home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

శ్రీహరి శయ్యా ! శివుని హారమా


(సుబ్రహ్మణ్య స్వామివారు శ్రీ దత్త భగవానుని శిష్యులే కాదు సాక్షాత్తు దత్త స్వామి యొక్క బాహ్య వేషధారియే. నాగుల చవితి నాడు స్వామి ‘పున్నాగవరాళి’ రాగంలో 'ఉరగేశ వందనం' అని కీర్తించారు.)

శ్రీహరి శయ్యా ! శివుని హారమా ! -  వాసుకి నామా ! ఓ ఆదిశేషా !
పుట్టలో నున్నట్టి పుణ్యాల మూర్తీ! - నాట్యమాడుమా నాగేంద్ర స్వామి!

ఉరగేశ వందనం - భుజగేశ వందనం |
ఫణిరాజ వందనం - నాగేంద్ర వందనం || (పల్లవి)

1. తరనాననాననం తరనాననాననం - అనురాగనాదమే నిను లేపునయ్యరో ! |
బుసకొట్టి దూకగా పరుగెత్తు పాపమే - ఇక  పాలు త్రాగుమా  శ్రిత రక్ష సేయుమా ||

2. బహువక్ర యానమా! మెరిసేటి నాగమా! - శిరమందు రత్నమే వెలిగేను  దైవమా ! |
ననుబ్రోవలేవవా తలవిప్పి ఆడవా - అభయమ్ము నీయవా అహిరాజ ! వందనమ్ ||

3. మహినెపుడు మోతువే శ్రమనంతసైతువే - హరిశయ్య  వైతివే శివకంఠ హారమా |
నిను పూజ సేయుచో స్ధిరయోగ లబ్ధియౌ-ఫణినాధ! పాహిమాంఅహిదేవ! రక్షమాం ||

4. కరుణా సముద్రమా! వినుమయ్య నామొరన్-బహుపాప రూపినై ఇలనుంటినాదొరా! |
బుసచిమ్ము జ్వాలతో అఘమెల్ల భస్మమౌ- నను పావనాత్మగా నాగేశ! మార్చుమా!  ||

5. బలరామ దేవుడా! బలమంత నీదెగా - హరి నీకు తమ్ముడై పదమందు మ్రొక్కెనే |
రఘురామ సేవలో - నినుమించి లేరుగా - నిదురించలేదుగా నిలుచుండి లక్ష్మణా !

6. భువిలో పతంజలీ ! నవయోగ శాస్త్రమే - నీ ముఖమునుండియె వెలువడెను దేవరా !
వ్యాకరణ భాష్యమే పలికితివి పండితా! - గురుదత్త దేవుడా! ఫణి బాహ్య వేషుడా !

7. గురులక్ష్మణాకృతీ! రచియించినావుగా-హరిభక్తి భాష్యముల్ కలిలోన నాయనా!  |
కరుణించవేలరా కమనీయ రూపుడా - కలమైతి పాటకున్ కవి నీవె దైవమా ! ||

8. నీవాడు నేనెరా నావాడు నీవెరా - గతి నీవు మాత్రమే గతి వేరు లేదురా !
దయఁజూపరానిచో దయ చేసి నాకికన్ - విషమైన నిమ్మురా నా తండ్రి శేషుడా ||

9. హరిదేహమంతయున్ నీ మీదనుండగా -ఆనందవార్ధిలో మనమందు తేలుచున్ |
వేవేల పడగలే కంపించుచుండగా - క్షీరాబ్ధినుంటివే క్షీర ప్రియుండవై ||

10. జగమంత స్వామి! నీ బుసమాత్రమే కదా - తలనుంచి మోయుచున్ పాలించుచుంటివే |
బుసలోని జ్వాలతో జగదంత మౌనుగా - ఫణిరాజ ! నీవెగా శ్రీ దత్త బ్రహ్మమే ||

11. ఒకసారి దూకుతో ఒకసారి మెలికతో - ఒకసారి వంపుతో ఆడేవు సొంపుగా |
నీ నాట్యమందునె అందాలు చిందునే - తల మీది రత్నమే కిరణాలు చిమ్మునే ||

12. పాతాళ నాయకా! నే తాళ జాలరా - రక్షింప రమ్మురా నిను విశ్వసింతురా |
నీవె కాదన్నచో నేనేమి చేతురా - నా భాష్పవృష్టిలో నీ పుట్ట కరుగురా ! ||

13. పాలారగించరా పాపాల కాల్చరా - పరమేశ్వరా! హరా ! ఫణిలోక నాయకా! |
రోగమ్ముఁబాపరా యోగమ్ము నీయరా - నారాయణాశ్రయా నాగేశ్వరా దొరా ! ||

14. చైతన్య శక్తియౌ కుండలిని నీవెగా - అనఘయను పేరుతో పరమాత్మ దేవిగా |
చక్రాల దాటెదవు వంకరగా పోవుచున్ - గెలిచెదవు మాయతో మాయలను సర్పమా! ||

15. చంపెదవు కచ్ఛతో పగబట్టి దుష్టులన్ - కాచెదవు దీక్షతో శ్రితులైన శిష్టులన్ |
ఓ నాగ నాయకా! ఒకసారి చూడుమా - శరణార్ధి నేలుమా మణిదీప భోగమా ! ||

16. అలవోలె దొర్లుమా తల విప్పి పొర్లుమ - తళ తళ మెరుపులా నాట్యమాడేవుగా |
హిమశైల గంగలా దూకేవు నాగమా - అలలయ్యె మెలికలే ముత్యాల సరముగా |

17. జగదాది సృష్టికై  ప్రధమోహ నీవెగా - శివలింగ రూపివై  చైతన్య శక్తివై |
ప్రచలత్తరంగమై జగదాద్యరంగమై - ఙ్ఞానులకు బుద్ధిలో భాసింతు వెప్పుడున్ ||

18. నిను నాగ దేవతా బిగి కౌగిలింతలో - పెనవేసి ఆడెనే సొరబూరనూదగా |
నటరాజ పార్వతీ నవనాట్యమాయెనే - రససాగరంబులో అలలయ్యె మీరలే ||

19. మెలివేసి కొంటిరె అనురాగ పాశముల్ - వలపంత చూపుచున్ పలుమార్లు ఆడిరే |
తలలందు రత్నముల్ తళతళా వెలుగులన్-విరజిమ్ము చుండగా నవకాంతి చక్రముల్|

20. బహునాట్య రీతులన్ శ్రమఁజెందినావుగా - ముకుళించిచుట్టగా నిదురించు పుట్టలో |
కనురెప్ప వేయకే కాపాడుచుందువే - లోకాలఁ జూచుచున్ నవయోగ నిద్రలో ||

21. అగజాకుమారకా! కరశక్తి భల్లకా! - శుభ షణ్ముఖాబ్జకా ! గురుదత్త శిష్యకా !
శిఖివాహ సంచరా ! హతతారకాసురా ! - హిమశైలమందిరా ! లఘుకోప సుందరా ! ||

 
 whatsnewContactSearch