26 Mar 2025
m) జ్ఞానబోధ: ప్రకృతి నియమములను అనుసరించియే ఇట్లు జ్ఞానబోధను చేయుటకు అవకాశము ఉన్నప్పుడు పరమాత్మ దానిని ఉపయోగించుకొనును. ప్రకృతిసిద్ధముగా సులభముగా ఒక పనిని సాధించుకొనుట వివేకవంతుని లక్షణము. ఒక పని సులభముగా నెరవేరినపుడు దానిని కష్టసాధ్యమైన మార్గములో ఏల చేయవలయును? నీరు పంపు నుండి ధారాళముగా లభించునప్పుడు దానిని వదలి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వాయువులను తీసుకొని కష్టపడి విద్యుత్ వలయముతో ఆ రెండింటికి మధ్య చర్యలు కలుగచేసి నీటిని ఏల సృష్టించవలయును? ఇట్టి ప్రయోగము సిద్ధాంతమును నిరూపించుటకు ఒకసారి చేయవచ్చునే కాని, మాటిమాటికి ఉపయోగించు నీటి కొరకు చేయనేల? ఇదే ప్రయోగము ద్వారా ప్రకృతి ఆకాశములో నీటిని సృష్టించి అందించుచున్నది. ప్రకృతి ఇట్టి సేవను చేయుటకు సిద్ధమై యుండగా దానిని తిరస్కరించి అదే పనిని ప్రకృతికి అతీతమైన మార్గముతో ఏల చేయవలయును?
ప్రమాణ సమ్మతము ఏ భక్తునికో ఎచ్చటనో, ఎప్పుడో ఒక విగ్రహము నుండి కాని, తేజోరూపము నుండి గాని, నిరాకారమైన శూన్యము నుండి కాని ఒక వాక్కు వినిపించి ఉండవచ్చును. అంత మాత్రమున భగవంతుడు వీటి ద్వారా అందరికిని జ్ఞానబోధ చేయునని భావించరాదు. ఏ భక్తునికో జరిగిన అట్టి అనుభవము విజ్ఞానవేత్తలు (scientists) ప్రమాణముగా అంగీకరించరు. ఏలననగా అట్టి అనుభవము జరిగినపుడు అదే సమయములో అందరికి ఆ అనుభూతి లభించలేదు గదా. నీవు ఆకాశములో చంద్రుని చూచినపుడు అదే సమయములో అదే చంద్రుని ఇతరులును చూచుచున్నారు. కావున నా చంద్రదర్శనము ప్రమాణ సమ్మతము. కాని నా ఒక్కనికే చంద్రుడు కనిపించుచు, ఇతరులకు కనిపించనిచో ఈ చంద్రదర్శనము ప్రమాణ సమ్మతము కాదు.
అప్పుడు నాకు జరిగిన చంద్రదర్శనము నాకు కల మానసికభ్రమ వలన కూడా జరిగి ఉండవచ్చునని విజ్ఞాన వేత్తలు పలుకుచున్నారు. ఇట్టి మానసికభ్రమ లోకములో ఉండుట కూడ సత్యమే కదా. నా అద్భుతానుభవము నిజముగనే నా భక్తి మూలముగా జరిగినదో, లేక నాకు కలిగిన మతిభ్రమణము వలన కలిగినదో ఎవ్వరును తేల్చి చెప్పజాలరు. కావున నా అనుభవము మిగిలిన వారికి కూడ అదే సమయములో అనుభవాన్ని కల్గించినచో అదియే సర్వసమ్మతమైన ప్రమాణము. ఆ పై సర్వసమ్మతమైన ప్రమాణము నరాకారము ద్వారా స్వామి జ్ఞానబోధ చేయుచున్నప్పుడే సిద్ధించుచున్నది. ఏలననగా, నీవు జ్ఞానబోధను విను సమయములోనే అందరు ఆ జ్ఞానబోధను వినగలుగుచున్నారు.
ఒక ప్రవక్త తాను దేవదూతననియు, భగవంతుడు తన ద్వారా జ్ఞానమును పంపినాడనియు చెప్పినప్పుడు కూడ ఇదే సమస్య ఎదురగుచున్నది. భగవంతుడు అతడికి ఆ జ్ఞానమును ఇచ్చుట ఎవ్వరునూ చూడలేదు. దానికి అతడే ఏకైక సాక్షి. అతడు మహాభక్తుడై కూడ ఉండవచ్చును. కావున అతడు చెప్పిన మాటలు కూడ నిజమే కావచ్చును. కాని అదే సమయములో అతడు మతిభ్రమణమును పొంది అట్లు పలుకుచున్నాడని చెప్పుటకు కూడ సమానమైన అవకాశము ఉన్నది. ఈ రెండు అవకాశములను ఎవరును వేరు చేయలేరు. సాధారణముగా ఒక వస్తువును ఒక దూత ద్వారా పంపినపుడు ఆ వస్తువులో ఎట్టి మార్పురాదు. కాని ఒక గురువు జ్ఞానమును అందించమని తన శిష్యుని తన క్లాసునకు పంపినపుడు ఆ జ్ఞానము బోధించు నైపుణ్యము గురువు వలె ఆ శిష్యుడు కలిగియుండజాలడు.
కావున జ్ఞానమును బోధించునపుడు పరమాత్మయే స్వయముగా తప్పక నరరూపమున దిగివచ్చును. అట్టి పరమాత్మ తన యొక్క యథార్థస్థితిని గురించి చెప్పుకొనుట శ్రోతల యొక్క స్థాయిపై ఆధారపడి యుండును. అర్జునుడు అసూయను, అహంకారమును జయించి పరిపూర్ణ శరణాగతి చేసినాడు. కావున కృష్ణుడు తానే భగవంతుడనని, తనకే నమస్కరించమని, తననే భజించమని చెప్పినాడు. ‘మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు’ అని గీతా శ్లోకములో చెప్పినాడు. కాని తరువాత వచ్చిన క్రీస్తు తానే భగవంతుడనని కొందరితోను, తాను దైవకుమారుడనని కొందరితోను, తాను దైవదూతనని కొందరితోను వారి వారి స్థాయిని బట్టి చెప్పినాడు. ఆ తరువాత వచ్చిన మహమ్మద్ తాను కేవలము దైవదూత అని పలికినాడు.
n) ఆధ్యాత్మిక స్థాయి: కాలక్రమేణ మానవుల యొక్క ఆధ్యాత్మిక స్థాయి దిగజారి అసూయ, అహంకారము, వృద్ధి చెందినదనుటకు ఇది చక్కని నిదర్శనము. సత్త్వగుణము అగు వినయము శరణాగతి నశించి, క్రమముగా రజోగుణ, తమోగుణములగు అసూయ, అహంకారములు ప్రబలుట వలన దైవము యొక్క వాక్కు ఈ విధముగా కాలానుగుణముగా మారవలసి వచ్చినది. సాటి మానవరూపములో ఉన్న దైవమును గుర్తించి, సేవించు సత్త్వగుణమును సంపాదించుకొనుటకై ముందుగా సమస్త మానవజాతికి సేవచేయమని బుద్ధుడు ప్రబోధించినాడు. ఇది ఒక శిక్షణ వంటిది.
అసూయ రజోగుణము, అహంకారము తమోగుణము. ఒకవైపు కృష్ణుడు తానే భగవంతుడనని పలుకుచుండగా, మరియొక వైపు మహమ్మద్ తాను దైవదూతను మాత్రమే అని పలుకుచున్నాడు. ఈ ఇద్దరి మధ్య వారధి వలె ఉన్న క్రీస్తు ఒకసారి తాను దైవమని అద్వైతమును, మరియొకసారి తాను దైవకుమారుడనని విశిష్టాద్వైతమును, మరియొకసారి తాను దైవదూతను మాత్రమేనని ద్వైతమును, మూడు విధములుగా పలికియున్నాడు. ఇట్లు మూడు విధములుగా పలుకుట వివిధ స్థాయిలలో నున్న భక్తులతో సంభాషించుటకే, పూర్తిగా సత్త్వగుణమును కలిగిన వారితో అద్వైతమును, కొంత రజోగుణ, తమోగుణములు కలిగిన వారితో విశిష్టాద్వైతమును పలికినాడు. పూర్తిగా రజోగుణ, తమోగుణము కలిగినవారితో ద్వైతమును పలికినాడు. ఈ మూడు మతములు హిందూమతములో కూడ ఉన్నవి. కావున హిందూ, క్రైస్తవ మతములు అన్యోన్య ప్రతిబింబములు. మహమ్మద్ చెప్పినది కేవలము ద్వైతమతము.
కృష్ణుడు చెప్పిన నిష్కామ కర్మయోగమను మార్గమునే బుద్ధుడు మరల మరల చెప్పినాడు. మార్గమును ప్రయోగించినచో గమ్యము తప్పక లభించును. మార్గము ముఖ్యము కావున గమ్యమైన దైవము గురించి మౌనమును వహించి, మార్గమునే బుద్ధుడు బోధించినాడు. ఇట్టి మార్గమునే ‘ధర్మపథము’ అను శబ్దముతో సూచించినాడు. ఇట్లు ధర్మమును శరణము పొందుట అనగా స్వార్థమును త్యజించుటయే. ఇక సంఘసేవను బుద్ధుడు ముఖ్యముగా ప్రతిపాదించినాడు. ఇందులో మానవులను సేవించుట ద్వారా సాటి మానవరూపమును సేవించుటలో వచ్చు అహంకారమును, అసూయను తగ్గించుకొనుటయే లక్ష్యము. ఇట్టి శిక్షణ అయిన తరువాత మానవరూపమున ఉన్న పరమాత్మను సేవించుట సులభము. ఇట్టి స్థితిలో నరావతారమున ఉన్న బుద్ధుని శరణము పొందవలెను. ఈ విధముగా బుద్ధుడు ధర్మము, సంఘములను శరణాగతి చేయమని చెప్పుటలో అదే తత్త్వమును ప్రతిపాదించినాడు. కావున కృష్ణుడు చెప్పినది బుద్ధుడు బోధించినదీ ఒక్కటే. బుద్ధుడు విష్ణువు యొక్క దశావతారములలో ఒక అవతారము. దీనిని అర్థము చేసుకొనక బౌద్ధులు నాస్తికులగుట ఎంతో దురదృష్టము.
ఈ నాలుగు నరావతారములతో పాటు ఒక విజ్ఞానవేత్త చిత్రము కూడ ‘యూనివర్సల్ స్పిరిట్యువాలిటీ’ యొక్క ముఖచిత్రమున ఉన్నది. ఈ విజ్ఞానవేత్త సాధకుడుగు జీవుని సూచించుచున్నాడు. అనగా సాధకుడు మార్గము నిర్ణయించుకొనుటలో కాని, గమ్యమగు సద్గురు స్వరూపముగ వచ్చిన నరావతారమును గుర్తించుటలో కాని అంధవిశ్వాసమును కలిగియుండరాదు. గమ్యమును గుర్తించి స్థిరపరచుకొన్న తరువాత మాత్రమే అట్టి అచంచలమైన అంధవిశ్వాసమును కలిగియుండవలెను. అప్పుడు కూడ సద్గురువును తర్కములో చర్చించినచో ఆయన రజోగుణ, తమోగుణ ప్రదర్శనముతో జీవుడు జారిపోవుచున్నాడు. గమ్యము చేరువరకే తర్కము ఉండవలెను. గమ్యము చేరిన తరువాత అది తర్కాతీతము. కావున తర్కమును ప్రదర్శించరాదు. మార్గములో అంధవిశ్వాసము, గమ్యము వద్ద తర్కము ప్రదర్శించిన వారు జారిపోవుచున్నారు.
విగ్రహములు, పటములు, తేజోరూపములు కాని, నిరాకారమైన శూన్యము కాని జ్ఞానబోధను చేయగల సద్గురు స్వరూపములు కావు అని నిర్ణయించుట, తనకు కేవలము మానవరూపమే జ్ఞానబోధను చేయగలదు అని నిర్ధారించుట ద్వారా తాను ప్రకృతి నియమములను అనుసరించిన తర్కమగు విజ్ఞానమును అనుసరించవలెను.‘విజ్ఞానం యజ్ఞం’ అని శ్రుతి. విజ్ఞానము దైవమార్గములో పవిత్రము. ఒకే సమయమున అందరును జ్ఞానబోధను పొందుదురు. కాన నరావతారమే సర్వసమ్మతమైన సద్గురు స్వరూపము అని నిర్ణయించుటలో విజ్ఞానశాస్త్రము యొక్క సహాయమును పొందవలెను.
వేదములో కూడ ఆత్మయను శబ్దము, నరావతారమునే సందర్భమును బట్టి చెప్పుచున్నది. ఆత్మయనగా స్థూలమైన నరశరీరము అని సంస్కృతములో అర్థము ఉన్నది. కావున శుద్ధచైతన్యమైన ఆత్మ మరియు దాని వికారములగు గుణముల యొక్క సంఘాతమైన (bundle of qualities) సూక్ష్మశరీరము (subtle body) మరియు బాహ్యస్థూలశరీరము కూడ ఆత్మ శబ్దమునకు అర్థములై చివరకు ఆత్మయనగా ముందు చెప్పిన ఈ మూడు శరీరములే భాగముగా గల నర శరీరము అను ఏకార్థమును కలిగియున్నవి. బైబిల్ లో క్రీస్తు మరలవచ్చును అన్నప్పుడును, భగవద్గీతలో అవసరమైనప్పుడు తాను అవతరిస్తానని చెప్పిన కృష్ణుని మాటలలో గల అంతరార్థమును గమనించినపుడు - ఒక్క మనుష్య తరమునకు మాత్రమే వచ్చి, దేవుడు పక్షపాతమును చూపినాడను ఆక్షేపణ తొలగుచున్నది. ప్రతి నరుడు పరమాత్మ అయినచో, పరమాత్మ అవతరించవలసిన పని ఏమున్నది?
To be continued...
★ ★ ★ ★ ★