home
Shri Datta Swami

 28 Oct 2024

 

చైత్రపూర్ణిమ సందేశం - కాలాన్ని వృథా చేసుకుంటే మరల సంపాదించలేవు


Part-1   Part-2


Part-1

[2005, చైత్రపూర్ణిమ సందేశము] పార్థివనామ సంవత్సర చైత్రశుక్లద్వాదశి గురువారము సా. 6.30 నుండి 9.00 గంటల వరకు సత్యనారాయణపురంలో శ్రీభీమశంకరం గారి యింట్లో దత్తస్వామి వారిని నేను నా శ్రీమతి, మనుమరాలు రాధ సేవించుకున్నాము. దత్త దివ్యవాణి ఇలా ఉన్నది.

నాయనా విను! శ్రద్ధగా విను. మనసును కలవర పరుచుకోకండి. మనశ్శాంతిని పోగొట్టుకోకండి. ఎలా అంటారా? అభ్యాసం చేయండి. మనస్సు కుదుటపడుతుంది. మనశ్శాంతి కోల్పోయిన ఆ సమయం భ్రష్టమౌతుంది. నీ జీవితకాలంలో అది వ్యర్థమవుతుంది. ఆ పోయిన సమయాన్ని నీవు తిరిగి సంపాదించలేవు. ధనము పోతే మరల సంపాదించవచ్చు. కాని కాలాన్ని వృథా చేసుకుంటే మరల సంపాదించలేవు. నీ జీవిత పరిమాణం నిర్ణయించబడే ఉన్నది. కనుక ఆ పరిమితకాలంలో కొంత వృథా చేసుకుంటే దానిని నీవు మరల సంపాదించలేవు.

కనుక ఎవడైతే కాలాన్ని పరమాత్మ వైపు మళ్ళిస్తాడో వాడే ధన్యుడు. బ్రహ్మానందము అందిన క్షణమే శాశ్వతము. ధన్యము. శంకరాచార్యుడు జీవించినది 32 సంవత్సరములే అయినా ఆయన అల్పాయుష్కుడు కాదు. ఎందువలననగా ఆయన ప్రతిక్షణము ఆనందముతో జీవించెను. మనము 90 సంవత్సరములు బ్రతికినా ఆనందముతో గడపలేదు గదా. కనుక మనమే అల్పాయుష్కులము.

Swami

శంకరాచార్యులు జీవన్ముక్తులు - మనము జీవన్మృతులము

జీవితంలో అనేక కష్టాలు వస్తాయి. నీవు పట్టించుకోవద్దు. ప్రతిక్షణం ఆనందంతో ఉండటానికే ప్రయత్నించు. ఒక రాజు భూమండలం అంతా జయించినపుడు ఆయన పొందే ఆనందాన్ని ‘మనుష్యానందము’ అంటారు. మనుష్యానందమునకు వందరెట్ల ఆనందము పితృదేవతానందము. పితృదేవతానందమునకు వందరెట్ల ఆనందము గంధర్వానందము. గంధర్వానందమునకు వందరెట్ల ఆనందము దేవతానందము. దేవతల ఆనందమునకు వందరెట్ల ఆనందము ఇంద్రానందము. ఇంద్రానందమునకు వందరెట్ల ఆనందము బృహస్పతి ఆనందము. బృహస్పతి ఆనందమునకు వందరెట్ల ఆనందము బ్రహ్మానందము.

ఇటువంటి బ్రహ్మానందమును శంకరాచార్యులు వారు ప్రతిక్షణము అనుభవించారు. మనమో–అలాకాదే! జీవితమంతా మనశ్శాంతి లేక క్షణక్షణము దుఃఖసముద్రములో మునిగి తేలుచున్నామే. అంటే ఆయన (శంకరాచార్యులు) జీవన్ముక్తుడు. మనమో జీవన్మృతులమన్నమాట. కనుక నాయనలారా! Time is Very Important. శ్రీకృష్ణావతారము చూడండి. ఆయన ఏమైనా సుఖపడ్డాడా! ఎన్ని కష్టములు. అడుగడుగునా కష్టములే కదా.

(1) పుట్టింది కారాగారంలో

(2) పెరిగింది గొల్లపల్లెలో

(3) పూతన చంపబోవడము

(4) శకటాసురుడు

(5) తృణావర్తుడు

(6) బకుడు

(7) ధేనుకాసురుల హత్యాయత్నాలు.

ఆహా ఎన్నో ఎన్నెన్నో కష్టములు గదా. ఆ తర్వాత మధుర వెళ్ళడము, కంసవధ. అప్పటినుంచి జరాసంధుడు అనేకసార్లు యుద్ధం చేయడము, మధురను వదలి ద్వారకకు వెళ్ళడము, నరకాసురసంహారమ, కురుక్షేత్రయుద్ధము, గోపాలురు తాగి తందనాలాడి ఒకరినొకరు చంపుకోవడము, ముసలం పుట్టడము, ఏకాంతములో చెట్టుక్రింద విశ్రాంతి తీసుకుంటుంటే బోయవాడి బాణం బ్రొటనవేలుకు తగిలి పరమపదించడము – ఇదీ కథ.

కనుక వాసుదేవునికి ఎన్ని కష్టాల పరంపర. ఎన్ని కష్టాలు వచ్చినా, ఏమైనా తన ఆనందస్థితి నుండి వైదొలిగాడా కృష్ణుడు? లేదు, లేదు. నిత్యానందస్థితియే. మనం అలా కాదే. ఒక్క కష్టానికే తల్లడిల్లిపోతున్నామే. చూడండి. శాంతి ఆత్మస్థితి. ఇందులో దైవత్వము లేదు. ఆనందమే దైవత్వానికి లక్షణము.

ఒక కుండ వున్నది. దాని నిండా ఉప్పునీరు వున్నది. ముందు ఏమి చేయాలి అంటే, ఉప్పునీటిని పారబోసి ఆ కుండను ఖాళీ చేసి శుభ్రపరుచుకోవాలి. అప్పుడు ఆ ఖాళీకుండలో గంగాజలము నింపుకోవాలి. అట్లే ముందు మనస్సునుండి అశాంతిని తొలగించుకొని ఖాళీ చేసి శుభ్రపరచుకోవాలి. అదే దుఃఖాన్ని తీసివేసి శుభ్రపరచుకోవడము. ఖాళీ మనస్సే – శాంతి. ఆ తరువాత భగవదానందముతో మనస్సును నింపుకోవాలి. అది బ్రహ్మానందము.

ఉప్పునీరు

ఖాళీకుండ

మంచినీరుతో నింపుట

 

(దుఃఖము)

(శాంతి)

(ఆనందము)

 

మనస్సు –1 పైసా        వాక్కు – 1 పైసా

100 పైసలలో వాక్కుచేత చేయు భజనలు 1 పైసా విలువ గలవి. మనస్సు చేత చేయు జపములు, ధ్యానములు 1 పైసా విలువ గలవి.. మిగిలిన 98 పైసలు సంసారములో మునిగి తేలుతున్నాయి. 100 పైసలు భగవంతునికి అర్పించుటయే కర్మసంన్యాసము, కర్మఫలత్యాగము, బ్రహ్మలోకప్రాప్తి. ఏ మనుజుడు కర్మసంన్యాసము, కర్మఫలత్యాగము చేయలేకపోతున్నాడు? ఆవకాయముక్క ఉప్పు, కారము, ఆవపిండి, నూనెతో ఊరి ఊరి ఉన్నపుడు, నీవు తియ్యగా మారు అని చెప్పినంత మాత్రాన మారుతుందా! మారనే మారదు. ఇదీ మానవుని పరిస్థితి. అందువలన ఇప్పటి రోజులలో మహాత్ములు – భజనలు, పూజలు, నామజపములు, ధ్యానములు చేయమని ప్రోత్సహించి 100 పైసలు భగవంతునికి అర్పించలేక పోయినా కనీసం మనసా వాచా 2 పైసలన్నా స్వామికి అర్పించుతారనే దృష్టితో ప్రోత్సహిస్తున్నారు.

జీవులందరు కాలార్ణవములో మునిగిపోతున్నారు. నాకు చాలా అశాంతిగా యున్నది. అందుకే వచ్చాను. వాక్కు, మనస్సు 2 పైసలే. అసలు విషయమంతా కర్మసంన్యాసము, కర్మఫలత్యాగములోనే వున్నది. ఇదే కర్మయోగము అని బోధిస్తున్నాను. ఏ ఒక్కడన్నా ఈ జ్ఞానసరస్వతిని విని ఆచరించి తరించండి అని అందరికీ చెప్తున్నాను. ఎన్నో e-mails పంపుతున్నాను. గృహస్థులకు కర్మసంన్యాసము, కర్మఫలత్యాగము రెండూ అవసరము. ఇలా ఆచరించి తరించండి.

ఇలా చేయడము ఎంతో అవసరం, కర్తవ్యమనే చెప్పాలి. ఇలా చేయకపోతే – కనీసం మీ మనస్సు, వాక్కు భగవంతునికి సమర్పించి మీ కర్తవ్యాలు చేసుకొనండి. ఇది గ్రహించే మహాత్ములు కనీసం ఈ రెండు పైసలన్నా సమర్పిస్తావనే ఉద్దేశ్యంతో ఈ పూజలు, భజనలు, అభిషేకాలు (వాక్కు), జపాలు, ధ్యానాలు (మనస్సు) ఏర్పాటు చేశారు అని తెలుసుకోవాలి.

శ్రీకృష్ణుడు మసిపూసుకున్న వజ్రమైతే– భీష్ముడు బొగ్గుమీద పూసిన సున్నపు పూత

నాయనలారా! ఇంకో ముఖ్యవిషయం గమనించండి. వజ్రం మీద మసిపూసుకున్న రూపమే శ్రీకృష్ణభగవానుడు. బొగ్గుమీద సున్నపు పూతరూపమే భీష్ముడు. తళతళ మెరిసే వజ్రమైన పరమాత్మ తమోగుణమును ప్రదర్శించుటయే ఈ కృష్ణావతారము. గోపికలతో రాసక్రీడ సల్పటము ఈ వజ్రముపై మసి పూసుకోవటము. ఈ వజ్రాన్ని కడిగితే ఆ మసిపూత పోతుంది.

వజ్రం తళతళలాడుతునే వుంటుంది. మసిపూత వజ్రములోనికి ప్రవేశించలేదు కదా. అంటే తమోగుణమును ప్రదర్శించినంతమాత్రమున శ్రీకృష్ణునకు ఎట్టి దోషము అంటదని తెలుసుకోవాలి. భీష్ముడు బొగ్గుపై పూసిన సున్నపుపూత. ఈ సున్నపుపూత కడగగానే పోతుంది. బొగ్గే మిగులుతుంది. అట్టి బొగ్గే భీష్ముడు.

శ్రీకృష్ణుని చూడండి. 16 సంవత్సరముల వయస్సు వచ్చేవరకే బృందావనములో వున్నాడు. రాసక్రీడలో పాల్గొన్నాడు. అది ఆయనకు మచ్చ అయితే, అక్కడ నుండి మధురకు వెళ్ళిన తరువాత మరల బృందావనానికి రానే లేదు. కనుక గోపికలపై మక్కువ ఉన్నట్లైతే ఒక్కసారైనా వచ్చేవాడు కదా. రాధాలోలుడు అన్నారేగాని ఆ రాధకోసం ఒక్కసారి, కనీసం ఒక్కసారి కూడా మళ్ళా రాలేదే. అంటే ఏమిటి? వజ్రం వజ్రమే గాని బొగ్గు మాత్రము కానే కాదు అని గదా దీని అర్థము.

అయితే భీష్ముని విషయానికి వస్తే ఆయన ఆజన్మ బ్రహ్మచారి. చాలా పవిత్రుడు. అదే బొగ్గుపైనున్న పూత. ఆ పూత కడగగానే మళ్ళా బొగ్గే కాని వజ్రం కాదే. ద్రౌపది అమాయకురాలు. స్త్రీ మరియు అబల. ఆమెకు జూదానికి ఎట్టి సంబంధమూ లేదు. కాని దుర్యోధనాదులు ఆమెను సభలోనికి లాగుకొని వచ్చి వస్త్రాపహరణ ప్రయత్నము చేశారు. అది ఎంత అధర్మము.

ఆ సభలో బలవంతుడైన భీష్ముడు వున్నాడు కదా. అయ్యో అధర్మము జరుగుతుందే అని తెలిసి కూడ దాని విషయమై ఏమి చేశాడు? దుర్యోధనాదుల తిండి తింటున్నానే ఆవైపే ఉండాలని ధర్మాన్నే పట్టుకు వేళ్ళాడాడే కాని, ద్రౌపదీ వస్త్రాపహరణమును ఆపాలనే ధర్మాన్ని, పక్కకు నెట్టివేసాడే. అది ఎంత తప్పు. అదే బొగ్గు లక్షణము.

శరతల్పము మీద పడిన తరువాత గాని తన తప్పు తెలుసుకోలేదు. ధర్మాన్ని కాపాడడం కోసము ప్రతిజ్ఞను ఉల్లంఘించటమే ధర్మమని, నేను అధర్మం వైపు పోరాడుతుంటే ధర్మాన్ని కాపాడటానికే తాను చక్రం పట్టాను అని కృష్ణుడు ప్రకటించడంతో నాకు జ్ఞానోదయమైనదని భీష్ముడు ప్రకటించాడు గదా. అందుకే తన అవసానదశలో భీష్ముడు శ్రీకృష్ణుని ధ్యానించి ముక్తిని పొందాడు.

Part-2

జో అచ్యుతానంద జో జో ముకుందా

నాయనలారా! మరో ముఖ్యమైన విషయమును చూడండి. ఒక పసిపాప ఏడుస్తూ వుంటుంది. ఆ పిల్లతల్లి ఆ పాపతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. బంగారు బొమ్మవు కదూ. అదిగో చూడు ఈ గిలక్కాయలు ఎంత బాగున్నాయో. ఏడవబోకే నా చిట్టితల్లీ. నా బంగారం వరహాల మూట, అంటూ ఉంటుంది. ఆ పిల్ల ఏడుస్తూనే ఉంటుంది. ఈ తల్లి మాటలు ఆ పసిపాపకు ఏమైనా అర్థమవుతాయా.

ఆ తల్లి వాక్కుతో మాట్లాడినందున ఎంత శక్తి వృథా అయినది. ఆ తల్లికి గాని, ఆ పిల్లకు గాని ఏ పుణ్యఫలమైనా దక్కినదా? ఆలోచించండి. అంతా వృథాయే గదా. అంతకంటే జో అచ్యుతానంద జో జో ముకుందా అంటూ దైవభజనలు పాడిందనుకోండి. ఆ తల్లికి, ఆ పాపకు పుణ్యఫలము దక్కుతుంది. అట్టి పుణ్యఫలము ఆ లోకములో ఉపయోగపడుతుంది గదా.

అసలు ముఖ్యవిషయము ఏమిటంటే, ఈ లోకములో కోరికలు తీర్చుకోవటానికి నీవు నీ శక్తిని ఉపయోగించుకోవచ్చు. కాని పరలోకములో భగవంతుని అనుగ్రహము కావాలి. దాని కోసమే ప్రయత్నించాలి. ఈ లోకములో మన జీవితం ముగియగానే యమకింకరులు వచ్చి, పాశాలు వేసి లాక్కుపోతారు. ఇక్కడినుండే భగవంతుని సాయం కావాలి.

ఆ సాయం కోసమే ఈ జన్మలో సాధన చేసుకోవాలి. అది ముఖ్యము. అందుకనే జీవితం ముగియక ముందే భగవదారాధన, సద్గురువు సేవ చేసుకోవాలి. అప్పుడు విష్ణుదూతలు వస్తారు. బ్రహ్మలోకానికి తీసుకువెళ్తారు. దీనికి ఒక్కటే సాధనమార్గము. నరావతారుడైన సద్గురువును పరిపూర్ణముగా విశ్వసించి సేవించడమే సాధనమార్గము.

డబ్బు రక్షిస్తుందా? భగవదనుగ్రహము రక్షిస్తుందా?

ఈ కాలములో మనుజులు డబ్బు, డబ్బు, డబ్బు అని తల్లడిల్లి పోతున్నారు. ఆ డబ్బు రక్షిస్తుందా? లేదు, భగవదనుగ్రహము ఒక్కటే రక్షిస్తుంది అని తెలుసుకోవాలి. పరిపూర్ణవిశ్వాసముతో సేవించాలి. జడములైన పటములను, విగ్రహములను ఆరాధించడము మొదటిమెట్టు. అంతటితో ఆగరాదు. మనుష్యశరీరమును ఆవహించి వచ్చిన పరమాత్మను అనగా నరావతారుని గుర్తించి, విశ్వసించి, సేవించి తరించాలి.

కర్మసంన్యాసము, కర్మఫలత్యాగమే బ్రహ్మలోకాన్ని పొందటానికి గల సాధనలు. గోపికలు, రాధ, హనుమంతుడు నరావతారులైన శ్రీకృష్ణ, శ్రీరాములనే విశ్వసించి, సేవించి తరించారు. రాధకు అసూయ పరీక్ష, హనుమంతునికి అహంకార పరీక్ష పెట్టారు స్వామి. రాధ – స్త్రీ. తను ప్రేమించిన పురుషుడు ఇతరస్త్రీలను ప్రేమిస్తున్నపుడు తనకు అసూయ వస్తుంది గదా. రాధామాధవులు ప్రేమించుకున్నారు.

కాని మాధవుడు మధురకు వెళ్ళిన తరువాత అష్టభార్యలను 16 వేల రాజపుత్రికలను పెండ్లియాడాడు. రాధ కొరకు అసలు రానే రాలేదు. రాధకు ఎంత అసూయ ఉండాలి. అందుకే రాధకు అసూయ పరీక్ష పెట్టాడు స్వామి. రాధ ఎట్టి అసూయపడక తన ప్రాణములనే మాధవుని కొరకు త్యజించి, పరీక్షలో నెగ్గింది. అందుకే ఆమెకు 14 లోకములకు పైన గోలోకమును సృష్టించి ఆ లోకమునకు రాణిని చేశాడు స్వామి.

ఇక హనుమంతులవారికి అహంకారపరీక్ష పెట్టాడు స్వామి. శ్రీరాముడు తన శక్తులను దాచుకున్నాడు. సామాన్యమానవునిగా ప్రవర్తించాడు. సీతను రావణుడు అపహరించినప్పుడు రోదించాడు. హనుమంతుడు అష్టసిద్ధులను ఉపయోగించి లంకకు వెళ్ళి సీతను దర్శించి వచ్చాడు. యుద్ధములో లక్ష్మణుడు మూర్ఛపోగా రాముడు పామరునిలా రోదించాడు గదా. హనుమంతుడే మరల అష్టసిద్ధులను వినియోగించి, సంజీవి పర్వతము తీసుకొనివచ్చి లక్ష్మణుని బ్రతికించాడు.

ఇక్కడ కూడా రాముని కంటే హనుమంతునికే ఎక్కువ శక్తి ఉన్నట్లు నిరూపణమైనది గదా. కాని హనుమంతుడు “దాసోఽహం కౌసల్యేంద్రస్య” అని అంతా రాముని శక్తియే అన్నాడు కాని అహంకరించలేదు గదా. ఈ పరీక్షలో హనుమంతుడు నెగ్గాడు. శ్రీరాముడు హనుమంతునికి భవిష్యత్ బ్రహ్మపదవిని ప్రసాదించాడు. కనుక నరావతారములోయున్న పరమాత్మను ఆశ్రయించి, విశ్వసించి, సేవించినచో బ్రహ్మలోకము తథ్యము అని ఋజువు అగుట లేదా!

తులసీదాసు పరమ రామభక్తుడగుట

ఇక తులసీదాసు విషయం చూడండి. తులసీదాసుకు అందమైన భార్య ఉన్నది. ఆమె అంటే తులసీదాసుకు అనంతమైన మోహము కూడా. ఒక్కరోజు కూడా ఆమెను వదలి ఉండలేడు. ఇలా ఉండగా ఒక రోజు ఆమె ప్రక్క గ్రామమైన తన పుట్టింటికి వెళ్ళింది. తులసీదాసు ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి ప్రొద్దుపోయింది. ఇంటికి వచ్చేటప్పటికి భార్య ఇంట్లో లేదు. తులసీదాసుకు ఏమీ తోచలేదు. బయట మబ్బులు, వాన ఇదీ వాతావరణము. వెంటనే ప్రక్క గ్రామానికి బయలు దేరాడు.

త్రోవలో నది అడ్డం వచ్చింది. దానిని ఆ వానలోనే ఈదుకుంటూ దాటాడు. ఆ గ్రామం చేరాడు. అత్తవారి యిల్లు ఒక మేడ. ఆ చీకట్లో ఆ మేడ ఎక్కవలసి వచ్చినది. అక్కడ మెట్లు లేవు. అక్కడ వ్రేలాడుతున్న త్రాడు పట్టుకొని ఎగబ్రాకి పైకి ఎక్కాడు. చీకట్లో భార్య వద్దకు చేరాడు. ఆమె గాఢనిద్రలో ఉన్నది. ఆమెను తట్టి లేపాడు. ఆవిడ ఉలిక్కిపడి లేచింది. ఆశ్చర్యచకితురాలైనది.

చీకట్లో ఎలా పైకి వచ్చారు అన్నది. అక్కడ త్రాడు ఉన్నది, దానిని పట్టుకొని పైకి ప్రాకాను అన్నాడు తులసీదాసు. త్రాడా! ఎక్కడ ఉన్నది? అని దీపం పట్టుకు వచ్చినది. తీరా చూస్తే అది ఒక పెద్దపాము. పాముతోక పట్టుకొని త్రాడు అనుకొని ప్రాకాడు అన్నమాట. ఆహా! ఎంత ఆశ్చర్యము. తులసీదాసుకు తనపై గల ఈ మోహానికి ఆమెలో ఒక మెరుపు మెరిసింది. ఆమె ఇలా అన్నది –

“హాడ్ మాంస్ కో దేహ్ మమ, తాపర్ జిత్నీ ప్రీతి
తిసు ఆధో జో రామ ప్రతి – అవసి మిటిహి భవభీతి.”

ఎముకలు, మాంసము, రక్తముతో కూడుకున్న ఈ చర్మముతో కప్పబడిన ఈ శరీరముపై ఎందుకు మీకు ఇంత మోహము. ఈ మోహములో సగము అయిననూ శ్రీరామునిపై పెట్టుకున్నచో ఈ భయంకరమైన సంసారసాగరమును దాటవచ్చును గదా! అని అన్నది. తులసీదాసులోని జీవుడు సామాన్యుడు కాడు. ఈ మాటలు వినగానే తులసీదాసుకు జ్ఞానోదయమైనది. గిరుక్కున వెనక్కు తిరిగినాడు. అంతే రామభక్తుడైనాడు. పరిపూర్ణముగా భార్యపైన వ్యామోహము తెంచుకున్నాడు. పరిపూర్ణముగా ఆ వ్యామోహమును శ్రీరామునిపైకి మరల్చినాడు. ధన్యుడైనాడు.

Swami

శ్రీహనుమంతులవారు తులసీదాసుకు దర్శనమిచ్చినారు. సంభాషించినారు. అప్పుడు తులసీదాసు శ్రీరాముని దర్శనం కావాలని అడిగాడు. స్వామి వస్తారు. నేను సంజ్ఞ చేస్తాను, అప్పుడు గుర్తించి పట్టుకో అన్నారు హనుమంతులవారు. రోజూ గంధమును అరగదీసి అందరికీ తిలకం పెడుతున్నాడు తులసీదాసు. శ్రీరామలక్ష్మణులు మారు వేషములలో వచ్చి తులసీదాసు చేత తిలకం పెట్టించుకుంటున్నారు.

అప్పుడు హనుమంతులవారు శ్రీరాముడే సాక్షాత్తు వచ్చి తిలకం దిద్దించుకుంటున్నారని సంజ్ఞ చేశారు. వెంటనే తులసీదాసు గుర్తించి, లేచి శ్రీరాముని పాదములకు నమస్కరించాడు. తరించాడు. కనుక ఐహిక మోహములను తెంచుకొని, అట్టి మోహమును భగవంతుని పైకి మరల్చుకొని తరించాలని శ్రీదత్తవాణి.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch