24 Mar 2025
a) కృష్ణావతార రహస్యము: శ్రీకృష్ణుని స్మరించగానే ఆయనలో మనకు మూడు దోషములు వెంటనే గోచరించి ఆయన దైవత్వమును శంకించుటకు కాని లేక నిరాకరించుటకు కాని దోహదము చేయును. మానవునకు దోషదర్శనము చాలా శీఘ్రముగా కలుగుచున్నది. ఈ మూడు దోషములు ఏమనగా –
ఈ విషయములో ఇతర మతములు కూడా హిందూ మతమును తప్పు పట్టుచున్నవి. దీనికి కారణము కృష్ణుని కేవలము బాహ్య పరిశీలనతో అపార్థము చేసుకుని ఆయన యొక్క అసలు తత్త్వమును పరిశీలించ లేకపోవుటయే. ఈ గోపికలు గత జన్మలో బ్రహ్మర్షులు. వీరు స్వామిని పరిపూర్ణముక్తి కొరకు అర్థించినారు.
b) ముక్తి: ముక్తి అనగా బంధముల నుండి బయటపడుట. ఈ బంధములలో ఇనుపసంకెళ్ళ వంటి మూడు బంధములను ‘ఏషణాత్రయము’ అందురు. అవి ధనేషణ, పుత్రేషణ మరియు దారేషణ. అనగా ధనముతోను, తన సంతానముతోను, మరియు భార్యాభర్తలలోను కలుగు ఆకర్షణములే ఈ మూడు ఏషణలు. వారు కోరిన ప్రకారముగా వారికి స్వామి ఏషణాత్రయము నుండి పరిపూర్ణముక్తిని ప్రసాదించినారు. వారి కష్టార్జితధనమైన వెన్నను దొంగిలించి వారి ధనేషణను త్రెంచినారు. వారి సంతానమును ఆకర్షించి, ఆ పిల్లలు తమ తల్లిదండ్రుల మాటలు వినక కృష్ణుని మాటలనే వినుచున్నందున వారి పుత్రేషణా బంధము తెగినది. ఇక వారిని ఆకర్షించి వారితో నృత్యము చేయుట ద్వారా వారి పతి బంధములను తెంచినారు. బంధములు తెగుటకు కారణము స్వామితో ఏర్పడిన కొత్తబంధము కావలయును గాని నిష్కారణముగా సంసారబంధములు తెంచుకొనుట వ్యర్థము.
స్వామిపై ఏర్పడిన బంధము ఒక్కటియే మిగిలి, అన్ని మిగతా బంధములు నశించవలయును. ఒక రాతికి ఎట్టి సంసారబంధములు లేవు. దాని వైరాగ్యము వలన ప్రయోజనమేమి? దానికి స్వామితో బంధము లేదు కదా. బ్రహ్మర్షులు గోపికలుగా పుట్టిన బృందావనములోనే శ్రీ కృష్ణుడు ఈ మూడు పనులు చేసినాడు. కాని బృందావనమును వదిలిన తరువాత ఇట్టి పనులను ఎక్కడను చేయలేదు. దానికి కారణము ఆ ఋషులు తప్ప ఏ ఇతర జీవుడును అట్టి ఏషణాత్రయ ముక్తి కొరకు స్వామిని యాచించలేదు. అట్టి ముక్తిని గోపికలకు అనుగ్రహించిన తరువాత తన పని ముగిసినది కావున మరల బృందావనమునకు స్వామి రాలేదు. ఈ ప్రత్యేక కారణము లేకున్నచో, శ్రీకృష్ణునకు ఇట్టి దుర్గుణములే స్వభావసిద్ధమైనచో ఈ పనులను బృందావనమునకు బయటచేయుట కాని లేక కనీసము అట్టి భోగముల కొరకు బృందావనమునకు తిరిగి వచ్చుట కాని స్వామి చేసి ఉండవలెను.
c) నివృత్తి: ఈ ఋషులు నివృత్తి అనబడు మోక్షమార్గములో స్వామిని తప్ప ఇతర వస్తువులను గాని, ఇతర వ్యక్తులను గాని, ఆశించిన వారు కారు. కావుననే స్వామి బృందావనము నుండి వెడలిపోయిన తరువాత వారు స్వామి కొరకు ఉన్మాదముతో బృందావనముననే సంచరించిరి.
d) క్రీస్తు ప్రభువు: ఒకసారి క్రీస్తు ప్రభువును విలువైన సుగంధముతో ఒక స్త్రీ అర్చించుచుండగా క్రీస్తు శిష్యుడు దానిని విమర్శించెను. ఆ సుగంధము యొక్క విలువతో బీదలకు అన్నదానము చేయవచ్చును కదా అని క్రీస్తు యొక్క వ్యక్తిగతసేవను ఆక్షేపించెను. క్రీస్తు, శిష్యుని మందలించి, ఆమె సేవను గ్రహించెను. దానికి కారణము ఆమె పరమాత్మ యొక్క వ్యక్తిగత సేవయను నివృత్తి మార్గములో యున్నది. ఆమెకు ప్రభువు మాత్రమే కావలయును. అట్టివారు స్వామి తప్ప లోకసేవను ఆశించరు. వారు స్వామి కొరకు అధర్మమునే గాక ధర్మమును సైతము పరిత్యజించగలరు. ఇట్టివారు శాశ్వతమైన బ్రహ్మలోకమును పొందెదరు. వారు స్వామిని తప్ప ఏవ్యక్తిని, ఎట్టి వస్తువును ఆశించక, స్వార్థమన్నది లేక ఉందురు. ఒక ధనవంతుడు కూడ ఈ సుగంధమును ఒక స్త్రీ పూయుచుండగా ఆనందించుట గలదు. కానీ ఆ ధనికుడు క్రీస్తుతో సమానుడు కాడు. క్రీస్తు చిట్టచివరి ప్రభువు. ఆయన మరియొక ప్రభువును ఆనందింపచేయనక్కరలేదు.
భగవంతుడైన ఆయన ఆనందము ఆ స్త్రీని రక్షించినది కాని ధనికుని ఆనందము కాదు కదా, అతను ఒక జీవుడే గదా. అతడు కూడ తనకన్న ఎంతో అధికుడగు ప్రభువును ఆనందింపచేయుటయే లక్ష్యముగా కలిగియుండవలెను. కాని స్వార్థము కొరకు తన ఆనందము అతనికి లక్ష్యము కాకూడదు. ఆ ధనికుని ఆనందము అతడికి సేవ చేయుచున్న స్త్రీని రక్షించలేదు. ప్రవృత్తికి సంబంధించిన ఒక ధనికుడు క్రీస్తును సమీపించినపుడు, క్రీస్తు ఆ ధనికుని ధనమును బీదలకు దానము చేయమని చెప్పినాడే కాని అతడిని సెంటు తెచ్చి తనకు పూయమనలేదు. ప్రవృత్తి మార్గములో వారు అనిత్యమగు స్వర్గసుఖమును మాత్రమే పొందగలరు. ఈ విధముగా ప్రతి దైవచర్యకును వెనుక ఎంతో నిగూఢమైన అంతరార్థము ఉన్నది. దీనిని అర్థము చేసుకొనలేనివారు క్రీస్తు సుందరమైన స్త్రీ యొక్క మృదువైన హస్తస్పర్శను ఆశించిన స్త్రీలోలుడని విమర్శించెదరు.
డాన్ బ్రౌన్ రచించిన ‘డా విన్సీ కోడ్’ అను గ్రంథములో క్రీస్తు ‘మేరి మాగ్డలిన్’ అను స్త్రీని వివాహమాడి ఆవిడ ద్వారా సంతానమును కూడ కలిగినాడని ప్రతిపాదించినాడు. కృష్ణుడు మరియు మహమ్మద్ బహుభార్యలను కలిగియుండిరి. బుద్ధుడు కూడ వివాహితుడే. శంకరుడు బ్రహ్మచారి. కాని ఒక పండితవివాదములో కామశాస్త్ర జ్ఞానము అవసరమైనందున దానిని అనుభవపూర్వకముగా సంపాదించినాడు. కావున ప్రభువు సద్గురువుగా వచ్చినపుడు వివాహితుడా కాదా అను విషయము ఏ విధముగను ప్రాధాన్యత లేనిది. అగ్నిలో ఏ కట్టెయు వికారము చెందజాలక దానిలో భస్మమగును. ప్రభువు నరావతారమున వచ్చినపుడు విశ్వములో గల సర్వగుణములతోను క్రీడించును. సర్వగుణములతో కూడిన ఈ విశ్వమును ప్రభువు తన లీలావినోదము కొరకై సృష్టించినాడు. సాతాను కూడా ప్రభువుచే సృష్టించబడినవాడే.
ఒక సినిమాకథలో ‘విలన్’ పాత్ర కూడా కథలో భాగమైన సృష్టించబడును కదా! ఆ విలన్ పాత్రధారికి కూడా వేతనము అందించబడుచున్నది. ప్రభువు యొక్క ఆనందము కొరకు ఉపయోగించబడు ప్రతి గుణము సద్గుణమే. ఆయనకు కోపము తెప్పించు ఏ గుణమైనను దుర్గుణమే. కావున ప్రభువు వైపునకు మరలించబడునది అంతయును పవిత్రమే. జీవుడు తన స్వార్థము కొరకు మరలించుకున్నది ఏదైననూ అపవిత్రమే. దీనికి కారణము ఏమనగా జీవునితో సహా ఈ సృష్టి అంతయు ప్రభువు యొక్క ఆనందవినోదమునకే సృష్టించబడినది. సాతాను కూడా భక్తుల విశ్వాసమును పరీక్షించుటలో తన పాత్రను సక్రమముగా పోషించుచున్నాడు. కావున సాతాను ఆకర్షణమును నీవు ద్వేషించవలయునే గాని సాతానును కాదు. అందుకే క్రీస్తు ‘పాపమును ద్వేషించుము కాని పాపిని ద్వేషించవలదు’ అని బోధించినాడు.
e) గుణములు: గుణాతీతుడైన ప్రభువు క్రీడించునపుడు ఈ గుణములను తన వశములో ఉంచుకొని వాటి చేత ఎట్టి వికారమును పొందక వాటిని తన క్రీడాసాధనముగా ఉపయోగించుకొనుచున్నాడు. కాని గుణస్వరూపుడైన జీవుడు ఈ గుణములకు వశుడై ఈ సగుణములచే వికారమును పొందుచూ ఆ గుణములకు తాను క్రీడాసాధనముగా మారి వాటిచేత ఆడుకొనబడుచున్నాడు. అయోగ్యుడు తనను సమీపించకుండునట్లు ప్రభువు ఈ దుర్గుణములను మాయగా కప్పుకొనుచున్నాడు. మరియు ఈ దుర్గుణములను ఉపయోగించి భక్తుల యొక్క స్థిరవిశ్వాసమును కూడ స్వామి పరీక్షించుచున్నాడు. ఈ రెండు ప్రయోజనములే కాక స్వామి ఈ దుర్గుణములనే ఉపయోగించి గోపికలకు పరిపూర్ణముక్తిని ప్రసాదించినాడు. కావున ఏ జీవుడును స్వామి తత్త్వమును యదార్థముగా తెలియజాలడు. స్వామిని చాలా సులభముగా అపార్థము మాత్రమే చేసుకొనగలడు.
To be continued...
★ ★ ★ ★ ★