14 Dec 2024
[29.11.2002] బ్రహ్మము తర్కమునకు అందదు అని శ్రుతులు చెప్పుచున్నవి. "నైషా తర్కేణ", "అతర్క్యః" అని శ్రుతులు. తర్కమనగా పదిమంది పండితులు తర్కించి తమ బుద్ధులతో నిర్ణయించినది. ఒక్కడే చూచి నిర్ణయించినప్పుడు వాడు భ్రమకు గాని కంటి దోషమునకు కాని లోను కావచ్చును. తర్కము చేత నిర్ణయించినపుడు ఎవరి బుద్ధికిని అందదని సారాంశము. "న మేధయా”, “యో బుద్ధేః పరతః" అను శ్రుతులు. ఇక వాక్కులకుగాని, కన్నులకు గాని చిక్కుననుకొనుట హాస్యాస్పదము. "యతో వాచః", "మనసా సః", "న సన్దృశే" ఇత్యాది శ్రుతులు కన్నులకుగాని, వాక్కునకుగాని, మనస్సునకుగాని బ్రహ్మము అందదని చెప్పుచున్నవి. ఐతే ఇట్టి ఊహకు అందని బ్రహ్మము ఉన్నది యని శ్రుతి చెప్పు చున్నది. "అస్తీత్యేవ" అని శ్రుతి. అనగా బ్రహ్మము ఉన్నది అని మాత్రమే చెప్పగలము అని అర్థము. ఇట్లు యముడు, నచికేతునకు చెప్పినాడు. ఐతే శ్రుతి ప్రత్యక్షానుభవము లేనిదే చెప్పదు. ఏ శ్రుతి వాక్యమైనను యుక్తికి అనుభవమునకు సమ్మతముగనే యుండును.
అష్టసిద్ధుల ద్వారా అనూహ్యతత్త్వము వ్యవస్థాపించబడుచున్నది
ఐతే ఊహకు సైతము అందని తత్త్వమగు ఈ పరబ్రహ్మము ఉన్నదని చెప్పుటకు ప్రత్యక్షానుభవము ఏమి? అట్టి బ్రహ్మము సాక్షాత్తుగా ప్రత్యక్షమగుచున్నది అని శ్రుతి "యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ" చెప్పుచున్నది. అనగా ఆ అనూహ్యతత్త్వము ఈ లోకమున మనకు ప్రత్యక్షమగుచున్నది. ఈ విషయమునే బ్రహ్మసూత్రములు "ఆత్మని చైవం విచిత్రాః సంతి హి" అని చెప్పుచున్నవి. అనగా అనూహ్యమైన ఆ బ్రహ్మము జీవాత్మగా అవతరించి విచిత్రములైన సిద్ధులను ప్రదర్శించుచూ అనూహ్యతత్త్వము ఉన్నది అని, స్థాపించుట జరుగుచున్నది. ఇదే భగవద్గీత "మానుషీం తను మాశ్రితమ్" అను శ్లోకచరణము ద్వారా బ్రహ్మము మనుష్యరూపమును ఆశ్రయించి ప్రత్యక్షమగుచున్నది అని ఘోషించుచున్నది. పరమాత్మ ప్రత్యక్షమగునపుడు ప్రకృతి రూపమును ఆశ్రయించి, ఊహకు అందని తత్త్వము ఉన్నది అని స్థాపించుటకు మాత్రమే అష్టసిద్ధులను ప్రదర్శించును తప్ప మిగిలిన పనులను చేయుటకు ప్రకృతి నియమములను పాటించును.
పరమాత్మ భక్తులతో సంభాషణము చేయదలచినాడు. పరమాత్మ ఒక శిలావిగ్రహమును ఆశ్రయించి వ్యక్తమైనచో అష్టసిద్ధులను ప్రదర్శించుటయేకాక సంభాషించుటకును ఒక సిద్ధిని ప్రదర్శించవలెను. శిలావిగ్రహము సంభాషించునపుడు సిద్ధి ప్రదర్శనము చేయక తప్పదు కదా! అట్లు కాక ఒక మనుష్యరూపము నాశ్రయించినపుడు అనూహ్య తత్త్వమును బోధించువరకే సిద్ధుల ప్రదర్శనము అవసరము. సంభాషించుటకు సిద్ధుల ప్రదర్శనము అవసరము లేదు. ఏలననగా, నరరూపము ప్రకృతి రూపమును అనుసరించియే సంభాషించవచ్చును. తిరుపతిలో నున్న వాసుదేవుని విగ్రహము అనేక మహిమలను చేయుచున్నది. కాని ఆవిగ్రహము సంభాషించినచో అదియును ఒక మహిమయే అగును. అంతే కాక ఆ మహిమలకు విభ్రాంతులైన జనులు స్వామి చెప్పునది సరిగా వినలేరు. అట్లు కాక పరమాత్మ నరశరీరమును స్వీకరించిన దృష్టాంతము తీసుకొనగా, ద్వారకలో ఉన్న కృష్ణుడు కూడా అనేక మహిమలను చేయుచున్నాడు. కాని కృష్ణుడే సంభాషించవలసి వచ్చినపుడు మహిమ అవసరము లేదు. అప్పుడు కృష్ణుని సంభాషణమును జనులు ఎట్టి ఉద్రేకమునకు లోనుగాక చక్కగా విందురు.
గోటితో త్రవ్వు దానికి గొడ్డలి ఏల?
ఒకడు అష్టసిద్ధులు ప్రయోగించి నదిని దాటెను. ఆ విషయమును అతడు తన గురువుకు నివేదించగా, గురువు లెంపకాయ కొట్టి శిష్యునితో ఇట్లు చెప్పెను. ఓరి! పిచ్చి శిష్యా! ఒక రూపాయి ఇచ్చినచో పడవ వాడు నిన్ను నదిని దాటించును. అంత చిన్న కార్యమునకు సిద్ధిని ఏల దుర్వినియోగపరచితివి? కావున భక్తులకు సంభాషణము ద్వారా జ్ఞాన బోధనము చేసి తరింపచేయుట అవతారము యొక్క లక్ష్యము. ఇది శిలావిగ్రహము ద్వారా వీలుకాదు. అంతే కాదు ఔదార్యము, ప్రేమ మొదలగు కల్యాణ గుణములు నరరూపములోనే స్పష్టముగా కనిపించును తప్ప శిలావిగ్రహములో గోచరించవు. కావున జడములైన తేజోరూపములగు సూర్యాదులను ఉపాసించు వారికి "నేదం తత్" అను శ్రుతి ఆ సూర్యుడు బ్రహ్మము కాదని చెప్పుచున్నది. మరియు "అయమాత్మా బ్రహ్మ" మొదలగు శ్రుతులు ఈ జీవుడు బ్రహ్మమనియు బోధించుచున్నవి. శిలావిగ్రహములు, చిత్రపటములు మొదలగునవి అట్టి అవతారపురుషుడు ప్రత్యక్షముగా లభించనపుడు దర్శనము కొరకు ఉపయోగపడుచున్నవి. కావున ఈ విగ్రహములు, చిత్రములు భక్తికి దోహదము చేయు సాధనములే తప్ప పరమాత్మ యొక్క అవతారములు కాజాలవు. మహావాక్యములన్నియు పరమాత్మ జీవస్వరూపముగా అవతరించునని చెప్పుచున్నవి. కావున నరావతారమే సత్యమైన పరిపూర్ణమైన అవతారము. ఆ నరావతారము యొక్క విగ్రహములు, చిత్రములు మన సాధనకు సహకరించునవి మాత్రమే. కావున దేవతా విగ్రహాదులకు దర్శనమునకు అనుకూలముగు స్నాన, పుష్పాలంకారాది ఉపచారములు మాత్రమే చేయవలెను. అంతే తప్ప అవి అవతారముగా భావించరాదు. పరమాత్మ వీలగునంత వరకు తాను సృష్టించిన ప్రకృతి యొక్క నియమములను అనుసరించియే పనులను చేయును. వీలుకానప్పుడు మాత్రమే అనూహ్యశక్తులగు అష్టసిద్ధులను ప్రదర్శించును.
మనందరము ప్రకృతి నియమములను తప్పక అనుసరించవలెను
ఆయన యొక్క ఈ లక్షణము నుండి సాధకుడు నేర్చుకొనవలసినది ఏమిటి అనగా – మన పనులను వీలున్నంతవరకు ప్రకృతి నియమములను అనుసరించియే చేసుకొనవలెను తప్ప వీటిని అనూహ్యమైన దైవశక్తిని ఉపయోగించుటకు కోరుకొనరాదు. పరమాత్మయే తన భార్యయైన సీత దొంగిలింపబడినపుడు అన్వేషణము చేసెనే తప్ప తన దివ్యదృష్టిని ఉపయోగించి సీత ఎక్కడ ఉన్నదో తెలుసుకొనలేదు. ఐతే ఈ నరావతారము యొక్క బాహ్యస్వరూపమైన శరీరము యొక్క ప్రకృతి నియమానుసారమైన ధర్మములను చూచి జనులు మోసపోవుదురు. భార్య కనిపించక, ఎక్కడ ఉన్నదో తెలియక విలపించు రాముడా పరమాత్మయని సంశయించి, రాముని కేవలం రాజకుమారునిగా చూచి కొందరు ఋషులు ఆతిథ్యముతో అర్చించినారు. "సంశయాత్మా వినశ్యతి" అనునట్లు అనుమానించిన ఋషులు తరించలేదు. కాని అట్టి రాముని పరమాత్మగా గుర్తించి ఏ మాత్రము భక్తిలో లోపములేక పరిపూర్ణ విశ్వాసముతో అర్చించినది శబరి. రాముడు సీత జాడ తెలియక విలపించుచుండగా శబరి దోవను కూడ చెప్పినది. కాని రాముడు సాక్షాత్తు పరబహ్మము అను విశ్వాసము చెక్కు చెదరలేదు. కావుననే శబరి సశరీరముగా దేవతా విమానములో వైకుంఠము చేరినది. ఈ ఫలము దండకారణ్యమున ఉన్న ఋషులకు ఎవ్వరికిని దక్కలేదు. కారణమేమి? ఎంత భక్తి సౌందర్యమున్నను, అనుమానమను కుష్ఠుమచ్చ ఎక్కడో దాగి యుండుట చేతనే. కావున భక్తులను పరీక్షించుటకు కూడా అవతారము యొక్క బాహ్యస్వరూపమైన ప్రకృతిధర్మములు ఉపయోగించుచున్నవి. ఇట్లు పరమాత్మ చేయు పనిలో అనేక అర్థములుండును.
మానవులు చాలా వరకు నరావతారమును విశ్వసించలేరు. "కశ్చిత్ మాం వేత్తి తత్త్వతః" అని గీతలో చెప్పబడినది. వేలాది భక్తులలో ఏ ఒక్కడో నరావతారమును విశ్వసించును. అట్లు విశ్వసించిన వారిలో కూడా ఏ ఒక్కడో నన్ను చేరును అని ఈ శ్లోకార్థము. అనగా విశ్వసించిన వారిలో కూడా అవతార శరీరప్రకృతి ధర్మములను చూచి చాలా మందికి మరల అనుమానము వచ్చును. అట్లు అనుమానము వచ్చిన వారందరును, పర్వత శిఖరమునుండి కాలుజారి క్రింద పడిపోయినటువంటివారు. క్రింద పడిపోయిన వారందరును అట్టి అనుమానము ఎప్పుడును రాకుండా పరిపూర్ణముగా విశ్వసించిననాడు శబరి వలె కైవల్యమును పొందుదురు. పరమాత్మ ఈ జగత్తులో ఉన్న ఒక చిన్నరూపమును వ్యాపించి అవతరించుచున్నాడు అని ఈశావాస్యము యొక్క మొదటి వాక్యమునకు అర్థము. "ఈశావాస్య మిదం సర్వమ్", "యత్కిఞ్చ జగత్యాం జగత్" అని చెప్పు ఈ ప్రథమ మంత్రమునకు అర్థమేమి? జగత్ అనగా ‘జచ్ఛతి గచ్ఛతి ఇతి జగత్’. అనగా పుట్టుచున్నది మరియు గిట్టుచున్నది అని అర్థము. ఆద్యంతములు గల ఈ మహాజగత్తులో, ఆద్యంతములు గల ఒక చిన్న నరరూపమును సంపూర్ణముగా వ్యాపించి ఈశ్వరుడు అవతరించుచున్నాడని అర్థము. ఒక తీగలో కరెంటు వ్యాపించినట్లు ఇచ్చట తీగ, కరెంటు అని రెండు ఉండుటయే ద్వైతము. కరెంటు ప్రధానము. తీగె అప్రధానము అనునది విశిష్టాద్వైతము. కరెంటు వేరు, తీగె వేరు అనునది ద్వైతము.
★ ★ ★ ★ ★