30 Mar 2025
r) పరిపూర్ణ ధర్మస్థాపన: ఈనాడు కేవలము నామ మాత్రముగా మత గ్రంథములపై ప్రమాణము చేయించి సాక్ష్యమును పలికించుటలో భగవంతుని సహాయము పూర్తిగా అర్థించబడుటలేదు. పరలోక రాజ్యమనగా భగవంతుడే న్యాయ నిర్ణేత, అధర్మ శిక్షకుడు అని అర్థము. కావున ప్రభుత్వ వ్యవస్థలో కాని, రాజకీయ వ్యవస్థలో కాని ఆధ్యాత్మికవిద్యను ప్రధానముగా బోధించుటయే పరిపూర్ణ ధర్మస్థాపనకు మార్గమగును.
సంసార బంధముల యొక్క పరిపూర్ణచ్ఛేదము అను నివృత్తిని బోధించుట ద్వారా పరధనాపహరణము అను అధర్మము సహజముగనే క్షీణించును. భార్యాపుత్రుల బంధములలోని మమకారము యొక్క తీవ్రత చేతనే ఇతరుల ధనములను అపరిమితముగా అపహరించుచున్నారు. ఈ భార్యాపుత్రుల బంధములు పూర్వజన్మలలో లేవు. ఉత్తర జన్మలలో ఉండవు. కేవలము ఈ జన్మ వరకే పరిమితము. కావున ఇవి అనిత్యములు. అనిత్యము ఎప్పుడునూ అసత్యమే అని శంకర భాష్యము చెప్పుచున్నది. ఏలననగా నాటక సమయములో కూడ అనిత్యములైన నాటక బంధములు కూడా అసత్యములే అగుచున్నవి. ఈ జ్ఞానము చేత ఇతరుల ధనమును దోచి వారికి (భార్యాపుత్రులకు) ఇచ్చు బుద్ధి నశించి ధర్మస్థాపనము జరుగును. నాటకములో ఉన్న పాత్రధారులందరును తన సహనటులేననియు తెలిసినందున ఒక జీవుని ధనము దోచి మరియొక జీవునికి పెట్టు బుద్ధి నశించును. ఇట్లు ఆధ్యాత్మిక జ్ఞానము చేత ఆర్థికవ్యవస్థలో కూడ శాశ్వతస్థితిని (అనగా శాశ్వత సమత్వస్థితిని) సంపాదించవచ్చును. ‘యే చైవ సాత్త్వికా భావాః’ అని గీత.
ఇట్టి ఆధ్యాత్మిక జ్ఞానము లేక, కేవలము సోషలిజం, కమ్యూనిజం, నక్సలిజం అను సిద్ధాంతములతో ధనికుని కొల్లగొట్టి బీదలకు పంచినచో ఆ ధనికుని బుద్ధిలో మార్పు రాదు. అతడు ఇకపై ధనమును ఎట్లు రహస్యముగా దాచవలయునో అను నూతన మార్గములనే అన్వేషించును. లేదా నా భార్యాపుత్రలకు సంపాదించి పెట్టని ధనమును ఆర్జింపనేల? యని నైపుణ్యము ఉన్నను పరిశ్రమలను స్థాపించుట మానుకొనును. దానిచేత అట్టి నైపుణ్యము లేని బీదవాడు ఉద్యోగము లేక తిండికై మలమలమాడవలసి వచ్చును.
కావున ఆధ్యాత్మిక జ్ఞానమును విసర్జించి నీవు ఏ రూపములోను పరిపూర్ణ విజయమును సాధించలేవు. దుర్యోధనుడు అన్యాయముగా ధనమును దోచుకొని తనవారే అనుభవించవలయునన్న సిద్ధాంతముతోనున్న ఆధ్యాత్మిక జ్ఞానశూన్యుడగు వ్యక్తి. అట్టి వానికి కృష్ణుడు ఎంత బోధించినను మారలేదు కావున వానిని కృష్ణుడు సంహరించినాడు. దీనినే ఈనాడు టెర్రరిస్టులు చేయుచున్నారు. కాని దుర్యోధనునకు పరిపూర్ణబోధను చేసిన తరువాతనే దానిని ఆచరించినాడు. నిజముగా శిక్షించు బాధ్యత ఏ జీవుడును తన చేతిలోనికి తీసుకొనపనిలేదు. ప్రభుత్వము ద్వారా, న్యాయ స్థానముల ద్వారా నిలవకపోవచ్చును. ప్రభుత్వము అగు ధృతరాష్ట్రుడు అధర్మమునే సమర్థించినాడు గదా. ధర్మవేత్తలగు భీష్మద్రోణాదులును అధర్మమునే సమర్థించినారు గదా. ఇట్టి సమయములో కౌరవులను సంహరించు పక్షమును పాండవులు స్వీకరించక శాంతికై ఎంతో ప్రయత్నించినారు గదా. తుదకు అర్జునుడు ధర్మము ఓడినను, హింసవలదని యుద్ధము చేయనని వెనుతిరిగినాడు గదా. అప్పుడు ధర్మరక్షణమునకై, పరమాత్మ అర్జునునకు విశ్వరూపమును జూపి, తానే అధర్మమును సంహరించెదనని ప్రకటించవలసి వచ్చినది గదా.
కావున జీవులు తొందరపడనవసరము లేదు. సమయము రాగానే పరమేశ్వరుడే ధర్మము రక్షించి అధర్మమును శిక్షించును. పార్ధునివలె అధర్మమును శిక్షించినపుడు, కృష్ణుని వంటి ఆధ్యాత్మిక జ్ఞాని బోధ చేయవలెను. ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా పరివర్తనము తెప్పించినపుడు ధనికుడు శాశ్వతముగా మారును. కావుననే క్రీస్తు బోధించిన ‘పరలోక రాజ్యము’, భగవద్గీత బోధించిన నివృత్తి మోక్ష శాస్త్రము అన్ని రంగములలోను ధర్మమును స్ధాపించగలవు. ఇదే మార్గము. గాంధీ మహాత్ముడు దేశమునకు స్వాతంత్రము తెచ్చినది కూడ నిత్య రామ స్మరణ శక్తి చేతనేనని తెలియవలెను. కావున స్వాతంత్ర దినోత్సవమున ముందుగా స్వాతంత్ర్యమును ప్రసాదించిన భగవంతుని ప్రార్ధించి ఆ తరువాతనే నిమిత్త మానవులను స్మరించవలెను. కురుక్షేత్ర విజయమునకు మూల కారణమగు కృష్ణుని స్తుతించిన తరువాత నిమిత్తమాత్రుడగు అర్జునుని పొగడవలయును. ఒక విప్లవ కారకుడగు యూదుల జాతీయుడు క్రీస్తు బోధించు దైవ రాజ్యము రోమన్ ప్రభుత్వము నుండి స్వాతంత్ర్యము సంపాదించ కోరిన యూదుల పోరాటమునకు అన్వయించుకొని క్రీస్తును సమీపించినాడు.
కాని క్రీస్తు పరలోక రాజ్యమునకు అర్ధము వేరనియు, ప్రతి విషయములోను భగవంతుని సహాయము ఆశ్రయించుటయే పరలోక రాజ్యము యొక్క అర్ధమనియు వివరించినాడు. అర్జునుడు యుద్ధమును విరమించి వెనుతిరిగినపుడు కృష్ణుడు విశ్వరూపమును చూపి దుర్మార్గులను తాను సంహరింతునని ప్రదర్శించినాడు. ఆ విశ్వరూపమే క్రీస్తు చెప్పిన పరలోక రాజ్యము, ఒక రాష్ట్రములో రాష్ట్ర ప్రభుత్వముతో పాటు కేంద్ర ప్రభుత్వము కూడ పని చేయుచున్నది. అయితే ఆ రెండు ప్రభుత్వములతో పాటు భగవంతుని ప్రభుత్వము కూడ విశ్వమంతటను వ్యాపించి అదృశ్య రూపమున పని చేయుచున్నది. కావున అర్జునుడు యుద్ధము మానుకుని, ధర్మరాజు యొక్క పట్టాభిషేకమునకు సహకరించపోయినను కృష్ణుడు తానే కౌరవులను సంహరించి ధర్మరాజు పట్టాభిషేకమును చేయుదునని భీష్ముని మీదకు చక్రముతో లంఘించినపుడు భారతములో చెప్పినాడు.
కావున ధర్మస్ధాపనములో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వములు విఫలమైనను దైవ ప్రభుత్వము విఫలము కాదు. కావున ఇట్టి దైవ ప్రభుత్వమును బోధించు ఆధ్యాత్మిక జ్ఞానబోధను ఈ లౌకిక ప్రభుత్వములు ప్రధానముగా ప్రచారము చేయుటలో నడుముకట్టవలయును. అప్పుడే లోకమున పరిపూర్ణ ధర్మస్థాపన జరుగును. ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారమును స్ధాపించుట రాజు (ప్రభుత్వ) కర్తవ్యము. ఏలననగా ప్రజలు చేయు పాపములలో రాజునకు భాగము సంక్రమించునని ధర్మశాస్త్ర వచనము. కనీసము భక్తులు చేయు కర్మఫలత్యాగములైన దైవ దక్షిణల ధనమునైనను ఇట్టి ప్రచారమునకు వినియోగించవలయును.
విదేశములలో వాటిగన్ చర్చి ధనమునంతయు ప్రభుత్వ ప్రమేయము లేక ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారమునకు మఠాధిపతి వినియోగించుచున్నారు. ఇది కనీస ప్రభుత్వ ధర్మము. అట్లే తిరుపతి మొదలగు క్షేత్రముల ధనమునంతయును ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారమునకై మఠాధిపతుల అధ్యక్షతలో చేయవలయునే కానీ కేవలము కట్టడములకును భక్తుల సౌకర్యములకును కాదు. భక్తులు దైవ దర్శనమునకు వచ్చునపుడు ఎన్నో కష్టముల ద్వారా చేరవలెను. కష్టము ద్వారా జ్ఞానము. కావుననే వెనుక ఈ క్షేత్రములు దుర్గములగు అరణ్యములలో కొండలపైనున్నవి. ఆధ్యాత్మిక జ్ఞాన పండితుల పరిపాలనలో దైవక్షేత్రముల నుంచి, వాటి ఆదాయమును ఆస్తికత్వ ప్రచారమునకై వినియోగించవలెను కానీ కేవలము పనులకు ప్రజా సౌకర్యములను పెంచుటకు వినియోగించరాదు.
నివృత్తి మార్గములో బ్రహ్మలోకమునకు చేరిన ముక్తజీవులు మరల ఈ తిరిగి ఈ సంసార బంధములలో చిక్కుకొనరను భావమే వారు మరల జన్మించరు అను మాటకు అర్ధము. భగవంతుడే మరల అవతారములు ఎత్తుచుండగా, ఈ ముక్తజీవులు నరజన్మమును ఎత్తరు అనుట హాస్యాస్పదము. అంతే కాక వారికి బ్రహ్మ సామీప్యము నిరంతరము ఉండుటయే బ్రహ్మ లోక నివాసము. కావున వారు పరమాత్మతో పాటు సేవకులుగా నరజన్మములను పొందిననూ సంసార బంధములలో చిక్కుకొనరు. లోక సంగ్రహమగు ప్రవృత్తిని, వ్యక్తిగత మోక్షమునకు నివృత్తి ఈ రెండింటినీ స్ధాపించు మహాగ్రంధమే భగవద్గీత. దానిని చెప్పిన వాడు శ్రీ కృష్ణభగవానుడు.
ఈ కృష్ణాష్టమి సందర్భముగా ఈ జ్ఞాన నవనీత ప్రపాదమును స్వామి అనుగ్రహించుచున్నారు. శ్రీ దత్తాత్రేయ భగవానుడు నరావతారములో ఆనాడు శ్రీ కృష్ణుడుగా ఈనాడు సాక్షాత్తుగా శ్రీ దత్తస్వామిగా ఈ ప్రసాదమును భక్తజనుల కొరకు కృష్ణలంకలో సేవకులమైన భవాని కృష్ణులమైన మా దంపతుల ఉద్ధరించుటకు అనుగ్రహించిన దివ్యవాణి.
నవనీతమును తిన్నచో క్రొవ్వు వృద్ధి చెంది ఆరోగ్యము చెడుటయేగాక, అహంకారము కూడా పెరుగును. ఈ జ్ఞాన నవనీత ప్రసాదము మీకు భగవదనుగ్రహమును సంపాదించిపెట్టి మీకు ఈ లోకమున ఆయురారోగ్య సంపదలను అనుగ్రహించుటయే కాక, మీ అసూయ అహంకారములను నిర్మూలించి మిమ్ములను శాశ్వత బ్రహ్మలోక నివాసులుగా చేయు దివ్యమైన ప్రసాదము. ఇట్టి ప్రసాదము ఆస్వాదించిన నాడే నిజమైన కృష్ణాష్టమి పండుగను జరుపుకొనుట అగును.
★ ★ ★ ★ ★