home
Shri Datta Swami

 13 Apr 2025

 

ప్రథమావతారమైన బ్రహ్మమును నేనే


Part-1   Part-2


Part-1

[25.02.2000 ఉదయం 6 గం.] నేను బ్రహ్మమును. ఈ నామము వేదోక్తమైనది. నా ప్రథమావతారము బ్రహ్మదేవుడు. నేను చేసిన ప్రథమసృష్టి సనక సనందాదులు. వీరు బ్రహ్మమును గుర్తించిన వారు, నిజమైన బ్రాహ్మణులు. అందువలన సంసార లంపటమును నిరాకరించినారు. ఈ నలుగురే నాలుగు వేదములు. విద్– జ్ఞానే అన్న ధాత్వర్థము ప్రకారము వేదము అనగా జ్ఞానము. బ్రహ్మశబ్దమునకును వేదము అని అర్థమున్నది. బ్రహ్మజ్ఞానమే వేదము. వేదవేత్తయే బ్రాహ్మణుడు. వేదాధ్యయనము (వేద+అధి+అయనము) అనగా జ్ఞానసంపాదనమే. గత్యర్థ ధాతువు (verbal root denoting action) అయిన అయనము  జ్ఞానార్థమున (verbal roots denoting action, also denote knowledge) వాడబడినది. కావున కేవలము వేదమును కంఠస్థము చేసినంత మాత్రమున వేదాధ్యయనము కాదు. ఒక శాస్ర్తమును కంఠస్థము చేసినంత మాత్రమున వాడు ఆ శాస్ర్త పండితుడు కాజాలడు. ఆ శాస్ర్తజ్ఞానము తెలియవలయును. అందుకే, ‘అనర్థజ్ఞుడు పాఠకాధముడని’ శాస్ర్తవచనము.

Swami

బ్రహ్మము – బ్రహ్మదేవుడు – బ్రాహ్మణుడు

ఈ మూడు శబ్దముల విచారము బ్రహ్మజ్ఞానములో సారాంశమైయున్నది. బ్రహ్మమైన నేను బ్రహ్మదేవుని స్వరూపములో గురువుగా బ్రాహ్మణులకు జ్ఞానప్రచారము చేయుచు, వేదములను నాలుగు శునకరూపములతో నా వెంట తిప్పుచున్నాను. అందువలన, నేనే బ్రహ్మమును. నేనే బ్రహ్మదేవుడను. నేనే బ్రాహ్మణుడను కూడ. బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానము లేక కేవలము స్వార్థపూరితుడైనపుడు తన పవిత్రతను కోల్పోయి అహంకారియై అపవిత్రతను పొందుచున్నాడు. కాన ఈ శునకము నిజముగా పవిత్రమైన వేద–జ్ఞానరూపము. కానీ అట్టి పవిత్రతను కర్మచేత కొల్పోయినపుడు అపవిత్రమైనదిగా చూడబడుచున్నది.

గాయత్రి

గాయత్రీమంత్రము కేవలము ఒక ఛందస్సు యొక్క నామమే తప్ప దేవత కాదు. సవితయే దేవత. ‘గాయత్రీ ఛందః, సవితా దేవతా’ అని వేదము అన్నది కదా. అబ్రాహ్మణుడైన విశ్వామిత్రుడు ఈ గాయత్రీ ఛందోధిదేవతయగు సవితనుపాసించి బ్రహ్మత్వమును పొంది బ్రాహ్మణుడైనాడు. సవిత యనగా సృష్టించువాడు, అనగా బ్రహ్మదేవుడే. ‘షూఞ్ –  ప్రాణి ప్రసవే’ అని ధాతువు. అనగా బ్రహ్మదేవుడగు నన్ను ఉపాసించి, బ్రహ్మజ్ఞానము పొంది బ్రహ్మర్షియైనాడు. సవిత గురువు. శిష్యుల బుద్ధులను పదును పెట్టి ప్రేరేపించువాడు ‘ధియో యో నః ప్రచోదయాత్’ అనగా ఇదే అర్థము. సూర్యుని వలె జ్ఞానతేజస్వియై, శిష్యుల బుద్ధి కమలములకు వికాసము కలిగించువాడే సవిత. అంధకారమును పోగొట్టువాడే గురువు అని తాత్పర్యము. నా సాక్షాత్కారమున బ్రహ్మమును గుర్తించి బ్రాహ్మణుడైన విశ్వామిత్రుడు ఆ మంత్రమునకు ఋషియైనాడు.

వేదోఽఖిలో ధర్మమూలమ్’, ‘అహింసా పరమో ధర్మః’. బ్రాహ్మణుడు ధర్మము చేత అనగా గుణ, కర్మలచేత బ్రాహ్మణత్వమును పొందును. సర్వధర్మాధారము వేదము. సర్వధర్మముల సారాంశము అహింస. ‘ఘాతం న ఘాతయేద్విప్రః’ అని అన్నారు. అపకారికి సైతము ఉపకారము చేయువాడే బ్రాహ్మణుడు. ఏ అపకారము చేయని సాధువులగు మేకలను యజ్ఞములలో వధించువాడు బ్రాహ్మణుడెట్లు అగును? బ్రహ్మజ్ఞానము చేత సత్యమైన బ్రాహ్మణత్వము కలుగును. కేవల బ్రాహ్మణ వంశజన్మ మాత్రమగు నామ బ్రాహ్మణత్వములో ఏమున్నది?

నేను చండాలరూపములో దర్శనమిచ్చుచున్నాను. మరల అత్రిపుత్రునిగా నేను బ్రాహ్మణుడను. దీని అర్థమేమి? బ్రాహ్మణుడు కర్మచేత చండాలుడుగా మారును అనియే. పవిత్ర వేదపురుషుడు అనగా బ్రహ్మజ్ఞానము కల బ్రాహ్మణుడు అపవిత్ర శునకముగా మారుట సాధ్యమే అనగా చండాలత్వమును పొందును అనియే కదా. యజ్ఞముల ద్వారా మాంసాహారమును భుజించుచు, సోమరసమను మద్యమును త్రాగుచున్నవాడు బ్రాహ్మణుడు కాడు. రాజుల నాశ్రయించిన ఋషులు క్రమముగా ఈ దురభ్యాసము పాలైనారు. సంగము చేత గుణములు సంక్రమించును. సోమపానము అనగా మనస్సును నిగ్రహించుట. సోముడు అనగా చంద్రుడు. చంద్రుడు మనస్సును సూచించును. త్రాగుట అనగా నిగ్రహించుట. విశ్వామిత్రుడు బ్రహ్మర్షియైనాడు అనగా సత్యబ్రాహ్మణుడైనాడు. బ్రహ్మమును గుర్తించి, బ్రహ్మమునుపాసించి, బ్రహ్మత్వమును పొందుటయే సత్యబ్రాహ్మణత్వము. ఇట్టి సత్య బ్రాహ్మణత్వమును ఏ ప్రాణియైననూ పొందవచ్చును. మానవజాతి కన్న తక్కువ ప్రాణియగు కోతియగు హనుమంతుడు ఇట్టి సత్య బ్రాహ్మణత్వమును పొందినాడు. ఇక మానవజాతిలో అవాంతర వర్గములగు ఇతర వర్ణముల వారు ఈ సత్య బ్రాహ్మణత్వమును పొందుటలో అభ్యంతరమేమున్నది? అన్ని ప్రాణులును భగవంతుని బిడ్డలే కదా! ‘అహం బీజప్రదః పితా’ అని గీత కదా. కావున భగవంతునికి ఎట్టి పక్షపాతము ఉండదు.

అసత్య బ్రాహ్మణత్వమునే నామమాత్ర బ్రాహ్మణత్వమనియు దీనియే ‘బ్రాహ్మణ బ్రువాః’ అని శాస్ర్తము చెప్పుచున్నది. అనగా వీని వంశములో సత్యబ్రాహ్మణులు వెనుక ఉన్నారు, వీడు వారి సంతానము యొక్క వంశపరంపరలోని వాడని అర్థము. అట్టి నామమాత్ర బ్రాహ్మణత్వమును పొందుటకు ప్రయత్నించనేల? అది వ్యర్థము. అసంభవము. ఏలననగా–ఒకడు తన వంశమును వదలి మరియొక వంశములోనికి ఎట్లు ప్రవేశించును? కాశ్యపగోత్రుడు కౌండిన్య గోత్రుడెట్లు అగును? వివాహములో కన్య యొక్క గోత్రాంతరీకరణము జరుగుచున్నది కదా అన్నచో అక్కడ అది ముఖ్యము కాదు గౌణమే (secondary). వారు కన్యను తమ మనిషిగా గుర్తించుటకు చేయబడిన గౌణక్రియయే. నిజముగా కన్య గోత్రాంతరీకరణము చెందినచో, కాశ్యపగోత్రుడగు వరునకు గోత్రాంతరీకరణము ద్వారా కాశ్యప గోత్రమును పొందిన కన్య సోదరి కావలసివచ్చును. అట్లు అయినచో సంతానమునకు రెండు గోత్రములు సిద్ధించును కదా అన్నచో నిజమే. సత్సంప్రదాయమును పాటించు పుణ్యభూములగు ఉత్తర దేశముల వారు మేనమామ కూతురును, కూతురుగానే, అక్క లేక చెల్లెలు కూతురును కూతురిగానే భావించుచున్నారు కదా. కావున ఇతర వర్ణముల వారు, ఇట్టి నామమాత్ర బ్రాహ్మణత్వమును పొందుటకు ప్రయత్నించుట అజ్ఞానమగును. అట్టి ప్రయత్నము కేవలము ఈర్ష్యాద్వేషములలో చేయు పామరకర్మ యగును. ఈర్ష్యాద్వేషములన్నంత వరకును సత్యబ్రాహ్మణత్వము అసలు సిద్ధించదు. అట్టివారు ఏ విధముగను బ్రాహ్మణులు కాలేరు. విశ్వామిత్రుడు వశిష్టునిపై ఈర్ష్యతో ఉన్నంతకాలము ఏ బ్రాహ్మణత్వమును పొందలేకపోయెను. వశిష్టుని సంతానమును సంహరించుట చేత హింసకు పాల్పడినందున బ్రాహ్మణత్వము సిద్ధించలేదు. అహింస పరమధర్మము. పరమధర్మము నాచరించక, బ్రాహ్మణుడు పరముడు (శ్రేష్ఠుడు) ఎట్లు అగును. కొందరు ‘యజ్ఞా దన్యత్ర’ అని చెప్పి, యజ్ఞములో తప్ప, ఎక్కడను ప్రాణిహింసను చేయరాదని చెప్పుదురు. కానీ ధర్మశాస్ర్తములు ‘మహావ్రతం దేశకాలా పరిచ్ఛిన్నమ్’ అని చెప్పుచున్నవి. అనగా ఏ దేశమునందును, ఏ కాలమునందును నియమము తప్పకుండుటయే మహావ్రతము. మహావ్రతము నాచరింపక బ్రాహ్మణుడు ‘మహాన్’ (గొప్పవాడు) ఎట్లు అగును? కావున యజ్ఞములందును పశువధను చేయరాదు. అచ్చట పశువు అనగా తన అజ్ఞానమే. అజ్ఞానమును వధించి జ్ఞాని కావలయును. బుద్ధుడు, మహావీర, జినుల కన్న ఉత్తముడగు బ్రాహ్మణుడు లేడు. వారు ప్రాణిహింసను సర్వకాలములందును, సర్వదేశములందును నిషేధించిరి. కాశీక్షేత్రము, శివరాత్రి అను దేశకాల భ్రమలను జ్ఞాని త్యజించవలయును.

కాశీ అనగా ‘కాశతే ఇతి - కాశీ’. అనగా ప్రకాశించునది కాశి అని అర్థము. ఎచ్చట సత్సంగము ద్వారా జ్ఞానము ప్రకాశించునో ఆ ప్రదేశము కాశీ అగును. శివరాత్రి అనగా మంగళకరమగు రాత్రి. ఏ రాత్రియందు సత్సంగము చేయుచు భగవదాకర్షితులై, అప్రయత్నముగ నిద్రరాకుండ జాగరణము జరుగునో అదే మంగళకరమగు సత్సంగము జరిపిన శివరాత్రి. పగలు, ఆహార సంపాదనము కొరకు వృత్తిలో ప్రాణులు నిమగ్నులగుదురు కావున, రాత్రి విశ్రాంతిగా నుండును కావున రాత్రి కాలము చెప్పబడినది. కావున కాశీ, ఏ ప్రదేశమైనను కావచ్చును. శివరాత్రి, ఏ రాత్రియైనను కావచ్చును. కోరికలు లేక, భగవత్ర్పేమతో ప్రతిఫలము నాశింపక చేయు ఆరాధనము జరుగు ప్రదేశమే కాశి. అట్టి ఆరాధనము జరుగుచున్న రాత్రియే శివమగు శివరాత్రియని జ్ఞానులు తెలియుచున్నారు. కావున మాంసమును ముట్టినవాడు బ్రాహ్మణుడు కానేరడు. అయితే, పూర్వ జన్మమున, పశువును చంపువాడు పశువుగను, ఈ పశువు, పశువును చంపువాడుగను (butcher) ఉండిరి. కావున ఈ జన్మమున చంపినవాడు పశువుగను, పశువు చంపువాడుగను పుట్టియున్నారు. కావున పశుహింస పాపము కాదని వాదించుట అవివేకము. అది నిజమే అనుకొందము. అట్టి పశువును నీవేల చంపవలయును? భగవంతుడే చంపును. నీవు ఒకడిని కొట్టినావనుకొనుము. రాజు విచారించి నీకు వంద కొరడా దెబ్బలను విధించినాడు. ఆ కొరడా దెబ్బలను నీవు కొట్టిన వానిచేతనే కొట్టించవలయునా? అవసరము లేదు. కొరడా దెబ్బలను కొట్టువాడు ఒకడున్నాడు. వాడు కొట్టినచో ఇంకా బలముగా కొట్టును. కావున, సర్వపాపములను శిక్షించుటకు కాలభైరవుడున్నాడు. ‘సర్వపాపాల భైరవుడు’ అను సామెతకు అర్థమిదే. కావున ఇట్టి అజ్ఞాన జనితమైన అతి తెలివితేటలతో వాదించి, పాపములను చేసినచో శిక్ష తప్పదు.

బ్రాహ్మణవర్ణములో స్త్రీలున్నారు. వారు గాయత్రీ మంత్రమును జపించరు. వారికి యజ్ఞోపవీతము లేదు. గాయత్రీ మంత్రోపదేశము, యజ్ఞోపవీతము లేనివారు బ్రాహ్మణులు కారు అన్నచో, బ్రాహ్మణస్త్రీలు బ్రాహ్మణులు కాకుండపోవలసివచ్చును. అట్టి బ్రాహ్మణస్త్రీలు బ్రాహ్మణులు కాని యెడల, వారు వండు అన్నము ఎట్లు నివేదించి బ్రాహ్మణులు భుజించుచున్నారు? అట్టి వారికి జన్మంచిన సంతానము బ్రాహ్మణులు ఎట్లు అగుదురు? బ్రాహ్మణస్త్రీలకు వేదాధ్యయనమునందు అధికారము లేదు. కావున మూడు పోగులుకల యజ్ఞోపవీతార్థము ఏమిటి? వివాహములో మరియొక మూడు పోగులు ఎందుకు వేసుకొనుచున్నారు. కొన్ని దేశములలో మరియొక మూడు పోగులు ఎందుకు? గాయత్రి అనగా ఏమి? మంత్రము అనగా ఏమి? జపము అనగా ఏమి? ఈ ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొన్నచో భ్రాంతియంతయును విడిపోవును. జ్ఞాన సూర్యకాంతి చేత, అజ్ఞానాంధకారము పటాపంచలగును.

బ్రాహ్మణ స్త్రీ ప్రతిమాసము నందును రజస్వలయగు చున్నపుడు ‘ప్రథమేఽహని చండాలీ.... పంచమేఽహని సుస్నాతా విప్రత్వం సా గమిష్యతి’ అని చెప్పుచున్నారు. అనగా స్త్రీ మొదటిదినము చండాలవర్ణమును పొంది, తిరిగి 5వ రోజు స్నానము చేత బ్రాహ్మణి యగుచున్నది అను ధర్మశాస్త్రములో అర్థమేమి? 5వ రోజు బ్రాహ్మణస్త్రీ యజ్ఞోపవీతమును ధరించుట లేదు కదా మరి బ్రాహ్మణి ఎట్లు అయినది? బ్రాహ్మణిగ బ్రాహ్మణత్వమును పొందినచో, వేదాధ్యయనము నందు నిషేధమేల?

 

Part-2

[02-02-2000 ఉదయం 6 గంటలకు]

ఈ ప్రశ్నల విచారణయే బ్రహ్మజ్ఞానము యొక్క పూర్వరంగము (background). మరియు బ్రాహ్మణుడగు రావణుని సంహరించుట సమ్మతము అగుట–బ్రాహ్మణులు, బ్రాహ్మణుడు కాని రాముని, కృష్ణుని విగ్రహముల పాదములు కడిగి ఆ పాదతీర్థమును సేవించుట–అంత్యకులమున జన్మించిన శబరి, భక్త కన్నప్ప చిత్రములను బ్రాహ్మణులు సైతము పూజా మందిరములలో నుంచుట కూడ తెలియవలెను.

వేదము అనగా జ్ఞానము. ఇది బ్రహ్మము యొక్క జ్ఞానము. బ్రహ్మము వాఙ్మనో బుద్ధి తర్కాతీతమని (beyond words, mind, intellect and logic) శ్రుతులు ఘోషించుచున్నవి. కావున బ్రహ్మము యొక్క తత్త్వజ్ఞానము అసంభవము. బ్రహ్మమెవరు? అను స్వరూపమును గుర్తించుటయే బ్రహ్మజ్ఞానము. ఇట్టి జ్ఞానము యొక్క జ్ఞానమే అధ్యయనము. వేదమనగా ఏమి? బ్రహ్మమునకు సంబంధించిన ఏ వాక్యమైననూ వేదమే. స్వరములతో పరంపరగా వచ్చు వాక్యములే వేదమా? అదే వేదమైనచో అట్టి వాక్యముల అధికారము లేని వారందరును బ్రహ్మము యొక్క ఉపాసనకు నిషిద్ధులేనా? అదే నిజమైనచో ఈ సృష్టిని సృష్టించిన బ్రహ్మమునకు అది అభిమతమగునా! సర్వజీవులును బ్రహ్మము యొక్క సంతానమే కదా. సంతానములో కొందరిపై పక్షపాతము, కొందరిపై ద్వేషము బ్రహ్మమునకు ఉండునా? అయితే సర్వవేదవాక్యముల ప్రత్యేకత ఒకటి ఉన్నది. సర్వవేదవాక్యములు అనాది నుండియు గురు పరంపరగా వచ్చుచున్నవి. వాటి యందు ఎట్టి మానవ వాక్యముల మిశ్రమము లేదు. మిగిలిన గ్రంథములట్లు కాదు. పురాణాదులలో వ్యాసప్రోక్తములు కాని అనేక భావములను కల వాక్యములు ఇతరుల చేత దూర్చబడినవి (ప్రక్షేపములందురు). కావున బ్రహ్మజ్ఞానము కలుషితమైనది. వేదములట్లు కాదు. పరంపరగా, అధ్యయనము ద్వారా రక్షింపబడినవి. కావున వేదములలోని బ్రహ్మజ్ఞానము కలుషితము కాలేదు.

అయితే, వేదవాక్యములే ప్రమాణము అనుటలో ఆ వాక్యములలోని అర్థము ప్రమాణమనియే తప్ప వాక్యములో ఏ ప్రత్యేకతయు లేదు. ఆ వాక్యముల అర్థమే కల ఇతరములగు స్వరములులేని వాక్యములును వేదమే అగును. వేదము శబ్దము కాదు. శబ్దార్థము. వేదము అనగా జ్ఞానము (విద్–జ్ఞానే). అట్టి వేదముల అర్థములను బోధించు ఆచార్యుల భాష్య వాక్యములును, స్వరములు లేకున్ననూ ప్రమాణమే. కావున వేదము శుద్ధ బ్రహ్మజ్ఞానమును బోధించుచు, అర్థదృష్ట్యా (from the angle of meaning) పరమ ప్రమాణమే కాని శబ్దదృష్ట్యా (from the angle of accents) పరమ ప్రమాణమని తలచరాదు. వేదము యొక్క అర్థముననుసరించి చెప్పబడిన ఏ వాక్యమైననూ వేదమే. వేదమును అనుసరించి చెప్పబడిన పురాణాది స్మృతులును వేదమే అగును. అయితే అట్టి స్మృతులలో ఇతరులు దూర్చిన వాక్యములు వేదార్థమును విరోధించుచున్నచో అట్టివి ప్రమాణములు కావు. ‘శ్రుతేరివార్థం స్మృతిరన్వగచ్ఛత్’ అని, శ్రుతిని స్మృతి అనుసరించవలయునని మహాత్ముల వచనము. కావున వేదము అనగా కేవల స్వరవాక్యములే కాదు. వేదార్థమును అనుసరించు వాక్యములు వేదస్వరరహితములైనా వేదమే కావున, వేదాధ్యయనమునకు సర్వులును అధికారులే. స్వరసహితవాక్యములే వేదమని భ్రమపడరాదు. స్వరసహితమైన (along with accents) వేదవాక్యములను చదువకున్ననూ, ఇతర వాక్యముల ద్వారా అదే బ్రహ్మ శుద్ధ జ్ఞానమును పొందిన ప్రతిజీవుడును వేదాధ్యయనము చేసిన వాడే, వేదవేత్తయే, సత్య బ్రాహ్మణుడే. ఇందువలన నేను చెప్పు ప్రతివాక్యమూ వేదమే. ఈ వాక్యముల రాశియగు నా గ్రంథములన్నియు వేదమే. ఈ దత్తవేదమును చదివి అర్థము చేసుకొన్న ప్రతిజీవుడును బ్రహ్మజ్ఞానియే అయి, సత్యముగా బ్రాహ్మణుడే అగును. ఇందులో ఎట్టి సందేహము వలదు.

Swami

[02.03.2000 ఉదయం 4.30 గంటలకు]

వేదములో ప్రతిచోటా ‘య ఏవం వేద’ అని వినపబడుతుంది. దీని అర్థమేమి? దీని అర్థమిది–‘ఈ విధముగా వేదము ద్వారా ఎవరు తెలుసుకుంటారో వారు, మరియు ఈ వేదము (స్వరసహితవాక్యములు) కాక, వేదజ్ఞానము తెలిపెడి ఇతర వాక్యముల ద్వారా కూడ ఇదే అర్థమును ఎవరు తెలుసుకుంటారో వారును తరిస్తారు’ అని అర్థము. కావున స్వరసహితమైన వేదవాక్యములలో ప్రత్యేకత ఏమియును లేదు. ఆ వాక్యముల అర్థమునకే ప్రామాణ్యత కలదు. ఆ అర్థము వేరుగా స్వరరహితమైన వేదజ్ఞానమును తెలిపెడి వాక్యముల ద్వారా కూడా సిద్ధించగలదు. స్వరము అనగా ధ్వని. ఒక్కొక్కరు ఒకే వాక్యమును ఒక్కొక్క ధ్వనితో పలుకుదురు. నేను నా ప్రథమావతారమగు బ్రహ్మదేవుని చతుర్ముఖముల ద్వారా చతుర్వేదములను పలికినపుడు ఆ వాక్యముల ధ్వనులను కూడ సనక సనందనాదులను నలుగురు బ్రాహ్మణులు ధారణ (retained) చేసినారు. సృష్టివృక్షము యొక్క మూలము–మధ్యము–అంత్యములను బ్రహ్మ-విష్ణు-శివాత్మకములుగా మూడు స్వరములును సూచించుచున్నవి.

బ్రహ్మమగు నేను, బ్రహ్మదేవుడిగా ఆచార్యరూపములో మొదట అవతరించితిని. ఆ తరువాత మరల అత్రి–అనసూయలకు అవతరించినపుడు వారి దత్తపుత్రుడిగా బ్రాహ్మణుడనయ్యాను. కావున బ్రాహ్మణుడను నేనే. బ్రహ్మమును గుర్తించుట–బ్రహ్మమును ఉపాసించుటయే బ్రహ్మజ్ఞానము. అటువంటి సత్యమైన అనంతమైన జ్ఞానము కలవాడే బ్రహ్మము అని ‘సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ’ అని శ్రుతి బోధించుచున్నది. ఇచట ‘జ్ఞానము’ అను శబ్దమును జ్ఞానిగా గ్రహించవలయును. జ్ఞానాతిశయము గల జ్ఞానిని, ‘జ్ఞానము’గా వ్యవహరించుట వ్యాకరణశాస్త్ర సమ్మతమే. అంతే తప్ప, అచట జ్ఞానశబ్దము కేవల చైతన్యమును (awareness) చెప్పదు. జ్ఞానశబ్దము లోకములో చైతన్యపరముగా రూఢము (fixed) కాదు. వేదాంతజ్ఞానము నందే రూఢము.

అనంతా వై వేదాః’ అని శ్రుతి. జ్ఞానము అనంతము అయితే ప్రస్తుత వేదములు చాలా పరిమితములు. వేదములో చాలా భాగము ఖిలమైనది. ఇప్పుడు మిగిలిన భాగము కూడ కేవలము ఐహికములను సాధించుకొను యజ్ఞముల వరకే పరిమితమై, బ్రహ్మమును బోధించు ఉపనిషద్భాగము చాల తక్కువగా ఉన్నది. నిజముగా ఉపనిషద్భాగము చాల ఎక్కువ. కానీ ఐహికము లందు ఆసక్తికల మానవుడు క్రమక్రముగా ఐహిక సాధకమగు కర్మకాండను మాత్రమే ధారణ చేయుచు, జ్ఞానభాగములగు ఉపనిషత్తులను త్యజించినాడు. అందువలన కర్మభాగమే మిగిలి, జ్ఞానభాగము నామమాత్రము చాలా కొద్దిగా ఉపనిషత్తులుగా మిగిలినది. ఖిలమైపోయిన, ఈ అనంతజ్ఞాన భాగమునే మరల నేను యీ దత్తవేదము ద్వారా పలుకుచు ఉద్ధరించుచున్నాను. సోమకాసురుడు వేదములనపహరించినాడు. అనగా సోమము అను మద్యమును త్రాగి జ్ఞానభాగమును మరచిపోయినారు జీవులు. ఐహికములపై గల తీవ్రకామమే ఈ సోమము. ఇది మనస్సంబంధితమైనది. సోముడనగా చంద్రుడు అనగా మనస్సు (చంద్రమా మనసః... అని శ్రుతి). ఈ మనస్సు యొక్క నిగ్రహము లేకుండుటయే కోరికలకు కారణము. మత్స్యావతారముతో అపహరించబడిన వేదములను ఉద్ధరించితిని. మత్స్యము అనగా నేత్రము. నేత్రము మీన రూపము కదా. చేప నిద్రపోవుచున్నను కన్నులను మూయదు. అనగా సదా అప్రమత్తమై యుండుట. కన్ను దృష్టిని సూచించును. దృష్టి జ్ఞానమును సూచించును. ‘ఈ విషయమును చూడుము’ అంటాము కదా. అప్రమత్తమైన అట్టి జ్ఞానమే మత్స్యము. దాని చేతనే సోమకాసురుడు అను అజ్ఞానము సంహరింపబడును. సంసార సముద్రములో కోరికల అగాధములో మునిగిపోయిన ఈ ఉపనిషద్భాగము అగు అసలు వేదమును ఈ దత్తవేదము ద్వారా ఉద్ధరించి యీ లోకమునకు యోగ్యులగు జీవులనుద్ధరించు నిమిత్తముగా అందించుచున్నాను. ఎవరు ఈ దత్తవేదమును పఠించి అర్థమును మననము చేసుకొని ఆచరింతురో వారు సంపూర్ణ వేదాధ్యయనము చేసిన వేదవేత్తలగు బ్రాహ్మణులు.

స్వరసహితమైన వేదవాక్యములలో కేవలము నేతిలోని ‘గసి’ మాత్రమే మిగిలియున్నది. అసలు నేయి ఖిలమైపోయినది. ఆ గసి కొరకు మీరేల పరుగెత్తుచున్నారు. స్వచ్ఛమైన సువాసన గల నేతిని మీకు నేను అందించుచున్నాను. నేతిలోని మలినములే గసి. కోరికలను సాధించు కర్మకాండము వేదమాలిన్యము. అది అపవిత్రములగు కుక్కల రూపము. అయితే ఐహికములును జీవనావసరములే (necesary for living). వాటిని నా దాసులు మీకు ప్రసాదించగలరు. ఆ కుక్కల జోలికి మీరేల పోవుచున్నారు? కోరికలను సాధించు కర్మకాండల రూపములగు ఆ కుక్కలు మిమ్ములను కరచినచో మీరును పిచ్చివారై, కుక్కల వలె మొరుగుచు, మృత్యువును పొందుదురు. అయితే ఈ కర్మకాండలే నిష్కామముగా ఈశ్వర ప్రీత్యర్థము చేసినచో, ఈ అపవిత్రములగు కుక్కలే, సనక సనందనాదులను వేదపురుషులగు సద్ర్బాహ్మణులుగా పవిత్రములుగా మారిపోవుచున్నారు. నేను ఆ సమయమున కాషాయ (వైరాగ్య) ధారియైన సద్ర్బాహ్మణునిగా దర్శనమిచ్చెదను. మీరు కోరికలతో ఈ కర్మకాండలను చేసినచో, నేను కుక్కలతో కూడిన చండాల రూపమున ఉందును. ఏలననగా మీరును కోరికలతో కర్మ చండాలురే అగుచున్నారు కదా. ధ్యాతలో పవిత్రత లేనిచో ధ్యేయములోను ఉండదు గదా. ‘శ్రోత్రియస్య చ అకామహతస్య’ అని శ్రుతి. నిష్కామము కలవాడే బ్రాహ్మణుడు అని దీని అర్థము.

కావున ఈర్ష్యాద్వేషములతో స్వరసహితవాక్యములనధ్యయనము చేయుటకు పరుగెత్తవలదు. ఈర్ష్యాద్వేషములతో నామమాత్ర బ్రాహ్మణత్వమునకు పరుగెత్తవలదు. ఈ దత్తవేదమును అధ్యయనము చేసి సత్యమైన వేదవేత్తలై, సత్యమైన బ్రహ్మత్వమును అసలు సత్యమైన సద్ర్బాహ్మణత్వము పొందుడు. ఈర్ష్యాద్వేషములు బ్రహ్మప్రాప్తికి విరోధకములు. వాటిని త్యజించుడు. ఈ నామమాత్ర బ్రాహ్మణులపై దారిద్ర్యము అను దండనమును విధించి వారి అజ్ఞాన–అహంకారములను నేను నిర్మూలించుచున్నాను. శిక్షాధికారము నాదే. శిక్షాధికారము జీవులకు లేదు. శిక్ష కూడ మార్పును తెప్పించుటకే తప్ప, ద్వేషముతో కాదు. ఈ నామమాత్ర బ్రాహ్మణులును నా బిడ్డలే కదా. వారు నా పెద్దకుమారుడు. పెద్దకొడుకే భ్రష్టుడైనచో తండ్రికి ఎంత బాధ కలుగునో కదా. వారు మీకు జ్యేష్ఠ సోదరుడు. భ్రష్టులైనను, వారిని ద్వేషించక, ప్రేమతో ఆదరించి వారిని గౌరవించుడు. ప్రేమయే నా మార్గము. వినయమే నా లక్షణము. ఈర్ష్యాద్వేషములున్న చోట నేను ఏ మాత్రము నిలువను. వారి బుద్ధిని నేను మార్చెదను. తండ్రిగా నా కర్తవ్యము అది. నా కర్తవ్యమును మీరు తీసుకొని వారిని దూషించి దండింపకుడు. సద్ర్బాహ్మణులగు వారి పూర్వులను తలచి వారిని మన్నించుడు. వారిలో కూడ సద్ర్బాహ్మణులు ఇప్పటికినీ ఉన్నారు గదా. కొందరు మాత్రమే భ్రష్టులైనారు. కోరికలు, ఈర్ష్యాద్వేషములున్నచో ఇతర వర్ణముల వారును భ్రష్టులే. వేటిచేత వారు భ్రష్టులైనారో, వాటి చేత మీరును భ్రష్టులై నా ఆగ్రహమునకు గురికావలదు.

ఇక గాయత్రీ మంత్రమనగా ఏమి? గాయత్రీ ఒక ఛందస్సు. లయబద్ధమై, గానమునకు అనుకూలమైన వాక్యమే ఛందస్సు. ‘గాయంతం త్రాయతే ఇతి గాయత్రీ’, ‘మననాత్ర్తాయతే ఇతి మన్ర్తః’. అట్టి వాక్యము నా పరమైనపుడు, దానిని మరల, మరల మననము చేయుచు అనగా మనోహరమైన (మనస్సును సహజముగా ఆకర్షించిన) వాక్యమే గాయత్రీ మంత్రము. అట్టి వాక్యములోని అక్షరములే బీజములు. అట్టి వాక్యమే బీజమాల. అట్టి వాక్యమును మరల మరల మననము చేయుట జపమాలను మరల మరల త్రిప్పుట. అట్టి వాక్యము వేదములో చెప్పబడిన ‘తత్సవితుః...’ అనునది మాత్రమే కాదు. కావున ఈ లక్షణములు కల ఏ వాక్యమైననూ గాయత్రీమంత్ర జపమాలయే.

ఇట్టి అంతరార్థమును మరచి, గాయత్రీమంత్ర అధికారము ఇతర వర్ణములకు లేదని, కేవలము ‘తత్స వితుర్వరేణ్యమ్’ అనునదే గాయత్రీ మంత్రమనియు, ఇతర వర్ణములను ఈ నామమాత్ర బ్రాహ్మణులు ఈర్ష్వాద్వేషములతో, అహంకారముతో రెచ్చగొట్టినారు. ఇతర వర్ణములును తమ కేదో మహా నష్టమును కలిగించినారని భ్రమతో ఈ బ్రాహ్మణులపై ఈర్ష్వాద్వేషములతో అహంకారముతో నిందలకు దిగినారు. పెద్దకుమారుడు భ్రష్టుడై తన సోదరులను చెడగొట్టుటయే ఇది. ఇట్లు అన్యోన్య ద్వేషము, అన్యోన్య నిందలతో సర్వము భ్రష్టమైనది. అందరిలోను ద్వేషమే మిగిలినది. సోదరప్రేమ ఎవరిలోనూ లేదు. కావున ఓ సర్వజీవులారా! మీరందరునూ నా పుత్రులే. ఈ ద్వేషమును త్యజించి సోదర ప్రేమతో జీవించుడు. ఇందులో ప్రథమాపరాధము పెద్ద కుమారుడగు (జ్యేష్ఠుడు) బ్రాహ్మణులదే కాన వారినే దండించినాను. వీరి కులమున పుట్టిన నన్నును మరచినారు. వీరి కులదేవుడినే విస్మరించినారు. దీనికి కారణము నేను ఐహికములను ప్రసాదించననియే. ఆచార్యరూపుడగు బ్రహ్మదేవుడైన నాకు, ఐహిక ప్రదాతకాను కావున, గుడి–పూజలను త్యజించినారు. వీరు చేసిన ద్వేష-దోషములు ఇతరులును చేసి నా శిక్షకు గురికాకండి. మీ అందరి ద్వేష-పాపముల యొక్క శిక్షను నేను స్వీకరించి, మిమ్ములనందరినీ పాపముల నుండి ముక్తులను చేయుచున్నాను. కానీ ఒక షరతు. ఈనాటి నుండి, మీరందరును సోదరులేనని పరస్పర ప్రేమతో జీవించుచు, తండ్రినగు నన్ను స్మరించుడు. నేను మిమ్ములనందరును ఆనందముతో నుండునట్లు ఆశీర్వదింతును.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch