home
Shri Datta Swami

 25 Jan 2025

 

నరావతారము ప్రయత్నపూర్వకంగానే స్వరూప జ్ఞానము కలిగియుండదు

Updated with Part-2 on 26 Jan 2025


Part-1   Part-2


Part-1

[05-02-2003] పరమాత్మ అవతరించునపుడు కన్నులకు పూర్తిగా అజ్ఞానమను గంతను మహామాయచే కట్టించుకుని భూలోకమునకు వచ్చును. ఎట్టి పరిస్థితులలో కూడ ఆ గంతను విప్పరాదని మహామాయను శాసించి వచ్చును. మహామాయ స్వామికి దాసి కావున యజమాని యొక్క ఆజ్ఞను మరువజాలదు. ఈ గంత కన్నలకు ఉన్నప్పుడే భూలోకమున నవరసములను సంపూర్ణముగా అనుభవించుటకు వీలగును. ఈ నవరసములను అనుభవించునపుడు, పరమాత్మ తన యొక్క స్వరూపజ్ఞానము లేకయుండును. స్వరూపజ్ఞానము కలిగియున్నచో రసములకు భంగము కలుగును. ఉదాహరణకు స్వామి కృష్ణ రూపములో నున్నప్పుడు ఒక భక్తురాలు గిన్నెలో పెరుగువేసి ఇచ్చినది. ఆ పెరుగును స్వామి ఎంతో ప్రియముగా భుజించుచున్నాడు. ఆ సమయములో స్వామి తన స్వరూపజ్ఞానమును పొందినచో (తాను పరబ్రహ్మమని జ్ఞానమును పొందినపుడు) జగత్తు అంతయు ఊహాస్వరూపముగా మారును. అప్పుడు ఆ పెరుగు కూడా ఊహయే యగును. పెరుగును ఊహించుకొని ఊహాస్వరూపముగా నున్న పెరుగును తినువాడు, పెరుగును తిను ఆనందము పొందజాలడు. కావున భూలోకములో స్వామి వినోదమునకు అజ్ఞానము ఎంతో అవసరము.

వైకుంఠములో నారాయణుడు లక్ష్మియు నిరంతరము శేషశయ్యపై ఉన్నారు. ఆ లోకములో వారిని ఎవరును విడదీయజాలరు. నిరంతర అమృతధారలతో అఖండానంద స్వరూపులై ఉన్న ఆ స్థితి ఎట్టిదైనను కొంతకాలమునకు వెగటు కల్గించును. ఎప్పుడును చూచుచున్నచో మొగుడినియైనను మొట్టబుద్ధి కలుగుని సామెత కలదు. కావున నిత్య సహచర్యము గల లక్ష్మీ నారాయణులు భూలోకమునకు వచ్చి వియోగమును అనుభవింపదలచినారు. ఆ వియోగములోనే ఒకరిపై మరియొకరికి ఎంత ప్రేమ యున్నదో బయటపడును. దానిని ఒక చలనచిత్రముగా తీసి స్వామి లక్ష్మితో వైకుంఠమునకు వచ్చినపుడు, దానిని ప్రదర్శించు సేవను చిత్రగుప్తుడను వాడు ప్రకటింపచేయును. ‘చిత్రేణ గోపయతి సర్వం ఇతి చిత్రగుప్తః’ అనగా అన్ని దృశ్యములను, సంభాషణలను చలనచిత్రము ద్వారా రక్షించువాడు అని అర్థము. రావణుడు సీతను అపహరించినపుడు రామునికి స్వరూపజ్ఞానము కల్గినచో ఏమగును?

రాముడు ఏడ్చుటకు బదులు ఒక చిరునవ్వు చిందించి, మన ద్వారపాలకుడగు జయుడు తన తల్లిని తన ఇంటికి తీసుకొనిపోయినాడు అనుకొనెను. అప్పుడు లక్ష్మీదేవిపై యున్న ప్రేమ, మూర్ఛపోవుట, విలపించుట మొదలగు వాని ద్వారా వ్యక్తమగుటకు అవకాశము లేదు. ఈ అజ్ఞానపు గంత స్వామికే కాదు స్వామి వెంటవచ్చు సేవకులకు కూడ కట్టపడును. రావణునకు అజ్ఞానపు గంత కట్టియుండుట చేతనే సీతను అపహరించుకొని పోగలిగెను. అజ్ఞానపు గంతయే లేనిచో రావణునకు కూడ స్వరూపజ్ఞానము కలిగినచో అనగా తాను జయుడు అన్న జ్ఞానము కలిగినచో సీతాదేవిని బలాత్కారముగా అపహరించుటకు బదులు ఆమె పాదములపై బడి భక్తితో నమస్కరించును. అట్లు జరిగినచో వియోగములో ప్రేమను వ్యక్తపరచు అవకాశము లక్ష్మీనారాయణులకు పోవును. వారు భూలోకమునకు వచ్చుట వ్యర్థమగును.

Swami

వైకుంఠమున స్వామితో పాటు స్వామి సేవకులు కూడ నిరంతర బ్రహ్మానంద స్థితిలో ఉండి, వారు కూడా మార్పుకై భూలోకమునకు వచ్చుచున్నారు. స్వామికి ఉన్న సౌకర్యములన్నియు స్వామి సేవకులకు ఉండును. స్వామికివలె వీరికిని గర్భనరక దుఃఖము మరణ వేదన ఉండవు. శరీరము చాలించిన తర్వాత స్వామితో పాటు వీరును వైకుంఠమునకు పోవుదురే తప్ప ఇతర జీవులవలె పుణ్యపాప కర్మలననుసరించి స్వర్గనరకములకు పోరు. ఇతర జీవులకు మాత్రమే మరణానంతరము విచారణ, దానిననుసరించి స్వర్గనరకముల ప్రాప్తియుండును. స్వామి సేవకులకు విచారణ ప్రసక్తియే లేదు. విచారణ చేయు యమధర్మరాజు సహితము వీరికి నమస్కరించి, స్వామి అనుగ్రహము తనపై పడునట్లు చేయమని ప్రార్థించును.

 

Part-2

కావున అజ్ఞానము, కష్టములు తక్కువయని భావించరాదు. నిత్యానంద స్థితిలో వెగటు కొని వచ్చిన వానికి కష్టములు అమృతము వలెయుండును. భూలోకమున అజ్ఞానము లేనిదే స్వామికి వినోదము కలుగదు. కావున స్వామి సృష్టించిన ప్రతిదానికి ప్రయోజనమున్నది. ప్రయోజనము లేక స్వామి దేనిని సృష్టించడు. కష్టము లేనిదే సుఖము యొక్క విలువ తెలియదు. రాత్రి లేనిచో పగలు యొక్క విలువ తెలియదు. సాయంకాలము వచ్చుసరికి, ఎప్పడు రాత్రి వచ్చునా అనిపించును. తెల్లవారు ఝామున సూర్యోదయమెప్పుడు జరుగునా అని భావింతురు. ఈ అజ్ఞానవు గంత స్వామి కట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి తీవ్ర పరిస్థితిలో ఒక్క క్షణకాలము కండ్ల గంత జారిపోవచ్చును. నిద్రలో కలనుగాంచువారు ఒక్కొక్కసారి ఒక తీవ్ర సన్నివేశమునకు మేల్కొని యదార్ధ ప్రపంచము లోనికి వచ్చును. అట్లే స్వామియు ఒక్కొక్క తీవ్ర పరిస్థితిలో ప్రమాదవశమున కండ్ల గంత జారినట్లు అజ్ఞానము తొలగి స్వరూపజ్ఞానము పొందును. అతి తీవ్రమైన సీతా వియోగదుఃఖమును తట్టుకొనలేని సమయమున ఒక్క క్షణకాలము స్వామికి కండ్ల గంత జారినది అప్పుడు స్వామి లక్ష్మణునితో ‘లక్ష్మణా! ఈ దుఃఖమును భరించలేను ఈ సృష్టినంతను ప్రళయముగావించి ఉపసంహరిస్తాను’ అన్నాడు. దానికి దేవత లందరును గోలపెట్టగా – మహామాయ హడావిడిగా పరుగెత్తుకు వచ్చి జారిన కండ్ల గంతలను గట్టిగా కట్టినది. అప్పుడు రాముడు లేచి సీతాన్వేషణమును కావించెను.

ఒక గొర్రె వేషములలో సింహమున్నది. అదియును గొర్రల స్వరముతోనే అరచుచు గొర్రెలలో కలసిపోయినది. ఆ గొర్రెల మంద మీదకి ఒక ఏనుగు వచ్చినది. అప్పుడు గొర్రె వేషములో యున్న సింహమునకు తీవ్రముగా మొరపెట్టినచో ఆ సింహము తన కంఠస్వరముతో గాండ్రించుచు గొర్రె వేషమును విదల్చివేసి ఏనుగు మీదకి లంఘించును. కాని అది నిజముగ గొర్రెయే యైనచో నీవు ఎంత మొరపెట్టినను, ఎన్ని వాద్యములను వాయించినను ఏనుగును చూచి గొర్రె ఏనుగు మీదకి లంఘించజాలదు. కావున ఏనుగు రాని సమయమున నేను సింహమును, నేను సింహమును అని ప్రతి గొర్రె పల్కుచున్నది. అట్లే ప్రతి అద్వైత పండితుడును ‘అహంబ్రహ్మస్మి’ అని వాగుచున్నాడు. బ్రహ్మము ముందు జగత్తు ఊహాస్వరూపమగు మిధ్యకావలయును. అహంబ్రహ్మస్మి అన్న శంకరులు మండనమిశ్రుని ఇంటికి పోయినప్పుడు తలుపులు గడియ వేసియుండగా శంకరులు ఆ తలుపులలో గుండా లోపలికి వెళ్ళినారు. కావున ఆయనకు జగత్తు మిధ్యయని నిరూపించబడినది. కావున ఆయన బ్రహ్మమే. కాని మన అద్వైత పండితులలో ఆ విధముగా ఎవరు వెళ్ళినను లోపలకు పోకపోవుటయే కాక, తలుపు ఢీ కొట్టుకున్నందున నుదురు బొప్పికట్టును.

Swami

శంకరులు కరిగిన సీసమును త్రాగినాడు. హాలాహలమును త్రాగిన శివుడు తానేనని నిరూపించుకున్నాడు. కావున శివక్కేవలోహం అనుట సత్యమే. ఆయన గొర్రె వేషములో దాగిన సింహము. మన అద్వైత పండితులు అద్వైత భాష్యమును వచింతురే కాని శంకరులు మండనమిశ్రుని ఇంటిలోనికి పోవుట, కరిగిన సీసమును త్రాగుట అను రెండు విషయములను గురించి ప్రస్తావించరేల? అనగా ఏనుగు గొర్రెల మందల మీదకి వచ్చిన విషయమును గొర్రెలు ప్రస్తావించవు. అవి ప్రస్తావించినచో ఒక్క గొర్రెను మాత్రమే సింహము అనవలసివచ్చును. తమలో నున్న ఒకసాటి గొర్రెను సింహము అనుటకు అసూయ, అహంకారములు మనస్సునకు క్రమ్ముకొనుచున్నవి. కావున దత్త సేవకులు ఈ జగత్తులో వచ్చు కష్టములను గురించి ఆలోచించి, దత్తసేవకు ఫలము లేదని భావించరాదు. స్వామితో పాటు వారును ఈ లోకమునకు కొంతకాలము వచ్చి పైలోకమున కలిగిన నిత్యానంద స్థితి యొక్క వెటును పోగొట్టుకొనుటకు కష్టములను అనుభవించుచున్నారని మరియును వారికి స్వరూపజ్ఞానము కలిగినచో ఈ కష్టానుభవ వినోదము పూర్తిగా అనుభవించలేరని తెలుసుకొని, కావున జీవులుగా అజ్ఞానస్థితిలో ఉన్నారని గ్రహించవలెను. స్వామియే ఇట్టి స్థితిలో యుండి వినోదించుచుండగా, ఆయన సేవకులు మాత్రము అదే స్థితిలో యుండి వినోదించరా? మరియును వారికి నరరూపమున ఉన్న స్వామిని గుర్తించు జ్ఞానము కూడ ఉండదు. అది ఉన్నచో, స్వామి ఉండగా భయమేలయని వారు కష్టములను వినోదించజాలరు. రాముడే నారాయణుడని సీతకు తెలిసియున్నచో, రావణుడు సీతను తీసుకొనిపోవుచున్నప్పుడు సీత ఏడ్చునా? విశ్వవ్యాప్తియగు విష్ణువే నా భర్తయై యుండగా నాకేమి భయమని, రావణుని వెంట నవ్వుతూపోవును. కావున స్వామి సంకల్ప ప్రకారమే ఈ అజ్ఞానము దాని ప్రయోజనమును నిర్వర్తించుచున్నది. నా సంకల్పము చేతనే జ్ఞానము, అజ్ఞానము రెండును ప్రవర్తించుచున్నవని గీతలో ‘మత్తః స్మృతిః జ్ఞానమపోహవంచ...

 

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch