20 Sep 2024
[అనఘాష్టమి సందేశము, 27-12-2002] గురు స్వరూపము ఎప్పుడును శిష్యులు చేయు తప్పులను ఎత్తి చూపుచుండును. శిష్యుల యొక్క సద్గుణములను శిష్యులు సాధించినది గాని ప్రశంసించడు. శిష్యుడు చేసిన తప్పులను మాత్రమే వివరించి ఆ తప్పులు మరల జరగకుండా దిద్దుకొని శిష్యుడు పై స్థాయికి చేరవలయునని గురువు ఎప్పుడును ఆలోచించుచుండును. నూటికి 99 మార్కులు తెచ్చుకున్నను గురువు దానిని ప్రశంసించడు. ఆ తప్పిపోయిన ఒక మార్కు గురించే విశ్లేషించును. ఆ ఒక్క మార్కు తప్పిపోయినందుకు శిష్యుని ఉత్తేజపరచును. ఆ ఉత్తేజముచేత మరల పరీక్షలో నూటికి నూరు మార్కులు తెచ్చుకొనవలయునని గురువు ఆశించును. గురువు తనను ప్రశంసించక విమర్శించుచున్నాడే అని శిష్యుడు గురువును అపార్థము చేసుకొనరాదు. ప్రశంసించినచో అహంకారము పెరిగి ఈ సారి పరీక్షలో 99 మార్కులకి 90 మార్కులకే దిగజారును. అందుకే కబీరు ఇట్లు చెప్పినాడు. "నిన్ను తిట్టువాడు నీ మిత్రుడు". ఏలననగా ఆ తిట్లచేత నిన్ను నీవు దిద్దుకొని ఉన్నతస్థితికి పోవుదువు. నిన్ను పొగుడువాడు నీ శత్రువు. ఏలననగా అతని పొగడ్త చేత నీవు అహంకరించి పతనము చెందుదువు. గురువు తన శిష్యుడెప్పుడు పైకి పోవలయుననియే ఆలోచించుచుండును. కావున గురువు, శిష్యులలో కేవలము దోషములనే చూచును. ఒకసారి నానా చందోర్కర్ భగవద్గీతలోని శ్లోకమును చదువు చుండెను. "తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః" అప్పుడు శ్రీసాయి ఆ శ్లోకము యొక్క అర్థము అడిగెను. నానా ఇట్లు చెప్పెను. నీవు గురువులకు సేవ చేసి శరణాగతి చేసి ప్రశ్నించినప్పుడు వారు నీకు జ్ఞానమును బోధించెదరు అని. ఈ శ్లోకమునకు నానా ఇట్లు అర్థము చెప్పెను. అప్పుడు శ్రీసాయి ఇట్లు అడిగెను. జ్ఞానం అను శబ్దము స్థానములో అజ్ఞానం అని పెట్టినచో శ్లోకము యొక్క ఛందస్సుకు భంగమగునా? నానా - "ఉపదేక్ష్యంతి తేஉజ్ఞానం" ఇట్లు సవరించుట చేత శ్లోకము యొక్క అర్థమునకు భంగము రాలేదు. నానా ఇట్లు అడిగెను "నేను గురువు వద్దకు పోయినప్పుడు జ్ఞానమునకు బదులు అజ్ఞానమును ఉపదేశించుటయా?" అని ఆశ్చర్యపోయెను.
అప్పుడు శ్రీసాయి ఇట్లు పలికెను. గురువు ఎప్పుడును నీలో ఉన్న అజ్ఞానమునే వివరించును. దానిచేత నీ అజ్ఞానమును నీవు గుర్తించి ఆ అజ్ఞానమును పోగొట్టుకొనుటకు ప్రయత్నించుదువు. అనగా గురువు ఎప్పుడును నీ అజ్ఞానము చేత ఏర్పడుచున్న దోషముల గురించి ఆలోచించి గుర్తించి ఆ దోషములను దిద్దుకొనమని చెప్పగా దిద్దుకొని అప్పుడు నీవు జ్ఞానమునకు అర్హుడవగుదువు. కావున జ్ఞానమును దానము చేయుటకు ముందు గురువు నీలోని అజ్ఞానమును తొలగించును.
ఇంటికి అతిథి వచ్చినప్పుడు ఇల్లు ఊడ్చి శుభ్రము పరచుదువు. అదే విధముగా జ్ఞానము గ్రహించుటకు ముందు నీ అజ్ఞానమును తొలగించుకొనవలెను. నిన్ను జ్ఞానమునకు అర్హునిగా చేయు ప్రయత్నమే గురువు నీలోని తప్పులు పట్టుకొనుట. కావున గురుదత్తుడు ఎప్పుడును తన శిష్యులలో తప్పులు పట్టుచుండును. ఏలనననగా ఆయన పరిపూర్ణ గురుస్వరూపుడు. ఇది తెలుసుకున్నవాడు ఆయనకున్న వాత్సల్యమును గుర్తించును. ఇది తెలియనివాడు గురుదత్తుని విడిచివేయును. ఈ రోజు అనఘాష్టమి. అనఘ ఎవరు? అనఘ అనగా ఆదిజీవుడు. ఈ జగత్తును సృష్టించవలెనని పరమాత్మలో కలిగిన మొదటి సంకల్పతరంగమే అనఘ. ఆ తరంగమే ఆత్మలింగము అనబడును. ఈ అనఘయే మహామాయ, మూలమాయ అనబడుచున్నది. ఆమె అనఘ అనగా పాపరహిత. ఆమె పరమపవిత్ర. ఎందులకు? ఆమెను సర్వసృష్టి సంపదకు అధిదేవతగా పరమాత్మ చేసియున్నాడు. కాని ఆమె దృష్టి, సృష్టి మీద లేదు. ఆమె యొక్క దృష్టి, సృష్టికర్తయగు పరమాత్మ మీదనే యున్నది. ఆమె స్వామి పాదముల వద్దనే కూర్చున్నది. ఆమె దృష్టి ఎల్లప్పుడు పరమాత్మ మీదనే వున్నది - ప్రేమ, ధ్యానము అంతయు పరమాత్మయందే వున్నవి. జ్ఞానము గాని, ధ్యానము గాని, భక్తి గాని, సేవలేనిచో వ్యర్థము. కావుననే ఆమె చేతులు ఎల్లప్పుడు స్వామి పాదములను పిసుకుచున్నవి. ఇంత ఐశ్వర్యము లభించిననూ ఆమెలో గర్వము అణుమాత్రము లేదు. మనకు కొంచెము ఐశ్వర్యము లభించగనే అనేకమంది సేవకులను తీసుకొందుము. కాని అనేక ఐశ్వర్యములు కలిగిన ఆమెయే సేవకురాలైనది. ఆమె ఆచరణ పూర్వక సేవ చేయుచున్నది. ఈ రోజు అష్టకలశములపై అనఘాదత్తుల యొక్క అష్టపుత్రులగు అష్టసిద్ధులను అష్టైశ్వర్యములగు అష్టపుత్రికలను ఆవాహనము చేయుదురు. అష్టసిద్ధులను ఆవాహనము చేసి అనఘాదత్తులను పూజింతురు. దీనిలో అంతరార్థమేమి? స్వామి మీదనే దృష్టిని ఉంచిన అనఘను జూచి దాని నుండి కర్తవ్యమును తెలుసుకొని నీ దృష్టి స్వామిపై ఉంచెదవా? లేక అష్టకలశములువున్న అష్టసిద్ధుల మీద, అష్టైశ్వర్యముల మీద దృష్టి ఉంచెదవా?
అష్టసిద్ధులు, అష్టైశ్వర్యములు సృష్టికి సంబంధించినవి. దత్తుడు సృష్టికర్త. సృష్టియగు అష్టసిద్ధులు అష్టైశ్వర్యములు అనఘాదత్తులనుండి వచ్చినవి. ఇచ్చట యోగము అనగా స్త్రీ పురుషుల సంయోగము కాదు. సృష్టి సంకల్పమగు అనఘ, సృష్టికర్తయగు స్వామిని చేరగా సృష్టి ఉద్భవించినది. కావున దీనిని బాహ్యార్థములో తీసుకొనరాదు. అంతరార్థమే జ్ఞానస్వరూపము. నీకు సృష్టి కావలయునా? సృష్టికర్త కావలయునా? ఇదే దత్త పరీక్ష. నీ దృష్టి అష్టైశ్వర్యముల మీద అష్టసిద్ధుల మీద పోయినచో నీవు అష్టకష్టముల పాలగుదువు. అట్లు కాక నీవు అనఘాదేవిని చూచినచో, ఆమె దృష్టి తన పుత్రులగు అష్టసిద్ధుల మీద, తన పుత్రికలగు అష్టైశ్వర్యముల మీద లేదని తెలుసుకొని ఆమె యొక్క దృష్టి సృష్టికర్త మీద యున్నదనియు కావుననే సృషికర్త ఆమెకు అష్టసిద్ధులను అష్టైశ్వర్యములను ఇచ్చినాడు అని తెలియును. నీ దృష్టి అష్టసిద్ధులు అష్టైశ్వర్యములపైకి పోయినచో సృష్టికర్త వాటిని నీకు ఇచ్చును. ఇందులో సందేహము లేదు. కాని అవి సర్కస్ మాస్టరు గానివాడు సర్కస్‌లోని సింహముల మధ్య నిలబడి వాటిని శాసించలేక వాటిచేత ఎట్లు తినబడునో అట్లే ఈ అష్టైశ్వర్యములను, అష్టసిద్ధులను నీవు నిగ్రహించుకొనలేక పోవుటచే అవి నిన్ను మ్రింగి నీవు అష్టకష్టముల పాలగుదువు. వీటిని నిగ్రహించు శక్తి నీకు ఎప్పుడు వచ్చును? నీవు వాటి మీద దృష్టి ఉంచక సృష్టికర్తపై దృష్టి ఉంచిన అవి సృష్టికర్తను చూచి భయపడి కంట్రోలులో ఉండును. నీవు నీ నీడ చిక్కించుకొనుటకు ప్రయత్నించుచున్నప్పుడు ఎప్పటికి ఆ ఛాయను నీవు పట్టుకొనలేవు. కాని నీవు నీడ మీద దృష్టి ఉంచక, పరమాత్మ మీద దృష్టి ఉంచినచో, నీవు పరమాత్మ వైపుకు వెళ్ళినప్పుడు నీ నీడ నీతో నీదాసుని వలె అనుసరించును.
ఒక భక్తుడు భగవంతుని గురించి తపస్సు చేసెను. భగవంతుడు ప్రత్యక్షమై వరము కోరుకొనమనెను. భక్తుడు తాను సంకల్పించినది జరుగునట్లుగా వరము కోరుకొనెను. ఇది అష్టసిద్ధులలో ఒక సిద్ధి. భగవంతుడు ఆ వరమును ఇచ్చి మాయమైపోయెను. భక్తుడు ఇట్లు తలచెను. నాకు ఒక అందమైన భార్య కావలెననిన భార్య ప్రత్యక్షమైనది. అప్పుడు భక్తుడు తన భార్య వంటినిండా నగలు కోరగా అన్నియు ప్రత్యక్షమయ్యెను. భక్తుడు ఇట్లు తలచెను, “ఓహో! ఏమి? అమ్మవారి వలె ఉన్నది? అని. అప్పుడు ఆమె అమ్మవారిగా మారెను. భక్తుడు ఇట్లు తలచెను. ఈ అమ్మవారు నన్ను మ్రింగునా ఏల?” అప్పుడు ఆమె వానిని మ్రింగివేసెను. కావున నిగ్రహము లేనిదే అధికఐశ్వర్యము, అష్టసిద్ధులు అష్టకష్టములకు దారితీయును. అనంత ఐశ్వర్యమును అష్టసిద్ధులును నిగ్రహించగలవాడు ఒక్క దత్తుడే. కావున నీ దృష్టి సృష్టికర్తపై ఉన్నంత వరకు నీవు సృష్టికర్తకు సమీపమున ఉందువు. అప్పుడు ఈ అష్టసిద్ధులను సింహములునూ, ఈ అష్టైశ్వర్యములను పెద్దపులులునూ నిన్ను ఏమియూ చేయలేవు. నీవు Circus Master కు సమీపమున ఉన్నావు. కావున ఈ రోజు అనఘాష్టమి నుండి మనము పొందవలసిన జ్ఞానము ఏమనగా “సృష్టి మీద దృష్టి ఉంచక సృష్టికర్తపై దృష్టి ఉంచి, సృష్టికర్త యొక్క సేవలో నిరంతరము ఉండుచూ ఎంత ఐశ్వర్యము లభించినను, తాను యజమాని అను అహంకారము పొందక నేను ఎప్పుడు సేవకుడనని తెలుసుకుని రజ స్తమో గుణ ప్రధానమైన అహంకారమును పొందక, సత్త్వగుణ ప్రధానమైన వినయముతో ఉన్నచో నీవును అనఘవలె స్వామియొక్క హృదయములో ప్రవేశింతువు". కావున అనఘాదేవిని ఆదర్శముగా పెట్టుకొని పాదముల వద్ద సేవకురాలిగా యుండి, అనఘ ఎట్లు హృదయాది దేవతా స్థానము పొందినదో అట్లే నీవును స్వామియొక్క హృదయము లోనికి ప్రవేశించవలెను. అనఘకు ఇచ్చిన ఐశ్వర్యము ఆమె ఎప్పుడు అనుభవించ లేదు. స్వామియొక్క భక్తులకు ఆమె దానము చేయుచున్నది. స్వామి నుండి పొందినది ఆమె ఇతరులకు పంచుచున్నది. కేవలము త్యాగము చేతనే బ్రహ్మత్వము సిద్ధించును. "త్యాగేనైకే అమృతత్వ మానసుః" భోగము చేత కాదు త్యాగము చేతనే బ్రహ్మత్వము సిద్ధించును. ప్రహ్లాదుడు నారదుని నుండి తాను పొందిన జ్ఞానమును తన చుట్టు ఉన్న బాలురకు ఇచ్చుటకు ప్రయత్నించెను. అతడు ఆత్మోద్ధరణమునకు ఎప్పుడు ప్రయత్నించలేదు. ఆత్మోద్ధరణము స్వార్థము. అట్లే రాధయును ఇతర గోపికలకు కృష్ణుని గురించి ప్రశంసించి, వారిలో భక్తిని పెంచి, కృష్ణుడు వారికి ప్రియుడు కావలయునని తలచెను. రాధ ఎప్పుడు తన గురించి ఆలోచించలేదు. రాధ గోపికలకు నీడలాగా ఉండెడిది.
★ ★ ★ ★ ★