29 Mar 2025
q) ప్రవృత్తి నివృత్తిలకు అవరోధము: ప్రవృత్తియను పాసు మార్కులు తెచ్చుకొనుటకు గాని, నివృత్తియను స్వర్ణపతకమును సాదించుకొనుటకు గాను అవరోధము విద్యార్థికి ఒక్కటే. అదియే సినిమాలపై ఆకర్షణము. ఇట్లే ప్రవృత్తులకు, నివృత్తులకు అడ్డముగా నిలుచు కారణము కూడ ఒక్కటే. అదియే ఏషణాత్రయము. మూడు బంధముల ఆకర్షణము – ధనేషణ, దారేషణ, పుత్రేషణ. చలనచిత్రములను చూచుటలో కొంత నిగ్రహము సంపాదించుకొన్నచో పాసుమార్కులు వచ్చును. అట్లే ఈ సంసార బంధముల యొక్క మమకారము యొక్క తీవ్రతను తగ్గించుకొన్నచో, లంచమును తీసుకొనుట, పక్షపాతమును చూపుట మొదలగు పాపముల నుండి విముక్తుడవై ధర్మమునకు సహకరించి ప్రవృత్తిని సాధించి స్వామిని ప్రసన్నము చేసికొనగలవు.
ఇక సినిమాలను పూర్తిగా విసర్జించినచో, స్వర్ణపతకము సాధించు అవకాశము వచ్చును. అలానే స్వామితో ఏర్పడిన ఏకైక బంధము వలన అన్ని సంసార బంధములు నశించినచో నివృత్తిని సాధించి, స్వామికి అవధులు లేని ఆనందమును కలిగించెదవు. అట్లే కుల మత బంధముల తీవ్రతను తగ్గించుకొన్నచో, అన్య కులమత దూషణా పాపమును చేయవు. అట్లే మాతృదేశ బంధమను తీవ్రతను తగ్గించుకొన్నచో ఇతర దేశములతో యుద్ధమును చేయవు. ఇది ప్రవృత్తి మార్గము. ఇక కుల, మత, దేశ బంధములు పూర్తిగా నశించినచో సర్వజీవులును సోదరులుగను, సర్వమతములు ఒకే మతముగను, భూమి అంతయు ఒకే దేశముగను గోచరించి పరిపూర్ణ ముక్తిని పొందెదవు.
శ్రీకృష్ణుడు తన కులము కాని సాందీపుని కుమారుని బ్రతికించినాడు కాని, తన మేనల్లుడగు అభిమన్యుని బ్రతికించలేదు. తన కులము కాని కుచేలునకు సర్వసంపదలు ఇచ్చినాడు. తన కులము వాడగు తన వియ్యంకుడును అగు దుర్యోధనుని సంపదలను హరించి వానిని నాశనము చేసినాడు. భక్తులగు పాండవులను ఆ శత్రువుల నుండి, మృత్యువు నుండి రక్షించినాడు కాని, తన బంధువులు చివరకు తన కుమారులు, మనుమలు ఒకరినొకరు చంపుకొనుచుండగా వారిని ఏ మాత్రము రక్షించక సినిమాను చూచినట్లు వినోదించినాడు. ఇవి అన్నియు శ్రీకృష్ణుడు ఆచరించి చూపిన జ్ఞానబోధయగు భగవద్గీతాసారమే.
ప్రవృత్తిని, నివృత్తిని వివరముగా బోధించుటకును నిజముగా నరావతారమే అవసరము. వాటిని గురించి స్పష్టముగా తెలిసిన తరువాత, నీవు ఏ మార్గమును అనుసరించ గల స్థాయిలో నిశ్చయమును కలిగియున్నావో తేల్చుకున్నచో పరమాత్మయు దానికి అనుగుణముగా ప్రవర్తించును. అయితే సర్వజీవులును నివృత్తిమార్గమునే ఆశించి లక్ష్యముగా పెట్టుకొనుట అత్యుత్తమ మార్గము. క్లాసులో ప్రతి విద్యార్థియు సువర్ణపతకమును సాధించుటయే లక్ష్యముగా పెట్టుకొన్నచో, కనీసము అందరును పాసుమార్కులు తెచ్చుకొందురు గదా. ఎవడో ఒకడు సువర్ణ పతకమును సాధించవచ్చును. ఆ ఒక్కడు క్లాసులో ఏ విద్యార్థియైనను మంచిదే గదా. అందుకే భగవద్గీత అంతయును నివృత్తి మార్గమునే శ్రీకృష్ణుడు ఉపదేశించినాడు. అనగా క్లాసులో ప్రతి విద్యార్థియు స్వర్ణపతకమును సాధించుటకు ప్రయత్నించవలెనని ప్రేరేపించినాడు. గీతారంభమున ప్రవృత్తియగు ధర్మస్థాపనకు వచ్చినానని చెప్పి నివృత్తిని బోధించుటలో అంతరార్థము ఇదే.
అనగా గురువు అందరిని పాసు చేయుటకు వచ్చినానని చెప్పుచూ ప్రతి విద్యార్థియు పాసు కావలయునని బోధించక స్వర్ణపతకమునే తెచ్చుకొనవలయునని బోధించినట్లున్నది. కేవలము పాసు మాత్రమే లక్ష్యముగా పెట్టుకొన్నచో విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులు కాలేరు. బంధముల సంపూర్ణ చ్ఛేదమే లక్ష్యముగా ఉన్న మోక్షమార్గమగు నివృత్తినే బోధించినచో కనీసము బంధముల తీవ్రత తగ్గి ధర్మస్థాపనము అను ప్రవృత్తిమార్గమైనను సిద్ధించును. అట్లు కాక కేవలము ప్రవృత్తినే లక్ష్యముగా చెప్పినచో ధర్మస్థాపనము కూడ సిద్ధించదు. కావున భగవంతుడే ప్రధానముగా గల నివృత్తిమార్గమగు మోక్షరూపమైన ఆధ్యాత్మిక జ్ఞానబోధను విద్యావ్యవస్థలో తప్పనిసరిగా పెట్టవలయును. ‘ఆధ్యాత్మజ్ఞాన’ అను గీతా శ్లోకములో ఆధ్యాత్మజ్ఞానమే నిజమైన జ్ఞానము అనియు మిగిలిన జ్ఞానములన్నియును అజ్ఞానమేననియు శ్రీకృష్ణుడు బోధించినాడు.
విదేశములలో ఈ ఆధ్యాత్మికతత్త్వము యొక్క ప్రాధాన్యతను గుర్తించి విద్యావ్యవస్ధలో ప్రధానస్థానమును కల్పించుచున్నది. ‘డాలర్ నోటు’ నందు కూడ ‘మేము దేవుని విశ్వసింతుము’ అని ముద్రింపబడి యున్నది. కాని భారతదేశములో ఎంతో దురదృష్టస్థితి. సెక్యులరిజము అను సిద్ధాంతము పేరుతో ఆధ్యాత్మిక జ్ఞానమును పూర్తిగా త్యజించినారు. దీనిచేత అధర్మము విజృంభించి, ధర్మరక్షణము సహితము క్షీణించి ప్రవృత్తియే నశించుచున్నది. అన్ని కప్పులలో ఒకే మందు ఉన్నది. నీ ఇష్టము వచ్చిన కప్పులోని మందు త్రాగుము అని చెప్పుటయే నిజమైన సెక్యులరిజము. కాని ఈనాటి సెక్యులరిజము ఏమనగా ఏ కప్పుతో మందు త్రాగినచో మిగిలిన కప్పులకు కోపము వచ్చునని ఏ కప్పులోని మందు త్రాగకుండుటయే సెక్యులరిజముగా భావించుచున్నారు. ఇట్టి బూటకపు సెక్యులరిజము కన్ననూ, భారతదేశము హిందూమత దేశముగనే యుండి ఒక కప్పు మీద ప్రత్యేక అభిమానమను మందు త్రాగుటయే మేలు.
ప్రాచీన భారతదేశములో దేవాలయములే కోర్టులుగా పనిచేసినవి. భగవంతుని యెదుట సంభాషించుచున్నామని ప్రతి వ్యక్తియు పాపభీతితో సత్యమును చెప్పి ధర్మ విజయమును చేకూర్చెడివారు. ఈనాడు న్యాయస్థానములలో భగవంతుని విగ్రహములు లేవు. సెక్యులరిజము అన్నచో అన్ని మతముల విగ్రహములను ఉంచవలెను. అట్లుకాక కళ్ళకు గంతలు కట్టిన ధర్మదేవతా విగ్రహమును మాత్రమే ఉంచుచున్నారు. దీని వలన నేను సత్యమును చూడలేదు. కేవలము సాక్షులు చెప్పు మాటలను విని ధర్మనిర్ణయము చేయుదునని సూచించబడుచున్నది. దీనిచేత అసత్య సాక్ష్యములను ప్రవేశపెట్టినచో విజయము సాధించవచ్చునన్న అభిప్రాయము బలపడుచున్నది. అట్లుకాక కన్నులు తెరచిన భగవంతుని విగ్రహములను ఉంచినచో నేను సత్యమును చూచి ఉన్నాను. నీవు అసత్యము పలికినచో నిన్ను శిక్షించెదను అను భావన స్పష్టమగును. కావుననే దేవాలయములలో ధర్మవిచారణ జరిగినప్పుడు భగవంతుడు తాను స్వయముగా కలుగచేసుకొని అసత్యమును శిక్షంచెడివారు. ‘మానుషీమ్ తను మాశ్రితమ్’ ధర్మ రక్షకుని విగ్రహము ఉండవలెను. దేవాలయములలో న్యాయ విచారణ జరుగునప్పుడు రెండు పక్షములను నెలరోజుల పాటు వదిలిపెట్టెడివారు. నెలరోజులలో అధర్మపక్షము తీవ్రముగా శిక్షను పొందుటచేత, దానిచేత పాపమును గుర్తించెడివారు. ఇట్లు భగవంతుని సహాయము నేరుగా ఆశ్రయించెడివారు. ఇదే క్రీస్తు బోధించిన ‘పరలోక రాజ్యము’.
To be continued...
★ ★ ★ ★ ★