home
Shri Datta Swami

 27 Mar 2025

 

స్వామి జ్ఞానము నుండి కొన్ని వజ్రాలు (Gems: o)


Gems: a-e   f-l   m-n   o   p   q   r


o) నరావతారము: నరావతారమును గుర్తించుటకు కేవలము ఆ సద్గురువు బోధించు జ్ఞానమును పరిశీలించియే నిర్ణయించవలెను. ఆ జ్ఞానబోధలో సత్యములైన సమన్వయములు, స్పష్టముగా ఆత్మలోనికి దూసుకొని పోవు బోధన విధానము, అట్టి జ్ఞానము మరి ఏ ఇతర జీవులకు సాధ్యము కాని విశిష్టస్థితిని నిరూపించును. ఇది జ్ఞానామృతము. సత్యసమన్వయములు ‘జ్ఞానము’లను శబ్దము చేతను, స్పష్టమైన అనన్యసాధ్యమైన బోధన విధానము ‘ప్రజ్ఞాన’ శబ్దము చేతను  చెప్పబడుచున్నది. ‘సత్యం జ్ఞానం…, ప్రజ్ఞానం బ్రహ్మ…’ అని చెప్పబడిన ఇట్టి జ్ఞాన-ప్రజ్ఞానములు సద్గురువుకే సాధ్యము కాని ఆయన దూతలకు సాధ్యము కాదు.

Swami

ఒక చిన్న బోధకుడు తానే దైవదూతనని చెప్పినప్పుడు మనము నమ్ముట ఎట్లు? తాను దైవదూతనని చెప్పినప్పుడు అతడు బోధించు జ్ఞానమును బట్టి నిర్ణయించుకొనవలసి వచ్చును. ఆయన చెప్పిన జ్ఞానము దైవజ్ఞానమా కాదా అని పరిశీలించి అది దైవజ్ఞానమని నిర్ణయమునకు వచ్చినప్పుడు ఆ ప్రవక్త దైవదూతయని గాని సాక్షాత్తు దైవమని గాని నమ్మవలెను. అట్లు నిశితపరీక్ష చేసిన తరువాత పరిపూర్ణముగా నమ్మిన తర్వాత ఆయన వద్ద ఇంకా తార్కికమైన విజ్ఞానమును ప్రదర్శించరాదు. ‘నైషా తర్కేణ’ అని శ్రుతి. ఆయనను పరిపూర్ణ, నిశ్చలమైన అంధవిశ్వాసముతోనే సేవించవలెను. గోపికలు బ్రహ్మర్షులు కావున వేద, శాస్త్ర సహాయముతో విజ్ఞానకోశమైన బుద్ధితో తర్కించి, తర్కించి కృష్ణుడే పరమాత్మయని నిర్ధారించినారు. ఇట్లు నిర్ధారణము చేసిన తరువాత కృష్ణుడు ఎన్ని అధర్మములు చేసినను రాధ తన విశ్వాసముతో మనోమయకోశమైన ప్రేమతో ఏ మాత్రము చలించలేదు. రాధ దుర్వాసమహర్షి అవతారము. గమ్యమును తర్కముతో నిర్ధారించుకొనునది బుద్ధి. దానిని అంధవిశ్వాసముతో ప్రేమించునది మనస్సు. ముందు ద్వితీయాధ్యాయమున బుద్ధియోగముతో గీతారంభము జరిగినది కదా.

జీవుల యొక్క మానవ శరీరమును స్పృశించునప్పుడు, ‘లోపలి వ్యక్తి’ అను చొక్కాను స్పృశించినట్లగును. అచ్చట చొక్కా యొక్క స్పర్శ మాత్రమే కలుగుచున్నది. జీవుడు కూడ కారణశరీరమను పేరుతో శరీరభాగమే కావున చొక్కాలోని భాగమే. జీవుడు ఆధేయమే (అనగా ఆధారపడినవాడు) కాని ఆధారము కాదు. కాని నరావతారము యొక్క స్పర్శ చేసినప్పుడు నీవు చొక్కాను స్పృశించినపుడు చొక్కాతోపాటు దానిని ధరించిన ఆధార వ్యక్తిని కూడ స్పృశించినట్లు ఆ పరమాత్మ యొక్క స్పర్శ కూడ నీకు అనుభూతికి వచ్చుచున్నది. నేరుగా నీవు పరమాత్మను స్పృశించుట అసంభవము. పరమాత్మ యొక్క అసలు స్వరూపము వాక్కులకు, ఇంద్రియములకు, మనస్సుకు, బుద్ధికి, తర్కమునకు సైతము అందదు అని వేదములు ఘోషించుచున్నవి. ‘యతో వాచః, మనసా యో బుద్ధేః, అతర్క్యః’. పరమాత్మ నీకు తన దర్శన, స్పర్శన, సంభాషణ, సహజీవన అనుభూతి సందర్శన ద్వారా జ్ఞానమును ప్రసాదించుటకు నీతో సహవాసము చేయుటకు ఏర్పాటు చేసిన ఏకైక మార్గమే నరావతారము.

పరమాత్మ నిర్ణయించిన మార్గము అనుసరించి పరమాత్మ అనుభవమును పొందవలయునే గాని, పరమాత్మను నేరుగా దర్శించుటకు ఎగిరి గంతులు వేసినచో పరమాత్మ ప్రకటితమైనచో నీతో సహ ఈ జగత్తు కూడ లయమైపోవును. ఆయన యొక్క తేజోరూపమే వేయి సూర్యుల యొక్క తేజస్సు అనియు, ఈ కన్నులు చూడలేవనియు గీత చెప్పుచుండగా ఇక ఆయన అసలు స్వరూపము ఊహకే అతీతము. కావున పరమాత్మను నేరుగా దర్శించుటకు గాని, అన్యమార్గములలో అనుభూతిని పొందుటకు ప్రయత్నించుట కాని అవివేకము మూర్ఖత్వము అగును.

To be continued...

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch