27 Jan 2025
[15-04-2004 శుక్రవారము7:00] స్వామి యొక్క కార్యమునకు ఇతర సహకారములు అక్కరలేదు. మత్స్యావతారము మొదలు పరశురామావతారము వరకు స్వామి ఒక్కడే తన పనిని తాను చేసుకున్నాడు. రామావతారములో వానర సహాయమును తీసుకున్నాడే గాని నర సహాయమును తీసుకొనలేదు. కృష్ణావతారములో మాత్రము నర సహాయమును తీసుకున్నాడు. రామావతార పర్యంతము దుష్టసంహార కీర్తి భగవంతునికే చెందినది. ప్రేమావతారమైన కృష్ణుడు దైవకార్యమును నెరవేర్చిన కీర్తిని భక్తుడైన నరునకు (Arjuna) ఈయదలచినాడు. ఆ నరుడు తన నిత్య సహచరుడు. కాని ఆ నరుడు అది తెలుసుకొనలేక ఆ దైవకార్యమును తాను చేయుచున్నాననియు, తాను చేయనిచో అది ఆగిపోవుననియు తలచినాడు. అప్పుడు స్వామి నరుడు లేకపోయినను తానొక్కడే ఆ కార్యమును చేయగలనని నిరూపించుచు, తానే స్వయముగా కౌరవులను చంపు విశ్వరూపమును చూపినాడు. కావున స్వామి కార్యమున పాల్గొను సేవకులు తాము స్వామి కార్యమును చేయుచున్నందున అహంకారమును విడనాడవలయును. వారికి సంసారము నందు గల వ్యామోహము ననుసరించి స్వామి శక్తి వారి లోనికి ప్రసరించును. ఎట్లు ప్లాస్టిక్కు వైరు ద్వారా కరెంటు ప్రవహించదో, అట్లే సంసార వ్యామోహితుడైన జీవునిలో దైవశక్తి ప్రవహించదు. కావున అట్టి జీవుడు దైవసేవకు అనర్హుడు. ఆ నరుడి సంసార వ్యామోహము తగ్గుచున్న కొలది దైవశక్తి ప్రవహించును. వ్యామోహము ఉన్న కొలది ఆ దైవశక్తిని సంసారమునకు వినియోగించుకొనును. కావున వ్యామోహము సంపూర్ణముగ నశించిన వాడే సంపూర్ణమైన దైవశక్తితో కూడి సంపూర్ణముగా దైవసేవ చేసి సంపూర్ణముగా దైవానుగ్రహమును పొందగలడు.
★ ★ ★ ★ ★