home
Shri Datta Swami

 25 Nov 2024

 

గురువును సేవించు వారి ఆయుష్షు, విద్య, యశస్సు, బలము వృద్ధి యగును అని మను ధర్మ శాస్త్రము

[31-10-2006, కార్తీక శుద్ధ నవమి – భాగవతం] గురువునకు నమస్కరించుచూ, సదా వారిని సేవించువారికి ఆయుష్షు, విద్య, యశస్సు, బలము అనెడి నాలుగు విషయములు వృద్ధి యగును అని మనుధర్మశాస్త్రము. ధర్మానువర్తియగు వారిని ధర్మమే రక్షించును. అట్టివారికి దైవసహాయము లభించును. అట్టివారి వంశములో మహాత్ములు, మహాభక్తులు జన్మింతురు. నాభాగునకు అంబరీషుడు పుత్రుడై జన్మించెను. జీవుని మోహమునకు గురి చేయునది ఈ సంపదలే అని అంబరీషుడు గ్రహించెను. సౌభరివలె ముముక్షుడైనవాడు కామాతురులగు వ్యక్తుల సాంగత్యమును విడువవలెను. ఇంద్రియములను బహిర్ముఖము చేయగూడదు. నిర్జనప్రదేశమున ఏకాంతవాసియై శ్రీహరిని ప్రార్థించవలెను. ధ్యానించవలెను. సాంగత్యము చేయదలచినచో సాధుసాంగత్యమే చేయవలెను. మోహము వివేకమును నశింపచేయును. వైరాగ్యమును వక్రింపచేయును. మాయాలోలుడు తరింపలేడు. దృశ్యములు ప్రమాదకరములు. హానికరములు. పరమాత్మను మరపింపచేసి, చిత్తమును మురిపించి, విషయానందమువైపు త్రిప్పే దృశ్యములు ప్రాణహరములు. అట్టివి ఈ సాధనాసౌధమునే కూల్చివేయును, పునాదులను కూడా కదిలించును. సాధకుడు దృష్టిని అదుపులో ఉంచుకోవాలి. మనస్సు భ్రమింపచేయు దృశ్యములు కంటపడినపుడు శ్యామసుందరుని దివ్యరూపమును మనసులో ఉంచుకోవాలి.

Swami

హరిశ్చంద్రుడు - ఖట్వాంగుడు

మన కర్మలే మనకు ప్రతిబంధకములని మరువరాదు. సాధకుడు ఎప్పుడునూ అసత్యము పలుకరాదు. పెద్దలను మోసగించరాదు. ఇదియే హరిశ్చంద్రుని చరిత్ర ద్వారా తెలసికొనవలసిన సత్యము. ఖట్వాంగచరిత్ర భగవన్నామామృతమును పానము చేయువారికి మృత్యుభయము లేదని తెలుపును. ఈ ప్రపంచములోని బంధములన్నియు కల్పితములు, అసత్యములు. ఈ బంధములయందు మమత అనురాగములున్నంత వరకు అవి మనలను విడిచి పెట్టవు. భగవంతుని సంకీర్తనములో మనస్సు లగ్నము కాగానే సమస్తబంధములు తమంతట తామే వదలి పోవును. మానవ దేహము దీర్ఘకాలము నిలుచునది కాదు. మృత్యువు ఏ క్షణమునైనను కబళించవచ్చును. నిర్మించుకున్న ఆశాసౌధాలన్నీ ఆ క్షణాన్నే కూలిపోతాయి. ఆశలు మాసిపోతాయి. జీవితము అంతరించిపోతుంది. ఈ సత్యమును సదా మనసులో ఉంచుకుని భగవద్భజనలో చిత్తమును లగ్నము చేయువారు తప్పక తరింతురు.

దశరథుడు: త్యాగులకే పరమాత్మ లభ్యమౌతాడు, కోరికలు దుఃఖములకు కారణములు అని కౌసల్య చెబుతుంది. పరమాత్మ మన హృదయములో మనము సమస్త విషయములను మరచినపుడే ప్రవేశించును. మాతాపితరులను గౌరవించువారిని జగత్పిత ప్రేమించును. ఈ అంశములను రామాయణ సందర్భములో గ్రహించవలెను.

శ్రీగురుదత్త జయ గురుదత్త.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch