home
Shri Datta Swami

 19 Sep 2024

 

సంసారబంధము - పరమాత్మబంధము

[03.12.2003] మనము సంసారములో ఆచరించగలుగుచున్న విషయములను భగవంతుని విషయములో ఆచరించలేక పోతున్నాము. ఎట్టి బంధుత్వము లేని దూరదేశములలో ఉన్న ఇరువురు స్త్రీ పురుషులు వివాహము చేసుకొనగనే ఆ స్త్రీ పురుషులు వారి వారి రక్తబంధములగు తల్లితండ్రులు సోదరులను మరచిపోవుచున్నారు. దీనికి కారణము ఆ ఇరువురి బంధము ఇరువురికిని క్షణిక సంతోషమునకు కారణమగుటయే. అయితే నిత్యానందప్రదుడగు భగవంతునితో బంధము ఏర్పడినప్పుడు రక్తసంబంధములగు సంసారబంధములు ఏల తెగుట లేదు? గోపికలు తమ కష్టార్జితమైన వెన్న అను ధనమును సిద్ధము చేసుకొని తమ కడుపున పుట్టిన బిడ్డలకు పెట్టక యశోదానందులకు పుత్రుడైన పరాయివాడగు కృష్ణునకు పెట్టినారు. స్త్రీకి అన్ని రక్తబంధములలో ప్రధానమైనది సంతానబంధము. అది తెగినచో మిగిలిన అన్ని బంధములు తెగినట్లే. అర్జునుడు మాత్రము రక్తబంధువులైన తాత ముత్తాతల కొరకు ఏడ్చినాడే తప్ప, కృష్ణుని కొరకు చింతించలేదు. కృష్ణుని బంధము ముందు రక్తబంధము తెగలేదు. కావున గోపికలకు గోలోకము, అర్జునుడు బోయవాడుగను జన్మించినారు. అట్లే మన పుత్రులకు సేవ చేసినాము. వారు పెరిగి భార్యాలోలురై మనలను సేవించకపోయిననూ, అవమానపరచిననూ, మన ధనమునంతయునూ వారికే అర్పించుచున్నాము.

కాని భగవంతుని విషయములో మాత్రము మనము చేసిన సేవకు ఆయన మౌనముగానున్నచో ఆయన పటమును పారవేయుచున్నాము. ఇక కష్టములనిచ్చి అవమానపరచినచో, మరియొకరు సేవించకుండా ఆ పటమును ముక్కలు ముక్కలు చేయుచున్నాము. కావున మన సంసారబంధములలో ఏ బంధమునకును పరమాత్మ సమానము కాదని స్పష్టముగా నిరూపించుచున్నాము. స్తోత్రములలో మాత్రము ఆయన సర్వాధికుడని అసత్యములను చెప్పి ఆయనను మోసగించి ప్రతిఫలమును పొందుటకు ప్రయత్నించుచున్నాము. కనుక ఓ జీవులారా! ఆత్మవిమర్శ చేసుకోండి. మనము భగవంతుని ఎంత మోసము చేయుచున్నామో తేటతెల్లమౌతుంది. కనుక సర్వబంధ విక్షేపమే మోక్షము. స్వామి బంధమే కైవల్యము. బంధముల తెంచుకొనలేని పామరులకు జపతపములు నాటక బూటకములే. మోక్షము లేక కైవల్యము లేదు. భార్యయు, పతియు, సతులు, సుతులు, బంధువులు, ధనము అంత్య కాలములో నీ వెంట రావు. దత్తుడొక్కడే నీ వెంట వచ్చును. సమవర్తి లేచి నమస్కరించును. అప్పుడు బ్రహ్మానందముతో దత్తుని వెంట బ్రహ్మ లోకమునకు పోయెదవు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch