home
Shri Datta Swami

 22 Nov 2024

 

నివృత్తిలో ధర్మమును కూడా మించి పరమాత్మ ఉండును

[11.12.2002] లోకములో ధర్మమునకు అధర్మమునకు పోటీ వచ్చినపుడు అధర్మమును వదలి ధర్మమును గ్రహించవలెను. ఇది ఒక జీవునకు మరియొక జీవునకు మధ్య సంబంధించిన విషయము. ఈ విషయమునే రామాయణ, భారతములు జీవులకు ధర్మబోధను చేయుచున్నవి. దుర్యోధనుడు, ధర్మరాజు అను ఇద్దరు జీవుల మధ్య సంఘర్షణయే భారతము. అలానే రాముడు, రావణుడు అను ఇద్దరు జీవుల మధ్య పెనుగులాటయే రామాయణము. రాముడు తన భగవత్తత్త్వమును ఎచ్చటను ఎప్పుడును ప్రకటించలేదు కావున ఆదర్శమానవుడగు జీవునిగనే తీసికొనవలయును. ఇందు ధర్మమును గ్రహించక అధర్మమును గ్రహించిన వారు దైవముచే శిక్షింపబడుట వివరించబడియున్నది. భగవానుడు ధర్మస్థాపకుడు, ధర్మరక్షకుడు. ధర్మదేవతయే గోవురూపమున పాహి పాహి అని స్వామిని ఆశ్రయించినది. స్వామి దానిని వెంటనుంచుకొని సర్వదా రక్షించుటయే దత్తుని వెంట సదా గోవు ఉండుటకు అర్థము. ఈ ధర్మమును మంత్రాత్మకములైన వేదములు రక్షించుచున్నవి.

ఈ వేదమంత్రములే అస్త్రములు. అస్త్రము అనగా అదృశ్యరూపమున ఉండి అధర్మమును శిక్షించు దైవశక్తియే. నాలుగు వేదములు నాలుగు కుక్కల రూపమున చుట్టును కాపలా కాయుచు ధర్మధేనువును రక్షించుచున్నవి. అనగా అధర్మమును శిక్షించుటకు దైవమునకు కంటికి కనపడు శస్త్రములతో పనిలేదు. సుదర్శనచక్రము అనగా లోహముతో చేయబడిన ఒక చక్రాయుధము కాదు. "సు-దర్శనము" అనగా బాగుగా జ్ఞాననేత్రముతో ఆలోచించినచో గోచరించు తత్త్వము గలది అని అర్థము. దీనినే ‘కాలకర్మచక్ర’మందురు. అనగా కాలము రాగానే ఎవని కర్మఫలములను వారికి అందించు దైవశక్తియే. ఇక త్రిశూలమనగా లోహముతో చేయబడిన ఆయుధము కాదు. సంచితము, ప్రారబ్ధము, ఆగామి అను మూడు మొనలు కలిగిన కర్మస్వరూపము. అనగా ఆయా సమయములయందు ఈ మూడు కర్మల ఫలములను వేరువేరుగా అందించు దైవశక్తియే. ఈ దైవశక్తియే అస్త్రములైన మంత్రముల రూపములుగా, వేదములుగా బ్రహ్మదేవుని చేతిలో యున్నది. ఇదియును అస్త్రమైన ఆయుధరూప దైవశక్తియే.

కావున దైవము అవతరించినపుడు ఇట్టి ఆయుధములను పగటివేషగానివలె చేతిలో ధరించడు. ఇది అంతయు "ప్రతీక కల్పనము" అందురు. ఈ విధముగా భగవంతుడు ధర్మమునకు రక్షకుడై ధర్మము ఆయన చేత రక్షింపబడినదిగా యున్నది. రక్షకుడు గొప్పవాడా? రక్షింపబడినది గొప్పదియా? కావున భగవంతునకును, ధర్మమునకు పోటీ వచ్చినప్పుడు భగవంతుడే గొప్ప అని నిరూపించినదే భాగవతము. రామాయణ, భారతములు లోకములో శాంతిభద్రతలతో జీవించుటకు సంబంధించినవి. కాని భాగవతము ఆ జీవులలో భగవంతుని చేరగోరు సాధకులకు మాత్రమే సంబంధించినది. జీవులందరు సాధకులు కారు. ఈ సాధకులలో కూడా ఎంతో ఉన్నతస్థాయికి చేరిన సాధకులకు మాత్రమే సంబంధించినది భాగవతము. కావున భాగవతమును జీవులందరును లేక సాధకులందరును అర్థము చేసుకొనలేరు. అది వేదాంత శిఖరస్థానము. కావుననే "విద్యావతాం భాగవతే పరీక్షా" అన్నారు. అనగా ఒక పండితుడు పరిపూర్ణ జ్ఞానియని తేల్చుకొనుటకు భాగవతమును గూర్చి ప్రశ్నించుము అని అర్థము. వేదాంతశాస్త్ర శిఖరస్థాయికి పోయినవాడు మాత్రమే దానిని సమస్వయించి అదీ పరమపవిత్ర గ్రంథమని నిరూపించగలడు.

ఏడురోజులలో పరీక్షిత్తు ముక్తిని పొందుటకు మార్గమేమి? అని ప్రశ్నింపగా, శ్రీశుకపరబ్రహ్మ భాగవతమును పఠించమన్నాడు. అయితే అంత గొప్పదనము భాగవతములో ఎక్కడ ఉన్నది? పరిపూర్ణతమావతారమైన శ్రీకృష్ణుని గురించిన గ్రంథమన్నచో భారతములో కూడా శ్రీకృష్ణుడు ఉన్నాడు గదా! కాని భారతములో స్వామి జీవులకు సంబంధించిన ధర్మాధర్మముల పోటీ విషయములో ఉన్నాడు. అక్కడ భగవంతుని చేరు సాధకుల విషయము లేదు. ధర్మజుడు, అర్జునుడు, భీష్ముడు, కుంతి మొదలగు సాధకులు ఉన్నారు. కాని వారు గోపికలంత అత్యున్నత సాధకులు కాదు. గోపికలు ఎవరు? అత్రి ఆశ్రమమున ఉన్న బ్రహ్మఋషులు. వారే దండకారణ్య మునులు. యుగయుగముల సాధన చేసి తపస్సులో పండి శిఖరపరీక్షకు సిద్ధమైనవారు. శిఖరపరీక్ష యనగా, దాని తర్వాత ఎప్పుడును ఎట్టి పరీక్ష యుండదు.

Swami

ద్వాపర యుగమున వారు గోపికలుగా జన్మించుటకు ముందు త్రేతాయుగమున రామావతారమున ఉన్న దత్తునితో వారు ఇట్లు పలికినారు. "స్వామీ! మేము అన్ని బంధములను తెంచుకున్నాము. మీరు ఎట్టి పరీక్షయైనను పెట్టుడు. భార్యా, పుత్ర, ధనేషణములను ఛిన్నము చేసినాము. శరీర,ప్రాణ,మమకారములను గూడా త్యజించినాము" అని వారు చెప్పగా స్వామి ఇట్లు చెప్పినాడు. "మీరు ఎన్ని అహంకార మమకారములను త్రెంచుకున్నను పురుష అహంకారమును ఇంకనూ త్రెంచుకొనలేదు. కారణము ఇంతవరకును మీరు పురుషులుగనే జన్మించియున్నారు". ఇట్లు స్వామి చెప్పగనే వారిట్లు పలికిరి. "స్వామీ! అట్లు అయినచో మా తపశ్శక్తితో స్త్రీలుగా మారి నాథుడగు నిన్ను శరణము జొచ్చెదము" అని. దానికి స్వామి ఇట్లు వచించెను. "క్షణములో మీరు మీరూపమును మార్చుకొనిననూ ఇన్ని జన్మల నుండి వచ్చిన మీ పురుషవాసన పోదు. కావున ద్వాపరమున మీరు గోపికలుగా జన్మించుడు". ఇట్లు స్వామి చెప్పిన తర్వాత వారు "సరే" అనిరి.

వారు గోపికలుగా జన్మించిరి. ఇందు స్వామి ఒక రహస్యమును దాచినాడు. ఒక పురుషుడు భార్యాపుత్ర గృహాదులను వదలి స్వామి వెంటబడినచో ఎట్టి ఇబ్బందియు లేదు. కాని ఒక స్త్రీ పతి,పుత్ర,గృహాదులను వదలి నరాకారుడగు స్వామి వెంట పడుటలో చాలా పెద్ద ఇబ్బంది కలదు. దానిని లోకము అంగీకరించదు. ఇచ్చట పెద్దలు శిక్షింతురు. పరువు మర్యాదలకు భంగమగును. ధర్మము తప్పినందున నరకము తప్పదు. కావున ఇట్టి పరీక్షను పెట్టినచో ఋషులు తన కొరకు ఎంత మాత్రము త్యాగము చేయగలరు? ఇదే శిఖరపరీక్ష. ఇదే దత్తుని యొక్క ప్రళయాగ్ని పరీక్ష. అయితే ఈ పరీక్షలను గురించి ముందుగా ఋషులకు చెప్పలేదు. ఇదే రహస్యము. ఈ రహస్యము చెప్పలేదు. ఇట్టి అంతిమాంతిమ పరీక్ష విషయము గలిగిన భాగవతము కన్న మించిన వేదాంతగ్రంథము ఏమి యుండును?

ద్వాపరమున స్వామి పెట్టిన ఈ పరీక్షలో చాలా కొద్దిమంది మాత్రమే ఉత్తీర్ణులైనారు. వారినే సిద్ధగోపికలు అందురు. ఈ పరీక్షను అర్ధరాత్రియందు పెట్టుదునని సూచించుచు స్వామి అర్ధరాత్రమున జన్మించినాడు. అర్ధరాత్రమున బృందావనమున మురళితో ఇట్లు పాడినాడు "గోపభామ లెమ్ము రమ్ము, మురళి రవము పిలుపు వినుము" గోపికలందరును మేలుకున్నారు. కాని కొందరు గోపికలు మంచమును దిగలేకపోయినారు. మరికొందరు గోపికలు దిగియును ఇంటిగడప దాటలేకపోయినారు. చాలా క్రొద్దిమంది మాత్రమే గడపలను దాటి గోడలను దూకి ఎవ్వరడ్డు వచ్చినను, పరువు మర్యాద, నరకభయము మొదలగు మహాసర్పములను కూడా లెక్కచేయక తీవ్రాతి తీవ్రములైన ఆకర్షణలతో స్వామి వద్దకు పరుగులు తీసినారు. ఇట్టి సిద్ధగోపికలకే సర్వబంధచ్ఛేదమై పరిపూర్ణ జీవన్ముక్తి లభించి అపరోక్ష బ్రహ్మనుభూతియను మధురానందమైన రాసకేళిలో విహరించినారు. రాసము అనగా రసమునకు సంబంధించినది. రసము అనగా పరబ్రహ్మము. "రసో వై సః" అని శ్రుతి. ఇట్టి శిఖరాగ్రపరీక్ష దాటిన గోపికల తత్త్వమును వర్ణించు భాగవతము కన్న పరమ పవిత్రగ్రంథము లేదు లేదు లేదు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch