17 Mar 2025
[09-11-2002] జ్ఞానము కన్నను భక్తి గొప్పది. భక్తి కన్నను సేవ గొప్పది. జ్ఞానము పెరిగిన కొలది భగవంతునిపై భక్తి లేకపోవుటకు కారణము భగవంతుని గురించి జ్ఞానము తక్కువగా యుండుటయే. అయితే జ్ఞానము అనగా నేమి? పరమాత్మను గురించి తెలుసుకొనుటయే జ్ఞానము. మనకు పరమాత్మను గురించి తెలిసినది ఏమి అనగా మనము మనకు కష్టములు వచ్చినప్పుడు వెళ్ళి హఠాత్తుగా కాకా పట్టినచో ఆ కష్టములను తొలగించు వాడు భగవంతుడు అని. మరియు, మనకు కావలసిన వాటిని సంపాదించుకొనుటకు చేయు ప్రయత్నములలో సాయపడువాడు భగవంతుడు అని. ఈ విధముగా మనకు చిన్ననాటి నుండి భగవంతుని గురించి పెద్దలు బోధించిన జ్ఞానము ఇదియే. ఈ జ్ఞానము భగవంతుని గురించి సత్యమైన జ్ఞానము కాదు. ఇది భగవంతుని గురించి అసత్యమైన జ్ఞానము. కావుననే మనకు భగవంతునిపై అసత్యమైన భక్తి ఏర్పడుచున్నది. భక్తి వలన భగవంతుడు లభించును అని భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు "భక్త్యా త్వనన్యయా లభ్యః" యని చెప్పియున్నాడు. కాని మన భక్తి చేత భగవంతుడు లభించుట లేదే. కనీసము భగవదనుగ్రహము కూడా లభించుట లేదే.
అందుకే, జ్ఞానము భక్తికి మూలకారణము అని తెలియవలెను. అది భక్తికి బీజము వంటిది. దాని నుండి ఉద్భవించు వృక్షమే భక్తి. బీజముననుసరించియే వృక్షము ఉండును. బీజము మామిడి బీజమైన మామిడిచెట్టు వచ్చును. వేపబీజమైన వేపచెట్టే వచ్చును గదా. కావున జ్ఞానము సత్యమైనచో సత్యమైన భక్తి ఏర్పడును. దానికి సత్యమైన భగవత్ర్పాప్తి అను ఫలము లభించును. మామిడిచెట్టునకు మామిడిపండు, వేపచెట్టునకు వేపకాయ వచ్చుచున్నవి కదా. కావున మన సాధన మార్గమునకు ఆదిలోనే హంసపాదు అన్నట్లు బ్రహ్మజ్ఞానము గురించి అనగా భగవంతుని గురించిన జ్ఞానము సరియైనది లేకపోవుటయే. కావున సాధకుడు మొట్టమొదట బ్రహ్మజ్ఞానమును తెలుసుకొనవలెను. ఆ బీజము సక్రమమైనచో వృక్షము సక్రమమైన ఫలము లభించును. ఐతే బ్రహ్మజ్ఞానము అనగా నేమి? భగవతుని యొక్క జ్ఞానమే బ్రహ్మజ్ఞానము. బ్రహ్మము యొక్క అనన్య దుర్లభమైన విశిష్టమైన కల్యాణగుణముల గురించి తెలుసుకొనుటయే బ్రహ్మజ్ఞానము.
కల్యాణగుణముల వివరణ:- కారుణ్యము (kindness), తారుణ్యము (attraction), సౌజన్యము (courtesy), ఔదార్యము (generosity), గాంభీర్యము (depth), సౌందర్యము (beauty), సౌరభ్యము (fragrance), ధైర్యము (courage), వీర్యము (valour), జ్ఞానము (knowledge), బలము (strength), యోగము (unity), తేజము (shine), విలాసము (play), విభూతి (miraculous power), సామర్థ్యము (capability) అని ఆది అనంత కళ్యాణగుణముల వివరణ. ఉదాహరణకు:- బొంబాయి నగరములో యున్న విశేషములను తెలుసుకున్న వానికి (జ్ఞానము) బొంబాయిని చూడవలయునని ఆకర్షణ కలుగును (భక్తి). ఇక వాడు ఆ ఆకర్షణ కారణముగా బొంబాయి వెళ్ళుటకు ప్రయత్నించును (సేవ). అట్లే భగవంతుని కల్యాణగుణములు తెలుసుకొన్న కొలది ఆకర్షణ పెరుగును. అట్టి ఆకర్షణయే తపస్సు. మనము వెనుతిరిగి చూసుకుంటే ఈరోజు మనలో భక్తిగాని తపనగాని లేవు. మనకు కేవలము మన కోరికలు సాధించి పెట్టువాడే భగవంతుడు. కావున భగవంతుడు ఒక సాధనమన్న జ్ఞానమే మనను నడిపించుచున్నది. ఇది అసత్యమైన జ్ఞానము. సత్యమైన జ్ఞానము చేత, వెలుగు చేత చీకటి వలె ఈ అసత్యమైన బ్రహ్మజ్ఞానము నశించును. ఇది సత్యము. అపుడు ఎట్టి కోరికలు లేక, ఎట్టి స్వార్థము లేక కేవలము భగవత్సేవ కొరకు భగవంతుని చేరవలయునను తపన కలుగును.
నారద మహర్షి వలన శ్రీ కృష్ణుని యొక్క కల్యాణగుణములను విన్న రుక్మిణీదేవికి శ్రీకృష్ణునిపై గల ఆకర్షణకు కారణము ఆ జ్ఞానమే. రుక్మిణి కృష్ణుని చేరినది కృష్ణ పాదసేవ చేసుకొనుటకే తప్ప, ద్వారకానగరమునకు రాణి కావలయునని కాదు. కృష్ణుని పొందిన తర్వాత కూడ ఆమె సర్వదా కృష్ణ పాదసేవయే చేసెను. కావున సత్యమైన బ్రహ్మ జ్ఞానము చేత ప్రతిఫలాపేక్షరహితమైన భక్తి ఏర్పడుట, దాని చేత భగవత్ర్పాప్తి కలిగి నిష్కామమైన సేవ చేయుటయు వీలగును. ఏ మాత్రము స్వార్థము లేక కేవలము భగవత్సేవ చేయుటయే దత్తస్వరూపము.
దత్తుడనగా దానము. ఒక వస్తువుపై స్వార్థమయమైన ఆసక్తి ఉన్నప్పుడు దానిని దానము చేయలేడు. ఇట్టి దత్తస్వరూపమైన దానము చేతనే దత్తుడు లభించును. అనగా భక్తుడు పొందిన నరావతారము యొక్క సేవ ద్వారా ఆ నరావతారమందలి ఆంతస్స్వరూపమైన దత్తుడు లభించును. కృష్ణపాదసేవ ద్వారా కృష్ణునిలో గల అంతస్స్వరూపమైన విష్ణువు అను పేరుగల దత్తుడు రుక్మిణికి లభించగా ఆ రుక్మిణియే మహాలక్ష్మీ స్వరూపము ధరించినది. ఈ సేవయంతయూ యజ్ఞస్వరూపమై యున్నది. ఇది –
i) ద్రవ్య యజ్ఞము, ii) స్వాధ్యాయ యజ్ఞము, iii) జ్ఞాన యజ్ఞము అని మూడు రకములు.
i) ద్రవ్య యజ్ఞము అనగా ఆకలి గొన్న అశక్తులైన పేదవారి యొక్క జఠరాగ్నిలో ఆహారమును సమర్పించుట. అట్టి పేదవారు సజ్జనులు, సద్భక్తులైనచో విశేషమైన పుణ్యము లభించును. దుష్టులైనచో పాపము లభించును. ఆహారమును సజ్జనులకును, దుర్జనులకును సమర్పించక అగ్నిపాలు, మరియు మట్టిపాలు చేసినచో ఆహారమును వ్యర్థము చేయు మహాపాపము కలుగును. ఆహారమును వ్యర్థము చేయరాదని "అన్నం న పరిచక్షీత" అని శ్రుతి చెప్పుచున్నది. కావున అగ్నిలో నేతిని, మట్టిపుట్టలో పాలు, పండ్లు అర్పించుచున్న వాడు అన్నము వ్యర్థము చేసిన పాపమును పొందును. ఈ ద్రవ్యయజ్ఞమే, స్వాధ్యాయ, జ్ఞానయజ్ఞములకు కూడ కారణమై యున్నది.
ii) ఆహారము చేత శక్తి పుట్టి దాని వలన భగవంతుని కీర్తించుటయే స్వాధ్యాయ యజ్ఞము.
iii) భగవంతుని తత్త్వవిశ్లేషణతో చింతించుటయను జ్ఞాన యజ్ఞము లభించుచున్నది. మూలాధార చక్రము పృథ్వీతత్త్వము. పృథ్వి యనగా ఘనము. అనగా ఘనపదార్థమైన అన్నము. తరువాత జలస్వరూపమైన, మణిపూరక చక్రము. అనగా ద్రవ్యము భుజించిన తరువాత త్రాగు పానీయము. అన్నపానీయములే ఈ రెండు చక్రములు. తరువాతి చక్రము స్వాధిష్ఠానము. ఈ అన్నపానీయములను భుజించి, త్రాగిన తర్వాత జీర్ణమై ఏర్పడు శక్తియే అగ్ని. దీని తరువాత అనాహత చక్రము గుండె వద్ద యున్నది. ఈ శక్తియే గుండెను కదిలించి ప్రాణమును నిలుపుచున్నది. ప్రాణమనగా వాయువు. ఈ ప్రదేశముననే శ్వాసకోశములున్నవి. తరువాత విశుద్ధి చక్రము కంఠము, వాక్కు. ఈ శక్తి వల్లనే వాక్కుతో భక్తుడు పరమాత్మను కీర్తించగలుగుచున్నాడు. తరువాత ఆజ్ఞా చక్రము. ఇది భ్రూమధ్యమున యున్నది. ఇది కన్నులకు సంబంధించినది, ఈ శక్తి వల్లనే భగవంతుని దివ్యదర్శనము ద్వారా చూడగలుగుచున్నాడు. తర్వాత సహస్రారము. ఇది బుద్ధిస్థానము.
ఈ శక్తి వల్లనే బుద్ధితో ఆలోచించగలుగుచున్నాడు. ఇది మూలాధారము నుండి సహస్రార పర్యంతము ప్రయాణించు కుండలినీ శక్తి, సర్పాకారముగా తరంగమైయున్నది. శక్తి తరంగాత్మకము. కావున శక్తియే కుండలిని. ఈ శక్తికి మూలమే అన్నపానీయములు, అనగా ద్రవ్య యజ్ఞము. కంఠముతో చేయు భజనలే స్వాధ్యాయ యజ్ఞము. ద్రవ్యయజ్ఞము చేత ఆకలి ఎట్లు శాంతించుచున్నదో, స్వాధ్యాయ యజ్ఞము చేత మానవులకు సంసార దుఃఖము లన్నియు శాంతించి ఆనందము కలుగుచున్నది. అట్లే జ్ఞానయజ్ఞము ద్వారా దుఃఖశాన్తి, ఆనందప్రాప్తి లభించుచున్నవి.
కావున అన్నదానము, జ్ఞానదానము, భక్తిదానము ఈ మూడును కలిపి సేవయగు చున్నవి. ఆజ్ఞాచక్ర శక్తి యగు దృష్టితో చూడగల్గినది నరావతారమే. సహస్రార జ్ఞానము చేత చింతించునది కూడ నరావతారము యొక్క కల్యాణ గుణములే. సేవ చేయు కొలది ఆజ్ఞాచక్రశక్తి పెరిగి, సహస్రార శక్తి వృద్ధి చెంది ఆ నరావతారములోని అంతస్స్వరూపము దివ్యనేత్రములకు గోచరించి ఆ నరావతారము యొక్క తత్త్వము జ్ఞానమునకు అవగతమగును. నరావతారము లోని అంతస్స్వరూపమే శ్రీదత్త స్వరూపము. ఆయన తత్త్వమే బ్రహ్మజ్ఞానము.
★ ★ ★ ★ ★