21 Mar 2025
[08.11.2002] నాయనా! శ్రద్ధగా విను, అనుసరించి తరించు. దత్తతత్త్వము దానము. ఈ దానములో ‘దేశము’, ‘కాలము’, ‘పాత్ర’యను మూడు భాగములుండును.
దేశము అనగా:- కాశీ మొదలగు పుణ్యక్షేత్రములందు దానము చేయుట.
కాలము అనగా:- వైకుంఠ ఏకాదశి, మార్గశిర పూర్ణిమ, శ్రీపంచమి మొదలగు పుణ్యతిథులందు దానము చేయుట. (మేము కాలమునకు ప్రాధాన్యము నిచ్చియే గదా మార్గశిరపూర్ణిమకు అన్నవరములో శ్రీసత్యదేవుని సమక్షంలో అన్నదానము, కాశీలో అక్షయ తదియ, భద్రాచలములో శ్రీపంచమిలలో అన్నదానము చేయుచుంటిమి.)
పాత్ర యనగా:- దానమునకు యోగ్యుడైనవాడు. ఈ మూడింటిలోను పాత్రయే ప్రధానము. అర్హుడగువాడు దొరికినపుడు ఎచ్చట దానము చేసినను ఆ చోటు పుణ్యక్షేత్రమే అగును. ఏ సమయమున దానము చేసినను అది ఏకాదశియే అగును. "శ్రద్ధయా దేయమ్" అని శ్రుతివాక్యము. అనగా దానమును శ్రద్ధతో చేయవలెనని భావము. దానము చేయుటలోను దేశమును ఎన్నుకొనుట యందును కాలమును ఎన్నుకొనుట యందును ఎంతో శ్రద్ధను చూపుచున్నారు. కాని ఈ దేశ, కాల, క్రియల కన్నను పాత్ర ఎన్నుకొనుటలో శ్రద్ధ చూపవలెను. దానము చేయుటలో ఓర్పు కలిగియుండవలెను. అపాత్రదానము వ్యర్థము లేక పాపకర్మము. జడపదార్థములకు దానము చేయునప్పుడు వ్యర్థమగును. దుష్టుడగు జీవునకు దానము చేసినచో పాపమగుచున్నది. మట్టితో నిర్మించబడిన పుట్ట జడపదార్థము. దాని యందు పాలు, పిండి, అరటిపండ్లు వేయుటవలన చేసిన దానము వ్యర్థమగుచున్నది. మట్టిపుట్ట అనగా నేమి? మట్టిపుట్టలో నుండు నాగుపాము. నీవు అంతరార్థమును గ్రహించు. మట్టిపుట్ట అనగా మట్టికొంప అని అర్థము. అనగా మట్టితో నిర్మించుకున్న బీదవాని కొంప అని అర్థము. పుట్టలో (దానిలో) ఉండు పాము అనగా ఆ మట్టికొంప అనెడి గుడిసెలో తల దాచుకొనుచున్న బీదవాడు, దరిద్రుడు అని అర్థము. ఇక సామ్యములు వచించుచున్నాను.
1) పాము నడచుచున్నప్పుడు బుసకొట్టుచుండును. అట్లే తిండి లేని అన్నార్తుడైన బీదవాడు ఆయాసపడుచు, రొప్పుచుండును.
2) పాము వంకర టింకరులుగా నడచును. అట్లే పొట్టకూటిని సంపాదించుకొనుటకు ఈ కటిక బీదవాడు వంకర మార్గముల పోవలసివచ్చును.
3) పాములకు రెండు నాల్కలున్నవి. అట్లే బీదవాడును ప్రాణములను నిలుపుకొనుటకు తిండిని సంపాదించుకొనుటకు అసత్యములాడవలసి వచ్చును.
4) పాము పాదములు లేక నేలపై ప్రాకుచుండును. అటులనే బిచ్చగాడు తిండి లేక నడవలేక పొర్లుచుండును. కనుక అంతరార్థమును గ్రహించవలెనే కాని బాహ్యార్థమును పట్టుకొని మన చర్యలను వ్యర్థపరచుకొనరాదు. అట్టి బిచ్చగాళ్ళకు పాలు మెదలగు ఆహారములను అందించి వారి ఆకలిని తీర్చుటయే నాగులచవతి నాడు పాలు పోయుట, అరటిపండ్లు వేయుటలోని అంతరార్థము.
మూలాధార చక్రము:- మూలాధార చక్రమున కుండలిని నిద్రించుచున్నదని చెప్పుచున్నారు. ఈ కుండలినియే జఠరాగ్ని. మూలాధారము పృథ్వీతత్త్వము. దీనినే మట్టిపుట్ట యని చెప్పుచున్నాము. కనుక మట్టిపుట్టలోని నాగుపాము పృథ్వీతత్త్వమైన మూలాధారచక్రమును జఠరాగ్నియగు కుండలినిని చెప్పుచున్నది. ఇది నిద్రించుట అనగా ఆకలితో మాడి మాడి ఆకలి చచ్చిపోయినది అని చెప్పడమే. కావున ఇట్టి ఆర్తుడైన బిచ్చగాని భూమితత్త్వమైన మూలాధారచక్రమున ఉన్న కుండలినికి పాలు పండ్లు, అర్పించి శాంతింప చేయుటయే అగ్ని యందు హోమము చేయు యజ్ఞస్వరూపమై యున్నది. ఇట్టి అంతరార్థమును తెలుసుకొనక సంప్రదాయము యొక్క తత్త్వమును అర్థము చేసుకొనని వారు ఎన్నటికిని దత్తభక్తులు కాజాలరు. దత్తుడనగా ఎవరు? దత్తుడనగా గురువు, జ్ఞానమునకు స్వరూపము. ప్రతి క్రియలోను అంతరార్థమే దత్తుడు అని తెలుసుకున్న వారు మాత్రమే తరించెదరు. ఇట్టివారే ధన్యాత్ములగుచున్నారు.
★ ★ ★ ★ ★