home
Shri Datta Swami

 29 Sep 2024

 

అనుగ్రహము పొందినపుడే భక్తిని చూపుట నిజమైన భక్తి కాదు

[24-01-2003] పరమాత్మ యొక్క అనుగ్రహము పొందినపుడు భక్తిని చూపించుట నిజమైన భక్తి కాదు. మనకు లాభము చేయు వారి మీద ప్రేమను చూపుట, సత్యమైన ప్రేమ కాదు. ఎదుటివారు మన సుఖమునకు కారణమైనందున వారిపై మనము చూపు ప్రేమ అది నిజముగ వారిపై ప్రేమ కాదు. అది మన మీద మనకున్న ప్రేమయే. మనలను మనము ప్రేమించుట వలననే మనకు సుఖమునిచ్చెడి వస్తువులను వ్యక్తులను ప్రేమించుచున్నాము. కావున ఇది ఆత్మప్రేమయే తప్ప పరప్రేమ కాదు. మనకు సుఖమును దుఃఖమును కల్గించక మౌనమున ఉన్నవారిపై మనము కూడా ప్రేమను చూపము.

మనకు ఒక ప్రదేశములో ఒక రాయి కనబడినది. ఆ రాయి మనకు సుఖము నిచ్చుట లేదు. దుఃఖము నిచ్చుట లేదు. కావున ఆ రాయి మీద మనకు ప్రేమ లేదు. కాని అదే రాయి మన కాలికి కొట్టుకున్నచో కోపముతో దానిని అవతలకు పారవేయుదుము. కావున మనలో ఆత్మప్రేమ కాక పరప్రేమ ఎప్పుడు బయటపడుచున్నది? స్వామి వరములనిచ్చి అనుగ్రహమును చూపినప్పుడు కాదు స్వామిని పూజించి ప్రేమించుచున్నను ఎట్టి ప్రతిఫలమును ఈయక ఉపేక్ష వహించినపుడు మన ప్రేమ, సేవ కొనసాగినచో అది పూర్ణప్రేమ లేక సత్యప్రేమ యగును.

ఇక పరిపూర్ణమైన సత్యాతిసత్యమైన ప్రేమ సేవ ఏదియనగా స్వామి మనపై ఆగ్రహించినపుడు మనము ఎంత ప్రేమింతుము? మనము సేవించుచుండగా వరములనీయక పోగా ఉపేక్షవహించుట మాత్రమే కాక కష్టములను కల్గించినను ప్రేమ సేవలు యథాతథముగా కొనసాగించినచో అవియే పరిపూర్ణమైన సత్యాతిసత్యమైన భక్తి ప్రేమలనబడును.

లొట్టచేతులను బాగు చేసుకొనవచ్చిన కార్తవీర్యునకు ఆ రెండు లొట్టచేతులను బాగు చేయక పోగా స్వామి కాలితో తన్ని ఆ రెండు చేతులను విరగకొట్టినాడు. అయిననూ కార్తవీర్యుని ప్రేమలో సేవలో ఎట్టి తేడా రాలేదు. శిరముతో సేవించినాడు.

అట్లే శ్రీరాముడు రజకుని నిందా వాక్యములను విని సీతను కారడవులకు పంపినపుడు సీత లక్ష్మణునితో “రాముని వంశమగు ఈ సంతానము అడ్డము రాకున్నచో స్వామి వియోగములో వ్యర్థమైన ఈ బ్రతుకును చాలించి ఉండెడిదానను. ప్రసవానంతరము నేను పంచాగ్ని మధ్య తపమును చేయుదును. ఆ తపస్సు యొక్క లక్ష్యము ఏమనగా మరుజన్మలో కూడా రాముడే నాకు భర్తగా లభించవలయును” అని చెప్పినదే కాని శ్రీరాముని నిందించలేదు. ఇదే నిజమైన భక్తి.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch