12 Apr 2025
[12.02.2000 ఉదయం 5 గం.] ‘మాతృదేవో భవ–పితృదేవో భవ–ఆచార్యదేవో భవ’ అని శ్రుతి త్రిమూర్తుల యొక్క అనగా నా యొక్క త్రివిధ స్వభావములను వివరించుచున్నది. విష్ణువేషములో నేను ఐహికప్రదాతగా మాతృవేషమున నుందును. తిరుపతిలోనున్న శ్రీవేంకటేశ్వర తత్త్వమిదే. ఐహికార్థులందరును అచటకు వత్తురు. తల్లి శరీర పోషణమును చేయును. ఐహికములు కూడ శరీరము వలె ఈ జన్మకు సంబంధించినవే. అయితే నిశ్చింతగా సాధన చేయుటకు అన్నపాన వస్ర్తాదుల వరకు మితముగా అవియును అవసరమే కదా. అవి పునాది వంటివి. మోహినీ రూపమున విష్ణువు యొక్క మాతృతత్త్వము స్పష్టము. అలంకార సౌందర్యాదులన్నియును స్ర్తీజన ప్రియములైనవి, విష్ణుస్వరూపమున నున్నవి. ఇక శివతత్త్వము పితృస్వరూపము. తండ్రి విద్యాయశస్సులను కోరును. కీర్తికరములగు అష్టసిద్ధులను కోరిన జీవులు శ్రీశైలమున నున్న నా శివరూపమును సేవింతురు. అయితే ఇదియును ఐహికమే. ఇదియును, దైవప్రచార సమయమున కొంత పరిమితముగ అవసరమే. ఐహికములు–అష్టసిద్ధులును మితిమీరినచో అహంకారమునకు కారణములై పతనమునకు దారితీయును.
కార్తవీర్యార్జునుడు ఇట్లే పతనమును చెందినాడు. అయితే తల్లిలో కూడ పుత్రుని యొక్క విద్యాకీర్తి గురించిన ఆశ ఉండును అనగా పితృ స్వభావము ఉండును. కావుననే మాతృ తత్త్వము కలిగియును విష్ణువు పురుష (తండ్రి) రూపములో నున్నాడు. అట్లే తండ్రిలో కూడ పుత్రుని శరీరపోషణ మొదలగు ఐహికములను గురించిన ఆశ ఉండును. కావుననే పురుష స్వరూపముననున్న తండ్రియగు శివుడు అర్ధనారీశ్వర (తల్లి–తండ్రి) తత్త్వమును కలిగియున్నాడు. ఇరువురును ఐహికప్రదాతలే కావున ఒకే తత్త్వము వలన ‘శివాయ, విష్ణు రూపాయ’ అని శివకేశవుల తత్త్వము అభేదముగా చెప్పబడినది. శివుడు తమోగుణ స్వరూపుడు అనగా నల్లగా ఉండవలెను. విష్ణువు సత్త్వగుణ స్వరూపుడు అనగా తెల్లగా ఉండవలెను. కానీ వారు ఇరువురును తమ వర్ణములను మార్చుకున్నారు. శివుడు తెల్లగాను, విష్ణువు నల్లగాను ఉన్నారు. అయితే ఇది బాహ్యవర్ణమే. దీని సారాంశము తండ్రి కొంత తల్లి స్వభావమును, తల్లి కొంత తండ్రి స్వభావమును కలిగియుండుటయే.
ఇక జన్మజన్మలకు వెంటవచ్చు బ్రహ్మజ్ఞానము నిచ్చు ఆచార్యరూపమే బ్రహ్మదేవుని తత్త్వము. ఇదే గురుతత్త్వము. గురువు ఇచ్చునది శాశ్వతజ్ఞానము. ఐహిక విద్యలను బోధించువారు అధ్యాపకులే బోధకులే తప్ప, ఆచార్య–గురు శబ్దములకు వారు అర్హులు కాదు. వారు బోధించు ఐహిక విద్యలును ఈ జన్మతోనే నశించును. ఆచార్యుడు బోధించు దైవజ్ఞానము జన్మజన్మలకు వెంట వచ్చును. ఇదే చరమపరమ స్వరూపము. బ్రహ్మదేవుడే సృష్టి ప్రారంభమున నేను వేసిన మొదటి వేషము. శివ కేశవులు తల్లి-తండ్రులయినచో, బ్రహ్మదేవుడు పితామహ–మాతామహ స్థానమున నున్నాడు. తిరుపతి–శ్రీశైలముల వలె ఆయనకు ఒక స్థానము ఉండదు. ఈ తత్త్వము భూమి అంతయును సంచరించుచు, భక్తుల వద్దకే వచ్చుచుండును. ఐహికములను కోరువారు నా వద్దకు వచ్చెదరు. కానీ, జ్ఞానమును కోరువారున్న చోటికి నేను వచ్చి జ్ఞానమును ఇత్తును. ఆచార్యునిలో కూడ శిష్య (భక్త) వాత్సల్యమున్నది. అనగా తల్లి–తండ్రుల స్వభావములున్నవి. అనగా ఆచార్యుడు త్రిమూర్తిరూపుడు ‘గురుర్బ్రహ్మ...’ శ్లోకమునకు అర్థమిదే. ఇట్లు ఆచార్యరూపుడైన బ్రహ్మదేవుడే దత్తాత్రేయ నామధారియై త్రిమూర్తిరూపుడై భూమిలో సంచరించుచు, భక్తులకు జ్ఞానము నిచ్చుచున్నాడు.
★ ★ ★ ★ ★