11 Apr 2025
[10.2.2000 గురువారము రాత్రి 10-25] నేను బ్రహ్మమని వేదములో చెప్పబడుచున్నాను. ప్రథమముగా త్రేతాయుగారంభమున ఋక్షపర్వతము పై అత్రి–అనసూయా దంపతులకు దర్శనమిచ్చియున్నాను. ఆ తరువాత, ఆ దంపతుల ప్రార్థనను మన్నించి, వారికి దత్తపుత్రునిగా అవతరించితిని. బ్రహ్మము, బ్రాహ్మణునిగా అవతరించినది. ఈ కారణముననే బ్రాహ్మణకులము సర్వకులములలో శ్రేష్ఠకులముగా ప్రసిద్ధమైనది. ఈ ప్రసిద్ధికి నా అవతారమే కారణము తప్ప ఆ కులము యొక్క గొప్పతనము కాదు. ఈ బ్రాహ్మణకులమునందే రావణాసురుడు జన్మించినాడు కదా! నేను ఎక్కువగా చండాలరూపములో దర్శనమిస్తాను. చండాల రూపములోనే అవతరించి శంకరాచార్యుని కులాహంకారమును పోగొట్టితిని గదా.
కావున జన్మకారణముగా అహంకరించరాదు. ప్రతి కులము గొప్పదియే తప్ప, ఎక్కువ తక్కువలు లేవు. ఎక్కువ తక్కువలు కేవలము గుణము, యోగ్యతను పట్టియే ఉండును. కులము బాహ్యాకారము వంటిది. భక్తి అంతరంగము వంటిది. అంతరంగమే సర్వసారాంశము. ఆచార వ్యవహారములననుసరించియే కులవ్యవస్థ ఏర్పడినది. గుణము ఎక్కడున్ననూ దానిని గౌరవించి పూజించివలయును. శబరి, కన్నప్ప మొదలగు మహాభక్తాగ్రేసరులు అంటరాని కులమున పుట్టినవారు. కానీ, వారిని అంటినచో అన్ని పాపములు నశించును. రావణుడు బ్రాహ్మణకులమున జన్మించెను. కానీ వానిని అంటినచో సర్వపుణ్యములు నశించును.
బ్రహ్మము అవతరించిన కారణమున ఋషులకులమును ‘బ్రహ్మకులము’ లేక ‘బ్రాహ్మణకులము’ అన్నారు. బ్రాహ్మణ వృత్తి ధర్మములను నేను పాటించుచున్నాను. కాశీస్నానము–కరవీరపురమున సంధ్యావందనము–మాహురీపురమున భిక్షను స్వీకరించుచున్నాను. అనేక రూపములతో అనేక ప్రదేశములందు సంచరించుచు జ్ఞానమును బోధించుచు ప్రచారము చేయుచున్నాను. నా భక్తుల పాపకర్మ ఫలములను వారి భిక్షల ద్వారా స్వీకరించి అనుభవించి వారిని పాప విముక్తులను చేయుచున్నాను. ధర్మదేవత తన రక్షణకోరి గోరూపమున నన్నాశ్రయించినది. వేదములు శునకరూపములతో నా పాదముల నాశ్రయించినవి. గోవు పరమ పవిత్రము. కుక్క పరమ అపవిత్రము. నేను పవిత్రము–అపవిత్రములు రెండింటి యందునున్నాను. పవిత్రములు అపవిత్రములు ఉభయులును నన్నాశ్రయించి తరించవలసిన వారే. నన్ను బ్రహ్మమని వేదముల ద్వారా తెలియవలయును. నిర్మలమగు నిష్కామకర్మ యోగమగు సేవ ద్వారా నన్ను చేరవలయును.
బ్రాహ్మణకులమును భూదేవులన్నారు (భూసురులు). దీనికి కారణము, ఆ కులమున దేవుడగు నేను అవతరించుటవల్లనే. ద్విజులనియు ఆ కులమునకు పేరు గలదు. దానికి కారణము నేను ముందు ఋక్షపర్వతమున అత్రి–అనసూయలకు దత్తము చేసుకొనినందున జన్మించినవాడనే అయ్యాను. ఆ తరువాత అనసూయ ప్రార్థననుసరించి ఆమెకు ఔరసపుత్రునిగా మరల దత్తము చేసుకున్నాను. కాన రెండవసారి జన్మించినట్లే, ఇట్లు ద్విజన్మ వలన ఆ కులమునకు ద్విజనామ మేర్పడినది.
నేను ఎక్కువగా బ్రహ్మదేవుని స్వరూపములో ఉంటాను. శివ, విష్ణు ప్రసిద్ధి ఎలానూ ఉన్నది. నా రూపము ద్వారా బ్రహ్మదేవుని ప్రసిద్ధి. అందువల్లనే నేను అవతరించిన కులమును బ్రహ్మదేవుని పేరున ‘బ్రహ్మకులము’ అన్నారు. అందువల్లనే బ్రహ్మదేవునకు ప్రత్యేక పూజ లేదు. త్రిమూర్తులును నా వేషములే. అయితే బ్రహ్మదేవుని వేషములోనే నేను సదా సంచరిస్తున్నాను. దీనికి అనేక గుర్తులను ఇచ్చుచున్నాను. బ్రహ్మదేవుని నాలుగు ముఖములే నాలుగు వేదములు. ఆ నాలుగు వేదములే సదా శునకరూపములతో నా వెంట వచ్చుచున్నవి. బ్రహ్మదేవుడు తన నాలుగు తలలందున నాలుగు వేదములను నిక్షేపించుకొనియున్నాడు. తన జిహ్వయందు తన శక్తియగు వాణిని నిలుపుకొనియున్నాడు. దీని అర్థమేమి? తన మేధలోనున్న జ్ఞానమును, సదా తన వాక్కు ద్వారా బోధించుచు ప్రచారము చేయుచున్నాడు. అనగా బ్రహ్మదేవుడు సదా గురుస్వరూపమున నుండును. నేనును నిరంతరము గురు స్వరూపమున నా వాక్కుల ద్వారా జ్ఞానమును బోధించుచు సంచరించుచున్నాను. కాషాయవస్ర్తము బ్రహ్మదేవుని వస్ర్తము. కాషాయము పరిపక్వతను సూచించును. అది పరిపక్వమైన జ్ఞానమును సూచించుచున్నది. కావున నా స్వరూపము బ్రహ్మదేవుని వేషప్రాధాన్యమై యున్నది. నేను జన్మించిన ఋషికులము యొక్క లక్షణములు కూడ నా కేశపాశములను ఊర్ధ్వముగా ముడి వేయుటలో కనిపించును. నా శివలక్షణము నా భిక్షాటనలో కనిపించును. నా విష్ణులక్షణము ధేనురూపముననున్న గోవును రక్షించుటలో కనపడుచున్నది.
నా ముఖమున దత్తతిలకమున్నది. దీనిని ఇంత వరకు ఎవరును గ్రహించలేదు. నా ఫాలమున అడ్డముగా విభూతిరేఖలు మూడు శివతిలకమును, నిలువగ నున్న ఊర్ధ్వత్రిపుండ్రములు విష్ణు తిలకమును, మధ్యలో బింబరూపమున చందనతిలకము, దాని మధ్య బింబరూపమున నున్న కుంకుమ తిలకము బ్రహ్మతిలకమును సూచించుచున్నవి. ఈ మూడు తిలకములు నా ఫాలమున కలవు. దీనినే “దత్తతిలక”మందురు. నేను ఏకముఖుడను. కానీ సృష్టి, స్థితి, లయములను నేను ఒక్కడినే చేయుచున్నాను అను వేదప్రమాణమైన బ్రహ్మము యొక్క లక్షణమును తెలుపుటకు త్రిముఖములతో ఎక్కువగా గోచరించును. ఆ త్రిముఖములే సృష్టిని చేయు బ్రహ్మముఖము, పాలించు విష్ణుముఖము, లయింప చేయు శివముఖము.
దేవతలందరును త్రిదశులు. అనగా ఎల్లప్పుడును 30 సంవత్సరముల ప్రాయము కలిగియుందురు. నేను సదా షోడశవర్ష (16 సం.) ప్రాయునిగానే ఉన్నాను. నేను బ్రహ్మచారిగానే ఉన్నాను. ఏలననగా నాకన్నా రెండవవస్తువు లేదు కదా. అయితే నాలోనే లీనమై నాకన్న భిన్నము కాని నా విచిత్ర సామర్థ్యమైన నా శక్తి ఈ జగత్తుగా పరిణమించినది. ఈ జగత్తు మూడు భాగములుగా నున్నది. ఒకటి చైతన్యశక్తి. ఇదే మనో బుద్ధ్యహంకార చిత్తస్వరూపమను అంతఃకరణ చతుష్టయ శక్తి. ఈ జ్ఞానస్వరూపమైన సదా ప్రసరించు (సరస్వతి) స్వభావమును కలిగి వాక్కురూపమును ధరించుచున్న శక్తియే ‘సరస్వతి’. ఇక ద్రవ్యాత్మకమైన శక్తియే ‘లక్ష్మి’. తేజోరూపమైన జడశక్తియే ‘పార్వతి’. నా జ్ఞానవాగ్రూపమే సరస్వతి. నా ఈ తనువే లక్ష్మి. నా యందుగల తేజోరూప కళయే గౌరి. ఈ త్రిశక్త్యాత్మికయగు శక్తియే ‘అనఘ’, ‘మధుమతి’ అను నామములతో వెలుగుచు ఏకముఖియై నాకు ఆనందవినోదములను కలిగించుచు నా సహచారిణియై యున్నది. ఈమెను బ్రహ్మము యొక్క నర్తకి: బ్రహ్మనర్తకి అనియును పిలుచుదురు. ఈమెయును సరస్వతి–లక్ష్మి–పార్వతి త్రిముఖములతోనే ఎక్కువగా గోచరించును. నేను త్రివేషములగు త్రిరూపములను ధరించునపుడు, ఈమెయును త్రివేషములగు త్రిరూపములను ధరించుచున్నది. ఈమె జీవాత్మ. నేను పరమాత్మ. మా ఇరువురి నిత్య సాన్నిహిత్యస్థితియే యోగము. ఈమె వీణాపాణియై నన్ను కీర్తించుచున్నది. ఈమె నా పాదములను సదా సంవాహనము చేయుచున్నది. ఈమె సదా నన్ను ధ్యానించుచున్నది. నా కృష్ణావతారమున ఈ త్రిశక్తులే రాధ–రుక్మిణి–సత్యభామలు. నా రామావతారమున ఈమె ఏకముఖియై సీతయైనది.
★ ★ ★ ★ ★