home
Shri Datta Swami

 10 Dec 2024

 

శ్రీశంకరాచార్యుల వారు - అద్వైతసిద్ధాంతము

నేను శివదేవుడనైన శంకరాచార్యుడను. త్రిమూర్తులే స్వయముగా మతత్రయాచార్యులుగా అవతరించినారు. అత్యల్ప పంచభూతములతో కూడిన ఈ జగత్తు అసత్యమని శంకరులు చెప్పిరి. అత్యల్పమును అభావముగా భావించవచ్చును గదా. అత్యల్పమైన ఈ జగత్తు సత్యము కాదు. అసత్యమూ కాదు. అందువలన మిథ్య అనబడును. ఇది నాకు మాత్రమే వర్తిస్తుంది. అంతే కాని జీవునికి కాదు. అత్యల్పజగత్తులో జీవుడు ఇంకనూ అత్యల్పమైనాడు. అత్యల్పమనగా అసలు లేదని కాదు. జగత్తు అంతయు తాత్త్వికముగా బ్రహ్మమని భావించగలిగినప్పుడే అందులోని భాగమైన జీవుడు తాను బ్రహ్మమని పలుకవచ్చునే కాని ఎట్టి ప్రవర్తన లేక పలుకరాదు. బ్రహ్మము మనుష్యావతారమున (human incarnation) వచ్చినప్పుడు లేదా బ్రహ్మము జీవుని ఆవేశించినపుడు అట్టి మనుష్యుడు బ్రహ్మమే అన్నారు శంకరులు (అహం బ్రహ్మము). “అహం” అంటే జీవుడు కాదు. సృష్టి కాదు. జీవునకు ఆధారమైన బ్రహ్మమే అని అర్థము. ఈ అహం శబ్దముచే బ్రహ్మమును చెప్పుట అవతార సిద్ధపురుషులకే వర్తించును. అత్యల్పమును అసత్యముగా చెప్పవచ్చును గాన శంకరులు బ్రహ్మదృష్టిలో అత్యల్పమైన ఈ జగత్తు అసత్యమన్నారు. ఒక చిన్న నిప్పు రవ్వ (spark of fire) అత్యల్పమైననూ, దానిలోని దహించు ధర్మము కూడా అత్యల్పముగా యున్ననూ, దహించు గుణము ఉన్నది కాన, అంతా అగ్నియే తప్ప రెండవది లేదు అన్నారు శంకరులు. దీనిని జీవులు సరిగా అర్థము చేసుకొనక రెండవది లేదు కావున “మోక్షము దేనినుండి” అనుచూ మోక్షమే లేదు, సాధనే లేదు అని తలచిరి.

Swami

అత్యల్పమైన దానిలోని అత్యల్పమైన ధర్మము యొక్క అస్తిత్వమును (existence) శంకరులు పట్టుకొన్నారు. అత్యల్పమైన జగత్తు లేదు. దానిలో అత్యల్ప బ్రహ్మత్వమున్నది కాన బ్రహ్మమే అన్నారు శంకరులు. అనగా ఉన్నది ఒక్కటే బ్రహ్మము, జగత్తు (universe) లేదు అని మతము. నిప్పురవ్వలోను, మహాగ్నిలోను గల దాహకధర్మము ఒక్కటే అగుట వలన రెండూ ఒకటేనని శంకరుల అద్వైతము. సాధన ఏమియు లేకుండగానే జీవుడు బ్రహ్మమే అనుట అద్వైతము. తరువాత సాధన వలన తాను బ్రహ్మము అని జీవుడు తెలుసుకొనుట అద్వైతములో చివరి స్థాయి. స్వామి ప్రతి పరమాణువులో సైతము తన విచిత్రమాయ చేత పరిపూర్ణముగా ఉండుట చేత, ప్రతి పరమాణువు పూర్ణబ్రహ్మమే అయినది కాన తాత్త్వికముగా అద్వైతము నిజమే. శరీరము అగు ఊహ – బ్రహ్మ తనువు ఒకే వస్తు తత్త్వము కాన అద్వైతము.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch