home
Shri Datta Swami

 16 Mar 2025

 

భక్తులు - కోరికలు

[12.11.2002] భగవంతుని మనము నిత్యము పూజించుచున్నాము. ఆ పూజలలో మనము ఎంతో భక్తిని కలిగియున్నాము. అయితే ఆ భక్తి పరమాత్మపై నున్న భక్తి కాదు. ఒక కోరికను సాధించుకొనుటకు పరమాత్మను సాయము కోరుచున్నాము. మనకు అనారోగ్యము వచ్చినపుడు వైద్యుని వద్దకు వెళ్తాము గదా. అపుడు ఆ వైద్యుని ఎంతో వినయముతో, శ్రద్ధతో గౌరవించుచున్నాము. ఆ గౌరవము నిజముగా డాక్టరుపై కానే కాదు. మన అనారోగ్యమును ఆ వైద్యుడు తగ్గించును కాన మనము ఆ వైద్యునిపై ఎంతో శ్రద్ధ చూపుచున్నాము. మన అనారోగ్యము పోయి, ఆరోగ్యవంతులమై సుఖముగా నుందుము గాన, మన సుఖము కొరకు అనగా మన శరీరముపై ఉన్న మమకారము చేత వైద్యునిపై శ్రద్ధ చూపుచున్నామే తప్ప, వైద్యునిపై నిజముగా ఎట్టి మమకారము లేదు. కావున మన భక్తి అంతయును మన సుఖమును సాధించుకొనుటకు మనకు మనపై ప్రేమయే తప్ప భగవంతునిపై ఎట్టి ప్రేమయును లేదు.

ఇది భగవత్ర్పేమగా బయటకు భాసించుచున్నదే కాని యదార్థమైన భగవత్ర్పేమ కానే కాదు. వేశ్య విటుని వద్ద ఉన్న ధనమును తీసుకొని దానితో తాను సుఖించవలయునని ఆ ధనమును పొందుటకు విటునిపై ప్రేమను వలకపోయుచున్నదే తప్ప అది నిజమైన ప్రేమ కానే కాదు. వేశ్యకున్న ప్రేమ అంతయు తనపై తనకున్న ప్రేమయే. ఏలననగా ఆమె చూపుచున్న ప్రేమ అంతయు ధనమును సంపాదించుకొనుటకు హేతువు (cause) అగుచున్నది. ఆ ధనము తన సుఖమునకు హేతువు అగుచున్నది. ఆ సుఖము తనపై తనకు గల మమకారమునకు హేతువగుచున్నది. కావున వేశ్యచూపు ప్రేమకు తనపై తనకు గల మమకారమే కారణము గాని విటునిపై మమకారమునకు హేతువు కానే కాదు.

Swami

మోక్షము కోరువారును తాము బ్రహ్మానందమును పొందవలయునను కోరికతో తమపై తమకు ఉన్న మమకారమే కారణము గలవారు అగుచున్నారు. వీరికిని భగవంతునిపై మమకారము లేదు. కావున మోక్షకామము కూడా స్వార్థమే. ఎట్టి స్వార్థము లేక భగవంతునిపై మమకారము కలవారే స్వామికి నిజమైన సత్యమైన ఆత్మీయులు. వారిని స్వామి తనకన్న ఎక్కువగా ప్రేమించును. అట్టివారు ఎక్కడను లేరు అనరాదు. లౌకిక విషయములో లోకములోనే ఉన్నారు.

ఒక సినిమా హీరో మరణించగా ధనమును, భార్య, పిల్లలను సహితము విడచి తన ప్రాణములపై కూడ మమకారము లేక సజీవ దహనమును చేసుకొన్న వారు లేరా? అట్టివాడిలో ఆ సినిమా హీరోపై మమకారము తప్ప ఎట్టి స్వార్థము లేదు. అట్టి స్థాయికి భక్తి వచ్చినప్పుడే దత్తుడు ఆ జీవుని పై దృష్టి సారించి, దిగి దిగి వచ్చి ఆ జీవునకు తనను తాను దానము చేసుకొని, ఆత్మార్పణము కావించి, దత్తుడై ఆ జీవునిలో తాను లీనమగుచున్నాడు. అట్టి భక్తుడే అవతార పురుషుడగును. అట్టి జీవుడే నిజమైన దత్తుడగుచున్నాడు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch