home
Shri Datta Swami

 26 Nov 2024

 

భక్తులు అహంకారానికి లోను కాకూడదు

[22.01.2006, అనఘాష్టమి] భక్తులు అహంకారానికి లోను కాకూడదు. ఒకవేళ భక్తునిలో సంస్కారలోపము చేత కొన్ని పొరపాట్లు కనిపించినా, భగవానుని కరుణామయదృష్టి పడుటచేత అవి కూడా పండుటాకులవలె రాలిపోతాయి. చిరునగవుతోనే భక్తుల గర్వమును హరించువాడు భగవంతుడు. సత్యభామ గర్వభంగమును శ్రీ కృష్ణుడు చిరునగవుతోనే హరించెను గదా. ఆనందము ఎచ్చట ఉన్నది? ఆనందము ఆత్మయందే ఉన్నది. ‘ఆనందో బ్రహ్మ’ అని శ్రుతివచనము. ఆత్మలో ఆనందము ఉన్నదని తెలుసుకొనలేక, ఆనందము కొరకు ఆర్తితో అన్యవస్తువులయందు అన్వేషణ సాగిస్తున్న వ్రజవాసుల మానసములను అపహరించి, వారి చిత్తములను దారి మరల్చి, వారి మనములలో త్రీవరూపము తాల్చియున్న ఆర్తిని తన వైపునకు త్రిప్పుకున్నాడు శ్రీకృష్ణుడు. వెంటనే వారికి ఆనందానుభూతి కలిగినది. ఆ విధముగా గోపికలు శ్రీకృష్ణుని దాసులైనారు.

Swami

అదే ‘దాసోఽహం కోసలేంద్రస్య’  అన్న హనుమంతుని దాసభక్తి. అహంకారాన్ని శాశ్వతముగా తమ హృదయాల నుండి దూరం చేసి శ్రీకృష్ణుని పదసరోజములయందు సమర్పించినారు గోపికలు. కనుక సేవయే పరమావధి అని తాత్పర్యము. భగవద్దర్శనాన్ని ఆటంకపరచేది మన అజ్ఞానమే. అజ్ఞానము తొలగాలంటే జ్ఞానము కావాలి. జ్ఞానము రావాలంటే మనం అజ్ఞానాన్ని రూపుమాపాలి. దానికి ఆధ్యాత్మికమే మార్గము. అదే భగవద్భక్తి. ‘ఈశ్వరానుగ్రహాదేవ పుంసామ్ అద్వైతవాసనా’ అనగా భగవదనుగ్రము లేనిదే అద్వైతవాసన కలుగదని శ్రీదత్తాత్రేయుల వారు అవధూతగీతలో చెప్పియున్నారు.

23.01.2006

శ్రీగురుదత్త:- భగవానుని దివ్యపాదారవింద దర్శనముతో సమస్తపాపములు ప్రక్షాళనమగును. భగవానుని చరణములు బ్రహ్మదేవుడు కడిగిన పాదములు. అవి దివ్యగంగామాతకు దివ్యపాదములు – అహల్య పాపములను కడిగివేసిన పాదములు. అవి గజేంద్రుని కాపాడిన పాదములు. అది బలిని కృతార్థుని చేసిన పాదము.

భగవానుని దివ్యపాదారవిందములకు ప్రణామములు అర్పించు వారి పాపములు ప్రక్షాళనమగును. భక్తుడు భగవానుని పాదములకు ప్రణామములు అర్పించుటనుండే ధర్మయుతజీవనమును గడుపుటకు నిశ్చయించుకుని తనను కాపాడమని భగవంతుని ప్రార్థించుచు శరణాగతుడగుట. భగవంతుడే ధర్మము. ధర్మమే భగవంతుడు. ‘ధర్మో రక్షతి రక్షితః’ ధర్మమును రక్షించువాడు ధర్మముచేత రక్షింపబడునని ఉపనిషద్వాక్యము. కనుక భగవానుని దివ్యచరణములకు ప్రణమిల్లువానిని ఆ పాదములే రక్షిస్తాయి.

ముఖ్యవిషయము: మనిషికి సహజాతాలతో పాటు బుద్ధి కూడా ఉన్నది. నిత్యానిత్య వస్తువివేకము చేయగల జ్ఞానమున్నది. అందుచే ఆవేశాలను విచారణచే అంతమొందించుకోవాలి. కోపము రాగానే పశువువలె మనిషి బహిరంగ పరచకూడదు. మౌనం తాల్చాలి. ద్వేషము రాగానే ఆలోచించి దానిని ప్రేమగా మార్చుకోవాలి. లోభాన్ని త్యాగముతో జయించాలి. సేవాభావముతో కర్మలనాచరించి స్వార్థాన్ని నిర్మూలించాలి. నీతి జీవనం గడపాలి. ధర్మయుతంగా బ్రతకాలి. ‘కోరే వారికి కోరికలే మిగులుతాయి. కోరని వారికి ఆనందం అమరుతుంది’. తపించుటయే తపస్సు. భగవానుని కొరకు తపించే ధన్యజీవులకు భగవానుడు క్షణం కూడా దూరం కాడు. తపస్సు నాకు హృదయము. నేనే తపస్సుకు ఆత్మను అని భాగవతము ద్వితీయ స్కంధము 9వ అధ్యాయము నందు భగవానుడు స్వయంగా వేదగర్భుడైన బ్రహ్మదేవునకు తెలియచేసినాడు.

26.01.2006

శ్రీగురుదత్త:- భగవత్కథామృతము తాపత్రయమునందు కృంగువారలకు ఉపశమనము కల్గించును. తాపత్రయము మృత్యుసమానము. సాంసారిక తాపత్రయమునకు అజ్ఞానమే కారణము. ఇది దుఃఖాన్నే ఇస్తుంది. బ్రహ్మైక్యమనే అపరోక్షజ్ఞానము కలగాలంటే ఉపనిషత్తులలోని తథ్యాలను శ్రవణము చేసి పరిశోధించాలని ఆదిశంకరులవారు బ్రహ్మసూత్రభాష్యములో తెలియచేసినారు. సత్యము, ప్రేమ, శాంతిని భాగవతము బోధిస్తుంది. అసుర ప్రవృత్తులకు దూరంగాఉండాలనే భాగవత అంతరార్థము వైరాగ్యమును ప్రబోధిస్తుంది.

శ్రీకృష్ణుడు కర్ణరంధ్రాల ద్వారా భక్తుల హృదయమున ప్రవేశించి వారి పాపములను హరించునని భాగవతములో పరీక్షిన్మహారాజుకు తెలియచేయబడినది. వ్యాసుడు, శుకుడు, నారదాది మహర్షులు సదా హరిగుణ కీర్తనాదుల యందే తమ జీవితాలను ధన్యత చేసుకున్నారు. భగవంతుని మాహాత్మ్యాలను ఇతరులకు తెలియచేయుట అనెడి తైలము పోసి తమలోని దివ్యజీవనమను జ్యోతిని ఆరకుండా వెలుగునట్లు చేసుకున్నారు మహర్షులు, అంటే భక్తులు.

మనస్సులో తిష్ఠ వేసుకున్న వాసనలే కల్మషములు. కమనీయ కథాశ్రవణము మనస్సులో ఎప్పుడైతే ప్రవేశించినదో వెలుతురు రాగానే అంధకారము అదృశ్యమైనట్లు, అంతవరకు మనస్సును ఆవరించిన కల్మషములు అదృశ్యమౌతాయి. అట్టి భగవత్కకథాశ్రవణము ఆత్మానందఫలాన్ని ఇస్తుంది. సకలపాపములు హరించిపోతాయి.

పుణ్యశ్రవణకీర్తనుడు, సత్పురుషులను రక్షించువాడు అగు శ్రీకృష్ణభగవానుడు తన కథలను శ్రవణము చేయువారి హృదయములో నుండి పాపవాసనలను నశింపచేయును. అని సూతమహర్షి శౌనకాదులకు ప్రవచించెను. దీర్ఘకాలము విధేయతతో ఎడతెగని సాధన కొనసాగించినచో సాధన సులభమగును అని పతంజలిమహర్షి యోగసూత్రములు తెలియచేయుచున్నవి.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch