home
Shri Datta Swami

 25 Mar 2025

 

స్వామి జ్ఞానము నుండి కొన్ని వజ్రాలు (Gems: f to l)


Gems: a-e   f-l   m-n   o   p


f) రాధ: బృందావనములో రాధను మొట్ట మొదటి సారిగా రహస్యముగా వివాహమాడి ఎంతో ప్రాణాధికముగా ప్రేమించినాడు. కాని పెండ్లి అయిన రెండు సంవత్సరములలోనే బృందావనమును వదలి ఒక్కసారియైనను రాధను చూచుటకు రాక వేలకొలది స్త్రీలను వివాహమాడి ఆనందముతో యుండినాడు. ఇంత దుర్గుణ పరాకాష్ఠను ప్రదర్శించుటలో ప్రభువు యొక్క ఆంతర్యమేమి? ఇట్టి పరిస్థితిలో స్త్రీస్వభావసిద్ధమైన అసూయా గుణములు రాధకు ఎంతో రావలసియున్నవి. కాని ఆమె అణుమాత్రమైనను అసూయను పొందక స్వామినే స్మరించుచూ, పిచ్చితో భ్రమించుచూ మరణించినది.

‘బృందావనమున మండుటెండలో
ఇసుక రేణువుల నిప్పుల కణముల
నడుచుచు మాధవ మాధవ యనుచును
విలపించి రాధ ప్రాణము విడచెను’.

g) కృష్ణుడు: కృష్ణుడు గీతను బోధించునపుడు క్రీస్తుగా కనిపించును. వెంటనే కురుక్షేత్రములో దుష్టసంహారము చేయునప్పుడు మహమ్మదుగా కనిపించును. క్రీస్తు కూడా పాపులను నిత్య నరకములో పడవేయుదునని శిక్షాగుణమును ప్రదర్శించినాడు. అట్లే ఖురానును చెప్పి మహమ్మదు జ్ఞానబోధకుడని నిరూపించుకున్నాడు. బుద్ధుడు కూడ కోరికను తెంచుకొననిచో దుఃఖముతో జీవుడు అల్లాడునని నరకతత్త్వమును సూచించినాడు.

కావున అన్ని నరావతారములలోను జ్ఞానము, కరుణ అను సద్గుణములు; పాపుల యెడ క్రౌర్యము అను దుర్గుణము సమానముగా కనిపించుచున్నది. ఈ గుణములు అవసరమును బట్టి తగుపాళ్ళు వ్యక్తమగుచుండును. నరావతారములోను, విశ్వములోను నున్న పరమాత్మ ఒక్కడే. అద్దముల సైజు వేరుగనున్ననూ వాటిలో ప్రతిబింబించు వస్తువు పరిమాణము ఒక్కటే. అవతారము యొక్క నరశరీరము మరియు విశ్వము పరస్పరము పరిణామములో తేడా కలిగియున్నవి. కాని విశ్వము మరియు నరశరీరములో కల తత్త్వముల సంఖ్య ఒక్కటియే. ఈ తత్త్వములు పంచభూతములు మరియు అంతఃకరణములు అను నవావరణములే. ఇందులో మనస్సు అను అంతఃకరణము యొక్క స్వభావమే సర్వగుణములు.

రాజు పెద్ద భవంతిలోనున్ననూ, చిన్న ఇంటిలోనున్నను ఒక్కడే. పెద్ద భవంతియు మరియు చిన్నఇల్లు రెండునూ ఒకే పదార్థములతో నిర్మింపబడినవి. కావున నరావతారములోనున్న స్వామియు అనంతవిశ్వములోనున్న ఈశ్వరుడును ఒక్కడే. దానినే విశ్వరూపము ద్వారా శ్రీకృష్ణుడు బోధించినాడు. కావున విశ్వములోనున్న సర్వ సద్గుణ, దుర్గుణములు స్వామి యొక్క శరీరములో ఉండియే తీరవలయును. ఇందులో సద్గుణములు సత్త్వగుణములను పేరుతో 1/3 వంతు మాత్రమే ఉండును. 2/3 వంతులు దుర్గుణములు రజ స్తమో గుణములు. కావున విశ్వము యొక్క పరిపూర్ణతత్త్వము తన నరశరీరములో ఉన్నప్పుడే స్వామి విశ్వరూపధారి అనబడును. కేవల సద్గుణములే తన శరీరములో ఉన్నచో ఆయన కేవలము విశ్వములో మూడవభాగమును మాత్రమే ధరించుచున్నాడు. కావున విశ్వరూపధారి కాజాలడు. అయితే అవసరమును బట్టియే ఈ గుణములను వ్యక్తము చేయుచున్నాడు. వ్యక్తము చేసినంత మాత్రమున ఆయనకు మిగిలిన గుణములు లేవని కాదు. విష్ణువు సత్త్వగుణము, బ్రహ్మ రజోగుణము, శివుడు తమోగుణము. ఏ గుణమూ మిగిలిన రెండు గుణములు లేక శుద్ధముగా ఉండజాలదని వేదాంతశాస్త్ర వచనము.

విష్ణువు కేవల సత్త్వగుణమే. ఆయన నరసింహావతారమున, రజోగుణమగు క్రోధమును ఎంతో కలిగియున్నాడు. దత్తుడనగా భక్తలోకమునకు అందించబడిన ప్రతి నరావతారము. అట్టి నరావతారము త్రిగుణములతో కలసి ఉండుటచేత త్రిగుణాత్మకము లేక త్రిమూర్త్యాత్మకము అనబడుచున్నది. అంతే కాని మూడు తలలతో ఉన్న ఒక వికారము దత్తుడు కాడు. దత్తుడు ఎప్పుడును ఏకముఖమే. ఆయన ఆరు చేతులు ఆయన శరీరమునకు గల జననమరణాది ఆరువికారములను సూచించుచున్నవి. కావున త్రిగుణములను ప్రదర్శించిన ఏకముఖుడు, ద్విబాహువు. ఆయన కృష్ణాది నరావతారమే పరిపూర్ణదత్తుడు. దత్తావతారమైన శిరిడి సాయికి కోపము వచ్చినపుడు భయంకరుడై పిచ్చిబూతులు తిట్టెడివారట. కావున ఈ విధముగా స్వామి యొక్క త్రిగుణమాయను తెలుసుకొని దత్తుని గుర్తించి పట్టిన పట్టు విడువరాదు.

Swami

h) భగవద్గీత: గీతలో మనుష్యశరీరమును ఊహలకు సైతము అర్థము కాని పరమాత్మ ఆశ్రయించి అవతరించినాడని చెప్పబడియున్నది. ఈ మనుష్యశరీరము మూడు శరీరములుగా విభజించబడియున్నది. ఇందులో బాహ్యమైన పంచభూతాత్మకమైన తమోగుణమైన స్థూలశరీరము కోటు వంటిది. దాని లోపల చొక్కావలెనున్న సూక్ష్మశరీరము క్రియాత్మకమైన రజోగుణమైన సంస్కారముల రూపముతో ఉన్నది. దానిలో బనీను వలె శుద్ధచైతన్య స్వరూపమైన సత్త్వగుణమైన ‘జీవ’నామధేయము కల పరాశక్తి స్వరూపమైన ‘ఆత్మ’ అనబడు కారణశరీరమున్నది. ఈ ఆత్మ అతిసూక్ష్మమైనందున అనూహ్యమైన పరమాత్మకు సన్నిహితముగా ఉండును. ఈ పరాశక్తియగు సాత్త్వికమాయ, శరీరములో ఒక భాగమైనను, పరమాత్మకు సహచారిగా ఉండి వినోదమును కల్పించుచున్నది. ఈ పరాశక్తియే జగత్తును సృష్టించి, ఆడించి, తుదకు తనలో లయింపచేసుకొని చివరకు పరమాత్మతో అవ్యక్తస్వరూపముగా లయించుచున్నది.

i) లయము: లయము అనగా అసలు లేకపోవుట కాదు. అతిసూక్ష్మస్థితిలో ఉండుట. అయితే అసలు సృష్టికి పూర్వము ఈ పరాశక్తియు జగత్తుతో సహా లేదనియు, కేవలము పరమాత్మయే ఉన్నదనియు ‘ఏకాకీ న రమతే’ అని వేదవచనము చెప్పుచున్నది. కాని అట్టి అద్వైతము ఇక రాదు.

j) సినిమా: సినిమా నిర్మించక మునుపు ఫిల్ము కూడా లేదు. కాని సినిమా ఆట ముగిసిన తరువాత ఎవడును సినిమాఫిల్మును ధ్వంసము చేయుట లేదు. ఆ సినిమా, ఫిల్ములో అతిసూక్ష్మ రూపములో అవ్యక్తస్థితిలో ఉన్నది. మరల కావలసినపుడు సినిమా అను జగత్తు వ్యక్తమగుచున్నది. కావున పరమాత్మ నరశరీరములో ప్రవేశించినపుడు తాను ఈశ్వర తత్త్వములో ఉన్నప్పటికిని తనకు సేవచేయు జీవుడనబడు నరతత్త్వము కూడ శరీరభాగమై తనతోనే ఉన్నది. ఈ సహధర్మచారిణి అగు సాత్త్వికమాయయనే తన ప్రకృతిని తాను అధిష్ఠించి అవతరించుచున్నానని ‘ప్రకృతిం స్వామవష్టభ్య...’ అను వచనము ద్వారా గీతలో చెప్పియుంటిని. ఇట్టి నర-నారాయణ మిశ్రమతత్త్వమే నరావతారము.

k) నరరూపము: నరరూపములో పరమాత్మ రాడని నీవు వాదించినచో పరమాత్మ సర్వశక్తిమంతుడు కాడని నీవు చెప్పక చెప్పినట్లే అగును. సర్వశక్తిమంతుడు అగు పరమాత్మ నరరూపములో రాగల శక్తి కూడా కలిగియే యున్నాడు. అయితే  శక్తి యున్నను అట్లు ఉపయోగించ అవసరము లేదని నీవు వాదించుట సరికాదు. ఏలననగా ఈ లోకమున నరరూపమున వచ్చి జ్ఞానబోధను చేసి భక్తుల సంశయము తీర్చు అవసరము ఎంతో ఉన్నది.

l) విగ్రహములు: విగ్రహములు కాని, పటములు కాని జ్ఞానబోధ చేయుట ప్రత్యక్ష విరుద్ధము (against perception). ఎచ్చటనో జరిగిన ఒకానొక అద్బుతము అందరికిని అనుభవములోనికి రాదు. కాని, జ్ఞానబోధ సర్వజీవులును పొందవలసియున్నదియే. అట్లే తేజోరూపముల ద్వారా పరమాత్మ జ్ఞానబోధ చేయుట మనకు ప్రత్యక్ష అనుభవములో లేదు. ఎవరికో వ్యక్తిగతముగా జరిగిన అనుభవము సర్వజీవుల అనుభవ సిద్ధము కాదు. కాని పరమాత్మ నరాకారములో కృష్ణుడిగా, క్రీస్తుగా వచ్చినపుడు జ్ఞానబోధ చేయుట అందరికిని ప్రత్యక్షముగా అనుభవసిద్ధమై యున్నది.

To be continued...

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch