27 Nov 2024
[18.01.2006] దశమస్కందము భాగవతసారము కాగా రాసక్రీడా వైభవములో శ్రీకృష్ణుని కొరకు యమునాతీరములో గోపికలు గానము చేసిన గీతమే గోపీగీతలు. రాధ కృష్ణుని విరహమునకు తపించెడిది. గోపికలు ధన్యజీవులు. పవిత్రాత్మలు. తమ ప్రాణములను మధుసూదనునియందు ఉంచినారు. విషయప్రపంచము విషతుల్యమని భావించినారు. నిర్విషయానందములో ఓలలాడినారు. శ్రీకృష్ణుని అన్నిదిశల దర్శించిన ధన్యజీవులు వారు. ఈ ప్రపంచము జడాత్మకము. చైతన్యము గాదు. జగత్తు మాయాజనితము. జగత్తుయొక్క దోషములు బ్రహ్మమును అంటలేవు. గోపికల అంతఃకరణమునందు శ్రీకృష్ణుడు తప్ప మరియొక ఆలోచనలేదు. కృష్ణా! దర్శనమొసంగమని ఆర్తితో ప్రార్థించినారు. ప్రేమ, ప్రేమ, ప్రేమ – గోపికలు నిరంతరము ప్రేమలో మునిగితేలినారు. భగవంతుని రూపము ప్రేమ. ప్రేమయే భగవానుడు. గోపికలు అనేక విధముల తమ తపనను వ్యక్తపరచినారు.
i) సంసార కాళియమడుగులో నివసించు భ్రాంతియను కాళియుని మదమణచి, ii) అహంకారమనే అఘాసురుని సంహరించి, iii) ఆధ్యాత్మికసాధనను ఆటంకపరచే ఇంద్రియ పిడుగుపాట్ల గాలివాననుండి నీ దయ అనెడి గోవర్ధనము నెత్తి కాపాడి, iv) అశాంతి అనెడి బడబాగ్నిని మ్రింగి, మాకు శాంతిని ప్రసాదించి బహిర్ముఖమగుచున్న మా యింద్రియాలను అంతర్ముఖము చేసి ఆత్మదర్శనము కల్గించి, మాలో నిండియున్న రాక్షసులను వధించి, మాయయను నీ దివ్యదర్శన మొసంగి రక్షింపమని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించిరి. మాయ తొలగగనే అంతఃకరణశుద్ధి కలుగుతుంది. ఆత్మ ఎరుక అవుతుంది. జీవుడు తానే ఆత్మగా మారిపోతాడు. ఆత్మ అద్వితీయము. ఆత్మగా యుండుటయే ఆత్మను తెలుసుకొనుట అవుతుంది అని భగవాన్ రమణమహర్షి తెలియజేసినారు. గోపికలు శ్రీకృష్ణుని ఆత్మగానే ఆరాధించినారు. రాసలీల భౌతికదృష్టి కాదు. భోగ దృష్టి కూడ కాదు. ఆత్మదృష్టితోను, ప్రేమ దృష్టితోను గోపికలు శ్రీకృష్ణుని ఆరాధించినారు. అట్టి ప్రేమ భావము జ్ఞానము నుండి మాత్రమే అంకురిస్తుంది.
శ్రీకృష్ణునికి ఎంత సన్నిహితముగాయున్ననూ, అతని మాహాత్మ్యమును గూర్చిగాని, జ్ఞానమును గూర్చిగాని గోపికలు విస్మృతిని పొందలేదని నారదమహర్షి భక్తిసూత్రాలలో ప్రవచించినారు. గోపికలప్రేమ కేవలం పరాభక్తియని నారదుని ప్రబోధము. గోపికలు భగవదనుగ్రహమునకు పాత్రులగుటకు వారి నిష్కళంకప్రేమయే నిదర్శనము.
‘విషయములను ధ్యానించుచూ మనసు విషయసుఖాలచుట్టూ పరిభ్రమిస్తుంది. నన్నే స్మరించు, మనసు నాలోనే లయిస్తుంది.’ అని భగవంతుడు భాగవతములో తెలిపియున్నాడు. ‘లోక కళ్యాణమునకై బ్రహ్మదేవుడు ప్రార్థింపగా సాత్వత కులమున కృష్ణుడు జన్మించినాడు. ఇది కృష్ణుని జన్మరహస్యము. గోపికలు సర్వభూతాంతరాత్మయైన శ్రీకృష్ణునికి సంపూర్ణశరణాగతులైనారు. ప్రపత్తితో కూడిన ప్రకృతియే నివృత్తికి మార్గమౌతుంది. సంపూర్ణశరణాగతులైనవారి యోగక్షేమాలన్నీ భగవంతుడే స్వయంగా చూస్తాడని గీతామాత ప్రబోధము. ‘మాం ప్రపద్యన్తే’ అనెడి జ్ఞానయోగములోని 11వ శ్లోకములో (యే యథా మాం ప్రపద్యన్తే తాం స్తథైవ భజామ్యహమ్, మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః) ‘ఎవరు నన్నేవిధముగా సేవింతురో వారిని ఆ విధముగనే నేను అనుగ్రహింతును’ అని పరమాత్మ తెలిపెను. ‘మామేవ యే ప్రపద్యన్తే’ అనెడి జ్ఞానవిజ్ఞానయోగములోని పదునాలుగవ శ్లోకములో (దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా, మా మేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే) ‘దైవసంబంధమై, త్రిగుణాత్మకమైన ఈ నా మాయ దాట శక్యము కానిది. ఎవరు నన్నే శరణు పొందుచున్నారో వారు ఈ నా మాయను దాటుచున్నారు’ అని శ్రీకృష్ణపరమాత్మ బోధించెను.
★ ★ ★ ★ ★