home
Shri Datta Swami

 31 Mar 2025

 

రూపవైశిష్ట్యము

స్వామి శ్రీమతి. శ్రీలక్ష్మి సంశయాలను క్రింది విధముగా నివృత్తి చేశారు.

[02.01.2004]

ప్రశ్న: i) పటములలో విగ్రహములలో దేవుడు లేడనియు, శిలావిగ్రహముల నారాధించు వారు శిలలైపోతారని మీరు చెప్పారు గదా. ఐతే మీరాబాయి శ్రీకృష్ణుని విగ్రహమును ఆరాధించి తరించలేదా?

స్వామి సమాధానము: 1) నీవు శిరిడిసాయి భక్తురాలవు. స్వామి అయిదవ దత్తావతారులు. ఆ రోజులలో సశరీరముగా నరావతారములో ఉండి జనులను ఉద్ధరించి తరువాత సమాధి అయినారు. ఇప్పుడు జనులు ఆయన శిలావిగ్రహము, పటములను పూజిస్తున్నారు. అట్లే నీవు కూడా ఈనాడు పటమును శిలావిగ్రహమును పూజిస్తున్నావు. కాని వర్తమానములో ఉన్న సాక్షాత్తు దత్తుని నరావతారమును గుర్తించకపోవటం చేత నీకు ఈ సంశయం కలిగింది. శిరిడి సాయినాథుడు ఏమంటున్నారు. నాకు, నా పటమునకు తేడా లేదు అని అంటున్నారు. ఈ వాక్యము ప్రాథమిక భక్తులకు మాత్రమే వర్తిస్తుంది. కాని, ఆ తరువాత స్వామి క్షీరామృతములో ఏమంటున్నారు. తాను ఈనాడు నరావతారములో వచ్చినప్పటికీ పట్టించుకోక, ఆ పటాన్నే ఈ జనులు పట్టుకుంటున్నారు, వెర్రివాళ్ళు అనలేదా. ఇంకా ఏమన్నారు? తనకు తెలియని విషయాన్ని తెలుసుకోవటానికి పరిప్రశ్నను వినయముతో సేవిస్తూ వేయాలి. అంతే కాని స్వామికి విమర్శదృష్టితో నీ సంశయాలు వెలిబుచ్చరాదు.

ii) ఎప్పటి కాలపు క్రీస్తు గురించో చెప్పుచున్నారు గదా. మరి ఆ పటము పెట్టారు గదా?

స్వామి సమాధానము: అమ్మా! భగవద్గీత చూడు ‘యాన్తి దేవవ్రతా దేవాన్ పితౄన్యాన్తి పితృవ్రతాః భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజినో ఽపి మామ్’ అని ఉన్నది. అనగా దేవతలను ఆరాధించువారు దేవతలను పొందుచున్నారు. పితృపూజ చేయువారు పితరులను పొందుచున్నారు. భూతములను ఆరాధించువారు భూతములను పొందుచున్నారు. నన్ను ఆరాధించువారు నన్నే పొందుచున్నారు. కనుక ఈనాడు ప్రత్యక్ష నరావతారమును వదలిపెట్టి పటములను, శిలావిగ్రహములను పూజించినచో దాని ఫలమును చెప్పియున్నారుగదా.

Swami

iii) సుగంధాలు మా పెదనాన్న సృష్టించి ఇస్తున్నాడు అంటున్నారు గదా. నేనే ఈ సుగంధమును సృష్టిస్తున్నానని చెప్పవచ్చు గదా?

స్వామి సమాధానము: శిరిడి సాయినాథుడు ఆ రోజులలో అన్ని తానే చేస్తూ కూడా, అంతా తన తండ్రియే చేస్తున్నారు అని అనలేదా. అల్లామాలిక్, నేను సేవకుణ్ణి అన్నారా? లేదా? అట్లే ఈ సుగంధాలను నేనే సృష్టిస్తున్నప్పటికీ మా పెద్దనాన్న (శిరిడిసాయి) చేస్తున్నారని అంటున్నాను. మరియొక సంశయ నివారణ కూడా చేస్తున్నాను శ్రద్ధగా వినండి. శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ ఏ ఒక్క భక్తునినో ఉద్దేశించి బోధించడం లేదు. రకరకాల స్థాయిలలో ఉన్న అనేకమందికి చెప్పుచున్నారు. అక్కడ ఉన్న భక్తులస్థాయిని బట్టి ప్రవచనము చేస్తున్నారు. ఉదాహరణకు, అది S.S.L.C. క్లాసు అనుకో, ఆ క్లాసుకు B.A., M.A. క్లాసు పెద్దపిల్లలు కూడా వెళ్ళారనుకో. ఏమిటి స్వామి ఇలా చెప్పుతున్నారు అనుకోరా? అదే శ్రీస్వామీజీ వారు కొద్ది మంది మాత్రమే ఉన్న పెద్దక్లాసువారి వద్ద ఏమి చెప్పుచున్నారు? ‘బ్రహ్మ బ్రహ్మ కాలత్రయపూజితం బ్రహ్మ’ అని వచించటం లేదా. మరి ఆ ప్రవచనం చిన్నక్లాసులవారైన S.S.L.C. వారికి అర్థమౌతుందా? అంటే ఎవరికి ఎలా చెప్పాలో గురువుకు తెలియక కాదు, ఏ స్థాయి విద్యార్థులకు ఏది అవసరమో ఆయన వారికి అదే బోధిస్తారు, అని అర్థము చేసుకోవాలి అని వివరించారు స్వామి.

నాయనా విను! ఏ రూపములో భగవానుని ధ్యానించినా ఫరవాలేదు. కావలసినది భక్తి, శ్రద్ధలే కాని రూపవైశిష్ట్యము కాదు (glory of the form).

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch