30 Jan 2025
[21.03.2000] విగ్రహారాధనమును ఆర్య–బ్రహ్మ సమాజస్థులు, క్రైస్తవులును, ముస్లింలును నిరసించుచున్నారు. ఇది సరియైన పద్ధతి కాదు. సర్వశక్తిమంతుడగు భగవంతుడు ఎట్లు అవతారముల నెత్తుచున్నాడో, అట్లే భగవంతుడు విగ్రహముల నావేశించి భక్తుల అవసరముల కొరకు వారి ఆరాధనల నందుకొనుచున్నాడు. కావున తర్క ప్రకారముగ ఇందులో ఏ ఆక్షేపణయునులేదు.
పూర్వపక్షము (Opponent):- ‘అరూపమవ్యయమ్’, ‘న చక్షుషా’, ‘అరూపవదేవ హి’ ఇత్యాది ప్రమాణములన్నియు బ్రహ్మము నిరాకారమనియే చెప్పుచున్నవి.
సిద్ధాంతి (Swami):- ‘ప్రత్యగాత్మానమైక్షత్’, ‘పరిపశ్యన్తి ధీరాః’, ‘అపరోక్షాత్’ మొదలగు శ్రుతులన్నియును బ్రహ్మము యొక్క సాకారతత్త్వమునే ప్రతిపాదించుచున్నవి. ‘వివృణుతే తనూం స్వామ్’ అను శ్రుతి, బ్రహ్మము తన తనువును చూపెను అని చెప్పుచున్నది. మరియును ‘అవ్యక్తా హి గతి ర్దుఃఖమ్’ అను గీతాశ్లోకము నిరాకారము (formless) భక్తుల ఆరాధనమునకు కష్టసాధ్యము అని చెప్పుచున్నది, కావున విగ్రహారాధనములో దోషము లేదు. మీరును శిలువ, గోడలను (క్రైస్తవ, ముస్లిములు) ప్రతీకలుగా (representative) పెట్టుకొని ఆరాధించుచున్నారు గదా.
[22.3.2000 ఉదయం 6 గంటలకు]
ప్రతీకారాధనము (representative worship) శ్రుతులలో బోధించబడిన విషయమే. ‘ఆదిత్యం బ్రహ్మేత్యుపాసీత’ మొదలగు శ్రుతుల ద్వారా సూర్యుని బ్రహ్మ ప్రతీకగా ఆరాధించమనియే చెప్పబడినది. రూపము అనగా ‘రూప్యతే చక్షుర్భ్యామితి రూపమ్’, అనగా నేత్రములతో నిరూపించబడునది. అనగా పురుషప్రయత్నము చేత కన్నులతో చూడదగినది. ఒక గ్రామమును, స్వప్రయత్నముతో పోయి కన్నులతో చూడవచ్చును. ఆ గ్రామము రూపవంతము. కానీ స్వామిని అట్లు చూడలేము. కేవలము తపన (తపస్సు) తో, స్వామి కరుణిస్తే చూడగలము. కావున గ్రామము వంటి రూపవంతమైన లక్ష్యము కాదు కావున ‘అరూపము’ అని చెప్పబడినది. మరియు ఈ చర్మచక్షువులతో చూడలేము కావున, కృష్ణ భగవానుడు తన యోగీశ్వరరూపమైన దత్తాత్రేయ స్వరూపమును చూపునపుడు దివ్యదృష్టిని ఇచ్చినాడు. అందువలన ‘న చక్షుషా’ అను శ్రుతి సమన్వయమగును. రూపము కలవాడు కావుననే ‘ఐక్షత్’ , ‘పరిపశ్యన్తి’ మొదలగు శ్రుతులు సార్థకములగును.
విగ్రహారాధన వేదసమ్మతము. వేదములు ఎవరును వ్రాసినవి కావు. అవి పరంపరగా కంఠస్థము చేసి రక్షించబడినవి. ఎవరును దానిలో తమ పైత్యమును దూర్చలేదు. కానీ పురాణములట్లు కాదు. అవి తాళపత్రముల వ్రాతప్రతులు. దానిలో అనేకులు అనేక శ్లోకములను దూర్చినారు. వీటిని ప్రక్షేపములందురు. అందువలన ఈ సంపూర్ణ ప్రపంచములో వేదము వంటి శుద్ధమైన పవిత్రగ్రంథము లేదు. క్రీస్తు భగవానుడు కూడ విగ్రహారాధనను ఖండించలేదు. విగ్రహారాధనమును చేయువారు చేయు అక్రమములను ఖండించెను. ఆయన చెప్పిన ఉపదేశములందు ప్రక్షేపములు జరిగినవి. బైబిలు, ఖురాన్ మరియు విశ్వములోని ఏ మతగ్రంథమైనను నా దివ్యవాణియే. భాష మారినదే తప్ప భావములలో తేడా లేదు. ఆయా దేశముల వారికి వారి స్థాయిని బట్టి నేను ఆయా భాషలలో చెప్పితిని.
భారతదేశములో ఎక్కువ భగవదవతారములు వచ్చినవి అని భారతీయులు విర్రవీగరాదు. అహంకారము తప్పు. భారతీయులకు బుద్ధి బలము ఎక్కువ. కాన నేను చేసిన ఉపదేశములను వక్రముగా వ్యాఖ్యానించుకొని, వారి పరిస్థితులకు అనుకూల సమన్వయము చేసుకున్నారు. అందువలన వారి వక్రార్థములను సరిదిద్ది చెప్పుటకై నేను మరల మరల అవతరించవలసి వచ్చినది. పాశ్చాత్యులకట్టి అతితెలివి లేదు. చెప్పినది చక్కగా అనుసరించినారు. అందుకే వారి దేశమునకు మరల మరల అవతరించవలసిన అవసరము రాలేదు. ఈ నిజమును తెలుసుకున్న భారతీయులు అహంకరించరు. నాకు అన్ని దేశములు సమానమే. అన్ని జాతుల వారునూ నా బిడ్డలేనని నిశ్చయముగా చెప్పుచున్నాను. పశు, పక్షి, వృక్షాదులును నా బిడ్డలే. పాశ్చాత్యులలో మాంసాహార దురాచారము ఒక్కటే నా క్రోధకారణము. భారతీయులందును కొంత తక్కువగా ఈ దురాచారము కలదు. బ్రాహ్మణులలో ఎన్ని అవలక్షణములు ఉన్నా, వారిలో గల ఒక మహా సద్గుణము–మాంసనిషేధము. ఈ కారణము వలననే నేను మొదట బ్రాహ్మణకులమున అవతరించినాను. అయితే, ప్రస్తుత బ్రాహ్మణులు కూడా భ్రష్టులై, మాంసాహారమును తినుచున్నారు.
వేదాధ్యయనముల ద్వారా వీరు వేదములను రక్షించినారు. దీని వలన వేదములలో ఎట్టి ప్రక్షేపములు రాలేదు. ఈ రెండు కారణముల వలన వారి వంశమున అవతరించితిని. అది నా స్వరూపావతారము. మిగిలిన అవతారములన్నింటిలో అన్యరూపాలలో అవతరించితిని. మిగిలిన అవతారములలో అంతస్స్వరూపము నేనే అయినా బాహ్యరూపాలు వేరు. కానీ అత్రి అనసూయలకు అవతరించినపుడు బాహ్య–అంతస్స్వరూపములు రెండూ నేనే. కావున భ్రష్టులు కాని బ్రాహ్మణులను జ్యేష్ఠసోదరునివలె, అన్యవర్ణములు గౌరవించవలెను. వారును అన్యవర్ణములను తమ కనిష్ఠసోదరులుగా ప్రేమించి, వారి ఐహిక సమస్యలకును, ఆధ్యాత్మిక వృద్ధికిని సాయపడమని భగవంతుని ఆరాధించవలయును. ప్రేమ ఎప్పుడూ రెండు వైపులా వుండాలి. ఒక వైపున ఉన్నచో నిష్ర్పయోజనము.
‘బ్రహ్మ దృష్టి రుత్కర్షాత్’ అను బ్రహ్మసూత్రము, విగ్రహములను సైతము బ్రహ్మముగానే చూచి ఉపాసించవలయునని చెప్పుచున్నది. ఉత్కర్ష అనగా, బ్రహ్మము తన యొక్క సాధ్యాసాధ్య నిర్వహణ సామర్థ్యము వలన విగ్రహముగా మారుచున్నది. నిజముగా సృష్టివస్తువులలో బ్రహ్మము లేదు. (న త్వహం తేషు – నేతినేతి) అవసరమైనచో బ్రహ్మము సృష్టివస్తువు నావేశించగలదు. ‘ఈశావాస్యమిదమ్’ అను శ్రుతి దీనినే నిరూపించుచున్నది. విగ్రహమునావేశించుట అనగా విగ్రహముగా వుండుట–విగ్రహమునకు వేరుగా వుండుట ఏకకాల సాధ్యములు. ఎట్లనగా ఒక లోహపుతీగె యందు విద్యుత్తు ప్రవహించునపుడు, ఆ తీగెయే విద్యుత్తు. ఆ తీగెను ముట్టుకున్నచో విద్యుద్ఘాతము (electric shock) జరుగును. అనగా విద్యుత్తు ధర్మములు తీగెకు ఉన్నవి కదా. ఇచ్చట తీగెకును విద్యుత్తుకు భేదము లేదు. విద్యుత్తు ధర్మములన్నియును తీగెకు ఉన్నవి. అయితే, తీగె ధర్మములగు సన్నముగా, వంకరలు తిరిగియుండుట మొదలగునవి విద్యుత్తుకు లేవు. ఇదే విధముగా, విగ్రహములో పరమాత్మ ధర్మములున్నవి. విగ్రహధర్మములు పరమాత్మకు లేవు. ఆ సమయమున విగ్రహమే పరమాత్మగా భావించవచ్చును. విగ్రహధర్మములు పరమాత్మ ధర్మములను నిరోధించజాలవు. కావున విగ్రహధర్మములపై దృష్టి అవసరము లేదు.
ఒక తీగె అష్టవంకరలుగా ఉన్నది. అంత మాత్రమున ఆ తీగెలో విద్యుత్తు ప్రవహించుటను గానీ, విద్యుత్తు ధర్మములగు కాంతి, ఉష్ణము, అభిఘాతము (shock) మొదలగు వాటికి గాని విరోధము ఉన్నదా? తీగెధర్మమైన వంకరతనము, విద్యుత్తును గాని, విద్యుత్తు ధర్మములను కానీ నిరోధించలేదు. కావున విగ్రహధర్మములను పరిగణించనవసరము లేదు. విగ్రహధర్మములను దృష్టిలో ఉంచుకొని, విగ్రహము పరమాత్మ కాదని వాదించనవసరము లేదు. తీగె వంకరగా నున్నది కావున, వంకర ధర్మము విద్యుద్ధర్మము కాదు కావున, విద్యుత్తు తీగెలో విద్యుత్తు లేదనరాదు. అన్ని తీగెలలో విద్యుత్తు లేనట్లు, అన్ని విగ్రహములలో పరమాత్మ వుండడు. అంగడిలో ఉన్న దేవతా విగ్రహములందు పరమాత్మ వుండడు. ఆ విగ్రహమును తెచ్చి ఉపాసించిన నాడే అది పరమాత్మ అగును. ఈ ఉపాసనయే ప్రాణ ప్రతిష్ఠ అనబడును. అది దేవాలయములో ఉపాసనతో ప్రతిష్ఠింపబడిన సమయముననే పరమాత్మగా మారుచున్నది.
కొన్ని దేవాలయములలో విగ్రహములనుండి పరమాత్మ తొలగిపోవగా, ఆ విగ్రహములలో ప్రాణశక్తి పోయినది అని అనుచున్నాము. అనగా విద్యుత్తు తీగెలో నుండి విద్యుత్ ఉపసంహరింపబడగా, ఆ తీగె, విద్యుత్తు లేని తీగె అగును. అలాగే, మరల ఉపాసన చేత ప్రాణప్రతిష్ఠ జరుగగా మరల విద్యుత్ ప్రవేశించిన తీగవలె, విగ్రహము పరమాత్మ అగును. ప్రాణప్రతిష్ఠ అనగా, పరమాత్మను శ్రద్ధాభక్తులతో ఆహ్వానించుటయే. చిత్తశుద్ధి, భక్తి, శ్రద్ధల వల్లనే పరమాత్మ విగ్రహమును ఆవేశించును కానీ, అవి లేకుండా, కేవల మంత్ర తంత్రముల వలన పరమాత్మ విగ్రహమును ఆవేశించడు. మంత్ర తంత్రములు లేకున్ననూ, శ్రద్ధాభక్తుల వలన విగ్రహమును పరమాత్మ ఆవేశించునను విషయమును బ్రాహ్మణులు గ్రహించి తమ అజ్ఞానమును పోగొట్టుకొనవలయును. అనగా పరమాత్మ ఆవేశించుట, కేవలము తమ చేతిలోనే ఉన్నది అను అజ్ఞానము వారికి అహంకారమును కలిగించును.
★ ★ ★ ★ ★