home
Shri Datta Swami

 19 Dec 2024

 

అసూయా అహంకారములే నాస్తికతకు కారణము

Updated with Part-2 on 20 Dec 2024


Part-1   Part-2


Part-1

[31-12-2002 రాత్రి 10 గం.లకు] నాస్తికుడగు జీవుడు భగవంతుని అంగీకరించపోవుటకు కారణము వానిలో మేరు, వింధ్య శైలముల వలెనున్న అసూయా-అహంకారములే. భగవంతుడనగా తన కన్న ఎన్నో రెట్లు గొప్పవాడని అర్థము. భగము కలవాడు భగవంతుడు. భగము అనగా మాహాత్మ్యము అనగా గొప్పతనము. బ్రహ్మము అను శబ్దమునకు కూడ గొప్పతనము కలది అనియే అర్థము. తనకన్న లేక తన జాతియగు మానవజాతి కన్న గొప్పవానిని నాస్తికుడు అంగీకరించడు. భారతదేశమంతయును ఇట్టి నాస్తికులతోను పూర్వమీమాంసకులతోను నిండియుండెను. వీరే కాక విష్ణువు యొక్క అవతారమగు కపిలమహర్షిని కూడా అపార్థము చేసుకున్న కపిలశిష్యులు కూడా నాస్తికులుగనే యుండిరి. కపిలుడు ప్రకృతిని, పురుషుని గూర్చి చర్చించెను. పురుషుడు ప్రకృతి చేత లిప్తుడు కాడు అను అసంగ వాదనను కపిలుడు బోధించినాడు. "అసంగో హ్యయం పురుషః" అన్నాడు కపిలుడు. కపిలుడు చెప్పిన పురుషుడు జీవుడని భ్రమించి జీవుడు ప్రకృతి చేత లిప్తుడు కాడని శిష్యులు అపార్థము చేసుకున్నారు.

Swami

కాని కపిలుడు చెప్పిన పురుషుడు అవతార పురుషుడు. ఈ అవతార పురుషుడు అగు స్వామి తన యొక్క శరీరమగు ప్రకృతి యొక్క క్షుత్పిపాసాది (hunger, thirst etc.) ధర్మముల చేత లిప్తుడు కాడనియే (not effected) దీని అర్థము. అనగా తీగెలో విద్యుత్తు ప్రవహించునపుడు సన్నగా యుండుట వంకరలు కలిగియుండుట మొదలగు తీగె ధర్మములు విద్యుత్‌ యొక్క ధర్మము కానందున విద్యుత్‌ను అంటవని అర్థము. విద్యుత్తు లేని తీగె యొక్క ఈ ధర్మములు తీగె ధర్మములు కావున తీగెను అంటియే యుండును. అనగా క్షుత్పిపాసాది ధర్మములు జీవుని ధర్మములు కావున జీవుని అంటియే యుండును. ఈ జ్ఞానమును తెలుసుకొనుటయే సాంఖ్యము అనబడును. సాంఖ్యము అనగా జ్ఞానము అని అర్థము కావున విష్ణువు యొక్క అవతారమగు కపిలుడు నాస్తికుడు ఎట్లు అగును? అట్లే కొందరు మూఢులు శివుని అవతారమగు శంకరులను ప్రచ్ఛన్నబౌద్ధుడని దూషించినారు. నాస్తికుని ఉద్ధరింప వలయున్నచో అతడు 5 మెట్లు ఎక్కవలయును.

1వ మెట్టు: పరమాత్మ ఉన్నాడు. కాని అతడు నిరాకారుడు. ఈ మెట్టులో పరమాత్మ సాకారుడని అంగీకరించుటకు అసూయ అహంకారములు కొంత తగ్గినను అడ్డు వచ్చును.

2వ మెట్టు: పరమాత్మ సాకారుడు. కాని భూలోకములో కాక పైలోకములలో ఉండును. మొదటి మెట్టు కన్న అసూయ అహంకారములు మరికొంత తగ్గును.

3వ మెట్టు: పరమాత్మ నరాకారుడు కాని వర్తమానమున లేడు. అనగా గతించిన రామకృష్ణాది అవతారములు. రెండవ మెట్టు కన్న అసూయ అహంకారములు మరికొంత తగ్గినవి.

4వ మెట్టు: పరమాత్మ నరాకారుడే. వర్తమానమున ఉన్నాడు. అయితే స్వార్థమగు ఐహికములకు గానీ, మోక్షమునకు గానీ అతడిని ఆశ్రయించుచున్నాము. (మూడవ మెట్టు కన్న అసూయ అహంకారములు మరికొంత తగ్గినవి.)

5వ మెట్టు: వర్తమానుడగు నరాకారుడు అగు పరమాత్మను పూర్తిగా స్వార్థమును త్యజించి, సేవించుటయే బ్రహ్మప్రాప్తి. (ఈ మెట్టులో అసూయ అహంకారములు పూర్తిగా నశించినవి.)

పరుగెత్తుచున్న మదవృషభమును నిలద్రొక్కుటకు దానితో పాటు కొన్ని అడుగులు వేయవలెను. ఒక్కొక్క అడుగునకు దాని వేగము తగ్గుచు ఉండును. కొన్ని అడుగుల తర్వాత ఒక అడుగులో వేగము పూర్తిగా తగ్గి అది నిలబడును. అదే విధముగా శ్రీదత్తసద్గురువు శంకర, రామానుజ, మధ్వ రూపముల నాస్తికులను మదవృషభమును అనుసరించి అడుగులు వేయుచూ క్రమముగా నాస్తికులను మార్చుచూ చివరకు మధ్వాచార్య రూపమున 5వ మెట్టునకు ఎక్కించినాడు.

 

Part-2

మొదట శంకరులు నాస్తికుని, జీవులందరునూ బ్రహ్మమే కావున నీవు జ్ఞానము చేత బ్రహ్మము అగుదువు. నీవే దేవుడవు. నీవు ఉన్నావు కాన దేవుడున్నాడు. నీవు నిరాకారమైన చైతన్యము కావున, నిరాకారమైన దేవుడున్నాడు, అని మొదటి మెట్టును ఎక్కించెను. ఆ తర్వాత శివస్తోత్రములగు శివానందలహరి మొదలగు వాటి ద్వారా సాకారుడైన దేవుడు పైలోకములో ఉన్నాడు అని రెండవ మెట్టునెక్కించెను. ఆ తరువాత భజగోవింద స్తోత్రముల ద్వారా గతించిపోయిన నరాకారుడగు కృష్ణుడగు పరమాత్మ ఉన్నాడని మూడవ మెట్టు ఎక్కించెను. క్రమముగా శంకరులను, శిష్యులు ఆశ్రయించినారు. వారికి తను నేనే శంకరుడను శివోఽహం, శివోఽహం అని స్తోత్రము ద్వారా బోధించి వర్తమాన నరావతారుడగు పరమాత్మ తానేనని వచించినారు. ఇది నాలుగవ మెట్టు.

అయితే ఈ నాలుగవ మెట్టులో ఐహికములు, మోక్షమును ఆశించి శిష్యులు ఆశ్రయించిరి. తోటకుడు తన మూగతనమును పోగొట్టమని ఐహికమును ఆశించి శిష్యుడైనాడు. అట్లే సురేశ్వరుడు మోక్షమును ఇమ్మని కోరుచు శిష్యుడైనాడు. ఈ 4వ మెట్టులో జీవుడు బ్రహ్మము కావచ్చునన్న ఆశ ఇంకనూ మిగిలియే యున్నది. అనగా స్వార్థము కొరకే 4వ మెట్టు ఎక్కినారు. ఈ సమయములో శంకరులు శివుడు హాలాహలము త్రాగినట్లు కరిగిన సీసమును త్రాగి జీవుడు ఈశ్వరుడు కాడని నిరూపించినాడు. మరియు జీవుడగు తాను మాత్రమే ఈశ్వరుడనని తేల్చినాడు. దీనితో శిష్యులు నిరాశ చెందినారు. తమ నిరాశను పోగొట్టుకొనుటకు జీవుడే బ్రహ్మమన్న వాదనకు దిగినారు. ఇచ్చట శంకర రూపము నిష్ర్కమించినది.

రామానుజ రూపము వచ్చినది. నిరాశ చెందిన వారికి మరల కొంత ఉత్సాహమును కల్పించినారు. నీవు ఈశ్వరుడవు కాలేవు కాని పరమాత్మ శరీరములో ఒక భాగమై యున్నావు. భక్తిచేత ఆయన యొక్క శరీర అవయవము వలె ఆత్మీయుడవు కావచ్చును అని బోధించినాడు. తాను కూడా పరమాత్మ యొక్క శరీర అవయవమే అన్నాడు. తాను శేషావతారమన్నాడు. శేషుడనగా శరీర అవయవము అని అన్నాడు. శేషుడు శయ్యగా పరమాత్మ శరీరముతో నిత్య సంబంధము కలదు. ఈ శేషశేషి సంబంధమే విశిష్టాద్వైతము. ఈ విధముగా శంకరులు జ్ఞానమును, రామానుజులు భక్తిని పరిపూర్ణము చేసినారు. ఇచ్చట రామానుజులు నిష్ర్కమించినారు. ఇప్పుడు మధ్వరూపము వచ్చిది. మధ్వులు జీవుడు స్వామి కన్న వేరుగా ఉన్న ఒక నిత్య సేవకుడనియు, తాను ఆంజనేయుని అవతారమనియు బోధించినారు. ఇదియే ఐదవ మెట్టు.

శంకరులు నేను బ్రహ్మము, నీవూ బ్రహ్మము కావచ్చునన్నారు. రామానుజులు నేను శరీరావయవమును. నీవును స్వామి శరీరములోని అవయవమే. భక్తిచేత స్వామికి ప్రియమైన అవయవము కావచ్చును అన్నారు. మధ్వులు నేను స్వామి సేవకుడను. సేవ ద్వారా నీవును స్వామి సేవకుడవు కావచ్చునన్నారు. గురువులు ఎట్లు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని మీరు కూడా పొందవచ్చును అని ఆశ కూడా చూపించుట చేతనే స్వార్థము వల్లనే జీవులు ఆకర్షితులు అయినారు. కాని చిట్టచివరి మెట్టులో మధ్వులు హనుమంతుడు ఎట్లు తాను ఉన్న కాలములో అవతరించిన నరాకారుడగు శ్రీరాముని ఐహిక, మోక్షకామములు లేక నిస్వార్థముగా సేవించినాడో, అట్లే ప్రతి మనుష్య తరమున వచ్చు నరావతారుడగు స్వామిని ఐహిక, మోక్షకామములు లేక నిస్వార్థముగా సేవించవలెనని అదియే మోక్ష కైవల్యములని ఐదవ మెట్టుకు చేర్చి నిష్ర్కమించినాడు. ఇట్లు నాస్తికుని, హనుమంతుని స్థితికి తీసుకు వచ్చినాడు శ్రీదత్తసద్గురువు.

ఆహా! ఏమని వర్ణించగలను శ్రీ దత్త సద్గురుని వాత్సల్యము!

శంకరులు జీవుడే బ్రహ్మమని చెప్పిన వాదమును జాగ్రత్తగా పరిశీలించినచో సత్యము బోధపడును. జీవుడు బ్రహ్మము అన్నారు. నిజమే, కాని బ్రహ్మమనగా ఏమని చెప్పినారు? బ్రహ్మమనగా చైతన్యమని అర్థము చెప్పినారు. ప్రత్యక్షమైన ఈ విషయములో చైతన్యము కన్నా గొప్ప పదార్థము లేదు. ఈ చైతన్యము రాజులోను, బిచ్చగానిలోను సమానముగా ఉన్నది. కావున రాజులోని జీవుడు బిచ్చగానిలోని జీవుడు చైతన్యమే. అనగా బ్రహ్మమే. నిర్మల గంగానదిలోను, బురద గుంటలోను సూర్యుని ప్రతిబింబము కనపడుచున్నది. ఆ రెండింటిలోను ప్రతిబింబించిన సూర్య ప్రతిబింబము ఒక్కటే. ఈ సూర్య ప్రతిబింబము బ్రహ్మము కానీ, గంగనీరు, బురదనీరు ఒకటియగునా? గంగనీరే ఈశ్వరుడు. బురదనీరే మానవుడు. ఈశ్వరుడిలోను, మానవునిలోను జీవుడు లేక ఆత్మయను ఒకే చైతన్యము గలదు. ఉదాహరణమునకు కృష్ణునిలోను, యాదవునిలోను ఒకే చైతన్యాత్మ వున్నది. కాని శ్రీకృష్ణుడు గోవర్ధనమును ఎత్తినాడు. యాదవుడు ఒక బండను కూడా ఎత్తలేదు. ఇది ఉపాధికి సంబంధించిన జీవేశ్వరుల బేధము. ఈ జీవేశ్వర బేధమును శంకరులు, "అనుపపత్తేః" అను బ్రహ్మసూత్రములలో స్థాపించినారు. "సత్యపి బేధాపగమే" అను శ్లోకమున ఓ ఈశ్వరా! నీకును జీవుడగు నాకును అద్వైతము వున్ననూ నీలో నేనున్నాను. నీవు నాలో మాత్రమే లేవు. నాకు బయటనూ ఉన్నావు. సముద్రములో తరంగము ఉన్నది, కాని సముద్రము ఒక్క తరంగమందే లేదు అని వచించినారు. జీవుడు బ్రహ్మమన్నారే కాని ఈశ్వరుడనలేదు. జీవేశ్వర బేధమును కరిగిన సీసము త్రాగుట ద్వారా, శంకరులు ఆచరణలోనే నిరూపించినారు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch