14 Jan 2025
Updated with Part-4 on 17 Jan 2025
పురోహితులు దక్షిణలను యాచించరాదు. బీదవానికిని, ధనవంతునకు, ఒకే శ్రద్ధతో సాయపడి, వారిని దక్షిణలను అడుగక, వారు యథాశక్తి ఇచ్చునదియే తాము స్వీకరించవలెను. ధనవంతుడు లోభముతో ఇవ్వడేని, దానిని గురించి చింతించవలదు. నాపై విశ్వాసముంచుము. మీకు అతడీయవలసినది, వేరొకరి చేత నేను ఇప్పింతును. కాలాంతరమున, వడ్డీతో సహా ఆ లోభి యొక్క దక్షిణను అతడు కోల్పోవునట్లు చేసి, అనేక మార్గముల ద్వారా నీకిచ్చిన వేరొకరికి చేర్చెదను. నా పాలనలో పొరపాటు రాదు. కావున ఓ బ్రాహ్మణులార! నన్ను విశ్వసించి మీరు ధర్మముతో నడవండి. మీరు జ్యేష్ఠపుత్రులు. మిగిలిన పుత్రులకు మీరు ఆదర్శప్రాయులు కావలయును. మీరే భ్రష్టులైనచో ఈ లోకమను కుటుంబమంతయును నశించును.
పాపఫలమును అనుభవించక తప్పదు. కాలభైరవుడు అతి కఠినుడు. అతడి క్రమశిక్షణకు ఋషులు, దేవతలే గడగడ వణికిపోవుదురు. ఏ వర్ణము వాడైననూ కాలభైరవుని శిక్ష తప్పదు. మీరు వధించు పశుపక్ష్యాదుల వేదనయే సముద్రములలో వాయుగుండములు పడి, మీ పంటలను నాశనము చేయుచున్నది. మందులు కనిపెట్టలేని మహమ్మారి వ్యాధి ఒకటి ఈ విశ్వమును అల్లకల్లోలము చేయుచున్నది. ఆ వ్యాధి క్రిములు భగవత్సృష్టి కాదు. భగవంతుడు నిర్దయుడు కాదు. ఆ క్రిములు మీరు నిర్దాక్షిణ్యముగా చంపితిను పశుపక్ష్యాదుల జీవులే. అవియే మానవజాతిని చంపుచున్నవి. ఇందులో భగవంతుని ప్రమేయము లేదు. మీ కర్మయే మిమ్ము సర్వనాశనము చేయును. మాంసాహారము దోషము కాదు. ఒక ప్రాణి మరణించిన తరువాత దాని శరీరమునకు, అన్న ఫలాదులకునూ తేడా లేదు. పదార్థము ఒక్కటే. చచ్చిన వాటిని భుజించిన పాపము లేదు. చచ్చిన పశుపక్ష్యాదులు భూమిలో కలసిపోగా, వాటి పదార్థము అంతయు భూసారముగా మారి, మొక్కల ద్వారా మనము భుజించుచున్నాము. శుద్ధిచేయబడుటయే భూమిలో కలసిపోవుట. కావున చచ్చిన వాటిని భూస్థాపనము చేయుడు. అవి ఎరువుగా మారి, మొక్కల ద్వారా మీ పొట్టలోనికే చేరును. మొక్కల ద్వారా వచ్చినది మీకు ఆరోగ్యకరము. మాంసాహారము రోగకరమనియే నవీన వైద్యవిజ్ఞాన మతము.
పురోహితులు వైదిక కర్మలను అనవసరముగా పొడిగించరాదు. షోడశకర్మలు భగవదారాధనములే. అపర కర్మలు అపవిత్రము కానే కాదు. మృతిచెందిన జీవుని కాపాడమని భగవంతునితో మొరపెట్టుటయే శ్రాద్ధకర్మల అంతరార్థము. కావున శ్రాద్ధము అపవిత్రము కాదు. అది దైవారాధనయే కావున పరమ పవిత్రమే.
శ్రాద్ధములన్నియు దైవారాధనములే. శ్రాద్ధమునందు పితృస్థానమున మృతుడైన జీవుని ఆవహింతురు. ఇక కొందరు విశ్వేదేవ స్థానమున, మరికొందరు మూడవ స్థానమగు విష్ణుస్థానమున భగవంతుని ఆవాహన చేయుదురు. ఆ భగవంతునికి ఈ జీవుని చూపి రక్షించమని ప్రార్థించుటయే శ్రాద్ధతాత్పర్యము. అన్ని అపరకర్మల సారాంశమిదే. శ్రాద్ధమనగా మృతుడైన జీవుని పిలచి అర్చించుట కాదు. ఆ అర్చన సామాన్యము. అతడు బ్రతికియున్నప్పుడును నీవు అర్చించినావు కదా. ఇప్పడు అర్చించుటలో ప్రత్యేకత లేదు. కావున నీవు చూపవలసిన శ్రద్ధ పితృస్థానమున కాదు. దేవతా స్థానమున చూపవలెను. ఏలనన శ్రాద్ధములో నీ పితరులను రక్షించమని, దేవతాస్థానమునకు మొరపెట్టుకొనుచున్నావు. అక్కడ విశేష గౌరవమునీయవలసినది దేవతాస్థానమునకే గానీ పితృస్థానమునకు కాదు. నీ తల్లిని ఒక వైద్యుని వద్దకు కొనిపోయినావనుకొనుము. అచ్చట నీ తల్లిని చూపించి, రోగ విముక్తిని కలిగించమని వైద్యుని ప్రార్థించుచున్నావు. అచ్చట నీవీయవలసిన విశేషగౌరవము నీ తల్లికి కాదు. వైద్యుని విశేషముగా గౌరవించవలెను. కావున శ్రాద్ధములో దేవతాస్థానమునే విశేషముగా గౌరవించవలెను.
షోడశ కర్మలు నా ఆరాధనములే. కర్మలను పెంచరాదు. అనగా ఉపచారములను మాటిమాటికి పునరావృత్తములను చేసి వైదిక కర్మలను దక్షిణదేశములో పెంచినారు. కర్మలన్నియును క్లుప్తముగా నుండవలెను. మంత్రములను చదువునపుడు చేయించుకొను వానికి ప్రతి మంత్రార్థము చెప్పి చేయించవలెను. అర్థరహితమైన మంత్రపఠనము వ్యర్థమని నేను నొక్కి వక్కాణించుచున్నాను. కావున ఉపచారములను పునరావృతము చేయుట మాని, ఆ సమయమును అర్థవివరణములో ఉపయోగించవలెను. ఒక ఉపచారము శ్రద్ధతో ఒకసారి చేసిన చాలును. అదక్షిణ మహాయజ్ఞములో దక్షిణలేని వైదికకర్మ వ్యర్థమగును. కానీ, దక్షిణ యథాశక్తి ఉండవలెను. శక్తికి తగిన దక్షిణ యుండవలెను కానీ శక్తికి తగ్గిన దక్షిణ, చేసిన కర్మనంతయును బూడిదపాలు చేయును. శక్తికి మించిన దక్షిణను దరిద్రుడి నుండి ఆశించరాదు. ధనికునకు, దరిద్రునకు ఒకే శ్రద్ధతో ఒకే విధముగా వైదికకర్మను పురోహితుడు చేయించవలెను. పురోహితమనగా నీకు శ్రేయస్సు కలుగుటకు ముందు చేయవలసిన దైవారాధనము. నేనే దేవతల ద్వారా మీకు ఐహికముల నిచ్చుచున్నాను. అయితే ఐహికముల భ్రమలో పడరాదు. వైదిక కర్మలన్నింటినీ నిష్కామముతో భగవత్ర్పీత్యర్థము-అని సంకల్పము చెప్పి చేయువాడు ఉత్తముడు. నీకేది కావలయునో భగవంతునికి తెలియును. దానిని సంకల్పములో చెప్పనవసరములేదు. పురోహితులు సంకల్పములకు ప్రాధాన్యత నిచ్చుచున్నారు. అది దోషము. సంకల్పములు మనసులో సైతము వుండరాదు. అంతయును కర్మచక్ర ప్రకారముగనే జరుగుచున్నది.
కర్మచక్రమును మార్చుట సర్వానర్థదాయకము. తరువాత, దాని వలన నిరంతరము దుఃఖము కలుగును. చేయని కర్మకు ఫలము రాదు. చేసిన కర్మకు ఫలము తప్పదు. ఈ వైదికకర్మల వలన కర్మఫలములు ముందు వెనుకలకు జరుగుచున్నవి అంతే. అనగా–జీవుని యొక్క వర్తమాన దుష్కర్మ ఫలములు వెనుకకు జరిగి, భవిష్యత్తులో అనుభవించవలసిన పుణ్యకర్మ ఫలము ప్రస్తుతము ముందుకు జరిగి వచ్చుచున్నది. దీని వలన ప్రస్తుత పాపకర్మ ఫలము వడ్డీతో భవిష్యత్తులోకి పోయి, భవిష్యత్తులోని పుణ్యఫలము వడ్డీ కోల్పోయి ముందుకు జరుగుచున్నది. దీని వలన భవిష్యజన్మలలోని పుణ్యఫలములన్ని ముందుకు జరిగినందున భవిష్యజన్మలన్నియును ఆజన్మ మరణపర్యంతము దుఃఖమయములగును. కావున వైదిక కర్మలలో ఐహిక సంకల్పములను చేయవలదు. కేవలము భగవత్ర్పీత్యర్థము అని మాత్రమే చేయుడు. వర్తమాన జన్మలో అన్నియును సుఖములే అయినచో వెగటు కలుగును. నేను జీవుల కర్మచక్రములను సుఖదుఃఖముల మిశ్రమముగా, వారి వారి పుణ్యపాప ఫలములను మిశ్రమము చేసి ఏర్పాటు చేసి ఉన్నాను. నా ఏర్పాటు లడ్డు–బూంది వలె రసమయము. దానిని భంగపరచి, ఇప్పుడు అన్ని లడ్డూలు తిని, భవిష్యజన్మలలో కేవలము బూంది తినుట అవివేకము.
వైదిక కర్మలనాచరించు పురోహిత కర్మ ఎంతో అదృష్టమైనది. ఏలననగా-దానిచేత భుక్తి, ముక్తి రెండునూ లభించును. మిగిలినవి అన్నియు కేవలము భుక్తి కర్మలు. ముక్తి కొరకు వేరుగా మరల కర్మలనాచరించవలెను. ఇందులో భుక్తి కర్మయే ముక్తి కర్మయగుచున్నది. అయితే ఈ భుక్తి కర్మలో భుక్తిపై దృష్టినుంచక భక్తిపై దృష్టినుంచవలెను. అప్పుడే అది భుక్తి, ముక్తి రెండింటిని ఇచ్చును. భక్తిలో భకారమునకు కొమ్ము చేర్చినచో “భు” అగును, అనగా కొమ్ము, అనగా పశుత్వము. కావున పామర పశుత్వదృష్టిని చేర్చినచో భుక్తి అగును. కావున కొమ్ము అను పశుత్వ పామరదృష్టిని త్యజించి, భగవంతునిపై విశ్వాసముంచి భక్తికర్మలుగా వైదిక కర్మలనాచరించుచు, ఇతరుల చేత ఆచరింపచేయుటయే పురోహితము. ఇదే బ్రాహ్మణ ధర్మము. పురః = జగత్తునకు, హితః = హితమును చేయువాడు బ్రాహ్మణుడు. వేదము ‘అగ్ని మీళే పురోహితమ్’ అని ఆరంభించుచున్నది. అనగా అగ్ని ఎట్లు అనేక విధములుగా లోకహితమును చేయుచున్నాడో, బ్రాహ్మణుడును అట్లే లోకహితమును చేయువాడని అర్థము. అగ్ని, హవిస్సులను దేవతల వద్దకు కొనిపోయి, వారి నుండి వరములనెట్లు హోతకు తీసుకువచ్చుచున్నాడో, అట్లే బ్రాహ్మణుడును, ఇతరుల చేత దైవారాధనములను చేయించి, వారి అభీష్టములను నెరవేర్చి, అనర్థములను పోగొట్టి లోకహితమును చేయుచున్నాడు. ఎట్లు ముందు అగ్నికి ఆజ్యాహుతిని ఈయవలెనో, అట్లే బ్రాహ్మణుడైన పురోహితునకును ముందు యథాశక్తిగా దక్షిణనీయవలెను. యజ్ఞానంతరము, అగ్నికి మరల ఆహుతి నిచ్చినట్లు, వైదిక కర్మాంతమునను దక్షిణ నీయవలెను. దక్షిణ యథాశక్తిగా నుండవలెను. శక్తికిమించి బ్రాహ్మణుడాశించరాదు. శక్తికి తక్కువగా చేయించుకొనువాడును దక్షిణ ఈయరాదు. రెండునూ పాపములే అగును. వైదిక కర్మల ద్వారా దైవానుగ్రహము చేయించు కొనువాని పైనను, చేయువాని పైన కూడ కలుగును కావున చేయువాడగు పురోహితుడు తన సమస్యలకు కూడ దైవసహాయమును పొందుచున్నాడు. ఇట్లు పురోహితుని వైదిక కర్మాచరణము అన్యకార్యమే కాక, స్వకార్యమూ అగుచున్నది. ‘కర్తా కారయితా చైవ’ అని శాస్త్రము. అనగా చేయించువాడును, చేయువాడును ఫలమును పొందుదురు అని అర్థము.
జ్యేష్ఠపుత్రుడు సరిగా ఆదర్శముగా నున్న కాని, కుటుంబము బాగుపడదు. అట్లే నాలుగు వర్ణములలోను జ్యేష్ఠుడగు బ్రాహ్మణుడు సరిగా ఆదర్శముగా నున్న కాని లోకము బాగుపడదు. బ్రాహ్మణుడు స్వార్థమును త్యజించి, ఆదర్శముగా నుండి ఇతరులను కూడ స్వార్థరహితులుగా మార్చవలెను. పురోహితుల యొక్క స్వార్థ సంకుచిత భావములే వారి దారిద్ర్యమునకు కారణములు. పురోహితుడన్న ఎంత ఉచ్చస్థానములో నుండవలెను! అతడు రాజగురువుగా నుండవలెను. అతడికి ఎట్టి ఆర్థికసమస్య లేకుండా చేయవలసిన బాధ్యత లోకముపై నున్నది. అతడు ప్రశాంతముగా నున్న కాని, వైదిక కర్మలు భక్తి కర్మలుగా జరుగవు. అతడు దరిద్రుడైనచో, వైదిక కర్మలన్నియు అతడి భుక్తి కర్మలుగా మారి వ్యర్థములగును. బ్రాహ్మణుడు కేవలము కొన్ని మంత్రములను కంఠస్థము చేసి, కొన్ని క్రియలను నేర్చి, వైదిక కర్మలను కేవలము తన భుక్తి కర్మలుగా మార్చుకొన్నందువల్లనే, దారిద్ర్యము అతడికే కాక, లోకమునకు సంభవించుచున్నది. చేయించుకొనువాడు వ్యసనములకు ఎంతో ఖర్చుచేయును కానీ వైదికకర్మల దక్షిణలో లోభించుచున్నాడు. వానిని నాశనము చేయు వ్యసనములకు అధిక దక్షిణల నిచ్చుచున్నాడు. వానిని ఉద్ధరించి, రక్షించు వైదికకర్మలకు మాత్రము అల్పదక్షిణల నిచ్చుచున్నాడు. పురోహితుడు కూడా, ఆ దక్షిణ పైనే దృష్టిని ప్రసారించుచున్నాడు. చేయించుకొను యజమాని, శక్తి ఉండియు, లోభముతో తక్కువ దక్షిణ నిచ్చినచో, భగవంతుడు వానిని శిక్షించి, ఆ దక్షిణను వడ్డీతో పదింతలుగా నష్టపరచి, దానిని అనేకుల ద్వారా కడకు పురోహితునకు చేర్చుచున్నాడు. భగవంతుడు యీ లోకమను జూదములో ఆడగల అతి సమర్థుడు, కావున శక్తి కలిగియు దక్షిణలో లోభించినను, పురోహితుడు మౌనముతో నుండవలెనే కాని కలహించరాదు. దైవవిశ్వాసము కలిగి ఇచ్చిన దక్షిణను గ్రహించి, తృప్తితో, ఆశీర్వదించి వెడలిపోవలెను.
అప్పుడే అతడు ‘అగ్నిమీళే పురోహితమ్’ అను వేదారంభమగు అగ్నిదేవుని స్థానమున ఉండగలడు. అట్లు కానిచో–యీనాడు ‘పురీషస్య చ రోషస్య, హింసాయా స్తస్కరస్య చ’ అను నాలుగు దుర్గుణముల యొక్క ప్రథమాక్షరముల సంయోగముతో పురోహితుడని పిలువబడి, హేళనకు గురియుగుచున్నాడు. ఎంతటి ఉచ్ఛావస్థలో నుండవలసినవాడు ఎంత నీచావస్థకు వచ్చుచున్నాడో గదా! వైదికుడనగా కోర్కెలు లేనివాడని ‘శ్రోత్రియస్య చా కామహతస్య’ అని శ్రుతి చెప్పుచున్నది. వైదికుడనగా జ్ఞాని అని అర్థము. వేదము అనగా జ్ఞానము విద్–జ్ఞానే. వేదార్థము తెలియకపోవుట వలన వేదజ్ఞానరహితుడై, అవైదికుడు అనగా అజ్ఞాని అగుచున్నాడు. ఎవడు నిష్కామముగా, కేవలము భగవత్ర్పీత్యర్థము వైదిక కర్మలనాచరించి, ఇతరుల చేత ఆచరింపచేయుచున్నాడో అతడే వైదికుడు.
నిష్కామ కర్మయోగములే వైదిక కర్మలగు భగవదారాధనములు. భగవదారాధనములను వ్యాపింపచేయుటయే లక్ష్యము కావలయును కాని, వాటిని వ్యాపారము చేయరాదు. వైశ్యుడు వస్తువులను విక్రయించునపుడు కొనువాడి యోగ్యతను బట్టి వ్యాపారము చేయవలెను. పేదవానిని, యోగ్యుని మోసగించరాదు. అట్టి వ్యాపారము వైదికకర్మ వలె పవిత్రము. ఇక వ్యవసాయము వంచనా రహితమైనది కావున పరమపవిత్ర వృత్తి. ఆపద్ధర్మముగా ఏ వర్ణము వారలైనను ఏ వృత్తినైనా స్వీకరించవచ్చును. వ్యవసాయము చేయువారు చేయు పశు, పక్షిహింస వలన, ఆ జీవులు, క్రిమికీటకములుగా జన్మించి వీరి పంటలను నాశనము చేసి, వారికీ లోకమున వేదన కలిగించుచున్నవి కావున మాంసాహారము మానవలయును. వ్యవసాయము చేయునప్పుడు మాంసాహారులను సైతము, ఇవి క్రిమికీటకములుగా జన్మించి వారిలో చేరి వారికి రోగములను కలిగించి, వారికి తీవ్రవేదనను ఇచ్చుచున్నవి.
వైశ్యులు వ్యాపారము నందు ధర్మపరులై యుండవలెను. పేదవారి నుండి అధిక ధనమును గ్రహించరాదు. అధవా గ్రహించిన అధికధనమునకు సరిపడు వస్తువును కాలాంతరమున వారికి ఏదో విధముగా ఉచితముగ నిచ్చి, తమ పాపములను పోగొట్టుకొనవలెను. మద్యవ్యసనము కల పేదవానిని మోసగించి, వాని నుండి అధికధనమును గ్రహించి, ఆ అధికధనమునకు సరిపడు ఆహార వస్తువులను వాని కుటుంబమునకు ఉచితముగా నిచ్చినచో అది ధర్మమే అగును. వాడు ఇంటికి తన ధనమునీయక మద్యలోలుడైనాడు కదా. కావున ధర్మము దేశ కాల, వ్యక్తి పరిస్థితులను బట్టి ఉండును. దీనినే ధర్మసూక్ష్మము అందురు. ధర్మసూక్ష్మమే సదా ఆచరణీయము. మార్గము అధర్మమైననూ, లక్ష్యము ధర్మమగుటయే ధర్మసూక్ష్మము. కలియుగమున ధర్మసూక్ష్మమే ఆచరణీయము. పశుపక్ష్యాదులకు పోను మిగిలిన ధాన్యమును, దూడలు త్రాగుగా మిగిలిన పాలను గ్రహించవలెను.
హింసలో ప్రాణి మరణవేదన అతిదారుణము కావున ఏ ప్రాణిని వధించరాదు. రాజులు కూడ అపకారము చేసినపుడే క్రూరమృగములను వధించవలెను. లోకాపకారులగు రాక్షసులను భగవానుడు వధించెను. దుర్జనులకు అపకారము చేయుట, సజ్జనులకు ఉపకారము చేయుట ధర్మము. అట్లే దుర్జనులకు ఉపకారము చేయుట, సజ్జనులకు అపకారము చేయుట పాపము. కావున, సాధుజంతువులను, లోకమునకు ఎట్టి అపకారము చేయనట్టివి అగు జంతువులను వధించరాదు. వృక్షముల ఫలములు, సస్యముల ఫలములగు ధాన్యములను జీవులకు ఆహారముగా భగవానుడు సృష్టించినాడు. నీకు ఆహారమును సృష్టించియే నిన్ను దేవుడు సృష్టించినాడు. కావున, మాంసాహారమును మానుకొన్నచో, తగినంత ధాన్యాహారము చాలదు అను మాట వ్యర్థము. అపకారము చేయు దోమలను సైతము తెరవేసుకొని, వాటిని చంపుట బ్రాహ్మణుడు చేయరాదు. క్షత్రియుడు అపకారులను చంపును. ఈ రెండునూ ఉత్తమ, మధ్యమ ధర్మములు. ఇక ‘విశ్వాస ఘాతకో వైశ్యః శూద్ర స్సర్వస్య ఘాతకః’ – నమ్మించి హింసించువాడు వైశ్యుడు. అనగా పశువులకు మేత పెట్టి వాటిని తన సంతానమువలె పెంచి నమ్మంచి వాటిని వధించుట వైశ్యధర్మము. విచక్షణారహితముగా వధించుట శూద్రధర్మము. ఈ స్వభావములు కలవారే ఆయా వర్ణముల వారగుదురు.
★ ★ ★ ★ ★