15 Dec 2024
1. యమము, 2. నియమము, 3. ఆసనము, 4. ప్రాణాయామము, 5. ప్రత్యాహారము, 6. ధారణ, 7. ధ్యానము, 8. సమాధి అనెడి ఈ ఎనిమిది భగవంతునితో యోగమునకు అష్టాంగములుగా తెలసికొనవలెను.
1. యమము: అంటే శరీరము - వాక్కుల ద్వారా దుర్వినియోగమయ్యే శక్తిని దాచటము.
2. నియమము: అంటే మనస్సు యొక్క ఆలోచన ద్వారా దుర్వినియోగమయ్యే శక్తిని దాచటము. అంటే త్రికరణముల ద్వారా సాంసారిక విషయములలో దుర్వినియోగమయ్యే శక్తిని దాచటమే.
3. ఆసనము: ఆసనము అంటే కదలకుండా కూర్చోవడము కాదు. యమ, నియమముల అనంతరము కావలసిన ధనము దాచడమన్న మాట. అనగా దైవారాధనను ప్రారంభించడమే ఆసనము. భగవదారాధన లోని సుఖము నాస్వాదిస్తూ ఆ సుఖమును స్థిరము చేసుకొనుటను ఆసనమంటారు. స్థిరమైన సుఖమే ఆసనమని ఆసన శబ్దము యొక్క నిర్వచనము.
4. ప్రాణాయామము: అంటే భగవదాసక్తిలోని తీవ్రత. తీవ్రముగా ఆలోచిస్తున్నప్పుడు దీర్ఘముగా శ్వాస పీల్చి స్తంభింపచేస్తాము. అనగా శ్వాసక్రియను కూడా కాసేపు ఆపి దానికై వినియోగపడే శక్తిని కూడా ఆలోచనలో కేంద్రీకరిస్తున్నాము. ప్రాణాధికముగా దైవారాధనను చూపినపుడే ప్రాణాయామము సిద్ధించినట్లు. శ్వాసక్రియను ఆపి అవసరమైతే ప్రాణము సహితము నీకు అర్పిస్తానన్న భావమే ప్రాణాయామము లోని తాత్పర్యము. శ్వాసనాపినప్పుడల్లా దైవం కోసము ప్రాణార్పణము చేసేందుకు సిద్ధమౌతున్న ప్రయత్న పరంపరయే ఇది.
5. ప్రత్యాహారము: అంటే అంతర్ముఖ దైవారాధనము. సాంసారిక విషయములనుండి నివృత్తియే ప్రత్యాహారము. సంసారమునుండి ఇంద్రియములను నివృత్తి చేయుటయే రాజయోగము. అది చేతకాని యెడల విషయములకు దూరముగా నుండుటయే మార్గము. దాని వలన నివృత్తికి కొంత దోహదమగును. సంసారవిషయములకు దూరముగానుండియు చింతలతోనున్న అది వ్యర్థమే. అట్టి వారు సంసారమున యుండియే కొంచెము కొంచెముగా నివృత్తికై ప్రయత్నించవలెను. ఈ నివృత్తి అనెడిది మనస్సుకు సంబంధించినది. ఈ నివృత్తియు దైవమునందు మనస్సు నిశ్చయముగా లగ్నమగుట చేత గానీ సాధ్యము కాదు. నిశ్చయము చేయునది బుద్ధి. అట్టి బుద్ధి వేదాంతఙ్ఞానము లేక నిశ్చయము చేయకున్నది. కాన వేదాంత శ్రవణ, మననములు చేసినచో బుద్ధికి ఙ్ఞానము కలుగును. దానిచే బుద్ధి నిశ్చయించును. దాని చేత నివృత్తి పూర్ణముగా సిద్ధించి ప్రత్యాహార సిద్ధి కలుగును. అష్టాంగములలో ఇది చాలా ప్రధానమైన అంగము.
6. ధారణ: భగవంతుని కళ్యాణగుణముల ద్వారా పూర్తిగా నివృత్తివైపు మనస్సు ఆకర్షింపబడుటయే ధారణ. మనస్సులో భగవంతుడు ప్రవేశించినపుడు భగవంతుని శక్తి ఆయనయందు ఆకర్షణను కలుగచేసి మనస్సులో భగవంతుని నిలుపును. ఇక్కడ భగవంతుని శక్తి, ఆయన యొక్క మహత్యము ప్రధానములు. లక్ష్యమైన భగవంతుడు ఆకర్షణీయము కాకున్నచో ఈ దశ విఫలమగును. అందుకే, ఈ ధారణయనెడి అంగము ప్రత్యాహారము చెప్పిన వెంటనే చెప్పబడినది. ధారణ చిత్తమునందు జరుగును.
7. ధ్యానము: దైవమందు లగ్నమైన మనస్సు లక్ష్యము తప్పకుండ స్థిరమైన బుద్ధి యొక్క సహాయము చేత దైవమందు నిలుపుటయే ధ్యానము. భగవంతుని సంకల్పముచే ప్రవృత్తిలో అనేక పరీక్షలు ఎదురవగా, బుద్ధి నిశ్చయముచే వాటిని ఎదుర్కొనుచూ భగవంతుని స్థిరముగా మనస్సులో నిలుపుకొనుటయే ధ్యానమనబడును.
8. సమాధి: ప్రవృత్తిలో ఎదురైన పరీక్షలను దాటి బుద్ధి సహాయముతో శాశ్వతముగా భగవంతుని మనస్సులో వ్యవస్థాపించుకొనుట ద్వారా సమాధి యను సిద్థిఫలము లభించును. సమకాలీన నరావతారునిగా వచ్చిన భగవంతునియందు జీవితాంతము బుద్ధిని దృఢముగా, స్థిరముగా నిలుపుకొన్నచో అది నిర్వికల్ప సమాధి అనబడును. అట్లు కాక తరచూ ఆ దృఢత, స్థిరత సడలుచున్నచో అది సవికల్ప సమాధి అనబడును.
అంతర్ముఖోపాసన చాలా గొప్పది. నీవు, పరమాత్మ తప్ప మీ ఇద్దరి మధ్య మూడవ వస్తువు గాని మూడవ వ్యక్తి గానీ లేకుండా నీవు చేయు ఆరాధనయే అంతర్ముఖోపాసన. అక్కడ రెండవ జీవుడెవ్వడును తోడు రాడని తెలసి, అక్కడ నీవు, నేను తప్ప మన మధ్య మూడవ వ్యక్తి ప్రసక్తి లేదని తెలసి, నీవు-నేను అను రెండిటి స్పృహ తప్ప మూడవ స్పృహ లేకుండా సమకాలీన నరావతారమును ఆరాధించుటయే అంతర్ముఖోపాసన అనబడును.
★ ★ ★ ★ ★