20 Nov 2024
[02. 12. 2002] అవతారతత్త్వములో తీగెయను బాహ్య స్వరూపములో లీనమై, వ్యాపించి అంత స్స్వరూపమగు పరమాత్మయను విద్యుత్ ఉండును. బాహ్యస్వరూపము యొక్క ధర్మములు అంతస్స్వరూపమునకును, అంతస్స్వరూపము యొక్క ధర్మములు బాహ్యస్వరూపమునకును అంటుచుండును. తీగె అనేక వంకరలు తిరిగియుండును. ఇది తీగెధర్మము. ఈ తీగె ధర్మమును అనుసరించియే విద్యుత్తు కూడా ఆ వంకరలలోనే ప్రయాణించుచు తీగె ధర్మమును తాను పొందినది. అటులనే స్పర్శకు చల్లగా నుండు తీగె, విద్యుత్తు ప్రవహించగనే షాక్ ఇచ్చుచున్నది. ఈ షాక్ ఇచ్చుట విద్యుద్ధర్మము. ఈ విధముగా జీవాత్మ పరమాత్మ కలసి యుండుట చేత ఒకరి ధర్మములు ఒకరికి అంటుకొనుచుండును. అవతారములో జీవాత్మ పరమాత్మలు కలసి యున్న మిత్రులు అని "సయుజా సఖాయా" అని శ్రుతి చెప్పుచున్నది. ఆరు నెలలు సావాసము చేసినచో వారు వీరగునని సామెత గలదు. కావున ఇట్టి అవతార విషయమున జీవాత్మ తెలియక పలికినను అంతస్వరూపముగా యున్న పరమాత్మ దానిని సత్యము చేయును.
లౌకిక విషయములలో మోజు కలిగిన పరమాత్మ లోక సంబంధమగు మాటలను మాటలాడుచుండును. ఆధ్యాత్మిక విషయములో మోజు కలిగిన జీవాత్మ వేదాంతము మాట్లాడు చుండును. పరమాత్మ ఆధ్యాత్మికమును బోధించి బోధించి విసుగు పుట్టి లౌకికవాక్కులపై మోజు గలిగి నరరూపమును ఆశ్రయించినది. లౌకికవిషయములను పలికి పలికి వెగటు జనించి తత్త్వవాక్కులపై మోజుతో జీవాత్మ పరమాత్మను ఆశ్రయించినది. కావున అవతార విషయములలో లౌకికమును జీవాత్మ మాటలాడుచున్నదనియును, ఆధ్యాత్మికమును పరమాత్మ మాట్లాడుతున్నదనియు నిర్ణయించలేము. ఎప్పుడు అంతస్స్వరూపము మాటలాడుచున్నదో, ఎప్పుడు బాహ్యస్వరూపము పలుకుచున్నదో తెలుసుకొనుట చాలా కష్టము. కావున ఈ రెండు తత్త్వములకును పూర్ణమైన అద్వైతావస్థ ఉన్నది. జీవాత్మ ఒకవేళ లౌకిక విషయములను సరిగా తెలియక పలికినను పరమాత్మ ఆ వాక్కును సత్యము చేయును. పరమాత్మ చెప్పదలచుకున్నది మాత్రమే జీవాత్మ పలుకుచుండును. ఇట్లు ఒకరినొకరు అనుసరించి అన్యోన్యప్రేమతో విడదీయలేని అర్ధనారీశ్వరుల వలె ఉండు పరమాత్మ జీవాత్మల గంగా యమునా సంగమమే అవతారము.
శ్రీనరసింహసరస్వతి శ్రీదత్తుని పూర్ణావతారము. ఒకనాడు దారిన పోవుచూ తన భక్తులగు రైతు దంపతులను చూచి ఈ చేను కోయండి అని చెప్పి వెళ్ళినాడు. ఆ రైతు నరసింహ సరస్వతి యందు అద్వైతభక్తి కలిగినవాడు. అతనికి ఆ అవతారమున జీవాత్మ పరమాత్మలను రెండు భిన్నస్వరూపములు గోచరించవు. అంతయును పరమాత్మయే. ఏలననగా జీవాత్మ ఏది పలికినను పరమాత్మ దానిని సత్యము చేయును. కావున జీవాత్మ పలికినను పరమాత్మ పలికినట్లే గదా! ఇక పరమాత్మ పలుకతలచినది జీవాత్మ పలికినప్పుడు పరమాత్మ పలికినట్లే గదా. కావున చేనును కోయ సిద్ధమైనాడు. కాని రైతు భార్యకు స్వామి యందు ద్వైత భక్తి కలదు. చేనును కోయమని పలికినది బాహ్యస్వరూపమేనని ఆమె భావము. మఠమున ఉండి శిష్యులకు వేదాంతమును బోధించుకొను సంన్యాసికి వ్యవసాయ విషయములు తెలియవని ఆమె ఉద్దేశ్యము. మఠములో ఉండి వేదాంతము పలికినపుడు ఆయనలోని అంతస్స్వరూపము పలకుచున్నదనియు, చేను విషయములో కేవలము బాహ్యస్వరూపమే పలికినదనియు ఆమె ఉద్దేశ్యము. నిజమే, అవతారపురుషుడు కాని కేవల సంన్యాసి యిట్లు మాట్లాడినచో, దానిని విశ్వసించి చేనును కోసినచో అది అవివేకము. కావున చివరకు నష్టము వచ్చును.
అవతారమైనను అది కేవలము పూనకము వంటి ఆవేశావతారమైనచో అంతస్స్వరూపముగా పరమాత్మ ఆవేశించినపుడు మాత్రమే అతడి వాక్యము ప్రామాణికమగును. అనగా మీట నొక్కినపుడు కరెంటు ప్రవహించి తీగె షాకు కొట్టును. స్విచ్‌ని తీసివేసినపుడు తీగెలో కరెంటు లేనందున చల్లగా యుండును. పరశురాముడు ఆవేశావతారము. క్షత్రియ సంహారకార్యమున మాత్రమే అతడు కరెంటుతీగెగా ఉండెను. ఆ పని పూర్తికాగానే స్విచ్ తీయబడినందున అతడు మామూలు ఋషి అయ్యెను. స్విచ్ తీయబడిన తరువాత ఆ తీగె లైటును వెలిగించినది నేనే అని అహంకరించగా, గర్వభంగము నొందినది. కాని రామావతారము, కృష్ణావతారము అట్లు కాదు. అవి పూర్ణావతారములు. అట్టి పూర్ణావతారములలో ఆవేశావతారముగనే తాత్కాలికముగ అప్పుడప్పుడు పరమాత్మ వచ్చి పోవుచుండునని తలచినచో బురదలో పడినట్లే. కావున పూర్ణావతారమైన శ్రీనరసింహసరస్వతియందు ఆ రైతు నిశ్చలమైన అద్వైతభక్తిని కలిగి వ్యవసాయ విషయములో ఆయనకేమి తెలియును అని సందేహించక పంటను కోసి తన పూర్ణభక్తిని నిరూపించుకొని దత్తపరీక్షలో నెగ్గినాడు. ఎవడు పూర్ణావతారమును గుర్తించి పూర్ణమైన విశ్వాసమును, భక్తిని కలిగి యుండునో వాడు తరించుట తథ్యము.
కురుక్షేత్రము ఆరంభమైనపుడు తనను పెంచిన భీష్మ పితామహుని చూచి అర్జునుడు అస్త్రసంన్యాసము చేసినాడు. కృష్ణుడు యుద్ధము చేయమనుచున్నాడు. అర్జునుడు మనస్సులో ఇట్లు తలచినాడు. భీష్మపితామహుని స్థానములో తనను పెంచిన నందుడున్నచో కృష్ణుడు యుద్ధము చేయునా, ఇతరులకు ఉపదేశించుట తేలిక. తన వరకు వచ్చిన గాని తెలియదు అని తలచినాడు. కృష్ణపరమాత్మ వెంటనే పెద్దగా ఒక నవ్వు నవ్వి-గీతాబోధను ఆరంభించినాడు. ఇదే "తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత" అని చెప్పబడినది. అట్లే అసత్యమును చెప్పి ద్రోణుని వధించెదము అని ధర్మరాజుతో చెప్పినప్పుడు కూడా ధర్మరాజు ఇట్లు తలచినాడు. ఇదే సమయమున తన గురువుయైన సాందీపుడు ఉన్నచో వధించునా! తన గురువు కొరకు చనిపోయిన గురుపుత్రుని బ్రతికించినాడు. ఇతరుల విషయమున ఇట్లు చెప్పుచున్నాడు అని. అప్పుడు కూడా కృష్ణపరమాత్మ పెద్దగా నవ్వినాడు.
ఈ విధముగా మహాభక్తులైన జీవులు కూడా అవతారతత్త్వమును ఏదో ఒక సమయమున అపార్థము చేసుకొని, విశ్వాసమును కోల్పోయి, భక్తి అంతరించి, పరమపదసోపాన పటమున పైన చిట్టచివరియున్న గడిలో నోరు తెరచియున్న అజ్ఞాన సర్పముఖమున పడి జర్రున జారి అట్ట అడుగున ఉన్న మొదటి గడిలోనికి చేరుకొందురు. కావుననే గీత "వాసుదేవ స్సర్వమితి స మహత్మా సుదుర్లభః" అని చెప్పుచున్నది. అనగా ఆయన నఖశిఖ పర్యంతము బ్రహ్మమేననియు, ఆయన ప్రతి వాక్కు బ్రహ్మవాక్కే అనియు, ఆయన ప్రతి చేష్టయు బ్రహ్మకర్మయే అనియు ధృడవిశ్వాసము కల భక్తుడు దుర్లభుడు అని అర్థము.
★ ★ ★ ★ ★