home
Shri Datta Swami

 13 Feb 2025

 

వీరమతములు

[11.03.2000 ఉదయం 5గంటలకు] ‘ ఏత దుదర మంతరం కురుతేఅథ తస్య భయం భవతి’ అని శ్రుతి. ఎవరు భేదాలను పాటిస్తారో వారు అంత్యమున నరకమునబడి భీతులగుదురు. ఏకత్వమే బ్రహ్మత్వము. కులము, జాతి, మతము–ఈ మూడు భేదములతో కూడిన అజ్ఞానమే బ్రహ్మ జ్ఞానమునకు అవరోధము. దీనిని దాటలేకపోయినచో బ్రహ్మజ్ఞానము పూర్ణము కాదు. దీనినే శంకరాచార్యులకు దత్తసద్గురువు చండాలరూపములో బోధించారు. ప్రతి కులమునందును సజ్జనులున్నారు, దుర్జనులున్నారు. సజ్జనులందరును ఒక కులము. ఏలననగా కులము వాళ్ళ కర్మ సంస్కారము చేత నిర్ణయించవలెను. అట్టి వారందరును కలిసి సత్సంగము చేయవలెను. బ్రహ్మమును గుర్తించి, బ్రహ్మమును గురించి సత్సంగము చేయువారే వేదాధ్యయనము చేయు బ్రాహ్మణులు. జాతి యనగా స్త్రీ పురుషజాతులనియు, మనుష్య పశుపక్షి జాతులనియు, భారతీయ పాశ్చాత్య జాతులనియును వాడబడుచున్నది. ఇందులో స్త్రీ పురుష జాతి భేదము నిషిద్ధము. సర్వజీవులును స్త్రీలే. పరమాత్మ ఒక్కడే పురుషుడు కావున పరమాత్మనుపాసించు జీవులందరును స్త్రీలే కావున ఆ భేదము అజ్ఞానజనితము. ఇక మనుష్య–పశు–పక్షి జాతి భేదము అజ్ఞాన పరాకాష్ఠ. పశు, పక్షులే కాదు వృక్షములును జీవులే. అవి అన్నియును నీ సోదరులే. వాటిని చంపి తినువాడు సోదరహంతకుడు. ‘అహింసా పరమో ధర్మః’ అని కదా వేదము చెప్తోంది.

ఇక మతభేదము అవిద్య అనబడును. ఈ మతములలో వీరమతములున్నవి. వీరవైష్ణవ, వీరశైవ, వీరశాక్తేయము మొదలగు మతములు హిందూమతములోని అవాంతరమతములు. ఇక వీరక్రైస్తవ మతము మొదలగు మతములన్నియును పాశ్చాత్యమతములు. వీటి యందును భేదము పనికిరాదు. క్రైస్తవమతము కూడ దైవమతమే కానీ వీరక్రైస్తవ మతము అనుయాయుల గుడ్డి అభిమానమే. వీరక్రైస్తవులిట్లు పలుకుదురు – ‘క్రీస్తును నమ్మని వారందరును నరకాగ్నిలో పడుదురు. ఇతర దేవతలను నమ్మినవారు, విగ్రహారాధకులు శాశ్వత నరకమున పడుదురు’– అయితే, వారిని నేనిట్లు ప్రశ్నించుచున్నాను–సరే నిజమే అనుకొందాము. క్రీస్తును నమ్మని వారందరును నరకాగ్నిలో పడుదురు అనునది సత్యమే. అయితే క్రీస్తు భగవానుడు పక్షపాతము లేని కరుణామయుడు కదా. అయితే క్రీస్తు పుట్టకముందు ఈ ప్రపంచమున జీవించిన జీవులకు అట్టి అదృష్టము లేకుండాపోయినది కదా. క్రీస్తు పుట్టిన తరువాత పుట్టిన జీవులకు మాత్రమే యీ అదృష్టము లభించినది కదా. ఇది భగవంతుని పక్షపాతము కాదా?

పూర్వపక్షము (Opponent):- క్రీస్తు జన్మించక ముందు యొహోవా అను దైవమున్నది. యొహోవాను స్మరించినవారును ముక్తులే. యొహోవా తండ్రి. ఆయన యొక్క అవతారమే క్రీస్తు. కావున ఈ దోషము రాదు.

సిద్ధాంతము (Swami):- సరే, అది నిజమే అనుకొందాము. ఈ భారతదేశమును వాస్కోడిగామా కనుగొనక ముందు, ఈ భారతదేశీయులకు యొహోవా గురించి కానీ, క్రీస్తును గురించి కానీ తెలియదు కదా. తెలియకపోవుట వలన భారతీయులు, వాస్కోడిగామాకు ముందు యొహోవాను కానీ క్రీస్తును గానీ ఆరాధించలేదు. అట్లు ఆరాధించకపోవుట వారి దోషము కాదు. మరియును, అట్లు ఆరాధించనందున మీ వాదము ప్రకారముగా, అనవసరముగా, తప్పులేకున్నను, జీవులు నరకమున పడుట వలన భగవంతునికి పక్షపాత దోషము వచ్చుచున్నది. తెలిసిన తరువాత నిరాకరించిన వారు నరకమున పడుట న్యాయము. తెలియక ముందు నరకమున పడలేదన్నచో, అప్పుడు యొహోవాను, క్రీస్తును ఆరాధించక పోయినను నరకమున పడకపోవుట ఇదివరకు జరిగినది కావున ఇప్పుడును అట్లు జరగవచ్చుననుటలో దోషమేమి? ఈ ప్రశ్నకు మీ సమాధానమేమి?

Swami

[14.03.2000 ఉదయం 5.30 నిమిషములకు]

పూర్వపక్షము: క్రీస్తువార్త తెలియక ముందు కూడ భారతీయులు నరకమునే పడుదురు. ఏలనన, అది వారి దోషము కాకపోయినప్పటికీ, వారు తమ తమ కర్మల విచారణ చేత నిర్ణయింపబడి దుష్కర్మల వలన నరకమున పడిరి. కావున దానివలన వారికి అన్యాయము జరుగలేదు.

సిద్ధాంతి: అట్లు అయినచో, ఇప్పుడు కూడ అట్లే కర్మవిచారణ చేత జనులు నిర్ణయింపబడి స్వర్గ-నరకములను పొందుదురు గాక. ఇప్పుడును క్రీస్తును నమ్మని వారును, తమ పుణ్యకర్మల చేత స్వర్గమును పొందుదురు గాక.

పూర్వపక్షము: ఇప్పుడు అట్లు కాదు. క్రీస్తును నమ్మిన వారి పాపములు క్షమించబడి పుణ్యలోకమునకు చేరుదురు. క్రీస్తును నమ్మని వారికి అట్టి రక్షణ లేదు. ఇప్పటి వారు ఈ విధముగ అదృష్టవంతులు.

సిద్ధాంతి: దీని చేత మరల భగవంతుడికి పక్షపాతదోషము వచ్చినది కదా. ప్రస్తుతకాలములో నున్న జీవులు పాపములు చేసినా, క్రీస్తును నమ్మినందున క్షమించబడి పుణ్యలోకమునకు వెడలినారు. కానీ పూర్వులకు అట్టి అవకాశము లేకపోయినది. పాపము చేసిన పూర్వులు అందరూ నరకమునకు పోవలసినదే. కానీ నవీనులు పాపము చేసి కూడ, క్రీస్తును నమ్మినందున పుణ్యలోకమునకు పోయినారు గదా. ఇట్టి క్షమాపణావకాశము పూర్వులకు లేకుండా పోయెను గదా. ఇది భగవంతునికి పక్షపాత దోషము నంటగట్టుచున్నది.

ఈ దోషమును ఎట్లు పరిహరించవలెను? ఓ వీరక్రైస్తవులారా! దీనికి నావద్ద సమాధానమున్నది. వినుడు. భగవంతుడు నిష్పక్షపాతి. అనాది నుండియును, భగవంతుడు అన్ని దేశములలోను అవతరించి, అన్ని భాషలలో ఒకే పరమార్థ సత్యమును బోధించినాడు. కావున భగవంతుడు నిష్పక్షపాతి. పూర్వులకును, నవీనులకును సమానావకాశము వచ్చినది. నమ్మినవారు స్వామి లోకమునకు, నమ్మని వారు నరకమునకు అను మాటలో నిష్పక్షపాతమైన న్యాయము వచ్చినది. క్రీస్తు కూడా భగవంతుని అవతారమే. క్రీస్తు మాత్రమే భగవంతుని అవతారము అనరాదు.

కానీ మీ మొండివాదములో క్రీస్తు మాత్రమే భగవంతుడు అన్నపుడు, క్రీస్తుకు పక్షపాతదోషము అంటకతప్పదు. భగవంతుడు నిష్పక్షపాతియని మీరు అంగీకరించినచో నా సిద్ధాంతమును అంగీకరించుట తప్ప వేరు మార్గము లేదు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch