28 Sep 2024
[11.03.2003]
‘‘అపి చేత్స దురాచారః భజతే మామ్ అనన్యభాక్ |
సాధురేవ స మన్తవ్యః సమ్యక్ వ్యవసితోసి హి సః ||’’
అని గీతలో స్వామి చెప్పినారు. అనగా ఎంత దురాచారుడైనను మరియొక వస్తువును గాని, మరియొక వ్యక్తిని గాని కోరక ఏ జీవుడు నన్నే భజించునో, అట్టి జీవుడే నిజమైన పుణ్యాత్ముడు. అతడు చేసినది పుణ్యమే కదా! అనగా ఎంతటి పాపియైనను, స్వామియొక్క భక్తుడైనచో పుణ్యాత్ముడనియు, అయితే అట్టివానియొక్క భక్తి అనన్యభక్తిగా ఉండవలయుననియు, అట్టివాడు పాపఫలమును పొందడనియు చెప్పబడి యున్నది.
అనగా ఎన్ని పాపములు చేసినను, అనన్యభక్తితో స్వామిని సేవించినవాడు పుణ్యాత్ముడని స్వామియే చెప్పుట సరిగా లేదని కొందరు భావించుచున్నారు. కాని సత్యమును విచారించినచో స్వామి చెప్పినది అక్షరసత్యమని తేలుచున్నది. ఏలననగా ఈ సర్వజగత్తును సృష్టించినవాడు, నిన్ను సృష్టించినవాడు, నీకు ఆయురారోగ్యము లిచ్చినవాడు, నీకు సకల భోగములను ఇచ్చి ఆనందింప చేయుచున్నవాడు స్వామియే. నీ శరీరము లోపల వున్న గుండె, ఊపిరితిత్తులు, జీర్ణకోశము, మూత్రపిండములు మొదలగు అనేక అవయవములను పని చేయించుచున్నవాడు స్వామి.
నీవు స్వామికి సంపూర్ణముగా ఋణపడియున్నావు. ఉదయకాలము నిన్ను నిద్రనుండి లేచుచున్నట్లు చేయుచున్నవాడు స్వామి. నీవు స్వామికి ఏది సమర్పించినను, ఏ సేవ చేసినను ఆ ఋణము తీరదు. ఈ మానవజన్మను ఎత్తుటకు ముందు, నీవు పరలోకమున విచారణకు నిలబడియున్న సమయమున, నీ విచారణను ప్రక్కకు నెట్టించి నీకు మరల ఈ మానవజన్మమును ప్రసాదించినవాడు స్వామి. ఇన్ని ఉపకారములు చేసిన స్వామికి నీవు కృతజ్ఞతలు చెప్పకున్నచో “కృతఘ్నత” అను మహాపాపమును పొందుదువు. నీవు కృతజ్ఞతను చెప్పినచో అది మహాపుణ్యము. కృతజ్ఞతను మించిన పుణ్యము లేదు. కావున నీవు కృతజ్ఞతను చెప్పినచో, నీవు ఎన్ని పాపములు చేసిననూ అవి అన్నియును దానికన్న తక్కువ కావున నీవు పుణ్యుడవే అగుదువు.
ప్రతిదినము ఆయనకు కృతజ్ఞతలు చెప్పుచున్నచో నీ పుణ్యము +100 అగును. నీవు ఎన్ని పాపములు చేసినను అవి అన్నియు -99 మాత్రమే అగును. అప్పుడు +1 మిగులును. కావున స్వామిభక్తుడు పుణ్యాత్ముడే. నీవు కృతజ్ఞత వ్యక్తము చేయక దైవమును అంగీకరించక నాస్తికుడవైనచో నీ కృతఘ్నతా పాపము -100 అగును. నీవు ఎన్నిసార్లు పుణ్యకార్యములు చేసినను అవి అన్నియును +99 మించి పోలేవు. కావున అట్టి నాస్తికునకు -1 మిగులుచున్నది. అనగా భగవద్భక్తుడు ఎన్ని పాపములు చేసినను +1 మిగులుట చేత పుణ్యాత్ముడే అగును. ఆట్లే నాస్తికుడు ఎన్ని ధర్మకార్యములు చేసినను -1 మిగులుట చేత పాపాత్ముడే అగును.
ఏలననగా, కృతజ్ఞతకు మించిన పుణ్యము లేదు. కృతఘ్నతకు మించిన పాపము లేదు. అయితే ఈ శ్లోకము యొక్క అర్థము ప్రకారము భగవద్భక్తుడైన చాలును ఎన్ని పాపములనైనను చేయవచ్చును అని కాదు. భగవద్భక్తుడై పాపములు చేసినవానికి మిగిలిన పుణ్యము +1 మాత్రమే. కాని భక్తుడై పుణ్యము చేయువారి సంగతి ఏమి? భగవద్భక్తికి +100 పుణ్యకార్యములకు +99 మొత్తము +199 అగుచున్నది. కావున +1 గురించి చెప్పుట +1 తెచ్చుకొనమనుటయే. అట్లే నాస్తికుడై పాపకార్యములు చేయువాడు వాని నాస్తికత్వమునకు -100, వాని పాపకార్యములకు -99 మొత్తము -199 అగుచున్నది. ఇది -1 కన్నను -199 చాలా ఎక్కువ. కావున ఆస్తికుడై ధర్మమును ఆచరించువాడు పరమ పుణ్యాత్ముడని ఈ శ్లోకము యొక్క సారాంశము .
ఆస్తికుడై పాపములను ఆచరించినవాడు స్వల్పమైన పుణ్యాత్ముడు. అట్లే నాస్తికుడై ధర్మమును చేయువాడు స్వల్పమైన పాపాత్ముడు. నాస్తికుడై పాపములను చేయువాడు మహాపాపి యగును. అయితే ధర్మము అనగా నేమి? అధర్మము అనగా నేమి? ధర్మము, అధర్మము అను రెండు శబ్దములు నీ తోటి జీవించు సాటిజీవుల వ్యవహారమునకు సంబంధించినవి కాని స్వామికి సంబంధించినవి కావు. ధర్మము అనగా సజ్జనులగు భగవద్భక్తులను బాధించకుండా వారికి ఉపకారము చేయుటయే. అట్టి వారిని బాధించుట, వారికి అపకారము చేయుట అధర్మము. ఈ ధర్మము ‘మార్గ స్వరూపము’గను, ‘ఫలస్వరూపము’గను ఉండును. ఈ రెండింటి లోపల స్వరూపమే ప్రధానము. ఫలస్వరూపము అనగా నీవు ఒక కర్మ చేసి చిట్టచివరకు సాధించినది. దానినే ‘గమ్యము’ లేక ‘లక్ష్యము’ అందురు. గమ్యము ధర్మమైనచో మార్గము ధర్మమే.
ఉదాహరణకు, ఒక సజ్జనుడి జేబులో నుండి 10 రూపాయలను ఒక దుర్జనుడు దొంగిలించినాడు. ఆ దొంగిలించిన పదిరూపాయలు దుర్జనుడు తన స్వార్థమునకు వినియోగించుకున్నాడు. కావున ఇచ్చట లక్ష్యము అధర్మము. కావున ఆ దొంగతనము అధర్మము. కాని దుర్జనుని వద్ద నుండి ఆ పదిరూపాయలు దొంగిలించి ఆ సజ్జనునికి తిరిగి యిచ్చివేసినాము. ఈ రెండవ దొంగతనము అధర్మము కాదు. ఏలననగా లక్ష్యములో స్వార్థము లేదు. లక్ష్యములో త్యాగమున్నది. లక్ష్యము ధర్మస్థాపనయే.
అయితే దుర్జనుడితో యుద్ధము చేయగలిగి యుద్ధము చేసి వానిని తన్ని ఆ పదిరూపాయలు లాగుకొని ఆ సజ్జనుడికి ఇచ్చినచో ఇచ్చట మార్గము, గమ్యము రెండు ధర్మములే అగుచున్నవి. కాని ఆ దుర్జనుని తన్నుటకు శక్తి లేనప్పుడు ధర్మమార్గము అచ్చట కుదరదు. వాని వద్ద దొంగిలించియైనను దానిని సజ్జనునకు ఇచ్చివేయుటయే కర్తవ్యము. ఈ దొంగతనము పాపము కాదు. దొంగతనము చేయు నైపుణ్యము ఉండి కూడ ఈ సందర్భమున దొంగతనము పాపమని దొంగతనము చేయకున్నచో అట్లు చేయకపోవుటయే పాపమగుచున్నది.
"రామో విగ్రహవాన్ ధర్మః" అన్నారు. అనగా రాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపము అని అర్థము. అట్టి రాముడు చెట్టు చాటు నుండి వాలిని చంపుట యుద్ధధర్మము కాదని వాలి రాముని ఆక్షేపించినాడు. కాని ఇచ్చట రాముడు చేసినది ధర్మమే. ఏలననగా వాలికి ఒక వరము కలదు. యుద్ధము చేయునప్పుడు ఎదుటివాని శక్తినుండి సగము వాలికి లభించును. దీని వలన వాలిని ఎవడూ జయించలేడు. వాలి అధర్మమును చేసినాడు. సుగ్రీవుని భార్యయగు రుమను బలవంతముగా భార్యగా చేసుకొని, సుగ్రీవుని వెడలకొట్టినాడు.
అప్పటి కాలమున వానరులలో ‘దేవర న్యాయము’న్నది. అనగా సోదరులలో ఒకరు మరణించినపుడు మరణించిన వాని భార్యకు ఇష్టమైనచో బ్రతికియున్న సోదరునికి భార్య కావచ్చును. కాని సుగ్రీవుడు మరణించలేదు. మరియు రుమకు ఇష్టము లేదు. కావున ఇది రెండు విధములుగను అధర్మమే.
అయితే వాలి ఎందుకు ఇట్లు చేసినాడు? దుందుభియను రాక్షసునితో యుద్ధము చేయుటకు ఒక కొండగుహ లోనికి వాలి పోవుచు సుగ్రీవుని కాపలా పెట్టి నెలరోజులలో నేను తిరిగిరానిచో, నన్ను మరణించినట్లుగా భావించి తిరిగి పొమ్మన్నాడు. నెలరోజులు దాటినను వాలి రాలేదు. కావున అన్న ఆజ్ఞ ప్రకారము అన్న మరణించెనని భావించి దుందుభి బయటకు రాకుండగా ఆ గుహముఖమునకు పెద్దరాతిని అడ్డుపెట్టి సుగ్రీవుడు వచ్చి రాజ్యాభిషిక్తుడైనాడు.
వాలి భార్య తార ఇష్టపడినందున దేవరన్యాయ ప్రకారముగా సుగ్రీవునకు భార్యయైనది. కాని అచ్చట వాలి దుందుభిని చంపి, తాను రాకుండా సుగ్రీవుడు రాతిని అడ్డము పెట్టినాడని క్రోధావేశముతో, అన్న మాట మరచివచ్చి తార, రుమ సహితుడైన సుగ్రీవుని చూచి రెట్టించిన కోపముతో సుగ్రీవుడు ఏమి చెప్పినను వినక, సుగ్రీవుని వెడలకొట్టి రుమకు ఇష్టము లేకపోయినను, బలవంతముగా భార్యను చేసుకున్నాడు. భర్త మరణించినపుడు కూడ దేవరన్యాయములో స్త్రీ యొక్క అంగీకారము ప్రధానమైయున్నది. కావున చూచుటకు సుగ్రీవుడు చేసిన పని, వాలి చేసిన పని ఒకటిగా కనిపించును. కాని ఎంతో భేదమున్నది. కావున వాలి వధార్హుడు.
ఆనాడు భారత దేశమంతయును ఇక్ష్వాకుల సామ్రాజ్యమై యున్నది. అనగా అయోధ్యరాజుదే కేంద్ర ప్రభుత్వము. అయోధ్యరాజు భరతుడు. రాముడు తన రాజ్యమును 14 సంవత్సరములు మాత్రమే అప్పచెప్పినాడు. కనుక భారతదేశములో ఎచ్చట అధర్మము జరిగినను, శిక్షించుటకు రామునికి అధికారమున్నది.
ఇది అంతయును రాముడు వాలికి వివరించి ఇట్లు చెప్పినాడు. వాలీ! నిద్రపోవుచున్న ఏ ప్రాణిని వధించరాదు. కాని ఒక పెద్దపులి గ్రామము పైబడి జనులను వధించున్నపుడు అది మేల్కొని యుండగా దానిని ఎవరును వధించలేరు. కాని అది నిద్రపోవుచున్నది. ఈ సందర్భమున ధర్మశాస్త్రమును అతిక్రమించి దానిని వధించుట ధర్మసూక్ష్మము. ధర్మము కన్న ధర్మసూక్ష్మము గొప్పది.
★ ★ ★ ★ ★