home
Shri Datta Swami

 17 Dec 2024

 

భీముడే భగవంతునికి ఉత్తమసేవకుడు

Updated with Part-2 on 18 Dec 2024


Part-1   Part-2


Part-1

[28-12-2002] ధర్మరాజు అర్జునుల కన్నను ఆంజనేయ అంశగల భీముడు ఉత్తమ సేవకుడు. భీముడు వాయుపుత్రుడు. "వాయు ర్వై క్షేపిష్ఠో దేవతా" అను శ్రుతి ప్రకారము వాయువు అనగా దేవతలలో శ్రేష్ఠమైనవాడు అనగా దేవదేవుడైన శివుడే. కావుననే శివావతారము హనుమంతుడు. హనుమంతుడు, భీముడు, మధ్వుడు ఈ మువ్వురు వాయుదేవుని అవతారములని ప్రసిద్ధి. ధర్మరాజు సత్త్వగుణము. అర్జునుడు రజోగుణము. భీముడు తమోగుణము. శివుడును తమోగుణ స్వరూపుడని శాస్త్రము. రజస్సు బ్రహ్మ, సత్త్వము విష్ణువు, తమస్సు శివుడు. "జ్ఞానం మహేశ్వరాదిచ్ఛేత్‌" అని జ్ఞాన కారకుడు శివుడే. తమోగుణము అజ్ఞానము. శివుడు ఆదిగురువని ప్రసిద్ధి. గురువుకు జ్ఞానము అజ్ఞానము రెండు తెలియవలయును. ఏ అజ్ఞానము వలన శిష్యుడు పొరపాటు పడునో దానిని గురించి శిష్యునకు గురువు వివరించును. శిష్యుని దోషములను బట్టి వాటికి కారణమగు ఆ అజ్ఞానమును వివరించిన కాని వాడు వానిని దిద్దుకొనలేడు. కావున గురువు జ్ఞానముతో పాటు అజ్ఞానమును కూడా వివరించవలయును. అసలు అజ్ఞానమును గురించి తెలుసుకొని దానిని తొలగించినచో, బావినీటిలో మురికిని తొలగించినచో అదే స్వచ్ఛమైన జలమైనట్లు నిర్మలమైన జ్ఞానము అచ్చటనే ప్రకాశించునని శంకరులు చెప్పినారు. "మత్తః స్మృతిః జ్ఞానమ్ అపోహనం చ" అను గీతాశ్లోకము కూడా నా నుండియే జ్ఞానమును అజ్ఞానమును గురించి తెలియవలయునని చెప్పబడినది.

స్వామి కురుక్షేత్రరణమును నిశ్చయించినాడు. రజోగుణముతో యున్న అర్జునుడు అహంకారముతో స్వామి నిర్ణయమునకు విరుద్ధముగా యుద్ధము చేయరాదని తర్కించి విరమించినాడు. స్వామి ఎంతో బోధించి విశ్వరూపమును చూపినగాని మరల దోవకు రాలేదు. కాని భీముడు స్వామి నిర్ణయమునకు వ్యతిరేక తర్కమును చేయక స్వామి నిర్ణయించినదే ధర్మమని యుద్ధమునకు సిద్ధమైనాడు. కావున పరిపూర్ణ విశ్వాసము గలవాడు సంపూర్ణ శరణాగతి చేసినవాడు భీముడే. స్వామి ధర్మరాజును అశ్వత్థామ మరణించెనని అబద్ధమాడమన్నాడు. కాని అది అధర్మమని ధర్మజుడు నిరాకరించినాడు. స్వామికి ఇష్టమైనదే ధర్మము. స్వామికి ఇష్టము కానిది అధర్మము అను మహాభావమే పరాభక్తి, కాన ధర్మజుని విశ్వాసము పరిపూర్ణము కాదు. కానీ భీముని స్వామి అశ్వత్థామయని నామకరణము చేసిన శతృసేనలోని ఒక ఏనుగును చంపి ఆశ్వత్థామ మరణించెనని ద్రోణాచార్యునకు చెప్పమన్నాడు. భీముడు దానికి ఎట్టి వితర్కము చేయక అట్లే చేసి, అట్లే చెప్పినాడు. కాని ద్రోణుడు నీ మాటను నమ్మను ధర్మరాజు చెప్పినచో నమ్ముదును అన్నాడు. మరల స్వామి ధర్మరాజును బ్రతిమిలాడగ ధర్మరాజు ససేమిరా అన్నాడు. సరే! చివరకు ‘అశ్వత్థామయను గజము చంపబడెను’ అని అయినా అనమన్నాడు. ధర్మజుడు అట్లే అన్నాడు. ‘అశ్వత్థామ’ మరియు ‘చంపబడెను’ అను రెండు శబ్దముల మధ్య వున్న “అను ఏనుగు” అను శబ్దము వినబడకుండా పాంచజన్యమును పూరించినాడు. అప్పుడు ద్రోణునకు అశ్వత్థామ చంపబడెను అను రెండు శబ్దములే వినిపించినవి.

Swami

సత్త్వగుణ ప్రధానుడైన ధర్మరాజు ఇంత మొండిపట్టు ఏల పట్టినాడు? అట్లే అర్జునుడు 18 అధ్యాయములు గీత చెప్పు వరకును ఎందుకు మొండిగా కూర్చున్నాడు? ఆ మొండితనము భీమునిలో ఏల లేదు? అర్జునుడు రజోగుణము, ధర్మరాజు సత్త్వగుణము అన్నాము. రజోగుణము, సత్త్వగుణము ఉన్నవారిలో లోకజ్ఞానము ఎక్కువగా యుండును. వారిలో వారికి కనిపించని అహంకారము, అసూయ ఉండును. స్వామి చెప్పినట్లు వినవలయునా? అన్న అహంకారము అట్లు వినుటకు స్వామి గొప్పదనము ఏమున్నదిలే అన్న అసూయ వారికి తెలియకుండానే వారిలో ఉండును. కాని తమోగుణము కలవారికి లోకజ్ఞానము ఉండదు. కావున అహంకారము అసూయ వారిలో ఉండదు. స్వామికి తాను బానిసవంటి వాడినని సంపూర్ణమైన ప్రపత్తిభావము ఉండును. కావున అజ్ఞానము చాలా అవసరము. కాని దేని యొక్క అజ్ఞానము, లోకము యొక్క అజ్ఞానము. నీలో లౌకికము ఎంత ఎక్కువగా యుండునో నీవు స్వామికి అంత దూరముగా యున్నావని తెలియుము. నీలో లౌకికజ్ఞానము ఎంత తక్కువగా యుండ, అజ్ఞానిగా ఛాంధసునిగా ఎంత ఎక్కువగా యుందువో నీవు స్వామికి అంత సమీపమున ఉందువు. అమాయకుడగు బిడ్డ వెంట ఎప్పుడు తండ్రి యుండును. లోకవ్యవహార సమర్థుడగు బిడ్డకు దూరముగా యుండును. రజోగుణములోను, సత్త్వగుణములోను అతితెలివి ఎక్కువగా యుండును. తమోగుణములో అసలు తెలివియే తక్కువగా యుండును.

తమోగుణియగు భీముడు లౌకిక శూన్యుడు. స్వల్పమైన జ్ఞానము మాత్రమే ఉన్నది. అది ఏమనగా పరమాత్మ కృష్ణునిగా అవతరించియున్నాడు. ఆయన ఆజ్ఞ శిరోధార్యము, ఆయన సేవయే కర్తవ్యము. ఇంతే అతడిలో స్వార్థము, అహంకారము అసూయ లేనే లేవు. అదే నిజమైన సేవకుని లక్షణము. సేవకునకు అతితెలివి, ఎక్కువగా తర్కించుట పనికిరావు. గోపికలు కూడా పూర్వజన్మలో బ్రహ్మర్షులై యుండిరి. వారు మహా జ్ఞానులు సత్త్వగుణ సంపన్నులు కాన వారికి తన ఆలింగనము నీయ స్వామి నిరాకరించెను. వారు చదువులేని పామరులుగా పాలుపెరుగు అమ్ముకొను అజ్ఞానులుగా పుట్టి పురుష అహంకారములను కోల్పోయి స్త్రీ వినయముతో ఉన్నప్పుడే స్వామి వారితో రాసక్రీడ సల్పి వారిని తరింపచేసినారు.

 

Part-2

నరావతారమే మహావాక్యముల తాత్పర్యము

"అతర్క్యః" అని శ్రుతి చెప్పుచున్నది. అనగా స్వామిని గురించి ఎట్టి వితర్కము, విమర్శ మనస్సులో కూడా రాకూడదు. "నైషా తర్కేణ మతిరాపనేయా" అను శ్రుతి కూడా మానవ మేధస్సు ఎంత తర్కించినను ఆయనను అర్థము చేసుకొనలేమని చెప్పుచున్నది. ఆయన సర్వ స్వతంత్రుడు, ఆయన సంకల్పమే ఈ సృష్టి, ఆయన ఇష్టమే ధర్మము, ఆయన చెప్పినదే వేదము, ఆయన నడచినదే మార్గము అను విశ్వాసము పరిపూర్ణముగా యుండుటయే పరాభక్తి. అహంకారము, అసూయ అను రెండు చీడపురుగులను వదిలించుకున్న చాలును. ఆయన మన చేతికి చిక్కినట్లే. స్వామి ఎల్లప్పుడును ఒక మానవ శరీరముతోనే ఈ భూమిపై నున్నాడనియే మహావాక్యముల తాత్పర్యమని తెలిసినవాడే పండితుడు. "పండ" గలవాడే  పండితుడు. "పండ" అనగా పరమాత్మ జ్ఞానమని అర్థము, అనగా పరమాత్మను గురించిన సత్యమైన జ్ఞానము.

1) "ఇహ చేదవేదీత్‌" అను శ్రుతి ఈ లోకమున ప్రతితరములోను నరాకారమున ప్రత్యక్షమగుచున్న పరమాత్మను గుర్తించినవాడే ఆస్తికుడనియు అట్లు గుర్తించక పరోక్షభ్రమ ఉన్నవాడు శాశ్వతనష్టము పొందునని చెప్పుచున్నది.

2) "మానుషీం తను మాశ్రితమ్‌" అను గీత నేను ఎల్లప్పుడు మనుష్య శరీరమునే ఆశ్రయించి యున్నాను. నన్ను మూఢులు తెలుసుకోలేరని చెప్పుచున్నది.

3) "యత్సాక్షాత్‌" అను శ్రుతి కూడా పరమాత్మ ఎక్కడో లేడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పుచున్నది.

4) "ప్రజ్ఞానం బ్రహ్మ" అను మహావాక్యము ఆయన ప్రశస్త వేదాన్త జ్ఞానము గల పండిత గురువు అని చెప్పుచున్నది. ప్రజ్ఞానము ఎక్కువగా కలవాడు "ప్రజ్ఞాని" అని కాకుండా "ప్రజ్ఞానము" అనియే అనబడును. ఇది వ్యాకరణ శాస్త్ర సంప్రదాయము.

5) “అయమాత్మా బ్రహ్మ” అను మహావాక్యము బ్రహ్మము జీవరూపమున ఉన్నాడని చెప్పుచున్నది.

6) "తత్త్వమసి శ్వేతకేతో" అను మహావాక్యము ఓ శ్వేతకేతూ! ఆ పరమాత్మ నీ వలె మనిషిగా ఉన్నాడని చెప్పుచున్నది.

7) "అహం బ్రహ్మాస్మి" అను మహావాక్యము అవును నేనే బ్రహ్మమును. నరరూపమున ఉన్నాను అని చెప్పుచున్నది.

8) "జీవభూత స్సనాతనః" అను గీత - ఆ సనాతనుడు ఒక జీవునిగా మారి వున్నాడు అని చెప్పుచున్నది.

9) "జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్‌" అను గీతా శ్లోకము నేను ఒక సామాన్య జీవరూపమున ఉన్నను ఈ సర్వజగత్తును ధరించియున్నాను అని చెప్పుచున్నది. మనుష్యరూపమున ఉన్న కృష్ణుడు సర్వజగత్తును ధరించి యుండుట విశ్వరూపము ద్వారా నిరూపించినాడు. ఆ మనుష్యరూపము పసిబాలునిగా అల్ప ప్రమాణముతో ఉన్నను జగత్తును ధరించియే ఉన్నానని యశోదకు తన నోటిలో సమస్త జగత్తును చూపెను.

గీతను చెప్పినవాడు కృష్ణుడు. భాగవతము కృష్ణుని జీవితచరిత్ర. కావున గీతా శ్లోకములను గీతా శ్లోకములతో సమన్వయించవలెను. అంతే కాని మానసికములైన శుష్కతర్కములతో సమన్వయించరాదు. ప్రతిమానవుడు పరబ్రహ్మమే అయినచో అర్జునుడును పరబ్రహ్మమే కదా. పరబ్రహ్మము సర్వజ్ఞము గదా. మరి అర్జున పరబ్రహ్మము ప్రశ్నలను ఎట్లు వేసినది? విశ్వరూపమును చూచి ఏల గడగడ వణికెను? ప్రతిమానవుడు పరబ్రహ్మమే అయినచో శంకరులు మాత్రమే ఏల కరిగిన సీసమును త్రాగెను. మిగిలిన శిష్య పరబ్రహ్మములు ఏల త్రాగలేకపోయిరి?

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch