06 Apr 2025
శ్రీభగవానువాచ:
‘కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః |
సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః’ ||
కామ్యకర్మలను వదులుట సంన్యాసమనియు, సర్వకర్మల యొక్క ఫలములను విడచుట త్యాగమనియు పండితులు తెలిపిరి. యజ్ఞము, దానము, తపస్సు ఆచరింపదగినవే గాని, విడువదగినవి కావు.
అయితే, ఈ యజ్ఞ, దాన, తపస్సులు ఆసక్తిని, ఫలాపేక్షను వదలి చేయవలెను. దేహాభిమానము గలవారికి కర్మలను సంపూర్ణముగ విడచుట సాధ్యము కాదు. ఎవడు కర్మఫలములను విడచుచున్నాడో వాడే ‘త్యాగి’ యని చెప్పబడుచున్నాడు. ఫలాపేక్షను విడువక కర్మలను ఆచరించువారలకు ‘అనిష్టము’, ‘ఇష్టము’, ‘ఇష్టానిష్టము’ అను మూడు విధములగు ఫలములు మరణానంతరము కలుగుచున్నవి. కర్మఫలత్యాగము చేయువారలకు అవి ఎన్నటికిని కలుగవు. సర్వకర్మలు నెరవేరుటకు దేహము, కర్త, ఇంద్రియములు, వివిధములగు క్రియలు, దైవము అను ఈ ఐదు కారణములై యున్నవి.
విభక్తములైన (divided) సర్వప్రాణులయందు ఆత్మ ఏకమైనదిగా తెలిసి చూచెడి జ్ఞానమును సాత్త్వికజ్ఞానమని; సకలభూతములందును వేరు వేరుగా నున్న జీవులను వేరు వేరుగా నెరవేర్చు జ్ఞానమును రాజసజ్ఞానమని; హేతువు లేనిది, పరమార్థము గానిదియు, అల్పమైనది, ఒక విషయమునందే సమస్తజ్ఞానము ఇమిడి ఉన్నట్లు తలచెడి జ్ఞానమును తామసజ్ఞానమని అందురు. ఫలాపేక్ష లేకుండా సంగరహితముగ, రాగద్వేషములు లేకుండా ఆచరించెడి కర్మను సాత్త్వికకర్మ అందురు. కోరికలతో అహంకారముతో చేసెడి కర్మను రాజసకర్మ అందురు. తాను చేసెడి కర్మ యొక్క పరిణామము ద్వారా కలిగెడి హానితో కూడిన, హింస చేయుకర్మను తామసకర్మ అని అందురు.
ఫలాపేక్షరహితుడు, అహంకారము లేనివాడు, ధైర్యముతో ఉత్పాహముతో కూడినవాడు, కార్యము సిద్ధించినను, సిద్ధించకపోయినను వికారము చెందనివాడు సాత్త్వికకర్త అనబడును. అనురాగము కలవాడు, ఫలాపేక్ష గలవాడు, లోభి, హింసాప్రవృత్తి కలవాడు, శుచిత్వము లేనివాడు, హర్షశోకములతో కూడినవాడు రాజసకర్త అనబడును. పామరుడు, జడుడు, వంచకుడు, సోమరి, దుఃఖించువాడు తామసకర్త అనబడును.
కామాదిరూపమగు ఆంతరంగిక పరమశత్రువులే ఆశ అనబడును. అట్టి ఆశయను శత్రువును ఎట్లైన జయించవలయును. ఈ కామాదిరూపములగు శత్రువులే జ్ఞానమునంతము చేసి జీవుని అధోగతికి త్రోసివేయును. కావున వానిని ముందుగా జయించవలెను. అంతరంగ శత్రువగు ఆశకు దాసులైన వారు లోకమునకంతకు దాసులే యగుదురు. నాయనా, ఆశ ఎవరికి దాసియై యొప్పునో వారికి లోకమంతయు దాసియగును.
జీవుడు సంసారసాగరమధ్యమున మునకలు వేయుచున్నాడు. జనన, మరణ ప్రవాహామునబడి నానా దుఃఖములననుభవించు చున్నాడు. అట్టి వానికి తరణోపాయము బ్రహ్మవిద్యయే. శమ, దమములను, కరుణ, దయ, పరోపకారము, భగవద్భక్తి, వైరాగ్యము మున్నగు పరమార్థ గుణములను అభ్యసించవలసినదే. నాయనా, జీవితమంతయు చతుష్షష్టి కళల సముపార్జన యందే ముందుగా వినియోగించినచో, అకస్మాత్తుగా మృత్యువు ఆసన్నమైనచో అప్పుడు మనుజుడు ఏమి చేయగలడు? ఆ విద్యలు వానిని అంత్యకాలమున రక్షించునా? యమబాధలను అవి తప్పించగలవా? లేవు. లేవు. లేవు. అట్టి శక్తి ఒక్క బ్రహ్మవిద్యకు మాత్రమే గలదు. కనుక సద్గురువులనాశ్రయించి జ్ఞానబోధను శ్రవణము చేసి, నరావతారులను గుర్తించి, సేవించి, తరించుటయే మార్గము.
ఇక జీవుడు, దేహము మున్నగు వాని గురించి తెలుసుకొందము.
జీవుడు: ఈ జగత్తు ‘పరా’, ‘అపరా’ అను రెండు భాగములతో చైతన్య-జడములుగా నున్నది. ఇందులో పరా భాగమే ఈ జీవుడు. ఈ జీవుడు జగత్తులోని ఒక కణము. పరాప్రకృతి యగు జీవుడు అన్నరస పరిణామమే (modification of food). జీవుడు తిను పంచభూతమయమైన అన్నము క్రమముగా మనస్సు, బుద్ధి, అహంకారములుగా మారుతుంది. సంకల్ప, వికల్పములనే క్రియలు మనస్సు యొక్క కార్యములు. నిశ్చయపరచి ధారణ చేయు క్రియయే బుద్ధి. నేను, నేను అను నిత్యస్ఫురణ క్రియయే అహంకారము. గ్రహించుట (receiving), ధారణము (retaining) చేయుట, మననము (repeating) చేయుట అను మూడు క్రియలే చిత్తు లేక చైతన్యస్వరూపము. ఈ చిత్తమే పరాప్రకృతి.
జీవుని విషయాలలో అత్యంత ఇష్టమైన వాటిని నిత్యధారణ చేస్తూ ఒక స్ఫోటరూపములో చిత్తములోకి చేరుతుంది. ఆ చిత్తము చైతన్యము, జలమధ్య ద్వీపములాగా, వాసనల స్ఫోటాలతో ఘనీభవించి వజ్రములాగా ఉంటుంది. ఈ వజ్రరూపమైన, ఘనీభవించిన స్ఫోటముల సమూహముతో కూడిన చిత్తమే జీవుడు. ఈ జలరూపముగా నున్న చైతన్యము దుఃఖానుభవములో యాతనాశరీరముగాను, సుఖానుభవము కోసము భోగశరీరముగా మారి జీవుని మరణములో బయటకు లాగి, నరక, స్వర్గలోకములకు ప్రయాణం చేస్తుంది. ఇదే సూక్ష్మశరీరము. జీవుడు మరణించిన పదవరోజున, మృతి అనంతరము ప్రేతలోకములో నుండు జీవునకు నేను విచారణ చేసి తీర్పునిస్తాను.
పాపకర్మలకు నరకలోకమునకు, మధ్యమకర్మలకు పితృలోకమునకు, ఉత్తమకర్మలకు స్వర్గలోకమునకు పంపుతాను. ఆ పాపులు తరువాత నర, మృగ, పశ్వాది జన్మల నెత్తుతారు. మనుష్యజన్మ మరల దుర్లభము. జీవుడు మరల జన్మించునపుడు పురుషుని రేతస్సు (sperm) ద్వారా స్త్రీ గర్భమునకు చేరును. జీవుని మరల గర్భములోనికి ప్రవేశపెట్టు బీజప్రదుడు పరమాత్మయే.
అన్నము జడశక్తి యొక్క సాంద్రరూపమే (dense form of inert energy). ఈ అన్నము తినబడి జీర్ణమై, పలచనై, చైతన్యముగా మారుచున్నది. అన్నమే చైతన్యరూపమైన జీవునిగా మారుచున్నది. చైతన్యరూపుడైన జీవుడు ఈ సృష్టిలో అతిబలహీనులలో మొదటివాడు. జీవుడు, బ్రహ్మము ఒకటి అయిననూ, శక్తి సామర్థ్యములలో జీవుడు బ్రహ్మము కాడు. పరమాత్మ ప్రళయకాల సంవర్తాగ్ని అయినచో, ఈ జీవుడు స్వామిలోని ఒక నిప్పురవ్వలోని ఒక సూక్ష్మకణము.
అసలు జీవునకు ఏ కాలమునందును బంధము లేదు. సంపూర్ణ ధ్యానస్థితిలోనున్న జీవుడు వాస్తవముగా నిత్యశుద్ధ, బుద్ధ, ముక్త ఆత్మస్వరూపుడు. కాని అంధకార బంధురమైన ఘోరతపస్సునందు పడి కోట్లకొలది జన్మలలో నానాయాతనలు అనుభవించుచున్నాడు. మూఢబుద్ధియగు జీవుడు అనిత్యమగు దేహమే తానని భావించి దేహత్మబుద్ధిని ఆశ్రయించుచున్నాడు. బుద్బుదప్రాయమైన (temporary) ఈ జీవితమందు మీనమేషములు లెక్కించుచూ వ్యర్థముగా కాలయాపన చేయుటగాని, విషయ బుద్బుదప్రాయడై, భోగలాలసుడై పారమార్థిక అవకాశమును జారవిడచుటగాని, దేహేంద్రియాది దృశ్య పదార్థములపై మమతను, అహంకారమును కలిగియుండుటగాని సరియగు మార్గము కాదు.
బ్రతికియున్న నాలుగురోజులు తన చేతులారా తాను తన ద్రవ్యమును దానధర్మములకు ఉపయోగించనిచో, తుదకు రిక్తహస్తములతో బోవునపుడు ఏ పుణ్యము వానిని కాపాడగలదు? కనుక నశ్వరమగు (imparmanent) పాంచభౌతిక దేహమును ఎన్నియో పర్యాయములు ధరించి, సుకృతవశమున చక్కటి అవకాశములతో గూడిన మానవదేహము సంప్రాప్తించినప్పుడు అమృతస్వరూపుడగు పరమాత్మను అనన్యభక్తితో సేవించుట జీవుని ప్రథమకర్తవ్యము. నా దేహము శాశ్వతము; నా బంధు మిత్రాదులు శాశ్వతము; నా సంపదలు, నా కీర్తి శాశ్వతము అని భావించుటయే అజ్ఞానము. స్వల్పమగు ఆయుర్దాయమును వ్యర్థవిలాసములందు తుచ్ఛ విషయభోగములందు వ్యర్థము చేయరాదు. అనుభవజ్ఞులైన సద్గురువులను ఆశ్రయించి తరించవలెను.
దేహము: మన శరీరాన్ని దేహమని, శరీరమని అంటారు. అదే స్వామి శరీరాన్ని, దేహము, శరీరము అనరాదు. “తనువు” అనవలెను. మన శరీరము అశాశ్వతము, జడము. దేహము అంటే దహింపబడేది అని అర్థము. శరీరము అంటే కృశించి, నశించేది అని అర్థము. మన శరీరము పంచభూతాత్మకమైనది. పృథివీ, ఆపః, తేజోః, వాయు, ఆకాశః (నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశము) అనెడివే పంచభూతములు. శరీరము అశాశ్వతమైనది. అది షడ్వికార సంపన్నము అనగా పుట్టుక, బాల్య, కౌమార, యౌవ్వన, వృద్ధాప్య, నిర్యాణములు గలది. పుట్టుట, గిట్టుట కొరకే గదా. ఈ ఆరు వికారములు ఎలా సహజమో అలా పునర్జన్మ సహజము. అంత్యకాలములో ఈ దేహము మరల ఈ పంచభూతములలో కలసిపోవును. ఈ దేహము జడము. ఇందు చైతన్య స్వరూపుడైన జీవుడు ప్రవేశించగనే కార్యక్రమములు చేయుటకు అనుకూలించుచున్నది.
శివుడైన మంగళమయమైన చైతన్యస్వరూపుడైన జీవుడు వెడలిపోగానే ఈ శరీరము శవమగుచున్నది. కనుక శరీరము అశాశ్వతమనియు, పంచభూతాత్మకమైనదనియు, ఏదో ఒకనాడు నశించక తప్పదనియు, ఈ యవ్వనము తాత్కాలికమనియు, శరీరము ఆత్మకాదనియు తెలుసుకొన్నవాడు ధన్యుడు. ఇంతేకాదు శాశ్వత వస్తువైన పరమాత్మను జీవించియున్నప్పుడే తెలుసుకొని, కొలచి, ఆరాధించి, సేవించి తరించాలి. అప్పుడే జన్మించినందులకు ధన్యత.
కనుక దేహాత్మ భావమును త్యజించి, సత్యమైన పరమాత్మను సేవించి తరించవలయును. విజ్ఞులగు వారు ప్రపంచములోని పదార్థములను చక్కగా ఆలోచించి, వాటి ఆపాత సౌందర్యములకు మురిసిపోక, వానిపై ఆసక్తిని తగ్గించుకుని; శాశ్వతమైన, స్థిరమైన, సనాతనమైన పరమాత్మయందు అనన్యభక్తి కలిగి; హృదయగుహలయందు అట్టి లోకోత్తర సౌందర్యమును సదా వీక్షించుచు, బ్రహ్మానుభూతిని బడసి జీవితమును ఆనందమయుముగా నొనర్చుకొనవలయును. దేహమను ఉపాధిని ధరించుట వలన జీవుడు దుఃఖములపాలు పడుచున్నాడు. ఇక దేహమో, కర్మము వలన ఏర్పడినది. కర్మము రాగద్వేషాదుల వలన కలిగినది. రాగాదులు అజ్ఞానము వలన జనించినది. కాబట్టి అన్ని ఆపత్తులకు మూలము అజ్ఞానము.
ఆ అజ్ఞానమును జ్ఞానముచే తొలిగించివైచినచో సమస్తదుఃఖములు తృటిలో అంతమైపోగలవు. పరిపూర్ణ దుఃఖరాహిత్యమునకు ఇది యొక్కటియే మార్గము. తనది కాని వస్తువును తనదని భ్రమించి దానిపై వ్యామోహము కలిగియుండుటయే అజ్ఞానము. ఆ వన్తువుపై మమత్వమును వృద్ధినొందించుకొనుటయే అవిద్య. వాస్తవముగా ఈ దేహము తనది కాదు. ఇంద్రియములు తనవి కావు. మనస్సుకాని, బుద్ధికాని తనవి కావు. వీని యన్నింటికిని సాక్షియైన ఆత్మయే తాను. దేహము తనది కానప్పుడు దేహము వెలుపల నుండు బంధ్వాది పదార్థములు (Relatives etc.) తనవి ఎట్లగును?
కాబట్టి విచారణచే తన ఆత్మస్వరూపమును చక్కగా నెరిగి దాని యందు నిలకడ కలవాడై, తనది కాని వస్తువులగు దేహేంద్రియాదులందును, జగత్పదార్థములయందును సక్తుడు కాక, అసంగియై, పరమానందమును జీవుడు పొందవలెను. సద్గురువును ఆశ్రయించి, వారి బోధలను శ్రవణము చేసి, మననము చేసి, నిధిధ్యాసము చేసి తరించవలెను.
పరమాత్మ: ఆత్మ పరమాత్మ కాదు. పరమాత్మ ‘అవ్యక్తము’ (అనూహ్యము) అను మాయ తెరకు వెనుకనున్నాడు. పరమాత్మను పొందుటకు కానీ, కనీసము తెలుసుకొనుటకు గాని సాధ్యుడు కాడు. కాన ఆత్మప్రాప్తి, పరమాత్మ ప్రాప్తి కాదు. బ్రహ్మమే సత్యము. జగత్తు అత్యంతాల్పము కనుక అసత్యము. వేదవాక్య ప్రమాణ ప్రకారము బ్రహ్మ నిర్వచన, నిరూపణము వలన ఈ దత్తుడే ఆ బ్రహ్మము అయి ఉన్నాడు. జీవుడు బ్రహ్మము కాదు. పరమాత్మ అనుగ్రహము వలన బ్రహ్మము కాగలడు. లోకములో ఉన్నది ఇద్దరే – పరమాత్మ మరియు జీవుడు. పరమాత్మ పురుషుడు, జీవుడు ప్రకృతి. జీవుడు ప్రకృతియే కాని పురుషుడు కాడు. స్త్రీ శరీరము, పురుష శరీరములలో గల జీవుడు పురుషుడే అనబడును. పరమాత్మ పురుషోత్తముడగును. కాన శరీరమాత్ర భేదము చేత స్త్రీ, పురుష భేదమును పాటించుట అజ్ఞానము, భ్రమ. ఈ జన్మలోనే కడతేరే మార్గమును గుర్తించి, ఋషులు, మహాత్ములు బోధించిన మార్గములో పయనించి, ఈ పరమ లక్ష్యములను ఈ జన్మయందే, ఇప్పడే సాధించుట ఉత్తమము గదా. ఏలననగా ఇట్టి సదవకాశము మరుజన్మయందు లభించునో లేదో చెప్పజాలము కదా.
శ్రీదత్తాత్రేయుని షోడశ అవతార నామములు
i) ఓం శ్రీ యోగిరాజాయ నమః
ii) ఓం శ్రీ అత్రివరదాయ నమః
iii) ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః
iv) ఓం శ్రీ కాలాగ్నిశమనాయ నమః
v) ఓం శ్రీ యోగిజనవల్లభాయ నమః
vi) ఓం శ్రీ విశ్వంభరాయ నమః
vii) ఓం శ్రీ సిద్ధరాజాయ నమః
viii) ఓం శ్రీ జ్ఞానసాగరాయ నమః
ix) ఓం శ్రీ విశ్వంబరావధూతాయ నమః
x) ఓం శ్రీ అవధూతాయ నమః
xi) ఓం శ్రీ మాయాముక్తావధూతాయ నమః
xii) ఓం శ్రీ శివరూపాయ నమః
xiii) ఓం శ్రీ ఆదిగురవే నమః
xiv) ఓం శ్రీ దేవదేవాయ నమః
xv) ఓం శ్రీ విశ్వంబరావధూతాయ నమః
xvi) ఓం శ్రీకృష్ణశ్యామకమలనయనాయ నమః
★ ★ ★ ★ ★