28 Jan 2025
Updated with Part-2 on 29 Jan 2025
ఈనాడు అవతార పురుషులుగా పిలువబడేవారు, గురువులు పేరుకు తగ్గట్లుగా పరిపూర్ణముగా సిద్ధిని పొందనివారు. కీర్తి కోసము శిష్యుల లేక భక్తుల సంఖ్య పెంచుకొనుచూ వారి యొక్క పూజలచేతను, స్తుతులచేతను తమ యొక్క అహంకారమును పెంచుకొనుచు సాధనామార్గములో దారిలోనే పతితులగుచున్నారు. పరిపూర్ణసిద్ధిని సాధించిన సిద్ధుడు వేరు, క్రింద వారిని ఉద్ధరించుటకు దిగివచ్చిన అవతార తత్త్వము వేరు. సాధనలో కొంతదూరము పోయి, కొన్ని సిద్ధులు లభించగనే, వాటిని దుర్వినియోగము చేయుచూ అహంకారముతో ‘అహం బ్రహ్మాస్మి’ అనుచున్నారు. వంద మెట్లు ఉన్న మార్గమున ఒకడు పైకి ఎక్కుచూ 10వ మెట్టున ఆగిపోయినాడు. మరియొకడు 100 మెట్లు ఎక్కి 10వ మెట్టుకు దిగివచ్చినాడు. వీరిరువురునూ 10వ మెట్టు మీదే ఉన్నారు. చూచువారికి ఇరువురూ సమస్థితిలోనే వున్నారు. కానీ ఇందులో మొదటివాడు సాధకుడు. రెండవవాడు అవతరించిన అనగా క్రిందకు దిగివచ్చిన అవతారపురుషుడు. మొదటివాడు 11వ మెట్టునే ఎక్కలేడు. రెండవవాడు అవసరమైనచో 11వ మెట్టు పైన ఉన్న అన్ని మెట్లను క్షణకాలములో పరుగుతో ఎక్కగలడు. అయితే తొమ్మిదవమెట్టున ఉన్నవారిని 10వ మెట్టు ఎక్కించుటకు ఇరువురూ సరిపోదురు.
ఒకడు 10వ తరగతి ఉత్తీర్ణుడై 7వ తరగతి క్లాసుకు ఉపాధ్యాయుడిగా వచ్చినాడు. మరియొకడు హైస్కూలు, కాలేజీ, యూనివర్సిటీ చదువులన్నియు చదివి యూనివర్సిటీలో ఉన్న క్లాసుకు ఉపాధ్యాయుడైనాడు. ఈ యూనివర్సిటీ ఉపాధ్యాయుడు యూనివర్సిటీ క్లాసులకు మాత్రమే కాక దాని క్రిందనున్న కాలేజీలోను, మరియు దాని క్రిందనున్న హైస్కూలులోనూ ఉపాధ్యాయుడిగా పనిచేయగలడు. 10వ తరగతి చదివి, స్కూలులో ఉపాధ్యాయుడైనవాడు ఆ స్కూలు విద్యార్థులచేత గురువు అని పిలువబడును. అతడు గురుస్థానములో ఉండి స్కూలు విద్యార్థుల పూజలను అందుకొనుచుండును. ఇంత మాత్రమున అతడు ఇంక చదువవలసిన చదువు లేదా? అతడే కాలేజీలో చేరినచో ఒక విద్యార్థియై కాలేజీ ఉపాధ్యాయునికి శిష్యుడు కావలసియున్నది. అదే విధముగా సాధనలో 10వ మెట్టునకు చేరి తొమ్మిది మెట్ల వరకు ఉన్న సాధకులకు గురువుగా ఉన్నప్పటికినీ దానిచేత అహంకరించక మనస్సులో తానును సాధకుడేనని తెలిసి సాధన చేయవలెను. అతడి కన్నా అధికస్థాయిలో ఉన్న సాధకులను గురువులుగా భావించుకొనవలెను. అట్లుగాక 10వ మెట్టునే నూరవ మెట్టుగా భావించిన, అహంకారముతో కళ్ళు కమ్మి అతడు ఆ పదవమెట్టునే ఆగిపోవలసివచ్చును.
కానీ, ఒక యూనివర్సిటీ ఉపాధ్యాయుడు ఒక స్కూలుకు టీచరుగా వచ్చినచో అతడికి ఈ నియమములు వర్తించవు. అతడింక చదువవలసిన పనిలేదు. కావున అవతార పురుషుని చూచి సాధకుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు భ్రమలో పడరాదు. కావున ఈనాటి ఆధ్యాత్మిక పరిస్థితి చాలా దారుణముగా వున్నది. రెండవమెట్టు ఎక్కినవాడు అదియే నూరవమెట్టుగా భావించి మొదటి మెట్టును ఉన్న వారిచేత గురువు, దైవము అని పిలిపించుకొనుచు అహంకారముతో కీర్తి కొరకు అహర్నిశమూ ప్రయత్నించుచున్నాడు. ఇట్టివాడు మొదటిమెట్టు వాడిని ఎక్కించు సేవ చేయుచున్ననూ వాని అహంకారము వలన పతితుడగుచున్నాడు. శ్రీ దత్తభగవానుడు అవతరించినప్పుడు ఆయనను గుర్తించు ప్రధాన లక్షణము ఏమనగా ఆయన యొక్క వినయమే. నీవు ఎన్ని స్తోత్రములు చేసిననూ ఆయనలోనికి అహంకారమును ఎక్కించలేవు. ఆయనను మునగచెట్టు ఎక్కించుట అసంభవము.
ఆయన గురుస్వరూపుడు. జ్ఞానాధిదేవుడు. ‘విద్యా దదాతి వినయమ్’, విద్య యొక్క లక్షణము వినయమే. ఆయనలో అహంకారము ప్రవేశించదు. కావున ఆయనకు కీర్తిపై కోరిక వుండదు. విశేషసంఖ్యలో భక్తులను రాబట్టుటకు ఎట్టి ప్రయత్నము చేయడు. వచ్చినవారినే అనేక పరీక్షలకు గురిచేసి పారిపోవునట్లు చేయుటకు ప్రయత్నించును. నీవు గుర్తించినచో అనేక మాయలను ప్రదర్శించును. నీవు గుర్తించు కొలదీ అధమునిగనూ, అధమాధమునిగనూ నటించును. తన్ను తాను ఎప్పుడునూ తగ్గించుకొనుచుండును. నిన్ను నీవు ఎంత తగ్గించుకొందువో అంత హెచ్చింపబడుదువని స్వామి వాక్యము. ఆయన అత్యధిక స్థానమున ఉన్నాడు. ‘న తత్సమశ్చాభ్యధికశ్చ’ అను శృతి ఆయనతో సమానుడే లేడు ఆయనకన్న అధికుడు ఎట్లుండును అని చెప్పుచున్నది. అందుకే అత్యుత్తముడు అధమాధమునిగ కనిపించుచుండును. అన్నియును వున్న విస్తరి అణిగిమణిగి వుండును. ఏమియూ లేని విస్తరి అహంకారము కీర్తికాంక్ష అను గాలికి ఎగిరి ఎగిరి పడుచుండును.
ఆయన అత్యధమునిగా కనిపించి దురహంకారులను సైతము ఆకర్షించును. అహంకారులను, అసూయాపరులను ఉద్ధరించవలయునన్నచో ముందు వారి దగ్గరికి ప్రవేశించుటకు ఆయన అధమాధమునిగా నటించును. అహంకారులు, అసూయాపరులు వారితో సమానమైన వారినే సహించరు. ఇక వారికన్న అధికులను ఎట్లు సహించగలరు. కావున వారికి చెప్పవలయునన్నచో వారితో సమానుడిగా వారికన్న అధికుడిగా వారి వద్దకు పోరాదు. తమకన్న అధముడిగా కనిపించినప్పుడే వారు ఆ అధముడు చెప్పు మాటలను వినగలుగుదురు.
రాసకేళి అంతరార్థము
పుత్రుడు తండ్రి మాట వినడు. కానీ తల్లి మాటను వినును. పురుషుడు, గురువు మాట వినడు. కానీ భార్య మాట వినును. ఇందులో రహస్యమేమి? వానిలో తాను పురుషుడన్న అహంకారము వున్నది.
తండ్రి మరియొక పురుషుడు. కావున సమానుడు మరియు తనకన్న పెద్దవాడగుటచే అధికుడు. అహంకారము తనతో సమానత్వమును అధికత్వమును సహించలేదు. తల్లి వయస్సులో పెద్ద అయిననూ ఆవిడ పురుషుడు కాదు. పురుషుని కన్నా స్త్రీ తక్కువ అను భావము వాని మనస్సులో వున్నది. కావున తండ్రి చెప్పు మాటకన్ననూ తల్లి చెప్పు మాటను వినును. ఇక తల్లి మాటకన్ననూ భార్య చెప్పుమాట ఇంకనూ బాగుగా ఎక్కుచున్నది. దీనిలో కారణమేమి? తల్లియు, భార్యయు ఇరువురును స్త్రీలే. కానీ, తల్లి వయస్సులో తనకన్న పెద్ద. పుత్రుని ‘నేను చెప్పనది వినరా!’ అని పలుకును. అది వాని అహంకారమును దెబ్బతీయుచున్నది. కానీ భార్య స్వామీ, ప్రాణనాథా అని సంబోధించుచున్నది. అచ్చట వాని అహంకారమునకు ఏ దెబ్బయును తగులుట లేదు. తనకన్నా తక్కువగా భావించిన స్త్రీ, తనకన్నా వయస్సు తక్కువది అవడం చేత ఒక దాసుడు యజమానిని సంబోధించినట్లు స్వామీ! అని వినయ విధేయతలతో సంబోధించుచున్నది. కావున భార్య చెప్పుమాట చక్కగా ఎక్కుచున్నది. అందుకే ‘తల్లి విషమాయె, పెళ్ళాము బెల్లమాయె’ అన్నారు. అయితే ఈ భార్యయే కొంత కాలమునకు తల్లియై తన పుత్రునికి చెప్పుచున్నప్పుడు వాడు తన మాటను వినక భార్య మాటను వినుచున్నప్పుడు బాధపడుచున్నదే కానీ ఈ అహంకారతత్త్వము యొక్క రహస్యమును తెలుసుకొనుటలేదు.
అందువల్లనే దత్తుడు అవతరించినప్పుడు ఎప్పుడునూ వినయ విధేయతలతో తనను అధమాధమునిగా వర్ణించుకొనుచుండును. ఏలననగా ఈ ప్రపంచము నూటికి 99 మంది అహంకారులతోనూ, అసూయాపరులతోనూ నిండియున్నది. ఆధ్యాత్మిక సాధనలో స్త్రీ జన్మ ఎంతో అదృష్టమైనది. ఏలనననగా వారిలో సాధారణముగా అహంకారము రాదు. వినయము, భయము, సిగ్గు మొదలగు సాత్త్వికగుణములతో ఉందురు. పరమాత్మ వద్ద ఈ గుణములే చెల్లును. ఈ గుణములు సాధనచేత సంపాదించు కొనవలసిన గుణములవగా అట్టి వాటినే “దైవీసంపత్తి” అని భగవద్గీత చెప్పుచున్నది. అయితే ఒకే ఒక్క గుణము వలన స్త్రీలు పరమాత్మను చేరలేకపోవుచున్నారు. అదియే అసూయా గుణము. రక్తపోటు రోగము లేదు కానీ గుండెపోటు రోగము వున్నది అన్నచో ఎట్లుండునో, అహంకారము లేదు కానీ అసూయ అను మహాసర్పము యొక్క నోటిలో పడుటవలన సాధనలో క్రిందకు జారిపోవుచున్నారు.
ఇక పురుషునిలో అహంకారము మరియు మాత్సర్యము అనబడు అసూయను రెండునూ వుండును. ఏలననగా అహంకారము ఉన్నచోట మాత్సర్యము ఉండియే తీరును. కావున రెండు మాయ రోగములు కలవారు పురుషులు. ఒక్క మాయ రోగము కలవారు స్త్రీలు. కావున పురుషజన్మ కన్నా స్త్రీ జన్మ ఎంతో ఉత్తమమయినది. అయితే ఈ మాటను విని వారు మునగచెట్టును ఎక్కరాదు. కావున అసూయ అను ఒక్క దుర్గుణము వదిలించుకోగలిగినచో వారు సత్యముగా పరమాత్మను చేరగలరు. దండకారణ్యమున ఎంతో తీవ్రమగు సాధనచేసి అన్ని అహంకారములను వదిలించుకున్న ఋషులు పురుషాహంకారము నుండి ముక్తులు కాలేకపోయినారు. వారు స్త్రీ రూపమును ధరించి స్వామిని పతిగా భావించి వినయమును ప్రదర్శించుటకు ప్రార్థించినారు. కానీ అంతమాత్రము చేత అహంకారము నశించదు కావున వారిని గోపికలుగా స్త్రీ జన్మలను ఎత్తమని స్వామి శాసించినారు. వారు గోపికలుగా పుట్టగనే వారిలో అహంకారము నశించినది. కానీ, వారిలో స్త్రీ స్వభావసిద్ధమైన అసూయా గుణము మిగిలినది. ఆ అసూయా గుణమును కూడా స్వామి పోగొట్టుటకే బృందావనములో రాసకేళిని సల్పినారు. ఒక గోపిక చూచుచుండగా మరియొక గోపికను ఆలింగనము చేసుకుని, అట్టి సమయమున వచ్చిన మరియొక గోపికను ముద్దాడుచు, పక్కన ఉన్న 3వ గోపికతో సరస సంభాషణమును అడినారు. ‘శ్లిష్యతి కామపి’ ‘చుంబతి కామపి’ ‘రమయతి కామపి రామామ్’ అని రాసకేళి వర్ణించబడినది.
దీనిలో అంతరార్థము ఏమి? స్వామిని ఒక కాముకునిగా మూఢులు భావించుచున్నారు. ‘అప్తకామస్య కా స్పృహా అను శ్రుతి ప్రకారము అన్ని కోరికలూ సిద్ధించిన వారికి ఏ కోరికా ఉండదు. ఇదే గీతలో ‘నానవాప్త మవాప్తవ్యమ్’ అని చెప్పబడినది. అనగా 'ఓ అర్జునా! నాకెట్టి కోరికయునూ లేదు. ఏలననగా నా చేత పొందబడనిది ఏదియునూ లేదు. నేను పొందవలసినది ఏదియునూ లేదు అని'. మరి స్వామి అట్లే రాసకేళిలో చేసినారు. ఏలననగా వారి యొక్క అసూయా గుణమును పోగొట్టుటకే. తన భర్త మరియొక స్త్రీపై ప్రేమను చూపినచో ఏ స్త్రీ అయిననూ భద్రకాళి వలె లేచి వానిని అంతమొందించుచున్నది. కావున దీనికి కారణము స్త్రీ స్వాభావికమైన అసూయయే. ఆ ఒక్క దుర్గుణమును పోగొట్టి ఆ జీవులను పరమ పవిత్రులను కావించి ముక్తులను చేసినారు స్వామి. ఇదియే రాసకేళి యొక్క అంతరార్థము. అచ్చట కూడా స్వామి గురుస్వరూపమే ప్రకాశించుచుండును. ఆయన యొక్క ప్రతి లీలయునూ జీవుల ఉపకారార్థమే.
★ ★ ★ ★ ★