home
Shri Datta Swami

 21 Dec 2024

 

త్యాగేనైకే అమృతత్వ మానసుః అనెడి వేదవాక్య వివరణ

Updated with Part-3 on 23 Dec 2024


Part-1   Part-2   Part-3


Part-1

[02-01-2003] "త్యాగేనైకే అమృతత్వ మానసుః" అని శ్రుతి. త్యాగము చేతనే పరమాత్మ లభించును. త్యాగము అనగా దానము. దానమే దత్త శబ్దార్థము. కావున స్వామి పేరులోనే స్వామిని చిక్కించుకునే మార్గము బోధపడుచున్నది. దానము అనగా ధనము యొక్క దానము మాత్రమే కాదు. స్వామి పరీక్షించినపుడు స్వామి బంధము నుండి అన్ని బంధములు తక్కువేయని నిరూపించవలయును. చివరకు నీ శరీరముపైన బంధము కూడా వదలి ప్రాణత్యాగము చేయుటకు సిద్ధము కావలయును. నీ శరీర ప్రాణములపై బంధము కూడ ఒక బంధమే. ధర్మము మీద ఉన్న బంధమును సైతము స్వామి పరీక్షలో త్యజించవలయును అని "సర్వధర్మాన్‌ పరిత్యజ్య" అను గీతా శ్లోకము తెలుపుచున్నది. మానమును సహితము త్యజించవలెను. మానము అనగా అభిమానము అని అర్థము. దీనిని ఆత్మాభిమానమందురు. అనగా తనపై తనకున్న అభిమానము. ఇది కూడ బంధమై అభయమిచ్చిన గయుని వదలినచో ఆత్మాభిమానమునకు భంగము కలుగును. పట్టుదలయును ఒక బంధమే. గయుని రక్షింతును అను పట్టుదల పట్టి, అర్జునుడు ఆ పట్టుదలచే బంధింపబడినాడు. స్వామిపై తనకున్న బంధముకన్న ఆ పట్టుదలతోనున్న బంధము ఎక్కువ అని నిరూపించినాడు పార్థుడు. స్వామి కొరకు ఎలాంటి పట్టుదలనైనను త్యజించి ఆత్మాభిమాన త్యాగము చేయవలయునని స్వామి పార్థునికి బోధించుటకై తన పట్టుదలను త్యజించినాడు. పట్టుదలను ఎట్లు త్యజించవలయునో ఆచరించి చూపెట్టినాడు. పట్టుదల కూడ అజ్ఞానము యొక్క లక్షణమే. కావుననే పార్థుడు అజ్ఞానియగు ఆటవికునిగా తిన్నడుగా పుట్టినాడు. ఇదే సర్వసాధన యొక్క సారాంశము.

Swami

స్వామి సర్వాధికుడన్న భావము ఏక్షణములోనైనను నిరూపించుటకు సిద్ధముగా యుండవలెను. స్వామి నీ విశ్వాసమును పరీక్షించుటకు ఒక్కొక్కసారి అధర్మమును ఆచరించమని ఆజ్ఞాపించును. స్వామి చెప్పినదే ధర్మము, స్వామి కన్న ధర్మము ఎక్కువ కాదు. ధర్మాచరణము యొక్క ఫలమేమి? దానిచేత స్వామి ప్రసన్నుడగుననియే కదా? స్వామి ఆజ్ఞను పాలించినచో, స్వామి ప్రసన్నుడగును. కావున స్వామి ఆజ్ఞయే ధర్మము. స్వామితో పోటీ పడినచో ధర్మమే తలవంచుచున్నది. ధర్మదేవత ధేనురూపమున స్వామి పాదముల వద్ద తలవంచి 'రక్ష రక్ష' అని యాచించుచున్నది. ధర్మమే తలవంచినప్పుడు, నీవేల తలవంచవు? ఇందులో అసలు రహస్యము ఏమనగా నీవు తలవంచక పోవుటకు కారణము నీ అహంకారము అది బయటపడుట ఇష్టము లేక ధర్మశాస్త్రములను వల్లించుచున్నావు. "పెద్దలు ఇట్లు చెప్పినారని", "మా పెద్దలు ఇట్లు ఆచరించినారని" శిష్టాచారమును ఉదహరించుచున్నావు. శిష్టాచారమే కేవలము ప్రమాణమైనచో తన తండ్రి తాతలు ఆచరించిన రాక్షస ఆచారములను ప్రహ్లాదుడు ఏల నిరాకరించెను? కావున జ్ఞానముతో కర్మ చేయవలయును. "జ్ఞాతే కర్మ న విద్యతే", "సర్వం కర్మాధీనం పార్థ జ్ఞానే పరిసమాప్యతే", "జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి భస్మసాత్‌ కురుతేఽర్జున! బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి, బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే, ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనుంజయ" ఇత్యాది గీతా శ్లోకములన్నియును జ్ఞానాగ్ని సర్వకర్మలను భస్మము చేయుననియు, జ్ఞానము కర్మలను చూచి నవ్వుచున్నదనియు, జ్ఞానిని కర్మలు బంధించజాలవనియు బోధపరచుచున్నవి. కావున ధర్మశాస్త్రము గాని, పెద్దలు గాని కేవలము నీవు అడ్డుపెట్టుకొను సాకులే తప్ప నీ పట్టుదలకు అసలు కారణము నీలోని రజస్తమో గుణమైన అహంకారమే. శరణాగతి ధర్మమును పార్థుడు అడ్డుపెట్టుకున్నాడే తప్ప పట్టిన పట్టుదల విడవక పోవుట అను క్షత్రియ రాజస అహంకారమే దానికి కారణము. తనకు తెలియకుండా తనలోనే పెరిగిన మాత్సర్యము మరొక కారణము. ఏమి కృష్ణుని ఆధిక్యము? ప్రతిమాట కృష్ణుడు చెప్పినట్లు వినవలసినదేనా? నేను ఆయనకు బానిసనా? అన్న అసూయా అహంకారములే గయుని విషయమున పట్టుదలకు కారణము కావున ఈ అసూయా అహంకారములు పరిపూర్ణముగా ఈ సాధన చేత నిర్మూలించుకున్న నాడే దత్తుడు జీవులకు చిక్కును. అంతవరకు చిక్కుచూ, జారుచూ ఉండును. దత్తుడు మీలో ప్రవేశించి, జారిపోకుండా శాశ్వతముగా నిలువవలయున్నచో అసూయను అహంకారమును నిర్మూలించుకొనుడు.

 

Part-2

ఎదుటి ఇంటిలో మంచినీటి బావి ఉన్నది. వాని ఇంటిలో ఉప్పునీటి బావి ఉన్నది. "తాతస్య కూపోఽయమితి బృవాణాః క్షారం జలం కాపురుషాః పిబంతి" అని శాస్త్రవచనము. అనగా మాతండ్రిగారు తవ్వించిన బావియని మూర్ఖుడు ఉప్పు నీటినే త్రాగును. వాడు ఉప్పు నీటిని త్రాగుటకు అసలు కారణము తండ్రిపై అభిమానము గాదు. దానిని అడ్డు పెట్టు కొనుచున్నాడు. వానిలో అసలు కారణము ఎదుటి వారి బావిలో మంచినీరు పడినదను అసూయ. తాను నీటి కొరకు మరియొకరిని యాచించనేలనను అహంకారము వానిని ఉప్పు నీరు త్రాగునట్లు చేయుచున్నవి. ఇట్టి అహంకారముతో, మూర్ఖత్వముతో, అజ్ఞానముతో, అసూయతో పట్టుదలకు చిక్కి దానిని సడలించుకొనలేక, దానిని బయట పడకుండా కప్పుకొనుటకు సంప్రదాయములను, పెద్దలిట్లు చెప్పినారనియు సాకులుగా ఉపయోగించుకొనుచున్నారు. "ఇది ఆత్మవంచన" దీనిచే వారు నష్టపోదురు. అజ్ఞానులు చెప్పు అజ్ఞానవాక్యములను గుడ్డిగా విశ్వసించి, అజ్ఞానమయమగు నరక లోకమున శాశ్వతముగా పడుచున్నారు. అనగా ఆట్టి వారు విచారణకు, జ్ఞానమునకు అవకాశములేని పశుపక్ష్యాది జన్మలయందు శాశ్వతముగా పడుచున్నారు. గుడ్డివారిని గుడ్డివారు పట్టుకున్నచో గుంటలో పడుట తప్పునా? ఈ అజ్ఞానులు చెప్పు వాక్యములు "అవిచారిత రమణీయములు". అనగా విచారణ చేయనంత వరకు మనోహరములు. ఉదాహరణకు ఈ సృష్టిలో జరుగు ప్రతి పనియును ఈశ్వర సంకల్పమేనందురు. ఈశ్వరాజ్ఞ లేనిదే చీమయైనా కుట్టదు అందురు. దీని ఆధారముగా చేసుకొని తమ అజ్ఞానమును సమర్థించుకొను అహంకారమే కారణము.

స్వామి నరసింహుని రూపములో వచ్చినపుడు హిరణ్యకశిపుడు స్వామీ! ప్రతిదీ నీ సంకల్పము చేతనే జరుగును కదా. కావున ప్రహ్లాదుని నేను హింసించుట నీ సంకల్పమే. ఈశ్వరాజ్ఞ లేనిదే చీమ యైననూ కుట్టనప్పుడు నీ ఆజ్ఞ లేకుండా నేను ప్రహ్లాదుని ఇంత హింసించుట సాధ్యమా? కావున నన్ను సంహరించుట అన్యాయము. దానికి స్వామి సమాధానము ఏమని చెప్పును? ఓరీ! రాక్షసా! ఇప్పుడు నిన్ను చీల్చి చంపుటయు ఈశ్వరాజ్ఞయే. ఇదియు స్వామి సంకల్పమే. హత్య చేసాక వాడు న్యాయస్థానములో ఇదే మాటను చెప్పినచో న్యాయమూర్తి నీకు ఉరి వేయుట కూడా ఈశ్వర సంకల్పమనియే చెప్పును. సృష్టిలో ప్రతి పనియును ఈశ్వరుని శక్తి చేతనే జరుగుచున్నది. నిజమే, కాని ఆ పనిలో సంకల్పము ఈశ్వరునిది కాదు. సంకల్పము జీవునిది. సంకల్పించిన వారికే కర్మఫలమంటును. సంకల్పము లేకుండా కర్మ చేసిన వారికి కర్మఫలము అంటదు. సంకల్పము ఫలము మీద ఉన్న ఆశ వల్లనే జరుగుచున్నది. ఫలాశ లేని వారికి సంకల్పము కలుగదు కావున కర్మ చేసినను ఫలము అంటదు అని భగవంతుడు గీతలో పదేపదే ఘోషించినాడు. "మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భూః, అనాశ్రితః కర్మ ఫలం, సంగం త్యక్త్వా ధనంజయ" ఇత్యాది అనేక శ్లోకములు కలవు.

 

Part-3

అడవిలో నున్న నిధిని పొందవలయునని ఆశతో ఒకడు గుర్రమును ఎక్కి అడవికి వెళ్ళినాడు. అక్కడ దొంగలు వానిని కొట్టినారు. వాడు అడవికి పోవుట అను కర్మ, గుర్రము చేసినది కాని గుర్రమును కొట్టలేదు. కర్మము జడము. జడము ఫలము నీయజాలదు. కావున సంకల్పము చేసిన వానికే ఫలము అందును. సంకల్పము లేకుండా రావణ శరీర స్పర్శ జరిగినను సీత అపవిత్రురాలు కాలేదని అగ్ని రామునకు చెప్పినాడు. నర్మదానదిలో స్నానము చేయుచున్న గంధర్వుని చూచి రేణుక మనస్సు చలించినది. గంధర్వుని కనీసము చేతితోనైనను సృశించలేదు. కావున కర్మ జరగలేదు అయినను శిరచ్ఛేదమను కర్మఫలమును పొందినది. కావున కర్మ చేయకున్నను సంకల్పము చేత కర్మఫలము లభించును. కర్మ చేసినను సంకల్పము లేనిచో కర్మఫలము అంటదు. ఎట్టి సంకల్పము లేక తల్లి ఆజ్ఞను అనుసరించి వ్యాసుడు అంబిక, అంబాలికల యందు పుత్రోత్పత్తిని కలుగచేసినాడు. కావున ఆ కర్మఫలము వ్యాసునకు అంటలేదు. ఇదే ధర్మశాస్త్రము యొక్క సారాంశము. కావున సర్వకర్మలను పరమాత్మయే చేయుచున్నప్పటికిని సంకల్పములు మాత్రము జీవులవే కావున వాటి ఫలములను జీవులే పొందుదురు. జీవులే కర్తలు భోక్తలు. పరమాత్మ కేవలము సృష్టి సంకల్పమును చేసి సృష్టి యను కర్మను చేసినాడు. దీనియొక్క ఫలము లీలా వినోదము. అట్టి లీలా వినోదమను ఫలమును తానే పొందుచున్నాడు.

జగత్తును సృష్టించినంత వరకే స్వామి కర్త, దాని వినోదమును అనుభవించు వరకే భోక్త. ఈ జగత్తులో సృష్టి జరిగిన తర్వాత జరుగుతున్న అన్ని పనులకు పరమాత్మ సంకల్పము లేదు. వాటి సంకల్పము లన్నియు జీవులవే. తన తప్పును కప్పిపుచ్చుకొనుటకే ఈ మాయావాదమును జీవుడు చేయుచున్నాడు. ఇట్లే జీవులందరును పరమాత్మయే లేక అన్ని జీవులలో పరమాత్మను చూడుము ఈ వాక్యములు కూడా అవిచారిత రమణీయములే. సర్వ జీవులు పరమాత్మయే అయినచో పరమాత్మయగు తన తండ్రి జీవుని మాట ప్రహ్లాదుడు ఏల వినలేదు? పరమాత్మ యగు రావణ జీవుని రాముడు ఏల వధించెను? పరమాత్మ యగు తల్లి జీవుని శంకరులు ఏల త్యజించిరి? పరమాత్మలగు భార్యాపుత్రులను బుద్ధుడు ఏల త్యజించెను? ఈ వాక్యమును తప్పు చేసిన వానిని సమర్థించుకొనుటకు తెలివిగా ఉపయోగించు కొందురు. ఇది శంకరులు చేసిన అద్వైత కార్యమని చెప్పుదురు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch