03 Oct 2024
[26.12.2002-గురువారము-ఉత్తరా నక్షత్రము] ఈనాడు గురువారము. సూర్యప్రధానము గదా, ఎందుకనగా ఉత్తరానక్షత్రముతో కూడినది. సూర్యుడనగా సవిత. అనగా బ్రహ్మదత్తుడు అని అర్థము. అనగా సృష్టికర్తను గుర్తు చేయుచున్నది. సవితయనగా సూర్యుడనియు, జగత్తును సృష్టించువాడని అర్థము. అజ్ఞానాంధకారమును పోగొట్టి జ్ఞానప్రకాశముతో వేయిరేకుల పద్మమువంటి సహస్రార తత్త్వమగు బుద్ధిని వికసింపచేసి శిష్యుల బుద్ధులను ప్రేరేపించు గాయత్రీ మంత్రార్థ దేవతయే సవిత.
గురువారము అనగా గురువుకు సంబంధించిన రోజు. గురువు అనగా దత్తుడే. ‘గు’ అనగా అజ్ఞాన అంధకారము. ‘రు’ అనగా దానిని పోగొట్టు జ్ఞానతేజస్సు. ‘గురు స్సాక్షాత్పరబ్రహ్మ’ అను ధ్యానశ్లోకములో త్రిమూర్తి స్వరూపమగు శ్రీదత్త పరబ్రహ్మమే శ్రీగురుస్వరూపమని ఘోషించబడినది. ఇంతే కాదు. ఈ గురువారము అనఘాష్టమియగు శుక్రవారము అగు రేపటి దినమునకు ముందున్న రోజు. అనఘ అనగా ప్రకృతి. సృష్టి స్వరూపము కావున అనఘాష్టమికి ముందున్న ఈ గురువారము సృష్టికిముందున్న సృష్టికర్తను సూచించుచున్నది.
త్రిమూర్తిస్వరూపములలో ఆద్యస్వరూపము బ్రహ్మస్వరూపము. సృష్టికి ముందున్నది అనగా ఇంకనూ సృష్టి ప్రారంభించలేదు. అద్వితీయమైన శుద్ధబ్రహ్మ స్వరూపము. అందుకే బ్రహ్మము అను శబ్దము బ్రహ్మగా ఈ స్వరూపమునకే దక్కినది. కావున ఈనాడు గురుదత్తుడు శుద్ధబ్రహ్మ స్వరూపముతో జ్ఞానప్రదాతగాయున్న రోజు.
ఇంత ముఖ్యమైన గురుదత్త ప్రధానమైన ఈనాడు నన్ను ఎవ్వరును భిక్షకు పిలువలేదు. కారణము అందరి దృష్టియు అనఘావ్రతము అగు అనఘాష్టమి మీదనే యున్నది. శుక్రవారము లక్ష్మికి ప్రధానమైన వారము. లక్ష్మీదేవి భృగుమహర్షి పుత్రిక కదా. మరియు రేపు చంద్రప్రధానమైన హస్త నక్షత్రముతో కూడినది.
సూర్యునికి పురుషతత్త్వము, చంద్రునికి స్త్రీతత్త్వము అలంకారశాస్త్ర సంప్రదాయము. మరియు ‘చంద్రేణ లక్ష్మ్యాం’ అను జైమినీసూత్ర ప్రకారముగా చంద్రునిలో లక్ష్మీదేవత ప్రాధాన్యము గలదు. లక్ష్మి చంద్రుని సహోదరి. ఈ విధముగా ఈ దత్త జయంతికి వచ్చిన అనఘాష్టమి శుక్రవారము మరియు దానికి ముందున్న గురువారము ఎంతో విశేషము గలవి.
దీనికి కారణమేమనగా కృతయుగము తరువాత దత్త జయంతిని ద్రవ్యయజ్ఞముగా కాకుండా జ్ఞానయజ్ఞముగా జరుపుకొనడము మొట్టమొదటి సారిగా ఈ దత్తజయంతి నాడు జరిగినది. దాని యొక్క ప్రభావము చేతనే ఈ గురు శుక్రవారములు సృష్టికర్తయగు దత్తుడు మరియు సృష్టియగు అనఘగా వెంట వెంట నిలచినవి. కాని అందరి జీవుల దృష్టి సృష్టి పైన ఉన్నదే తప్ప సృష్టికర్తను మరచినారు.
సృష్టి భ్రమలో పడి సృష్టికర్తను మరచిపోవుటయే అజ్ఞానము. సృష్టి మన దృష్టిని ఆకర్షించినపుడు వెంటనే సృష్టికర్త గుర్తుకు రావలయును. గదాధరుడు అనగా రామకృష్ణ పరమహంస బాలునిగా యున్నప్పుడు మాగాణిభూమి గట్టుమీద నడచుచున్నాడు. అతడు ఆకాశము వైపు చూచెను. నీలాకాశమునందు తెల్లని పక్షులు మాలలుగా ఎగురుచున్నవి. ఆ ప్రకృతి దృశ్యసౌందర్యమును చూచి అతడు పరవశించినాడు. ఈ పరవశము అందరి జీవులకు కలుగును. కాని ఆయన జీవుడు మాత్రమే కాదు. మహాభక్తుడు. వెంటనే శ్యామలమైన కృష్ణ శరీరమున కదలుచున్న ముత్యాల హారములు ఆయన బుద్ధిని స్పృశించెను. అనగా సృష్టిని చూడగనే సృష్టికర్త గుర్తుకు వచ్చెను. వెంటనే మహాసమాధి స్థితిని పొంది ఆయన గట్టు మీదనే పడిపోయినాడు.
ఆయన జీవితములో మొట్టమొదటి బ్రహ్మానుభూతి ఇదే. అప్పుడాయన వయస్సు ఎనిమిది సంవత్సరములు. కాని 80 సంవత్సరముల వయస్సు వచ్చిన జీవులైనను ఆ దృశ్యమును చూచి పరవశింతురే తప్ప మహాసమాధిస్థితి వచ్చుట కల్ల. అంతే కాదు ఆ దృశ్యమును ఒక్కక్షణము చూచి మరుక్షణమే గట్టు మీద కాలుజారునేమో అని భయముతో కాలు క్రిందకు దించుదురు. కావున భక్తునకు సృష్టి ఎంత ఆకర్షించినను ఆ ఆకర్షణ అంతయును సృష్టికర్త మీదకే పోవును.
ఒక కవియొక్క కావ్యము వంటిది ఈ సృష్టి. ఈ అందుకే పరమాత్మను కవియని శ్రుతులు పొగడినవి. "కవిం కవీనామ్", "కవిర్మనీషీ" ఇత్యాది శ్రుతులు స్వామిని కవియని వర్ణించినవి. కావ్యములోనున్న బాగుగా వర్ణించబడిన ప్రకృతిదృశ్యములు మరియు కావ్యములోని పాత్రలు కవి యొక్క ఊహలే, అలానే పంచభూతాత్మకమైన ఈ జగత్తు మరియు ఈ జీవులు సృష్టికర్త యొక్క ఊహలే. కావున అనఘ, దత్తుని యొక్క ఊహాస్వరూపమే.
దత్తునియొక్క మనస్సే చాలా మృదువైన స్వభావము కలిగిన ‘చిచ్ఛక్తి’ లేక ‘లలిత’గా పిలవబడుచున్నది. ఈ మనస్సు ఊహాజగత్తును సృష్టించినపుడు సరస్వతిగా చెప్పబడుచున్నది. ఆ సమయమున దత్తుడు “బ్రహ్మ” యనబడుచున్నాడు. ఈ ఊహాజగత్తును ధరించి అదృశ్యము కాకుండా నిలిపి జీవింపచేసి క్రీడించుచున్న మనఃస్వరూపమే లక్ష్మి. ఈ సమయమున దత్తుడు “విష్ణువు” అనబడుచున్నాడు. ఈ ఊహాజగత్తును ఉపసంహరించి లయింపచేయు మనస్సే “మహాకాళీ” యనబడుచున్నది. ఈ సమయమున దత్తుడే “రుద్రుడ”నబడు చున్నాడు.
సృష్టి గతము. లయము భవిష్యత్తు. స్థితి వర్తమానము. కావున వర్తమానమున ఉన్న జీవులందరికిని లక్ష్మీనారాయణ స్వరూపము ఉపాస్యమని రామానుజ మధ్వులు బోధించినారు. శంకరాచార్యులు ఎక్కువగా శివ స్వరూపమునే ఉపాసించినారు. దానికి కారణము భ్రమను కలిగించి, ఆకర్షించి, పెడత్రోవ పట్టించు సృష్టి స్వరూపమును లయింపచేయు శివస్వరూపమును ఆరాధించి లయానంతరము, మరల సిద్ధించు ఆద్యస్వరూపమైన శుద్ధబ్రహ్మమును పొందుట ఆయన లక్ష్యముగా పెట్టుకున్నాడు. అనగా సృష్టికన్నను సృష్టికర్త కోటానుకోట్ల రెట్లు గొప్పవాడు. ఊహకన్న ఊహించు వ్యక్తి ఎంతో గొప్పవాడు. ఊహ అత్యల్పము. అది ఉన్ననూ దాదాపు లేనట్లే, కావున ఊహామాత్రమైన ఈ జగత్తును మిథ్య అన్నారు శంకరులు.
ఒక తెల్లనివ్యక్తి నేను నల్లనివాడను అని ఊహించుకొనుచున్నాడు. అంత మాత్రమున అతడు నల్లనివాడు కాలేడు. తెల్లనివాడు అనుటయే సత్యము. అట్లే ఊహించు సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మమే సత్యము. నల్లనివాడు అనునది ఊహ మాత్రమే. అంటే నల్లనివాడు అనుట అసత్యమా? దాదాపు అసత్యమే అనవలయును గాని పూర్తిగా అసత్యము అనరాదు. అది అత్యల్పమైన సత్యము. నల్లనివాడు అనుట ఊహా స్వరూపముగా ఉన్నది గదా. కావున అది అత్యంత స్వల్పముగాన మిథ్య అనబడును.
పూర్తిగా అసత్యము ఏదియనగా - ఆ వ్యక్తి తాను పచ్చనివాడు అని ఊహించుట లేదు. పచ్చనివాడు అనుట ఊహా మాత్రముగా కూడా లేదు గదా. కావున పచ్చనివాడు అనుట పూర్తిగా అసత్యము. కావున మిథ్యయనగా పూర్తి అసత్యము కాదు. అది అత్యల్పమైన సత్యము. అనగా ఉన్నది కాని దాదాపు లేనట్లే. అందుకే "బ్రహ్మ సత్యం జగన్మిథ్యా" అన్నారు శంకరులు. "జగదసత్యమ్" అనలేదు. "ఇచ్ఛామాత్రం ప్రభో స్సృష్టి:" అనగా ఈ సృష్టి అంతయు ప్రభువు యొక్క ఇచ్ఛ మాత్రమే. అనగా ఊహ మాత్రమే. "తదైక్షత", "స ఈక్షాం చక్రే", "సర్వమసృజత" ఇత్యాది శ్రుతుల అర్థమేమి?
ఆయన యొక్క సంకల్ప మాత్రమే ఈ సృష్టి అని అర్థము. కావున ఇట్టి అత్యల్ప సత్యమైన దాదాపు అసత్యమైన ఊహా మాత్రమైన సృష్టి యొక్క భ్రమలోపడి సృష్టికర్తను మరచిపోవు అజ్ఞానమును జ్ఞానముతో శంకరులు నిషేధించినారు. సృష్టియనగా పంచభూతములే కాదు జీవులు కూడా. అనగా ఇల్లు, ధనము మొదలగు జడములే కాదు, భార్య పుత్రాదులగు ఇతర జీవులు కూడ. ఇట్లు చేతనా చేతనమగు సృష్టి యొక్క భ్రమలోపడి సృష్టికర్తను విస్మరించుటయే అజ్ఞానమై ఆ అజ్ఞానస్వరూపమే జీవుడగుచున్నాడు. తల్లిదండ్రులు తమ బిడ్డలనుండి ఏమి ఆశించుచున్నారు. స్థిరచరాత్మకమైన తమ ఆస్తిపై దృష్టిని ఉంచక బదులుగా తమ మీద, తమ సేవ మీద దృష్టి ఉంచవలయును అని కదా. అట్లే జీవులును సృష్టిపై దృష్టినుంచక స్వామి మీద, స్వామిసేవ మీద దృష్టి ఉంచవలెను.
స్వామి యొక్క వ్యక్తిగతసేవ కన్నను స్వామి కార్యమున సహకరించు సేవ చాలా గొప్పది. తండ్రి చేయు పనిలో పాలుపంచుకొని తండ్రి కష్టమును తగ్గించుట గొప్ప సేవయగును. తండ్రి పనిని విరమించి శయనించినప్పుడు పాదములు పిసుగు సేవ గొప్పది. అంతేకాని తండ్రి పని చేయుచుండగా తండ్రి పాదములు పిసుకుట అంత సేవ కాదు. అసలు సేవనే వదిలినచో జపములేల, భజనలేల, ధ్యానములేల?
తండ్రి పనిలో పాలుపంచుకొనక, శ్రమించిన తండ్రి పాదములు వత్తక తండ్రీ తండ్రీ అని జపము చేయుచు, తండ్రీ తండ్రీ అంటూ రామకోటి రాయుచు, తండ్రి మీద భజనలను పాడుచు, తండ్రిని ధ్యానించు వారి వివేకమును ఏమనవలయును? ఆ తండ్రి కూడా పుత్రుడా పుత్రుడా అని జపము చేయుచు, పుత్రుడా అని రామకోటి వ్రాయుచు, పుత్రుని ధ్యానించుచు, పుత్రునికి తన ఆస్తి నుండియు ఏమియు ఇవ్వడు.
★ ★ ★ ★ ★