28 Mar 2025
p) నరావతారములో వచ్చి బ్రహ్మజ్ఞానమును బోధించు సద్గురువే పరమాత్మ: పరమాత్మ నరరూపములో వచ్చి పరమాత్మను గుర్తించు బ్రహ్మజ్ఞానమును బోధించునపుడు ఆ బోధకుడే పరమాత్మ అను విషయము నీకు స్పష్టమగును. పరమాత్మ కాని వాడు పరమాత్మను గురించి బోధించజాలడు. నన్ను నేను తప్ప ఎవడును తెలియజాలడని గీతావచనము - ‘మాం తు వేద న కశ్చన’. వేదములో కూడ బ్రహ్మమును తెలిసిన వాడు బ్రహ్మము తప్ప అన్యుడు కాడని వినబడుచున్నది. ‘బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి’ అని వేదవాక్యము. బ్రహ్మమును తెలిసిన వాడు బ్రహ్మమే అగునని వాక్యార్థమును చెప్పుచున్నారు. వారి వాక్యార్థము నిజమైనచో, నన్ను నేను తప్ప అన్యుడు తెలియజాలడు అన్న గీతావచనముతో విరోధము వచ్చుచున్నది. శ్రీకృష్ణుడు బ్రహ్మజ్ఞానము చెప్పుచున్నప్పుడు తానే గమ్యమని స్సష్టముగా బోధించినాడు. ఇదే విషయమును జీసస్ కూడా తన తండ్రియు తాను ఒక్కటేనని బోధించినాడు. రాముడు దైవమును గురించి బోధించలేదు. ఏలననగా ప్రవృత్తి మార్గములోనున్న ఒక సామాన్య మానవుడు ఆచరించవలసిన ధర్మమును తాను ఆచరణ ద్వారా బోధించినాడు. హనుమంతుడు కూడ ఒక జీవుడు. నివృత్తి మార్గములో ఎట్లు స్వామిని సేవించవలయునో ఆచరించి చూపించినాడు. ఇట్లు హనుమంతుడు మరియు రాముడు నివృత్తి ప్రవృత్తి మార్గములో జీవుని యొక్క పాత్రను పోషించి చూపించినారు. ఇరువురును జీవులుగా ప్రవర్తించినందున గురుస్వరూపమున గమ్యమును గురించి బోధించు అవకాశము రాలేదు.
కాని కృష్ణుడు గమ్యమును గురించి బోధించుటకు వచ్చిన సద్గురు స్వరూపము. నరావతారములో నారాయణ తత్త్వము మనుష్యశరీరమును ప్రవేశించి సంపూర్ణముగా తీగెను విద్యుత్తు వలె ఆవేశించి ఉండును - ‘వ్యాప్య నారాయణః’. కావున నరావతార శరీరమే సాక్షాత్తు పరమాత్మగా భావించి ఉపాసించవలయునని ఈ వాసుదేవుడే సర్వమని గీతలో బోధించినాడు. ‘వాసుదేవ స్సర్వమితి స మహాత్మా సుదుర్లభః’ అని గీతావచనము. విద్యుత్తుతీగెను విద్యుత్తుగనే చూసినట్లు భక్తులు నరస్వరూపమైన నరావతారుని నారాయణునిగా ఉపాసించవలెను. అయితే నరావతారములో గుణమయమైన సూక్ష్మశరీరము, శుద్ధచైతన్యమైన కారణశరీరములును ‘జీవుడ’ను పేరుతో నరతత్త్వముగా యుండును. ఈ నరతత్త్వమును నారాయణుడు ఆవేశించి ‘మానుషీం తనుమాశ్రితమ్’ అని చెప్పి ఉన్నను ఈ జీవతత్త్వము తను నరుడేనన్న స్మరణతో యుండును. ఈ నరతత్త్వము తానే నిజముగా నారాయణుడని భావించినచో నారాయణుడు తొలిగిపోయి పరశురామునికి వలె గర్వభంగమగును. ఈ జీవతత్త్వము తాను జీవుడేనన్న స్మరణములో నున్నచో, నారాయణుడు ఆ శరీరములో నివసించుట చేత హనుమంతునికి వలె సదా విజయములు కలుగును. దత్తావతారుడైన శిరిడిసాయిలో నున్న ఆ నరతత్త్వము ‘అల్లా మాలిక్’ అని నిరంతరము పలికినది గదా.
కురుక్షేత్రములో గీతను కృష్ణావతార ముఖము ద్వారా నారాయణుడు పలికినాడు. యుద్ధానంతరము పార్థుడు మరల గీతను చెప్పమని బలవంతము చేసినను కృష్ణుడు తానున్న నరతత్త్వములో చెప్పలేనని యదార్థమును వచించినాడు గదా. చివరకు అర్జునుడు మరీ బలవంతము చేయగా ఆ నరతత్త్వమే మరల గీతను చెప్పినది. ఆ గీత ‘అనుగీత’ అను నామముతో భగవద్గీత ముందు సూర్యుని ముందు గుడ్డిదీపమువలె వెలవెల పోయినది. కావున జీవుల దృష్టిలో నరనారాయణుల అద్వైతస్థితి ఉపాసనలో కొనసాగుచుండగా (అనగా భక్తులు ఈ అద్వైతస్థితినే ఉపాసించుచుండవలెనని భావము) అదే సమయమున నరావతారములోనున్న నరతత్త్వము ద్వైతస్థితిలో నుండి అహంకారమును పొందక శరణాగతితో ఉండుట చేత ఆ నారాయణ తత్త్వము నిత్యము దానికి సన్నిహితమై ఆక్రమించి, ఆవేశించి ఉండును. ఇట్లు అవతారములో నరతత్త్వము తనలో ప్రవేశించిన నారాయణతత్త్వమును నిత్యము నిలుపుకొని ఉండును. ఈ నర-నారాయణ తత్త్వములు జడమైన స్థూలశరీరమును ఆశ్రయించి ఉండుటయే వృక్షమును ఆశ్రయించిన రెండుపక్షుల వలె ఉన్నది అని ఋగ్వేదము ‘ద్వా సుపర్ణా’ అను మంత్రము ద్వారా చెప్పుచున్నది.
ఇచ్చట నారాయణుడు నరుడిగా మారలేదు కనుక ‘అవ్యక్తం వ్యక్తిమాపన్నమ్’ అని గీత స్పష్టముగా బోధించినది. కావున దేవుడు నరునిగా మారలేదు. పరిణామము కాలేదు. విద్యుత్ తీగెగా మారలేదు. కావున ద్వైతము నిజమే. కాని భక్తుల దృష్టిలో ఉపాసనలో అద్వైతమే ఉండవలెను. గాని ద్వైతము ఉండరాదు. వీరు విద్యుత్తీగెను విద్యుత్తుగనే భావించవలెను. వస్తుస్థితిని విమర్శించినచో విశ్వాసము నశించును కావున దైవానుభూతి లభించదు. ఆయనను గుర్తించుటలో మాత్రమే తర్కముగాని ఆయనను విమర్శించరాదు. ఆనాడు ‘వాసుదేవ స్సర్వమితి’, మరి ఈనాడు ‘దత్తస్వామీ సర్వమితి’.
నివృత్తిమార్గమును అవలంబించిన బ్రహ్మర్షుల అవతారములగు గోపికలను గురించి చెప్పిన పరమపవిత్ర గ్రంథమే భాగవతము. ఈ భాగవతము పరీక్షిత్తుకు 7 రోజులలో ముక్తిని ప్రసాదించిన ఏకైకగ్రంథము. నివృత్తిలో ధర్మాధర్మములను రెండింటిని అతిక్రమించు భక్తిపరాకాష్ఠస్థితి సామాన్యులు జీర్ణించుకొనజాలరు. కావున భాగవతమును అర్థము చేసుకొనుటయే పండితులకు నిజమగు పరీక్షయని చెప్పబడినది. ఈ నివృత్తిమార్గములో భగవంతుని నరాకారము చాలా ముఖ్యమైనది. జీవుడు ఈ నరాకారమును ప్రేమించి, అర్చించి, సేవించి స్వామి యొక్క ఆత్మీయులై, ఆంతరంగిక సేవకులై శాశ్వతమైన బ్రహ్మలోకమున ప్రవేశించును. కావున నివృత్తి కొరకై నిజముగా నరావతారము వచ్చుచున్నది. ఈ నివృత్తి మార్గములో సర్వబంధములు నశించి కేవలము స్వామిబంధమే మిగులును. జీసస్ తన కొరకు అన్ని బంధములు తుదకు ప్రాణములతో బంధమును సహితము తెంచుకొనవలయునని నివృత్తి మార్గమును గురించి పలికినాడు.
శ్రీకృష్ణుని నిర్యాణానంతరము తమ భర్తలు బ్రతికియున్నను గోపికలు అగ్నిప్రవేశము చేసినారు. ఇక భారతము ప్రవృత్తిగ్రంథము. భారతములో చూపించిన ఈ ప్రవృత్తి మార్గములో కేవలము ధర్మస్థాపనయే ముఖ్యము. దీనివలన అనిత్యమైన స్వర్గసుఖములు మాత్రమే లభించును. కాని, ‘క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి’ అన్నట్లుగా మరల భూమికి తిరిగిరావలెను. ధర్మరక్షణకు పరమాత్మ యొక్క నరస్వరూపము అవసరము లేదు. ఇందులో పరమాత్మ ద్వారా జరుగు ధర్మరక్షణయే ముఖ్యలక్ష్యము గాని, పరమాత్మ కాదు. పాండవులు తమకు జరిగిన అధర్మమును పరిహరించుటకై ధర్మరక్షణ కొరకు పరమాత్మను ఆశ్రయించినారు. ఈ ధర్మరక్షణములో పరమాత్మ యొక్క నిరాకారమైన మాయాశక్తి చాలును. కావున అర్జునుడు నరాకారమున ఉన్న కృష్ణుని కోరుకొన్నను, కృష్ణుడు స్వయముగా యుద్ధము చేయక తన యొక్క అదృశ్యమైన మాయాశక్తితో వారికి ధర్మరక్షణము చేసినాడు. కావున నీకు అన్యాయము జరిగినప్పుడు ధర్మరక్షణ కొరకై నీవు పరమాత్మ యొక్క నరావతారమును అన్వేషించనక్కరలేదు. సర్వవిశ్వ వ్యాపకమైన, నిరాకారమైన ఆయన యొక్క పరాశక్తి స్వరూపమైన మాయాశక్తి చాలును. కావున నీవు నిరాకారమును గాని, విగ్రహపటములను గాని లేక తేజోరూపమును ఊహించి గాని పరమాత్మను ప్రార్థించినచో నీకు ధర్మరక్షణము లభించగలదు. ఈ నరాకారశక్తియే పరాశక్తి లేక పరాప్రకృతి. ఇదే జగత్తుగా పరిణమించి బ్రహ్మమని చెప్పబడినది.
ధర్మము ఓడిపోయినచో ఆయన పరిపాలనకు కళంకము. కావున నీవు ప్రార్థించక పోయిననూ ఆయన తన మాయాశక్తి ద్వారా అధర్మమును నాశనము చేసి ధర్మమును రక్షించుచునే ఉన్నాడు. ప్రవృత్తిపరీక్షలో పాసుమార్కులు తెచ్చుకొనుట. నివృత్తిలో ఫస్టుర్యాంకును తెచ్చుకొని స్వర్ణపతకమును సాధించుట. ప్రవృత్తిలో నీవు అధర్మమును విడచి ధర్మస్థాపనకు సహకరించినచో పరమాత్మ నీయందు ప్రసన్నుడగును. ఇది పరీక్షలో పాసైనచో విద్యార్ధిని చూచి గురువు సంతోషించుట వంటిది. కాని నివృత్తి మార్గములో ఉత్తీర్ణుడైన భక్తుని గురించి ఆనందించుటలో ఆయనకు అవధులుండవు. ప్రవృత్తిలో నీవు ఒక బాహ్యవ్యక్తివి. నివృత్తిలో ఆయన కుటుంబ సభ్యుడవై, ఆత్మీయుడవై, చివరకు ఆయన శరీరములో ఒక అవయవము వలె ఉందువు. ఇట్టి స్ధితిని సంపాదించిన భక్తుడు ‘శేషుడు’ అనబడును. శేషుడు అనగా అవయవము.
కృష్ణనిర్యాణము విన్న పాండవులు గోపికలవలె అగ్నిప్రవేశము చేయలేదు. కాని విరక్తి చెంది మహాప్రస్థానము చేసినారు. రామాయణములో కూడ శ్రీరాముని ఆశ్రయించిన హనుమంతుడు నివృత్తిమార్గభక్తుడు. ఆయనకు రాముడు తప్ప అన్యము అక్కరలేదు. ముత్యాలహారము ఇచ్చిననూ దానిని కొరికి దానిలో రాముడు లేడని విసరి పారవేసినాడు. తన హృదయమును చీల్చి శ్రీరాముని చూపినాడు.
‘ముత్యాలహార మిచ్చిన గాని
రాముడు లేడని కొరుకుచు విసరెను
నఖముల హృదయము చీల్చి చూపెగా
శ్రీరాముని హనుమంతుడటులనే”.
హనుమంతుడు శాశ్వత బ్రహ్మలోకమును పొందినాడు. కాని సుగ్రీవ, విభీషణులు ధర్మరక్షణ కొరకు రాముని ఆశ్రయించిన ప్రవృత్తి మార్గభక్తులు. ఈ ప్రవృత్తి, నివృత్తి కాక మూడవమార్గము ఉన్నది. అది ఏమనగా వేదము ఇట్లు చెప్పుచున్నది. ‘తనకు ఇష్టమైనది అధర్మమైననూ రక్షించబడవలయునని స్వామిని ఆశ్రయించుట, తపము చేసి స్వామి నుండి వరములను పొంది అధర్మపరులైన రాక్షసులే అట్టివారు. ఈ రాక్షసుల అంశలైన కౌరవులు కూడ కృష్ణుని సహాయము కొరకు ఆశ్రయించినారు. వీరు భగవంతుని శక్తిని కోరుదురే తప్ప భగవంతుని కోరరు. దుర్యోధనుడు కృష్ణుని శక్తిస్వరూపమగు సేనను కోరినారు. దానిని వారికి వరముగా ఇచ్చినను తుదకు వారిని నాశనము చేసి వారిని నరకమున పడవేసినాడు. ధర్మరక్షణ కోరిన దేవతాంశలగు పాండవులకు అనిత్యమగు స్వర్గలోకమును ప్రసాదించినారు. దేవతల కన్నను గొప్పవారగు బ్రహ్మర్షులగు గోపికలు భగవంతుని మాత్రమే కోరినందున శాశ్వత గోలోకమును ‘నివసిష్యసి మయ్యేవ’ అని చెప్పినట్లుగా ప్రసాదించినారు. కావున నీవు భగవంతుని ఆశ్రయించినపుడు అధర్మమైనను నీ ఇష్టమును నెరవేర్చుకొను రాక్షసుడవో లేక కేవలము ధర్మరక్షణమును కోరు దేవతాంశవో లేక భగవంతుని కోరు బ్రహ్మర్షివో జ్ఞానముతో విమర్శించుకొనుము.
To be continued...
★ ★ ★ ★ ★