16 Dec 2024
భక్తుడు అనగా తన కర్మఫలములను స్వామి అనుభవించునని తెలిసి వాటిని తానే అనుభవించెదననియు వాటిని స్వామి రద్దు చేయవద్దు అని ప్రార్థించెడివాడు. రద్దు చేయుట అనగా స్వామియే స్వయముగా అనుభవించుట అని తెలిసినవాడే జ్ఞానియగు భక్తుడు. అజ్ఞానియగు భక్తుడు కర్మఫలములను రద్దు చేయగల శక్తి స్వామికి ఉన్నది కావున వాటిని రద్దు చేయమని అర్థించును. అట్టివాడు స్వామి యందు నిజమైన భక్తి కలవాడు కాడు. అట్టి భక్తుడు స్వామిని అరాధించుచు మొండిపట్టును పట్టుచూ ఉండును. స్వామి ఎన్నడును కర్మ ఫలములను రద్దు చేయడని వానికి తెలియ చెప్పినను వినక కర్మఫలములను రద్దు చేయగల శక్తిని ఉపయోగించమని స్వామిని కోరును. నా కర్మఫలములను అనుభవించి యైనను నాకష్టములను తొలగించమని మాట బయటకు అనడు. అట్లు అన్నచో స్వామిపై తనకు భక్తిలేదని నిరూపించబడును కావున తనకు భక్తిలేదను మాట బహిరంగముగా తెలియరాదని భావించును. కాని లోలోపల "నీవు అనుభవిస్తావో లేక రద్దు చేస్తావో నాకు తెలియదు. నా కష్టమును తొలగించుము" అని ప్రార్థించును. దాని కొరకై ఎక్కువగా ఆరాధనము చేయును. ఇది సత్యమైన భక్తి కానేకాదు. ఇట్టి భక్తుడు భగవంతుని తన సుఖమును సాధించుకొనుటకు పనిముట్టుగా వాడుకొనుటయే అగును. ఇట్టివాని భక్తి అనగా ప్రేమ అంతయును తన మీదనే ఉండును. ఇదియే స్వార్థము. తన కష్టమును తొలగించనిచో ఆ రూపమును వదలి మరియొక రూపమును పట్టును. ఇట్టి భక్తుని కష్టముల సైతము తొలగించి లోకములో దైవ విశ్వాసమును స్వామి కాపాడుచున్నాడు. అయితే ఇట్టి భక్తుల కష్టములను తొలగించుటలో పద్ధతి వేరుగ యుండును. ఇట్టి కపట భక్తుని కర్మఫలములను స్వామి అనుభవించడు. వాని కర్మ ఫలములను తరువాత జన్మలకు స్వామి త్రోసివేయును. ఈ కపట భక్తుడు తన కష్టములను స్వామి రద్దు చేసినాడని భావించుచున్నాడే కాని తరువాత జన్మలలో వాటిని పెరిగిన వడ్డీతో అనుభవించవలయును. కావున కపట భక్తునకు స్వామియును కపటముగనే ప్రవర్తించినాడు. బయటకు ఒకటి పలికి లోపల మరియొకటి తలచి ఒక మానవుడు అల్పజ్ఞుడగు మరియొక మానవుని మోసగించవచ్చునేమో గాని సర్వజ్ఞుడగు పరమాత్మను ఎట్లు మోసగించగలడు?
సత్యమైన భక్తుడు జ్ఞాని కావున ఇట్లు ఆలోచించును. "నా కష్టములను రద్దు చేయమని పరమాత్మను నేను ప్రార్థించినచో స్వామి నా కష్టములను అనుభవించవచ్చును. స్వామి భాధపడుట నేను ఏ విధముగను సహించజాలను. కావున ఈ మార్గమును అంగీకరించను. కాని రెండవ మార్గమున కర్మ ఫలములను తరువాత జన్మలకు త్రోసినచో అనవసరముగా పెరిగిన వడ్డీతో వాటిని ఏల అనుభవించవలెను? ఇప్పుడే తక్కువ వడ్డీతో అనుభవించెదను" అని నిజభక్తుడు ఎప్పుడును తన కష్టములను గురించి చింతించడు. ఇంకనూ, మహాజ్ఞాని యగు సద్భక్తుడు రాబోవు జన్మలలో ఏర్పాటు చేయబడి ఉన్న దుష్కర్మఫలములను ముందుకు లాగి ఈ జన్మలోనే తక్కువ వడ్డీతో అనుభవించి లాభమును పొందగోరి ఆ విధముగా కర్మ నిశ్శేషము చేయమని స్వామిని ప్రార్థించును. ఇట్టి సద్భక్తుల కష్టములను కూడా స్వామి తొలగించును. కాని ఏ మార్గమున తొలగించును అన్నచో స్వామి వాటిని ఆకర్షించుకొని వాటిని తానే అనుభవించి వారిని కష్ట విముక్తులను చేయును. ఇట్లు తాను చేసితినని స్వామి ఆ సద్భక్తునకు తెలియనీయడు. తెలిసినచో ఆ సద్భక్తుడు అంగీకరించడు. స్వామికి కర్మ ఫలములను రద్దు చేయగల అధికారమున్నను దానిని దుర్వినియోగము చేయడు. అంతేకాదు ఆ కర్మ ఫలములను అనుభవించునప్పుడు స్వామి ధరించిన శరీరము మన శరీరము వంటిదే అగును. కావున మనకు ఎంత బాధకలుగునో అంతే బాధ స్వామికిని కలుగును. బాధను అనుభవించునపుడు తన దివ్యశక్తని ఉపయోగించి ఓర్చుకొనగలడు. కాని అట్లు చేసినచో "నా భక్తుల కర్మఫలములను నేను అనుభవిస్తానని" స్వామి ధర్మ దేవునకు చేసిన వాగ్దానమును మోసముతో భంగపరచినట్లగును. ఏ భక్తుడు ఏ రూపమున ఆరాధించినను అన్ని రూపములలో యున్న వ్యక్తి స్వామియే కావున సమస్త సృష్టిలో ఉన్న అందరి సద్భక్తుల కర్మ ఫలములను తానొక్కడే అనుభవించుచుండును.
కమలములెన్నో ఉన్నవి కాని కృష్ణ భ్రమరము ఒక్కటే గదా! ఈ కారణము చేతనే అవతార శరీరము కూడా మన శరీరము వలె అన్ని ప్రకృతి ధర్మములను కలిగియుండును. ఈ రహస్యమును తెలియక అవతార శరీరము దివ్యమని కొందరు భక్తులు మూర్ఖముగా ప్రవర్తించుదురు. అవతార శరీరము మన శరీరముల కన్న విశిష్టమని భావించి ఒక మూఢ భక్తురాలు అవతార పురుషుని కాలి మీద టెంకాయ పగులకొట్టినది. స్వామి యొక్క పాదము వాచి పదిరోజులు బాధపడినారు. స్వామి మహిమలను చూచి స్వామికి ఆకలి దప్పికలు ఉండవని తలచి యశోద ఒకనాడు స్వామికి చద్దిఅన్నము మూట కట్టకుండా పంపినది. ఆ రోజు స్వామి గోవులను కాచి తిరిగి తిరిగి శ్రమతో అలసిపోయి ఆకలితో నీరసించి ఋషులు చేయుచున్న యజ్ఞవాటికను చేరి ఆ వండిన చరువును పెట్టమని మునిపత్నులను అర్థించినాడు. స్వామి దివ్య దర్శనములను సద్భక్తులకు అనుగ్రహించునపుడు కూడ ఒక మహాశక్తి ఈ సామాన్య శరీరము నందు ప్రవేశించుట చేత ఆయన శరీరము కూడ ఎంతో కష్టమును అనుభవించును.
కావుననే జ్ఞానులైన సద్భక్తులు స్వామిని దివ్యదర్శనముల కొరకు అర్థించరు. స్వామిపై పరిపూర్ణ విశ్వాసము లేకపోవుటయే ఆ దివ్యదర్శన కుతూహలము అని తెలియవలయును. చూచి నమ్మిన వాని కన్నను చూడక నమ్మిన వాడే ధన్యుడు. ఈ విధముగా స్వామి అవతరించినపుడు ఆయన శరీరము ఎన్నో ముళ్ళతో గుచ్చబడి యుండును. ఆ ముళ్ళు మన కంటికి కనిపించవు. స్వామి సింహాసనముపై కూర్చునవలయునని స్వామితో కైవల్యము సాధించవలయునని జీవులు తహతహలాడుదురే తప్ప ఆయన కూర్చున్న సింహాసనము మీద ఉన్న ఎన్నో ముళ్ళు ఆయన శరీరములో దిగబడినవి కంటకి కనిపించవు. జీవుడు యదార్థమును తెలియక కైవల్యమునకై అర్థించు చున్నాడే తప్ప, నిజముగ స్వామి కైవల్యము ఒక్క క్షణకాలము పొంది ఆ సింహాసనముపై కూర్చున్నచో వాడు ఒక్క దూకుతో దాని నుండి బయటకు వచ్చి పరుగుతీయును. అప్పుడు వాడు నాకు ఎన్నటికిని స్వామి పదవి వద్దు భక్తునిగనే ఉండుదును అని మొరపెట్టును. ఆ ఒక్క క్షణకాలపు బాధకూడా ఎంతో తీవ్రాతి తీవ్రము కనుకనే స్వామి తన బిడ్డలైన జీవులు బాధపడుదురని కరుణతో జీవులు ఎంత అర్థించినను కైవల్యము ఇచ్చుటలేదు. ఇది తెలియక జీవులు స్వామి కైవల్యమును ఇచ్చినా స్వామితో సమత్వము పొందినచో స్వామి ఓర్వలేక అసూయతో కైవల్యము ఇచ్చుట లేదని అపార్థము చేసుకొందురు. అయిననూ స్వామి వారు ఒక్క క్షణకాలమైనను ఈ బాధకు తట్టుకొనలేరని కైవల్యము నిచ్చుటలేదు. మహాశక్తిమంతుడు మహాబలవంతుడు అగు హనుమంతుడే ఒక్క క్షణకాలము స్వామితో కైవల్యమును అనుభవించి ఆ బాధలను తట్టుకొనలేక కైవల్యము వదలి "దాసోఽహం" అన్నాడు. జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయ బాధ్యతలైనను నిర్వర్తించుటకు హనుమంతుడు ముందుకు వచ్చినాడే కాని కైవల్య పదవిని మాత్రము వద్దని సదా దాసోహం అన్నాడు. అందుకే రామకృష్ణ పరమహంస పంచదారను తిను చీమగా ఉంటాను గానీ పంచదారను మాత్రము కాను అని అన్నాడు. అందుకే చిట్టచివరి గురుస్వరూపమైన మధ్వాచార్యులు స్వామికి జీవునకు మధ్య సేవ్య సేవక సంబంధమే ఉత్తమమని బోధించినాడు.
★ ★ ★ ★ ★