18 Nov 2024
[29-07-2007] ఏసుక్రీస్తు దివ్యవాణిలో ఇలా సెలవిచ్చారు – ఎవరైతే భార్య, పుత్రులు, బంధువులను ద్వేషిస్తారో (అంటే మోహమును తెంచుకుంటారో), అన్నింటికంటే భగవంతునికి ఎక్కువ స్థానమునిస్తారో వారే నాకు ప్రియతములు అని. ఇందులో రెండు అంశములున్నవి. (i) నరావతారుడైన వర్తమానములో ఉన్న అవతారపురుషుని గుర్తించడము. (ii) అందరికంటే భగవంతునికే ఎక్కువ స్థానం ఇవ్వడము. ఈ రెండు అంశములూ రెండు కళ్ళవంటివని, అట్లు గుర్తించినవాడు నాకు ఇష్టమని ఆయన చెప్పినారు. ఇందు నాలుగు రకముల వారున్నారు. (i) అన్నింటికంటే అందరికంటే భగవంతునికి ఎక్కువ స్థానమునిచ్చి – నరావతారమును గుర్తించలేని వాడు (ఒక్క ఎడమ కన్ను మాత్రమే ఉన్నట్లు). ఉదా: శరభంగ మహర్షి తన ప్రాణాలను ఆహుతి చేసినాడు. కాని ప్రత్యక్షనరావతారుడైన శ్రీరాముని గుర్తించలేకపోయినాడు. (ii) భగవంతుని అనగా వర్తమాన నరావతారుని గుర్తించినవాడు కాని ఆయనకు ఎక్కువ స్థానము ఇవ్వలేనివాడు (ఒక్క కుడి కన్ను మాత్రమే ఉన్నట్లు). ఉదా: ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని అవతారపురుషునిగా గుర్తించినాడు, కాని (పుత్రవాత్సల్యం ముందు) ఆయనకు తక్కువ స్థానం ఇచ్చినాడు. కనీసం ఆయన చెప్పిన 5 ఊళ్ళు కూడా పాండవులకు ఇవ్వలేదు గదా. (iii) హనుమంతుడు (రెండు కళ్ళు కలవాడు) – వర్తమాన దత్తావతారమైన శ్రీరాముని గుర్తించినాడు. ఆయన ఆజ్ఞానుసారము సేవలో పాల్గొన్నాడు. (iv) ఇప్పటి మానవులు (రెండుకళ్ళూ లేని వాళ్ళే) – వర్తమాన నరావతారుని గుర్తించరు, పైగా తమ సంతానమునకే పైచేయినిచ్చేదరు, కాన రెండు కళ్ళూ లేని గ్రుడ్డివాళ్ళు.
వరాహావతారము: భూమిని హిరణ్యాక్షుడు సముద్రములో ముంచితే స్వామి వరాహవతారములో భూమిని పైకెత్తి ఉద్ధరించడము, ఇందలి ఆంతర్యం ఏమిటి? కలియుగములో మానవులు దిగజారినట్లు ఏ యుగంలోనూ దిగజారలేదు. హిరణ్యాక్షుడు అంటే – హిరణ్యం అంటే బంగారము, అక్షుడు అంటే కన్ను (కలవాడు). జీవులు బంగారమే కళ్ళకు లక్ష్యముగా కలిగి దాని వెంట పరిగెడుతున్నారు. ఇట్టివారు వరాహములే. వారిని ఉద్ధరించటానికే వరాహరూపము అని విశదీకరించినారు.
సారాంశము:
1. భారతము: భారతములో పాండవులు ఒకానొక కార్యం కోసం వచ్చారు. వారు వేతనము తీసుకునే ఉద్యోగుల వంటివారు. కురుక్షేత్ర యుద్ధానంతరము వారు రాజ్యాన్ని పొందారు. ఇందులో స్వామికి వారు ప్రత్యక్షముగా చేసిన సేవ ఏమీ లేదు. స్వామి బంధువులకు, ఆత్మీయులకు సేవ ఏమీ లేదు. కనుక వారికి ఇహలోకములో రాజ్యము, పరలోకంలో స్వర్గలోకము ప్రసాదించారు స్వామి.
2. రామాయణము: రామాయణములో హనుమంతుల వారు శ్రీరాముని భార్య సీతాదేవిని వెతికి తెలుసుకొని ఆ కార్యములో పాల్గొన్నారు. శ్రీరాముని సోదరుడు లక్ష్మణుడు మూర్ఛ పోయినపుడు సంజీవిని తెచ్చి బ్రతికించి స్వామి సేవ చేసుకున్నాడు. భరతుడు ప్రాణత్యాగం చేయబోతున్నపుడు హనుమంతుడు పరుగు పరుగున వెళ్ళి శ్రీరాముని ఆగమనవార్తను అందించి, రక్షించి స్వామి సోదరుల సేవ చేసినాడు. అందువలన శ్రీరాముడు ఆయనకు భవిష్యత్ బ్రహ్మ పదవిని ప్రసాదించారు.
3. భాగవతము: భాగవతములో గోపికలు శ్రీకృష్ణ భగవానునికి సాక్షాత్తు సేవ చేసి తరించారు. అందువలన వారికి స్వామి గోలోకము ప్రసాదించి అక్కడ కూడా స్వామి సేవ చేసుకొనేటట్లు అనుగ్రహించారు.
★ ★ ★ ★ ★