14 Feb 2025
[09.05.2000 ఉదయము 6 గంటలకు] నారాయణుడనగా ‘నారం జ్ఞానమ్ అయనం యస్య సః’ అని అర్థము. అనగా జ్ఞానమునకు ఆశ్రయుడని, గురుస్వరూపమనియే అర్థము. ‘సత్యం జ్ఞానం...’ అను శ్రుతికి ఈ వ్యుత్పత్తి సమన్వయించుచున్నది. అయితే నారాయణుడే బ్రహ్మ అని, నారాయణుడే శివుడనియు ‘బ్రహ్మా చ నారాయణః, శివశ్చ నారాయణః’ అని శ్రుతి చెప్పుచున్నది. ఈ జ్ఞానియే బ్రహ్మ, అనగా చాలా గొప్పవాడు, ఈ జ్ఞానియే పరమపవిత్రుడను అర్థము గల శివుడు. ‘న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే’ అని గీత (జ్ఞానమునకు సమానమైనది, పవిత్రమైనది ఏదియును లేదు) బోధించుచున్నది.
ఇక హిరణ్యగర్భుడనగా హిరణ్యము (శ్రేష్ఠమైనది) గర్భమున (లోపల) కలవాడని అర్థము. హిరణ్యము అనగా సర్వశ్రేష్ఠమైన వేదాంతజ్ఞానమే. ఇదే విషయము ‘హిరణ్మయేన పాత్రేణ...’ అను శ్రుతిలో కూడ చెప్పబడినది. “బంగారుపాత్రలో దాగి ఉన్న సత్యమును నాకు సత్యధర్మమైన దృష్టితో తెలియుటకు చూపించుము” అని ఆ శ్రుతికి అర్థము. అనగా, సత్యమును తెలియబరచు వేదాంతజ్ఞానమును నాకు బోధించుము అనియే అర్థము. కాన హిరణ్యగర్భ, సదాశివ నామములు నారాయణుడే అగు పరబ్రహ్మమును సూచించును. బ్రహ్మ, విష్ణు శివాంతర్గతుడైన గురుస్వరూపమగు దత్తబ్రహ్మమే నారాయణుడు తప్ప వేరొకరు కాదు. వైష్ణవులు కూడ విష్ణువుకు అతిరిక్తముగ నారాయణతత్త్వమును ప్రతిపాదించుచున్నారు కదా. అట్లే శైవులు కూడ శివునికి అతిరిక్తముగ సదాశివుడున్నాడని ప్రతిపాదించుచున్నారు గదా. అలాగే బ్రహ్మదేవుని కన్న అతిరిక్తమగు హిరణ్యగర్భుని, హైరణ్యగర్భ వాదులగు ఋషులు పూర్వము ప్రతిపాదించినారు గదా.
ఈ హిరణ్యగర్భ శబ్దము బ్రహ్మదేవుని వేషములోనున్న దత్తుని చెప్పును. ఈ నారాయణ శబ్దము విష్ణువు వేషములోనున్న దత్తుని చెప్పును. ఈ సదాశివ శబ్దము, శివుని వేషములోనున్న దత్తుని చెప్పును. హిరణ్యమనగా సర్వశ్రేష్ఠమైన జ్ఞానము అదియే వేదాంతతత్త్వము. దానిని గర్భమునందు అనగా తనలో దాచుకొనియుంచి, అర్హులైన వారికే ప్రకాశింపచేయు గురుతత్త్వమే హిరణ్యగర్భ శబ్దమునకు అర్థము. అట్లే నారమనగా జ్ఞానము, దానికి అయనుడనగా ఆశ్రయుడని అర్థము. అనగా గురుస్వరూపమే. ఇక సదాశివుడనగా, సదా=ఎల్లప్పుడు, శివుడు=పవిత్రుడు అని అర్థము. అనగా గురుదత్తుడెపుడును మాయతో ఆచ్ఛాదింపబడి, అనర్హులకు చండాలాది వేషములతో అపవిత్రునిగ కనిపించును. కానీ లోపల అంతస్స్వరూపమున నిర్మల జ్ఞానానంద లక్షణుడై పరమ పవిత్రునిగ ఉంటాడనియే అర్థము. ఈ విధముగ త్రిమూర్తి వేషాంతర్గతుడగు శ్రీదత్తసద్గురువే శ్రుతి ప్రతిపాదిత పరబ్రహ్మము.
[28-07-2000]
శాక్తేయులు ఈ శక్తినే పరాశక్తియన్నారు. పరాశక్తి కూడ దత్తబ్రహ్మమునే బోధించును. శక్తియును ఆయన యొక్క స్త్రీ వేషమే. కావున హైరణ్యగర్భులు బ్రహ్మదేవుని కన్న భిన్నమైన హిరణ్యగర్భుని చెప్పుటలో భగవంతుని వేషములలో బ్రహ్మదేవుడొక వేషమనియే తాత్పర్యము. ఆ హిరణ్యగర్భుడే దత్తపరబ్రహ్మము. అట్లే వైష్ణవులు విష్ణువు కన్నా భిన్నముగా నారాయణుడని చెప్పుటలో విష్ణువు ఒక వేషమనియును, నారాయణుడు ఆ వేషాంతర్గతుడగు దత్తపరబ్రహ్మమనియే అర్థము. అట్లే శైవులు శివుని కన్న భిన్నముగా సదాశివుని చెప్పుటలో, శివుడొక వేషమనియు, సదాశివుడనగా దత్త బ్రహ్మమనియే అర్థము. అట్లే శాక్తేయులును వాణీ, లక్ష్మీ, గౌరీ - వీరికన్నా భిన్నముగా చెప్పు ఆదిపరాశక్తియే దత్తపరబ్రహ్మము. వాణీ, లక్ష్మీ, గౌరులు దత్తబ్రహ్మము యొక్క మూడు విభిన్న వేషములు మాత్రమే.
శాక్తేయులు పరబ్రహ్మము నంగీకరించి, ఆ పరబ్రహ్మము కన్నా భిన్నముగా శక్తి ఉన్నదని వాదించుట సరికాదు. ఏలననగా శక్తియే పరబ్రహ్మము, పరబ్రహ్మమే శక్తి. లోకములో ఎవడునూ ద్రవ్యము (matter) నుండి శక్తిని వేరు చేయలేడు. నవీన విజ్ఞానవాదములో కూడ ద్రవ్యము కణాత్మకమనియు, శక్తి తరంగాత్మకమనియు ముందు భావించిననూ, శక్తి కణాత్మకముగను, ద్రవ్యము తరంగాత్మకముగను ఉండుటను నిరూపించి అంగీకరించినారు. ‘ఈ రోజు నాకు శక్తి లేదు’ అన్న లోకవ్యవహారము కూడ విచారణ చేసిన ఈ సత్యము తేలును. ఆ ఉదాహరణలో ద్రవ్యము కన్న భిన్నముగా శక్తి ఉన్నదని దాని అర్థము కాదు. శక్తి లేనివాడు చిక్కిపోయినాడు. అపుడు, వానిలో ద్రవ్యరూపమై, కణాత్మకమగు శక్తి పోయినట్లే కదా.
ద్రవ్య(శక్తి)యంతయును అట్లే ఉండి, ఏ విధంగానూ చిక్కిపోనివాడు ‘ఈనాడు నాకు శక్తి లేదు’ అని అనలేడు. ఏలననగా ద్రవ్యమున్నపుడు శక్తియున్నట్లే. ద్రవ్యమే శక్తి, శక్తియే ద్రవ్యమని, నవీన విజ్ఞాన మతములో ప్రయోగ పూర్వకముగ నిరూపించబడిన నవీన తర్కమతము. ప్రయోగ నిరూపణము లేని కేవల ప్రాచీన శుష్కతర్కములు ఊహాపరంపరా (series of imaginations) జనితములు, నవీనతర్కము ముందు నిలువజాలవు. కావున, నవీనతర్క సిద్ధాంతములను అంగీకరింపక తప్పదు.
చిన్మాత్రవాదులగు అద్వైతులు, చైతన్యమునే బ్రహ్మమనుచున్నారు. అట్లే శాక్తేయులును ఈ చైతన్యమునే పరాశక్తి యనుచున్నారు. కానీ, యీ చైతన్యము నేడు నవీన విజ్ఞానమతములో అత్యంత సూక్ష్మకణ పరంపరగా ద్రవ్యాత్మకముగ నిరూపించబడినది. నవీన యంత్రముల ద్వారా చైతన్యశక్తినే కాంతిశక్తిగా (light energy) రూపాంతరమును (transformation) చెందించి చూపించుచున్నారు. కావున ఈ చైతన్యము కూడ సృష్టిలో భాగమే. ఇది పరాప్రకృతి యని ప్రకృతిలో ఒక భాగమే తప్ప, సృష్టికి అతీతమైన సృష్టిశక్తి కాదు. ఇది ప్రాణిశరీరమునందు కల అతి లలితమైన నాడీమండలమున (nervous system) ప్రవహించు అతి దుర్బలమైన (weakest), లలితమైన జడశక్తియే (subtle inert energy). అందుకే దీనిని ‘లలితా శక్తి’ అన్నారు.
గ్రీష్మకాలమునందు (summer) అల్లలాడు ఈ చైతన్యశక్తి ఎక్కడ? సూర్యుని సైతము శాసించు ఆ శక్తి ఎక్కడ? కావున ఆ శక్తి ‘పరా’ అనగా సృష్టికన్న భిన్నమైన శక్తియనియే గ్రహింపవలెను. ఈ చైతన్యమునకు సృష్ట్యాదిశక్తులు లేవని ప్రత్యక్ష గోచరమే (direct perception) కదా. అవి చైతన్యశక్తులే అయినచో, ప్రతి ప్రాణియందును సృష్ట్యాదిశక్తులుండవలెను. అవతారపురుషునియందు కనపడు సిద్ధులు చైతన్యశక్తులు కావు. అవి చైతన్యమునకు అతీతమైన ఆ పరబ్రహ్మశక్తులే. ‘నేతి నేతి’ శ్రుతి, సృష్టియందు గల సర్వతత్త్వములను బ్రహ్మము కాదని నిరాకరించుచున్నది. ‘మామేభ్యః పరమ్’ అని గీతయునిదే చెప్పుచున్నది.
అయితే సిద్ధులు స్వామి లక్షణములు కావు. అవి కేవలము స్వామి యొక్క సొమ్ములు మాత్రమే. అవి బ్రహ్మము యొక్క స్వరూపలక్షణములు (inherent characteristics) కావు. అవి తటస్థలక్షణములే (apparent characteristics). ఆ సొమ్ములను స్వామి, తపస్సు చేత మొండిపట్టు పట్టిన రాక్షసులకును ఇచ్చి ఉన్నారు. ఆ సొమ్ములు కల రాక్షసులు స్వామి అగుదురా?
స్వామి యొక్క గుర్తులు: జ్ఞానము, ప్రేమ, ఆనందము, శాంతి, సత్యము మొదలగు యోగిరాజ లక్షణములు. ఈ సృష్టి అంతయును స్వామి యొక్క సంకల్పమాత్రమే. అనగా చైతన్యమే. చైతన్యమనగనే ప్రాణిచైతన్యము కాదు. ప్రాణులలో కనపడు సామాన్య చైతన్యము కన్నా విలక్షణ–విశిష్ట చైతన్యము. చైతన్య శబ్దసామ్యము చేత ప్రాణి (జీవి) స్వామి కాడు. గ్రామపాలుడు (village president) –రాష్ట్రపాలుడు (president of a country) శబ్దములలో ‘పాలుడు’ అని శబ్దమున్నంత మాత్రమున గ్రామపాలుడు రాష్ట్రపాలుడగునా? ఈ చైతన్యాధారమగు వ్యక్తియే దత్తుడు. ఆ దత్తుడే పరబ్రహ్మమని శ్రుతిసిద్ధాంతము. శ్రుతి ప్రోక్తలక్షణద్వయము కేవలము స్వామి స్వరూపమందే సమన్వయించుచున్నది కావున సహేతుకముగా శ్రీదత్తసద్గురువే పరబ్రహ్మమని నిరూపించినాము తప్ప, వీరశైవాది వీరమతముల వలె మేము గుడ్డిగా చెప్పుట లేదు.
★ ★ ★ ★ ★