03 Apr 2025
[17.02.2008]
i) చెప్పిన జ్ఞానాన్ని విని ఇతరులకు అందించటం మాత్రమే కాదు మీరు కూడా మీ కష్టసుఖములకు ఈ జ్ఞానాన్ని సంపూర్ణముగా సమన్వయించుకొని ఆనందించాలే గాని కంటతడి పెట్టరాదు.
ii) జీవునిగా నీకు నీ శరీరములోనే ఉన్న గుండె, ఊపరితిత్తులు, మూత్రపిండాలు, అన్నకోశములను చూచావా? లేదే. మరి ఇదే కుదరనప్పుడు ఈ జన్మలోని మరియు గత జన్మలలోని వాసనలను నీవు ఎట్లు తెలుకొనగలవు?
iii) స్వామి సర్వాంతర్యామి. కర్మఫలప్రదాత. భేషజం, భిషక్. భవరోగ వైద్యుడు. ఏ రకమైన వ్యాధికి ఏ రకమైన ఔషధము ఎలా ఇవ్వాలో ఆయనకే తెలుసు. నీకేమి తెలుసు?
iv) స్వామి చేయుచున్న ఆ కార్యక్రమమును సంతోషముగా స్వీకరించు. అంతే గాని స్వామి కార్యములో నీవు నీ స్వంత కృషి చేయరాదు. అంతా స్వామి ఇచ్ఛ ప్రకారమే జరుగనివ్వు.
v) నీ యొక్క కర్మఫలాలను ఆయన క్షుణ్ణంగా చూస్తున్నారు. ఏ సమయములో ఏ ఔషధము ఉపయోగించాలో ఆయనకు బాగా తెలుసు.
vi) స్వామీ నేను బాధపడలేను, నన్ను తీసుకుపొమ్మని కోరరాదు. మృత్యువు అనంతరము నీ సాధనకు అవకాశము లేదు. అలా కాక, ఇప్పుడే ఏదైనా కష్టము వచ్చినదనుకో, దానిని స్వామి ఎందుకు ఇచ్చారు? ఈ సమయములోనే నీవు అనుభవించవలసిన కర్మఫలము తాలూకు చికిత్సయే ఇది. కనుక సంతోషముగా దానిని అనుభవించి ఆ కర్మఫలాన్ని రద్దు పరచుకో. అంటే, నీవు జీవించి ఉంటేనేగా ఈ కర్మఫలాన్ని రద్దు చేసుకోనే అవకాశము ఉంటుంది. కనుక స్వామి ఇచ్ఛానుసారము కర్మఫలాలను ఇస్తున్నారంటే అది నీకు ఇప్పుడే అవసరము అని తెలుసుకొని ఆనందముగా నీ కర్మఫలాలను అనుభవించి రద్దు చేసుకో.
vii) సుఖములో భగవద్భక్తి రాదు. కష్టమొస్తేనే దైవభక్తి వస్తుంది.
viii) గజేంద్రుడు జీవుడే గదా. ఆ మొసలి పళ్ళతో కొరుకుతుంటే గాని గజేంద్రుడికి ఆర్తి రాలేదు.
ix) కనుక నీకు భగవద్భక్తి పెంపు అవటానికే భగవంతుడు ఈ కష్టాలు ఇచ్చి నీ దైవభక్తిని, ఆర్తిని పెంచి దాని ద్వారా నీ కర్మఫలాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నారని తెలుసుకో. నేను అన్నీ చూస్తూనే ఉన్నాను. నాకు అంతా తెలుసు. అంతా నా ఇచ్ఛానుసారమే జరుగుచున్నది. అట్లే జరుగనిమ్ము. సర్వస్య శరణాగతి చేయుము. సంపూర్ణముగా విశ్వసించుము. నీ బాధ్యత నాది అని నా (Shri CBK Murthy) శ్రీమతికి బోధించారు.
★ ★ ★ ★ ★