18 Mar 2025
[26.03.2003] లోకములో కష్టములకు కుంగరాదు. సుఖములకు పొంగరాదు. సుఖములు పైకి లేచిన తరంగములు, కష్టములు క్రిందకు వచ్చిన తరంగములు. తరంగముల యొక్క బరువును తీసుకున్నపుడు ప్రతి తరంగమునకు శృంగము (crest), ద్రోణి (trough) అని రెండు వుండును. శృంగమే సుఖము. ద్రోణియే కష్టము. ఒకదాని వెనుక రెండవది ఉండును. కాలచక్రము తిరుగుచుండగా చక్రములోని క్రింది అరలు పైకి, పై అరలు క్రిందికి వచ్చుచుండును. కావున కష్టము గానీ, సుఖము గానీ నిత్యము ఉండదు. అవి ఎండ-నీడల వంటివి. నిరంతరము ఎండలో ఉండలేము. నిరంతరము నీడలో కూడ ఉండలేము. ఎండలో కష్టపడి పనిచేసి నీడకు వచ్చిన వాడు ఎంతో సుఖమును పొందును. అలానే కష్టములను అనుభవించిన తరువాత సుఖమును అనుభవించినచో, ఆ సుఖము ఎంతో రుచిగా యుండును. ఈ కష్ట, సుఖములు మనస్సులోకి ప్రవేశించరాదు. నీటి అలలో పడవ ఊగుచున్ననూ, ఆ పడవలో ఊయలలో ఊగు వినోదము పొందుచూ ప్రయాణించవచ్చును. కానీ పడవకు చిల్లిపడి ఆనీరు పడవ లోనికి వచ్చినచో పడవ మునిగిపోవును.
అట్లే కష్ట సుఖములు మనస్సులోనికి ప్రవేశించరాదు. కష్టములు వచ్చినపుడు కఠినముగను, సుఖములు వచ్చినపుడు సున్నితముగను ఉండవలెను. "వజ్రాదపి కఠోరణి మృదూని కుసుమాదపి, లోకోత్తరాణాం చేతాంసి కోహి విజ్ఞాతు మర్హతి" అని భవభూతి వర్ణించినాడు. కష్ట సుఖములకు కుంగక, పొంగక ఉన్నవాడే స్థితప్రజ్ఞుడు అని గీత చెప్పుచున్నది – "న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, నోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్". పొంగుట, కుంగుట వలన మన నుండి శక్తి విపరీతముగా ఖర్చు అగుచున్నది. శక్తి ప్రవృద్ధమైన (losing) వాడు ఇహమునందును ఏమియూ సాధించలేడు. మరియు శక్తిహీనుడై, సాధన చేయలేక పరమును కూడ కోల్పోవును. అట్టివాడు ఇహపరములందు చెడి ఉభయ భ్రష్ఠత్వము చెందును. సీతాపహరణము జరిగిన తరువాత రాముడు దారుణముగా విలపించుచున్నాడు. యోగశాస్త్రము రచించిన పతంజలియు, లక్ష్మణుడును, బలరాముడును, అదిశేషుని అవతారము కావున లక్ష్మణుడు రామునితో “అన్నయ్యా! ముందు ఏడ్చుట మానుకొనుము. ఏడ్చినందువలన సీత కనపడదు. మరియు ఏడుపు వలన శక్తి నశించి, సీతను వెదుకుటకు కావలసిన శక్తి లేకపోవుట వలన సీత ఎన్నటికినీ లభించదు.”
యోగము అను శబ్దము "యుజ్" అను ధాతువు నుండి వచ్చినది. "యుజ్ - ఏకీకరణే” అని యుజ్ ధాతువునకు ఏకీకరణము అని అర్థము. అనగా అన్నింటిని కలుపుట అని యోగశబ్దమునకు అర్థము. ఒక నీటి గొట్టము ఉన్నది. దానికి చిల్లులు పడి నీరు ధారలుగా బయటకు కారిపోవుచున్నది. అట్లే మన శక్తి అనేక లౌకికచింతల ఉద్రేకములలో వ్యర్థముగుచున్నది. ఆ గొట్టము యొక్క చిల్లును మూసి వ్యర్థముగా బయటకు చిందిపోవు నీటిధారలను అన్నింటినీ కలిపి గొట్టములో ఒకధారగా ప్రవహింపచేయుట ఉపయోగము. కావున లౌకికములకు చింతలలో ఛిన్నాభిన్నము చెంది పోవుచున్న ఈ శక్తిధారలను కలిపి ఒకేధారగా చేయుట యోగము. యుద్ధములో భేరులు మ్రోగుచూ, శంఖములు మ్రోగుచుండ, అందరును ఎంతో ఉద్రేకముతో నుండగా శ్రీకృష్ణుడు శాంతసముద్రునిగా మందహాసముతో రథమును నడుపుచున్నాడు. ఆయన జీవితములో ఎప్పుడునూ ఉద్రేకము చెందలేదు. కావుననే ఆయనలో శక్తి అంతయు రాశీభూతమై, లీనమై యున్నది. ఆయన విశ్వరూపమును ప్రదర్శించినపుడు బయటకు వచ్చిన వేలసూర్యుల కాంతి ఆ శక్తియే. అయితే ఈ సృష్టిలో ఈ ఉద్రేకము అను దానిని ఆయన ఏల సృష్టించినాడు? ఆయన సృష్టిలో ప్రతి వస్తువూ మంగళకరమే! కావున ఉద్రేకము కూడా ఒక మంచి పనికే సృష్టించబడి యున్నది. ఆ మంచి పని ఏమనగా - భగవంతుని విషయములో ఉద్రేకము చెందవలయును అని భావము.
భగవంతుని కొరకు తపించి ఉద్రేకము పొందుటయే తపస్సు. ఇట్లు భగవంతుని విషయములో సద్వినియోగము చేసినచో ఈ సృష్టిలో చెడు అనేది లేదు. చెడు గుణములు కూడ భగవంతుని వైపునకు త్రిప్పినచో అగ్గిలో పడిన పిచ్చిముళ్ళ కట్టెలు కూడ, నుదుట ధరించు పవిత్రభస్మముగా మారునట్లు, ఆ గుణములు పవిత్రమే అగుచున్నవి. గోపికలు తమలో ఉన్న కామము అను గుణము పరమాత్మ వైపుకు త్రిప్పినారు. ఆ కామమే మోక్షమార్గమై వారిని గోలోకమునకు చేర్చినది. భగవంతుని పరము చేయక భగవంతుని వ్యతిరేకముగా జీవుల పరము చేసినపుడు సద్గుణములు కూడా బురదలో పడిన పంచదార వలె వ్యర్థము అగుచున్నవి. ఎవరి ఉప్పు తిన్నామో వారికి కృతజ్ఞతగా వుండుట సద్గుణము.
భీష్ముడు ఈ సద్గుణమును కౌరవుల పరము చేసినాడు. కౌరవుల ఉప్పు తిన్నందున వారివైపు యుద్ధము చేయుట ధర్మమని, ఆ సద్గుణమును జీవుల పరము చేసి పరమాత్మపై బాణములను విసరినాడు. దాని ఫలమే అంపశయ్య పైబడి జీవన మరణమగు మరణ వేదన పడినాడు. ఈ లోకముననే ప్రత్యక్ష నరకమును అనుభవించినాడు. కావున భగవంతుని వియోగ దుఃఖములో ఉద్రేకము చెందినపుడు అచ్చట శక్తి ఖర్చు అగుట సార్థకమే కాని వ్యర్థము కాదు.
రుక్మిణి కృష్ణుని కొరకు ఎంతో తపనపడి, పెండ్లి రోజు క్షణక్షణము ఉద్రేకమును చెందినది. అదియే మహా తపస్సుగా మారి, కృష్ణుడు ధర్మమును సైతము అతిక్రమించి రుక్మిణిని వివాహమాడెను. రుక్మిణిని శిశుపాలునికి ఇచ్చుటకు నిశ్చయ తాంబూలములు ఇచ్చుకొనుటయు జరిగినది. మను స్మృతి యొక్క వాచాదత్త అను శ్లోకము ఆధారముగా నిశ్చయ తాంబూలము జరిగిన తరువాత కన్యకు పెండ్లి అయినట్లే. బ్రాహ్మణుడు రుక్మిణి వ్రాసిన ప్రణయ పత్రము తెచ్చిన తరువాత, కృష్ణుడు కొంతసేపు తర్జన భర్జన పడినాడు. కానీ ఆమె క్షణ క్షణము పడిన ఉద్రేకము చూచి ధర్మమును సైతము అతిక్రమించి కుండిన నగరమునకు వెడలినాడు.
కావున లోకచింతలలో ఉద్రేకము విడనాడవలెనే తప్ప, భగవంతుని విషయములో కాదు. పిల్లపెండ్లికి ధనము దాచమని చెప్పినామే తప్ప, పెండ్లినాడు కూడ ధనమును తీయని ఎడల ఆ ధనము దొంగల పాలో, రాజు పాలో అగును. కావున భగవంతుని విషయములో కూడ ఉద్రేకము పొందక శాంతిగా ఉన్నచో వాడు దాచిన శక్తి మృత్యువు పాలగును. మరణానంతరము శరీరము పంచభూతముల పాలగుచున్నది. వాని శరీరములో దాచబడిన శక్తి అంతయు అగ్నిపాలగును. కావున యోగము అనగా లోకమునకు సంబంధించిన ఉద్రేకములలో శక్తిని ఖర్చుకానీయక దాచి, భగవద్భక్తిలో ఖర్చు చేయుట అనగా శక్తి దుర్వినియోగము అరికట్టి సద్వినియోగము చేయుటయే యోగము.
★ ★ ★ ★ ★