20 Mar 2025
[07.11.2002] దత్తుడనగా దానము. అనగా స్వార్థము లేని త్యాగము. ఎవడు స్వార్థమును పరిపూర్ణముగా వదలి, పరిపూర్ణమైన త్యాగస్వరూపుడగుచున్నాడో వాడే దత్తుడగుచున్నాడు. స్వార్థము ఎంత విడచి పోవుచున్నదో ఎంత త్యాగము పెరుగుచున్నదో అంతగా వాడు దత్తునకు సమీపమగుచున్నాడు. దత్తుడు యోగియైనను, భోగియైనను జీవులను ఉద్ధరించుటకే తప్ప, ఆయనలో ఎట్టి స్వార్థము లేదు. ఆయన ఆప్తకాముడు అనబడుచున్నాడు. అనగా అన్ని కోరికలు తీరినవాడని అర్థము. ఆయనకు స్వార్థముగా ఎట్టి కోరికయు లేదు. ఆయన అఖండ బ్రహ్మానందసాగరుడు. ఆయన యోగిగా యున్నను, భోగిగా యున్నను, ఆయన యొక్క ఊహామాత్రమగు ఈ జగత్తు ఆయనలో ఎట్టి మార్పును తీసుకురాలేదు. మరియు ఆయనను బంధించజాలదు.
యోగ్యులకు మార్గదర్శకుడై యోగమును బోధించునపుడు ఆయన యోగిగా యుండును. భోగులను ఉద్ధరించు సమయమున ఆయన భోగిగా యుండును. బురదగుంటలో పడినవారిని ఉద్ధరించుటకై తానును బురద గుంటలో దూకవలెను కదా. భోగులలో భోగిగా నుండుచూ వారికి ఆత్మీయుడై క్రమముగా వారిని యోగము వైపుకు త్రిప్పును. మరియును యోగులకు తమపై విశ్వాసమును పరీక్షించుటకు తాను భోగిగా కనపడుచుండును. అంతేకాక అన్ని పాత్రలను ధరించు మోజును తీర్చుకొనుటకై యోగుల పాత్రను, మరియు భోగుల పాత్రలను ధరించి పలకరించుచుండును. కాని ఏ పాత్ర ధరించినను జీవులకు ఉపదేశము చేయుచు జీవులను ఉద్ధరించు త్యాగమే తన తత్త్వమై యుండును.
ఒక గరుడపక్షి, మరియు కుక్కపిల్ల నేలపై నడచుచున్నవి. నేలపై నడచు గరుడపక్షితో తాను సమానమని కుక్కపిల్ల తలచును. కాని ఒక్క క్షణములో గరుడపక్షి ఎగిరి ఆకాశమున విహరించును. కాని కుక్కపిల్ల ఎగురజాలదు. కనుక భోగిగా నున్న మానవునకును భోగిగా నటించుచున్న మాధవునకును తేడా ఇదే. యోగ, భోగములు కలసి సృష్టిచక్రము అగుచున్నది. ఈ రెండింటి యందును భ్రమించుచూ, దేనికిని కట్టుపడక లీలావినోదము చేయువాడే పరమాత్మ. ఈ రెండింటిలో ఏదో ఒక దానియందే బద్ధుడై చిక్కుకున్నవాడే జీవుడు. జీవుడగు భోగి, భోగములను త్యజించనిదే యోగిగా ఎదుగజాలడు.
అట్లే జీవుడగు యోగి యోగభ్రష్టుడు కానిదే భోగిగా క్రిందకు దిగజాలడు. పైకి ఎక్కలేడు, ఎక్కినా దిగలేని వాడే జీవుడు. క్షణములో ఎక్కి క్షణములో దిగ కలవాడే పరమాత్మ. ఈ ఎక్కుట, దిగుట అనునవి పరమాత్మకు వినోదదాయకములు అన్న అంశము ప్రధానము కాదు. ఈ ఎక్కుట దిగుట చేత సర్వ జీవులును దత్తస్వరూపులుగా మార్చుటయే దత్తుని లక్ష్యము. ఆయన యొక్క ప్రతి క్రియయు జీవులకు సాయపడుటయే పరమలక్ష్యమైయున్నది. అఖండానంద స్వరూపమునకు లీలావినోద ఆనందము కావలయునా?
జీవులను ఉద్ధరించుట అను ప్రధానలక్ష్యమే ఆయన యొక్క ప్రతి క్రియలో తత్త్వమై యున్నది. ఆ ప్రధాన తత్త్వమునకు అనుకోకుండా కలసి వచ్చిన లీలావినోదమును పొందుచున్నాడే తప్ప, లీలావినోదము ప్రధానము కాదు. ఆయన ఎన్నో అద్భుతములను చేసి తనను దాచుకొని వాటిని తన భక్తుడు చేసినట్లుగా కనిపింపచేసి ఆ కీర్తిని భక్తుల కిచ్చుచున్నాడు. ఇదే ఆత్మత్యాగము. భక్తుడును దత్తసేవలో ఇట్లే తన కీర్తి కొరకు గాక స్వామి కీర్తిని ప్రచారము చేయవలయును. అట్టి భక్తుడు దత్తస్వరూపుడగును. భక్తుడు స్వామి కీర్తిని ప్రచారము చేసి తరించవలెనని సారాంశము.
★ ★ ★ ★ ★