home
Shri Datta Swami

 18 Sep 2024

 

గోరంత సేవకు కొండంత ఫల పధకము

[12-01-2003] పరమాత్మ నరావతారమున భూలోకమునకు వచ్చినపుడు ఆయన మానవుల భక్తికి పరవశించుచుండును. ఈ భక్తి మద్యమును సేవించి ఆ మైకములో వారు కోరిన వరములు ప్రసాదించుచుండును. ఎంత నిష్కామ భక్తిని కలిగియున్నను ఎప్పుడో ఒకప్పుడు మానవుని యొక్క నైజము బయటపడక మానదు. "ఆ నైజమే స్వార్థము". ఆ స్వార్థముతో కోరు వరములతో ఒక్కొక్కసారి భగవంతునికే కాక ఆ కోరిన మానవునకే అనర్థము వాటిల్లును. భస్మాసురుడు కోరిన వరమట్టిదియే కదా! దాని వలన స్వామికి ముప్పు వచ్చుటయే కాక, చివరకు వాడే నశించినాడు. కావున వాని తపస్సు వానినే నశింపచేసినది. మరియు స్వామి వరమునీయకుండా తిరస్కరించ వచ్చును గదా! కాని వాడు యిచ్చిన భక్తి మద్యము అను మైకముతో స్వామి బోళా శంకరుడైనాడు. కావున అవతరించుటకు ముందు కాలభైరవునకు గట్టిగా ఈ విధముగా శాసనములనిచ్చును. "నేను భూలోకమునకు పోయినపుడు చాలా ప్రమాదకరమైన మానవుల మధ్యకు వెళ్ళుచున్నాను. వారు అతితెలివి గలవారు. వారి అతితెలివి వలన ఆత్మవినాశనము, పర వినాశము, గురు వినాశము సంభవించును. వారు అతితెలివి చేత భక్తసులభుడైన నా చేత భక్తి మద్యమును త్రాగించి అంతములో వినాశకరములగు వరములను కోరును.

కొందరు నిష్కామ కర్మసేవా భక్తియను మహాశక్తివంతమైన మద్యమును నాచే త్రాగింతురు. అట్టి భక్తులు నిష్కామముగనే ఉందురు. కాని ఎప్పుడో ఒకప్పుడు వారి నైజగుణమగు స్వార్థము విజృంభించును. కావున ఆట్టి సమయములలో నేను మైకములో పడి ఇచ్చిన వరములను నిష్ఫలములగునట్లు చేయుము. అప్పుడు నేను నిన్ను దూషించి నీపై ఆగ్రహించెదను. ఆ సమయమున భయంకరమైన రవమును అనగా గర్జనము చేసి నన్ను నియమించుము. ఇదే కాల = ఆ సమయము నందు; భైరవ = భయంకరమైన రవమును చేయుట. కావున కాలభైరవుడు నీ పేరు కాదు. బాధ్యతకు ఆ పేరు. నీవు ఇట్లు చేయకున్నచో నేను తర్వాత పైకి వచ్చినపుడు నిన్ను ఈ పదవి నుండి తొలగించవలసి వచ్చును". ఈ విధముగా అవతార కార్యక్రమ మంతయును స్వామి స్వయముగా రచించి ఇచ్చిన ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారమే జరుగును. స్వామి శాసనానుసారముగా ఆ ప్రణాళికను నిర్దాక్షిణ్యముగా అవసరమైనచో అవతారపురుషుని సయితము గర్జించి నియమించుటయే కాలభైరవుని కర్తవ్యము. ఇది అంతయును స్వామి శాసనమే కావున స్వామి యొక్క స్వాతంత్ర్యమునకు, అధికారమునకు, ఎట్టి భంగము లేదు. అందువల్లనే స్వామి మద్యపానము చేయుచున్నవానిగా దర్శన మిచ్చుచుండును. ఆ దర్శనములోని అంతరార్థమిది.

Swami

అయితే అంతయును నిర్దిష్టప్రణాళిక ప్రకారమే జరుగుచున్నది కదా. మనము అవతరించిన స్వామిని సేవించుట వ్యర్థము. ప్రణాళికలో ఉన్నచో అది మనకు లభించియే తీరును. దానికి సేవ యొక్క అవసరము లేదు కదా. ప్రణాళికలో లేనిచో ఎంత సేవ చేసిననూ లభించదు. అప్పుడు సేవ అవసరము లేదు కదా! అన్న సంశయము వచ్చును. దీనికి సమాధానము ఏమి అనగా కాలభైరవుని ప్రణాళికలో ఎవరు ఎట్టి సేవను చేసినచో వారికి ఎట్టి ఫలమును ఎక్కడ ఎచ్చట వారి యొక్క నిజమైన అవసరములకు అందచేయవలయును అని స్పష్టముగా వ్రాయబడియేయున్నది. కావున నీవు చేసిన సేవకు సరియైన ఫలమును పొందుట ప్రణాళికలోని అంశమే కావున నీ సేవ వ్యర్థము కాదు. కాకున్నచో ఏ సేవకు ఎట్టి ఫలము? ఆ సేవ యొక్క విలువ ఎంత? ఆ సేవ యొక్క ఫలము ఎంత? మొదలగునవి స్వామి నిర్ణయించి ఇచ్చినవే ప్రణాళికలో యున్నవి. వాటిని ఆ ప్రణాళిక ప్రకారము జీవులకు నిష్పక్షపాతముగా అందచేయు అధికారమును, అవసరమైనచో తనను గర్జించియైనను దానిని అమలుచేయు అధికారమును కాలభైరవుని చేతిలో స్వామి పెట్టియున్నారు. అనగా స్వామి చేత భక్తి మద్యమును త్రాగించి గోరంత సేవకు కొండంత ఫలమును దాన స్వభావము వలన మానవుడు కోరవచ్చును. భస్మాసురుడు కోరినది అదే కదా. వాడు చేసిన తపస్సు గోరంత. వాడు కోరిన వరము స్వామిని కూడ భస్మము చేయగల శక్తి కొండంత. భక్తి మద్యము యొక్క మైకములో స్వామి వరము ప్రసాదించినాడు. పోనీ దాని వలన వాడు ఏమైనను లాభపడినాడా లేదు లేదు. వాడే చివరకు అంతమైనాడు. కావున ఇట్టి సమయములందు ఆ భక్తుని శ్రేయస్సు కొరకే కాలభైరవుని నియమాధికారము అవసరమా కాదా? కావున దీని వలన చిట్టచివరకు ఆలోచించి చూచినచో ఇది జీవులకే ఉపకారమగుచున్నది.

అయితే గోరంత సేవకు కొండంత ఫలము లభించి ఆ ఫలము మనకే సద్వినియోగమునకు అవకాశము లేదా? ఇట్టి అవకాశము కూడా గలదు. నీవు గోరంత సేవను చేసి ఆ సేవకు ఎట్టి ఫలమును ఆశించకుము. నీవు చేసిన సేవయే నీ పురాకృత పుణ్యకర్మఫలమని భావించుము. ఫలమునకు మరియొక ఫలము ఉండదు. ఇట్టి భావముతో నీవు చేసిన సేవకు ఎట్టి ఫలమును కోరక నిస్వార్థ భావముతో ఉందువేని నీ గోరంత సేవకు కొండంత ఫలము అనుగ్రహించబడును. అయితే దానిపై నీకు కోరిక లేనందున ఆ కొండంత ఫలమును నీ ఖాతాలో జమచేయబడినట్లు నీకు తెలియదు. ఈ జమ చేసినది నీకు తెలియదు. ఏలననగా నీ గోరంత సేవయను వంద రూపాయిలు నీవు స్వామికి దానముగా సమర్పించియున్నాను అనుకొనుచున్నావు. దానము చేసిన తర్వాత దానిని వడ్డీతో కలిపి నాకు యివ్వమని అడుగుట లేదు కదా. కావున నీవు ఆ గోరంత సేవకు గోరంత ఫలమును కూడా కోరుట లేదు. ఇప్పుడు ఈ కొండంత ఫలము నీకు తెలియకుండా కాలభైరవుని అధీనములో యున్నది. ఇది నీకు తెలియదు కాన నీవు అవసరము లేకున్ననూ దానిని తీసుకొని ఖర్చుపెట్టకొనవు. ఆ కొండంత ఫలము స్వామి అధీనములో కూడ ఉండదు. ఏలననగా నీవు స్వామికి భక్తిమద్యమును త్రాగించి నీకు అవసరము లేనప్పుడు స్వామిని ధనమును ఇమ్మని కోరగా స్వామి ఆ మైకములో దాని నుండి తీసి ఇచ్చును. కావున ఆ కొండంత ఫలము నీకు తెలిసినను, లేక స్వామి అధీనములో యున్ననూ అనవసరముగా దుర్వినియోగమై వ్యర్థమగును. కాలభైరవునిచే నీవు భక్తిమద్యమును త్రాగించలేవు. ఏలననగా కాలభైరవుడు చాలా కఠోర హృదయుడు. నీ మద్యము నీ పాత్రలోనే యుండును. దానిని ఎట్టి పరిస్థితులలోను అంటడు. కావున సర్వము స్వామి ఇచ్ఛానుసారమే కాలభైరవుని అధీనములో యున్నది. నీవు భక్తిని త్రాగించినను ప్రయోజనము లేదు. కాలభైరవుని చేత త్రాగించలేవు. కావున స్వామిని మస్కా కొట్టి ఆత్మవినాశకరమగు వరములను కోరుకొనుటను విరమించుకొనుము. ఆ సమయమున నీకు వరములు లాభకరముగనే తోచును. కాని అవి భస్మాసురునివలె నిన్నే అంతమొందించును. కావున ఎట్టి ఫలములను ఆశించక నీవు స్వామికి చేసిన సేవ నీ పుణ్యఫలమే అని భావించుచు నీ యథాశక్తి స్వామిని సేవించుటయే నిజమైన అత్యుత్తమ మార్గము.

దీనికి చక్కని ఉదాహరణము రాజసూయ యాగమున స్వామి వేలు తెగి రక్తము కారుచుండగా అవభృధస్నాతయైన ద్రౌపది అమంగళకరమైనను, అనర్థకరమని తెలిసియును, తన పట్టుచీరెను చించి స్వామి వేలుకు కట్టినది. అష్టపత్నులు అచ్చట ఉన్నను అట్లు చేయు సేవ వారికి స్ఫురించలేదు. "ఇది నాకే స్ఫురించి నేనే చేసితిననగా, ఇచ్చట ఎవరును చేయని నేను మాత్రమే చేసిన పూర్వపుణ్య తపస్సు యొక్క ఫలము" అని ద్రౌపది భావించినదే తప్ప, ఈ సేవకు ప్రతి ఫలముగా నా వేలు ఎప్పుడైనను ఇట్లు తెగినచో పరమాత్మ ఎవరినైనను ప్రేరేపించి నావ్రేలికి గుడ్డముక్క కట్టునట్లు చేయునులే అని అనుకొనలేదు. ఆమె అట్లు భావించి యున్నచో ఆ గుడ్డముక్కను వడ్డీతో కలిపినచో చక్రవడ్డీయైనను ఒక చీరె మాత్రమే దుశ్శాసన వస్త్రాపహరణ సమయమున లభించియుండును. దుశ్శాసనుడు ఆ లభించిన ఆ రెండవ చీరెను లాగినప్పుడు ఆమె దారుణ దుఃఖమునకు గురియై యుండెడిది. కాని ఆమె స్వామి వ్రేలికి చుట్టిన గుడ్డముక్క తన యొక్క పుణ్యఫలమని భావించి ఆ ఫలమునకు మరియొక ఫలము ఉండదని నిశ్చయించినది కావున అసలు ఆ విషయమునే మరచిపోయినది. అందుకే వస్త్రాపహరణ సమయమున "స్వామీ నేను ఆనాడు మీ వేలుకు గుడ్డముక్క కట్టినాను నాకు ఇప్పుడు ఆ ఫలము నిమ్ము" అని ప్రార్థించలేదు. ఏలయనగా ఆనాడు ఆమె చేసినది కర్మయని భావించలేదు. కావుననే ప్రాణము మీదికి వచ్చినను ఆ కర్మకు ఫలమును యాచించలేదు. కావుననే ఆమె గోరంత సేవకు కొండంత ఫలముగా ఆమె పేరున జమ చేయబడినది. ఆమెకు నిజమైన అవసరము రాగానే ఆ కొండంత ఫలము ఆమెకి అందచేయబడినది. ఆ గుడ్డముక్కయే అక్షయమై అనంతమైన సంఖ్యలో చీరెలుగా మారినది. కావున ఓ దత్తసేవకులారా! మీరు ఈ “ గోరంత సేవకు కొండంత ఫలము” అను పథకములో చేరండి తరించండి.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch