03 Feb 2025
Updated with Part-4 on 06 Feb 2025
Part-1
[25-02-2003] భారతదేశము ప్రపంచములోని అన్ని దేశములకన్న ఎంతో మిన్న అయినది. అలానే ప్రపంచమతములలో హిందూమతము గురుస్థానమును వహించినది. ఇచ్చట జరిగినంత తత్త్వశాస్త్రము యొక్క చర్చ ఏ దేశములోనూ, ఏ మతములోనూ జరుగలేదు. భారతదేశము సర్వవిశ్వమునకూ, అలానే హిందూమతము సర్వమతములకూ ప్రతినిధిగా ఉన్నది. ఏలననగా భారతదేశములో వివిధ మాతృభాషలు గల రాష్ర్టములు ఎన్నో వున్నవి. అలానే హిందూమతములో వైష్ణవము, శైవము, శాక్తేయము, సౌరము, గాణపత్యము మొదలగు ఎన్నో ఉపమతములు ఉన్నవి. హిందూమత తత్త్వములో కూడా అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము, త్రైతము మొదలగు విభిన్న సిద్థాంతములున్నవి.
ఈ రాష్ర్టములు, ఉపమతములు, సిద్థాంతములలో ఏకత్వము వున్నది. మణుల యందు గుచ్చబడిన దారమువలె ఈ ఏకత్వము బాహ్యదృష్టికి కనిపించకపోయిననూ మణులన్నియు కలిసియుండుటకు లోపల ఒక దారము ఉండితీరవలయునను అంతరార్థము, కొంచెము జ్ఞానము కలవారికి బోధపడును. కేవలము ప్రత్యక్షమును మాత్రమే నమ్ము పామరులు (ignorant) బాహ్య దృష్టిలో కనిపించుచున్న మణుల యొక్క రంగులలోని భేదమును మాత్రమే చూచుదురు. ఒక చిన్న మణులమాలలో వున్న ఏకత్వమను దారమును చూచినవాడు పెద్ద తోరణములో దాగివున్న ఏకత్వమను తాడును కూడా చూడగలడు. కావున భారతదేశములో ఏకత్వమును దర్శించలేని వాడు ప్రపంచములోని ఏకత్వమును చూడలేడు. అలానే హిందూమతములో వున్న ఏకత్వమును దర్శించలేనివాడు సర్వమతములందు ఏకత్వమును దర్శించలేడు. ఉట్టికి ఎక్కలేని అమ్మ స్వర్గమునకు ఎక్కగలదా?
ఇప్పుడు పరమ దురదృష్టమైన పరిస్థితి ఏమనగా విశ్వమునకు ఏకత్వమును బోధించవలసిన భారతీయులు భాషాభేదముతో కలహించుకొనుచున్నారు. అట్లే విశ్వమునకు గురుస్థానములో ఉండవలసిన హిందువులు కులభేదముతోనూ, మతభేదముతోనూ కలహించుకొనుచున్నారు. గోటిచుట్టుపై రోకలి పోటు అన్నట్లు స్త్రీలను పురుషులు అణచివేసినారన్న మహిళాసంఘ నినాదముతో లింగభేదము స్త్రీ, పురుషుల మధ్య కూడా అనైక్యతగా తలెత్తినది. కులభేదములో కూడా అస్పృశ్యతా (untouchability) విషయము దారుణముగా పనిచేయుచున్నది. ఈ విధముగా ఛిన్నాభిన్నమైన హిందూమతములో అణచివేయబడిన వారు సనాతన సంప్రదాయమును దూషించుచున్నారు. ఈ దూషణము క్రమముగా నాస్తికమతమునకు బలమునిచ్చి సనాతన సంప్రదాయ సారథియగు భగవంతుని దూషించుటకు కూడా కారణమగుచున్నది.
ఇట్టి అల్లకల్లోల పరిస్థితిలో సనాతన ధర్మమును, సనాతన సంప్రదాయమును, వేదశాస్త్ర ప్రమాణములతో నిరూపించవలసిన అవసరము ముందుగా ఎంతైనా ఉన్నది. సూర్యప్రకాశము చేత చీకటి తొలగినట్లు జ్ఞానము చేత అజ్ఞానము వలన వచ్చిన అపార్థములు తొలగును. అయితే, సూర్యప్రకాశముచేత ప్రపంచములో చీకటి పోయిననూ, కొండల గుహలలో అది దాగియే ఉండును. అట్లే ఈ జ్ఞానసరస్వతి యొక్క ప్రచారము చేత అజ్ఞానము పోయిననూ అది మొండివారగు బండ మనుష్యుల హృదయములలో దాగియే వుండును. బయట పగలు వచ్చిననూ, రాత్రి వచ్చిననూ ఆ కొండగుహలలో నిత్యమూ అంధకారమయమైన రాత్రియే వుండును. అటువంటి జీవులను వేరు మార్గము లేక నిత్య నరకమున అసుర జన్మలలోకి పరమాత్మ త్రోసివేయునని గీత ‘క్షిపామ్యాసుర యోనిషు’ అని చెప్పుచున్నది.
సనాతన సంప్రదాయములో కేవలము గుణముల బట్టియే తారతమ్యము
సనాతన సంప్రదాయములో కేవలము గుణముల బట్టియే మరియు ఆ గుణముల ప్రేరణచేత చేయబడు కర్మలనుబట్టియే తారతమ్యము వున్నదే కాని కులమును బట్టి కాని, స్త్రీ–పురుష లింగభేదమును అనుసరించి కాని తారతమ్యము లేదని ఈ సర్వవిశ్వమునకు సద్గురు సార్వభౌముడగు శ్రీదత్తాత్రేయుడు వేదశాస్త్ర ప్రమాణములతో నిరూపింతునని ప్రతిజ్ఞ చేయుచున్నాడు. ఈ అజ్ఞానపు సంప్రదాయములు మధ్యలో వచ్చినవే కాని సనాతనములు కావు. అజ్ఞానులు, అహంకారులు పండితులమని విర్రవీగు కొందరు మూర్ఖుల యొక్క వాదఫలమే ఇది. కావున, అణచబడినవారు అందరినీ నిందించి ద్వేషించరాదు. వేదములో నాలుగు వర్ణములగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రకులములు పురుషసూక్తములో ప్రస్తావించబడినవి. వేదములో అస్పృశ్యులు అని ఐదవ కులము లేనే లేదు. భగవద్గీతలో కూడా ‘చాతుర్వర్ణ్యం’ అను శ్లోకములో నాలుగు కులములే ప్రస్తావించబడినవి. కావున అస్పృశ్యులు అను ఒక కులము లేదు. ఈ అస్పృశ్యులకు ‘చండాలురు’ అని పేరు కూడా కలదు. చండాల శబ్దమునకు అర్థము ‘చడి – కోపే’ అను ధాతువు ప్రకారము కోపముతో మరియు మొండితనముతో కూడిన వాడని అర్థము. కావున నాలుగు వర్ణములలో ఎంత బోధించిననూ మార్పురాని మొండిజీవులే వీరు.
జన్మచేత ఎవడును చండాలుడు లేడు. కేవలము గుణకర్మలను బట్టియే చండాలుడు. ఒక క్లాసులో ఒక చెడు విద్యార్థిని ఉపాధ్యాయుడు క్లాసు నుండి బయటకు పంపుచున్నాడు వానిని ఇతర విద్యార్థుల నుండి వేరు చేయుచున్నాడు. దీని అర్థమేమి? అట్టి కఠినశిక్షచేత వాడు మారుననియే కదా! కావున నాలుగు వర్ణములలో హింసాగుణ కర్ములగు వారిని గ్రామము నుండి వెలివేసినారు. అది కేవలము వారిలో మార్పుతెచ్చు శిక్షయే. ఈ శిక్ష కేవలము వ్యక్తిగతమే. అంతే కాని వారి పూర్వతరముల వారికి గానీ, వారి ఉత్తర తరముల వారికి గానీ గుడ్డిగా వర్తించదు. శబరి మరియు తిన్నడు అంత్యజాతి వారు. కాని వారి పటములు బ్రాహ్మణుల ఇళ్లలోని పూజా మందిరములలో వున్నవి. దుర్మార్గుని కుమారుడు దుర్మార్గుడు కావాలని లేదు. కాని ఈ సనాతన సంప్రదాయములోని ఉద్దేశము మధ్య తరములలోని కొందరు పండితుల యొక్క అజ్ఞానము వలన వక్రీకరించబడినది. ఈ విధముగా సనాతన సంప్రదాయము యొక్క అస్పృశ్యతలోని అంతరార్థము మరుగునపడినది.
Part-2
ఇక నాలుగు కులములలో ఉత్తమత్వము కానీ, అధమత్వము కానీ లేదు. ‘కేవలము గుణములు, కర్మలను బట్టియే కులములను సృష్టించితిని’ అని స్వామి గీతలో ‘చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః’ అని వచించినారు. అనగా గుణములని బట్టియు వారు చేయు కర్మలను బట్టియు కులములను స్వామి ఏర్పాటు చేసినాడని అర్థము. ఈ రోజు మనము ‘టీచర్సు కమ్యూనిటీ’ అను పదమును వాడుచున్నాము. అనగా బోధనవృత్తిని చేయువారి కులము అని అర్థము. అనగా బోధన సామర్థ్యము అను గుణము ఉండి బోధన అను కర్మను చేయుచున్న వారందరునూ ‘ఉపాధ్యాయులు’ అను ఒక కులముగా వ్యవహరించ బడుచున్నారు. అదే విధముగా వారి వారి గుణములు, కర్మలను బట్టి కులములు వచ్చినవి. కర్మచేయు సామర్థ్యమునే గుణము అందురు. కావున, గుణమునకు, కర్మకు సంబంధమున్నది. క్రౌర్యగుణము కలవాడు క్రూరకర్మను చేయును.
సత్త్వము, రజస్సు, తమస్సు అని మూడు గుణములున్నవి. సత్త్వగుణము జ్ఞానమునకు సంబంధించినది. మరియు ఆధ్యాత్మికతత్త్వము కలది. కావున వినయస్వభావము కలిగి పరమాత్మను గురించి లోకమునకు బోధించువాడే బ్రాహ్మణుడు. అనగా సత్త్వగుణ సంపన్నుడే బ్రాహ్మణుడు. ఇక రజోగుణము కలవాడే క్షత్రియుడు. క్షత్రియుడు అనగా క్షతము అనగా గాయము, లేక హింస నుండి రక్షించువాడని అర్థము. అనగా లోకములో దుష్టులగు బలవంతులు సాత్త్వికులను హింస చేయకుండా కాపాడువాడే క్షత్రియుడు. రజోగుణము అహంకారముతో నుండును. హింసించు వారిని దండించుటకు సాత్త్వికగుణము పనికిరాదు. బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానపరుడై ఆధ్యాత్మిక తత్త్వబోధకుడై జ్ఞానమును, భక్తిని, ధర్మమును బోధించవలెను.
క్షత్రియుడు తన బాహుబలము చేత దుష్టులను శిక్షించి, సజ్జనులను రక్షించవలెను. బోధించుట ముఖము ద్వారా జరుగును కావున బ్రాహ్మణుడు ముఖము నుండి పుట్టినాడని, బలము బాహువులలో ఉండును కావున క్షత్రియుడు బాహువుల నుండి జన్మించినాడనియూ వేదము చెప్పుచున్నది. ఇక వైశ్యుడు తొడల నుండి జన్మించినాడని వేదవాక్యము. విశ్వపాలకుడగు పరమాత్మ యొక్క అంకపీఠమున అనగా తొడపై కూర్చున్నది లక్ష్మీదేవత. కావున వైశ్యుడు ధనార్జనకు సంబంధించిన వాడగుచున్నాడు. ధనము ఎచ్చట ఉన్నదో అచ్చట దైవము కానీ, ధర్మము కానీ ఉండదు.
దైవజ్ఞానమునకు సంబంధించినది సత్త్వగుణము. ధర్మరక్షణకు సంబంధించినది రజోగుణము. కావున ధనాసక్తుడగు వైశ్యుడు తమోగుణ స్వరూపుడే అగుచున్నాడు. వైశ్య శబ్దము ‘విట్’ అను శబ్దము నుండి వచ్చినది. ‘విట్’ అనగా మానవుడు. కావున మానవత్వము కలిగి ధనమును ఆర్జించుచూ మానవత్వముతో ధనమును వితరణ చేసి సమస్త లోకమునకూ అంకపీఠమువలె ఆధారభూతుడైనవాడే వైశ్యుడు. ఈ వైశ్యుని యొక్క ధనము ఆధ్యాత్మిక ప్రచారమునకు, సజ్జనరక్షణమునకూ సహకరించవలెను. ఇక శూద్రుడు అనగా శోకించువాడు అనగా దుఃఖమును అనగా కష్టమును పొందువాడే. శూద్రుని యొక్క కర్మ సేవయని మనుస్మృతిలో చెప్పబడినది. ఇది కూడా తమోగుణ స్వరూపమే. కావున శూద్రుడు అనగా తాను నష్టపడుచూ కష్టపడుచూ భగవత్సేవను మరియు లోకసేవను చేయువాడని అర్థము. సేవకుడు స్వామి చెప్పినది చేయునే తప్ప తర్కించడు. మరియు సేవకుడు ‘నేను’ అన్న అహంకార భావమునే విస్మరించి సదా సేవలోనే మునిగిపోవును.
తర్కము జ్ఞానమయమైన సత్త్వగుణము. అహంకారము రజోగుణము. సేవలో ఈ రెండునూ ఉండవు. కావున సేవయూ తమోగుణమే. శూద్రుడు పాదముల నుండి పుట్టినాడని వేదము. పాదములు గమనమును అనగా కర్మను సూచించుచున్నది. కర్మ అనగా సేవయే. జ్ఞానము కన్ననూ, ధర్మము కన్ననూ, ధనము కన్ననూ నిస్వార్థమైన సేవయే గొప్పది. కావున నిజమును ఆలోచించినచో కష్టనష్టములకు ఓర్చి సేవచేయు శూద్రవర్ణమే నాలుగు కులములలో గొప్పది. కావుననే స్వామి పాదముల నుండియే త్రిలోకములను పావనము చేయు గంగ పుట్టినది. అనగా సేవ పరమ పవిత్రమని అర్థము. బ్రాహ్మణుడు కేవలము జ్ఞానమును ప్రచారము చేయువాడు. కానీ క్షత్రియ, వైశ్య, శూద్రులు కర్మ అనగా సేవకు సంబంధించిన వారు కావున వారే గొప్పవారు. ఈ నలుగురునూ ఒకే ‘విరాట్పురుషుని’ నుండి ఉద్భవించిన సోదరులు. వీరిలో బ్రాహ్మణుడు జ్యేష్ఠుడు. మిగిలిన వర్ణములకు అన్నవలె మార్గదర్శకుడై, గురువై ఉండవలెను. మిగిలిన వర్ణముల వారు తమ్ముళ్ళవలె బ్రాహ్మణుని ఆదరించి, గౌరవించవలెను.
లోకములో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వానిని అన్ని వృత్తులవారూ గౌరవించుచున్నారు. ఏలననగా ఉపాధ్యాయుడు సర్వ మానవుల విద్యాజ్ఞానమునకు కారకుడగుచున్నాడు. కావున బ్రాహ్మణునకు ఈయవలసిన గౌరవమును వాని యొక్క గుణము, వృత్తి లేక కర్మను బట్టియే కానీ జన్మను బట్టి కాదు. అన్నయైననూ దుర్గుణములు కల రావణుని తమ్ముడగు విభీషణుడు త్యజించెను. కావున అగ్రజన్మ పూజకు కారణము కాదు.
రావణుడు కశ్యపమహర్షి యొక్క సంతానమగు బ్రాహ్మణుడు. కానీ గౌరవించబడినాడా? కశ్యపుని యొక్క భార్యయగు అదితి యొక్క సంతానమే దేవతలు, వారు సాత్త్వికులు పూజనీయులు. కశ్యపుని యొక్క రెండవ భార్యయగు దితి యొక్క సంతానమే దైత్యులు. వారు రాజసులు మరియు తామసులు, నింద్యులు. రాముడు బ్రాహ్మణుడు కాడు. క్షత్రియుడు. కృష్ణుడు శూద్రకులమునకు చెందిన గొల్లవాడు. వారిరువురికీ గుడులు కట్టించి బ్రాహ్మణులు అర్చకులుగా వారిని పూజించుచూ వారి పాదతీర్థములను గ్రహించుచున్నారు. వేదాధ్యయనము చేసిన బ్రాహ్మణుడైన రావణునికి ఎచ్చటనూ గుడి లేదు. భాగవతమున ఋషులు చేయు ఒక యజ్ఞమున భూరిశ్రవసుడు అను ఒక కుమ్మరి వానిని యజ్ఞాధ్యక్షునిగా బ్రహ్మస్థానమున ఆసీనుని చేసినట్లు చెప్పబడినది. ఇదియే సనాతన సంప్రదాయము. గుణములను బట్టి పూజాస్థానమే తప్ప కులమును బట్టి కాదని స్పష్టముగా తెలియుచున్నది.
సద్గుణములు, బ్రహ్మజ్ఞానము ఉన్నవాడే బ్రాహ్మణుడు
ఇక స్త్రీ, పురుష భేదము పరమ హాస్యాస్పదము. స్త్రీ శరీరము కానీ, పురుషశరీరము కానీ పంచభూతములతోనే నిర్మించబడియున్నది. బ్రాహ్మణ శూద్ర శరీరములు కూడా అంతే. మరణానంతరము ఈ శరీరములు అగ్నిలో దహనము కావించబడినప్పుడు ఒకే భస్మము వచ్చుచున్నది. మరణమున వెడలిపోయిన ఏ శరీరములోని జీవుడైననూ చైతన్య స్వరూపుడే కావున జీవునిలో భేదము లేదు. అయితే ఈ జీవుని ఆశ్రయించిన గుణములలో భేదమున్నది. ఈ గుణములను బట్టియే ఉత్తమత్వము, అథమత్వము. సద్గుణములు, బ్రహ్మజ్ఞానము చండాలునిలో ఉన్ననూ వాడే బ్రాహ్మణుడు. దుర్గుణములు, అజ్ఞానము బ్రాహ్మణునిలో ఉన్ననూ వాడు చండాలుడు. దీనినే శ్రీ దత్తసద్గురువు చండాల రూపమున వచ్చి శంకరాచార్యునికి బోధించినాడు. శంకరాచార్యులు అహంకారముతో చండాలుని పక్కకు తప్పుకోమన్నాడు. ఈ అహంకారము, అజ్ఞానము వలన శంకరులు ఆ క్షణములో చండాలుడైనాడు. అహంకారి పాత్రను శంకరులు ధరించినారే తప్ప సాక్షాత్తు శివుడైన శంకరులకు అహంకారము వచ్చు ప్రసక్తియే లేదు. దానికి కోపగించక వినయముతో సత్త్వగుణమైన జ్ఞానముతో చండాలుడు ‘ఆచార్యా! ఏది పక్కకు పోవలయును? పంచభూతమయమైన శరీరమా? చైతన్యమయమైన ఆత్మయా?’ అని అడిగినాడు. ఆ క్షణములో ఆ చండాలుడు బ్రాహ్మణుడైనాడు. కావున గుణముల తారతమ్యము బట్టియే బ్రాహ్మణత్వము చండాలత్వము అని గ్రహించిన శంకరులు తామసమయమైన అజ్ఞానము వలన తనే అథముడనని, సాత్త్వికమైన జ్ఞానము వలన ఎదుటివాడే ఉత్తముడని క్షణములో గ్రహించి తన అజ్ఞానము పోగొట్టిన గురువుగా స్తుతించుచూ వాని పాదములపై పడినాడు. శంకరులు చెప్పిన మనీషాపంచకమే నిజమైన సనాతన సంప్రదాయము. (కాశీపథిని... స్వామి రచించిన దత్తగీతల నుండి) బ్రాహ్మణులు, పురుషులు అయిన బ్రహ్మర్షులు దండకారణ్యమున మోక్షము నిమ్మని స్వామిని అర్థించినారు. ఆ ఋషులలో కులాహంకారము, పురుషులమన్న లింగాహంకారము జన్మసిద్ధమై పోలేదు కావున స్వామి వారిని శూద్రులైన గొల్లకులమున స్త్రీలుగా జన్మించి ఆ రెండు అహంకారములను పోగొట్టుకున్న కానీ, మోక్షము సిద్ధించదని ఉపదేశించినారు. ఆ ఋషులు క్షణకాలము తపఃశక్తి చేత స్త్రీలుగా మారి సేవింతుమని చెప్పిననూ జన్మసిద్ధమైన వాసన మరల జన్మచేత కానీ పోదని సెలవిచ్చినారు. కావున మోక్షము సిద్ధించుటకు ఏ జీవునకైననూ స్త్రీ జన్మ మరియు శూద్రజన్మ రావలసినదే.
Part-3
పూర్వమీమాంస – ఉత్తరమీమాంస
‘అథాతో ధర్మజిజ్ఞాసా’ అని జైమిని మహర్షి ‘ధర్మజిజ్ఞాస’ ను గురించి చెప్పినాడు. ఇదే పూర్వమీమాంస లేక ధర్మశాస్త్రము. ‘అథాతో బ్రహ్మజిజ్ఞాసా’ అని వ్యాసమహర్షి చెప్పినది ఉత్తరమీమాంస లేక వేదాంత శాస్త్రము. ధర్మజిజ్ఞాస తరువాతనే బ్రహ్మజిజ్ఞాస అని శ్రీ రామానుజులు వచించినారు. దీని అంతరార్థమేమి? ఒక టీచరు క్లాసులోనికి వచ్చినాడు. పిల్లలు గోల చేయుచున్నారు. వారిని ముందు నిశ్శబ్దముగా వుంచవలెను. ఇదియే ధర్మజిజ్ఞాస. తరువాత పాఠమును చెప్పవలయును. అదియే బ్రహ్మజిజ్ఞాస. అగ్రవర్ణులు తమరిని అణచివేసినారని కొందరు, పురుషజీవులు మమ్ములను అణచివేసినారని స్త్రీ జీవులు, సనాతన సంప్రదాయమును విమర్శించుచు అసూయతో ద్వేషించుచుండగా జీవులు ఈ జ్ఞానసరస్వతిని శ్రద్ధగా ఆలకించజాలరు.
కావున ముందు వేదశాస్త్ర ప్రమాణములతో సనాతన సంప్రదాయమేదో నిరూపించి, మధ్యలో కొందరు పండితమ్మన్యులు చేసిన అపార్థములను తొలగించి, అసూయా ద్వేషములను తొలగించిన తరువాత చిత్తశుద్ధి ఏర్పడినప్పుడే జ్ఞానయోగమునకు అధికారము వచ్చును. ఇంటిలోని దుమ్ము ఊడ్చివేసిన తరువాతనే నీటిని చల్లవలెను. దుమ్మును అట్లే వుంచి నీటిని చల్లినచో నేల అంతయు బురద అగును. కావున చిత్తశుద్ధిలేనిదే జ్ఞానాధికారము లేదని శంకరులు వచించినారు.
నిజముగా సర్వమానవులూ స్త్రీలే లేదా పురుషులే. అందరునూ స్త్రీలే ఎట్లు అనగా ప్రకృతియే స్త్రీతత్త్వముగా చెప్పబడుచున్నది. ప్రతి మానవుని యొక్క జడదేహము అపరాప్రకృతి యనబడును. అట్లే ప్రతి మానవదేహములోనున్న చైతన్యము పరాప్రకృతి కావున మానవుడు పరా, అపరా ప్రకృతుల సంయోగమై ప్రకృతి స్వరూపుడే కావున స్త్రీ అగుచున్నాడు. కావున శ్రుతి ‘స్త్రియ స్సతీః పుంస ఆహుః’ చెప్పినది. అనగా జీవులలో నున్న పురుషులు కూడా స్త్రీలే అని అర్థము. ఒకనాడు మీరాబాయి భక్తి ప్రచారము చేయుచూ దారిలో తులసీదాసు ఆశ్రమమున విశ్రమించగోరినది. తులసీదాసు ‘ఇది పురుషులుండు ఆశ్రమము, స్త్రీలకు నిషిద్ధము’ అన్నాడు. అప్పుడు మీరా ‘అయ్యా! మన జీవులలో కూడా పురుషులు వున్నారా? స్వామి ఒక్కడే పురుషుడని ఇంతవరకు భావించుచున్నాను’ అని అన్నది. తులసీదాసు తలతిరిగి మీరా పాదములపై పడినాడు.
‘అథ పురుషో హ వై’ ఇత్యాది శ్రుతులు, ‘ఉత్తమః పురుషః’ అని గీతయు స్వామి ఒక్కడే పురుషుడని చెప్పుచున్నవి. పురుషశబ్దము యొక్క అర్థమును విచారించినచో ‘పురి దేహే శేతే ఇతి పురుషః’ అనగా పురము అనబడు ఈ దేహమును వ్యాపించిన ఆత్మయనబడు చైతన్యమే పురుషుడు. కావున ఏ మానవ శరీరమందైనను వ్యాపించిన చైతన్యము పురుషుడే గావున అందరు మానవులు పురుషులే అనవచ్చును. కావున స్త్రీ పురుష భేదము కాని, బ్రాహ్మణ శూద్రాది వర్ణభేదము కాని అసత్యములే. కేవలము గుణములు, వాని కర్మలను బట్టియే తారతమ్యమున్నది.
శ్రీరామానుజులు బ్రహ్మజిజ్ఞాసకు అర్హుడైన పురుషుడు బ్రాహ్మణుడై ఉండవలయునని ఎట్లు చెప్పినారని కొందరు విమర్శించుచున్నారు. ఆయన ఒక అబ్రాహ్మణుడగు హరిభక్తుడు భోజనము చేసిన తరువాత మిగిలిన అన్నశేషమును ప్రసాదముగా స్వీకరించుటకు పరుగెత్తినాడని మీరు వినలేదా? అబ్రాహ్మణుని భార్య తోడిన జలము చిందగా తన భార్య మడిబిందెలోని నీటిని పారబోసినందులకు ఆగ్రహించి సంన్యసించినాడని మీరు వినలేదా? అటువంటి విష్ణుస్వరూపుడగు ఆచార్యునకు ఇట్టి అల్పభేదములుండునా? ఆయన చెప్పిన బ్రాహ్మణుడు అనగా అవతరించిన పరబ్రహ్మమును గుర్తించినవాడని అర్థము. మరియు పురుషుడు అనగా చైతన్య స్వరూపుడైన మానవుడని అర్థము. కావున నరరూపములో వచ్చిన పరబ్రహ్మమును గుర్తించి వచ్చిన నరుడని అర్థము.
వేదాధ్యయనము నందు అధికారము స్త్రీలకు, శూద్రులకు ఏల నిషేధించబడినది? వారికి ఉపనయనము, గాయత్రి మంత్రోపదేశము ఏల లేవు? అని కొందరు వాదించుచున్నారు. అంతరార్థము తెలియక సనాతన సంప్రదాయమును దూషించుచున్నారు. గాయత్రి అనగా ‘గాయన్తం త్రాయతే’ అని అర్థము. అనగా గానాత్మకమైనది గాయత్రి. ఇది ఒక ఛందస్సు. ఉత్పలమాల, చంపకమాల వంటిది. ఆ ఛందస్సులో కీర్తించబడిన దేవతయే సవిత. సవిత యనగా జగత్తును ప్రసవించినవాడు, అనగా బ్రహ్మదత్తుడని అర్థము. చంపకమాలలో కృష్ణుడు కీర్తించబడినచో ఆ పద్యార్థము, భావము కృష్ణుడా? లేక చంపకమాలయా? చంపకమాలయను దేవత లేదు. కృష్ణుడే దేవత.
అట్లే ఒకానొక ప్రత్యేకమైన పద్యము చంపకమాల కాదు. కావున గాయత్రియను ఒక ప్రత్యేకమైన మంత్రముగాని, ఒక దేవత కాని లేదు. కావుననే ‘గాయత్రీ ఛందః, సవితా దేవతా’ అంటున్నాము. ఇక మంత్రము అనగా ‘మననాత్ త్రాయతే’ అని. అనగా మనస్సును అప్రయత్నముగా ఆకర్షించునది. ‘న గాయత్ర్యాః పరో మంత్రః’ అనగా మనస్సును ఆకర్షించుటలో గానమునకు మించినది లేదు అని అర్థము. ఇచ్చట ‘త్రాయతే’ అనగా రక్షణము. రక్షకుడు పరమాత్మయే. కావున ఆ గానము పరమాత్మపరమై వుండవలయును. కావున పరమాత్మపరమై గానాత్మకమై అప్రయత్నముగా మనస్సును ఆకర్షించు వాక్యము ఏదియైననూ గాయత్రి మంత్రమే.
ఉపనయనము – బ్రహ్మోపదేశము
గానము సామవేదము. వాక్యము యజుర్వేదము. పద్యము ఋగ్వేదము. ఈ మూడింటిలో గానమే మనోహరము. కావుననే ‘వేదానాం సామవేదోఽస్మి’ అన్నారు స్వామి. ఈ గానము పరబ్రహ్మమును ఉపదేశించవలయును కావున దీనినే బ్రహ్మోపదేశము అన్నారు. అయితే బ్రహ్మము అనూహ్యము. అది త్రిగుణాత్మకమైన ప్రకృతిరూపమైన నరాకారమునాశ్రయించి అందివచ్చును. అట్టి త్రిగుణాత్మక సగుణబ్రహ్మమునే ఆరాధించమని సూచించుటయే మూడు పోగుల జందెము వేయుట. అట్టి సద్గుణబ్రహ్మము చిక్కిన తరువాత ఆయన యందు మనస్సును లగ్నము చేసినవాడే సంన్యాసి. కావున వానికి జంద్యముతో పనిలేదు. ఈ విధముగా పరబ్రహ్మము యొక్క ఉప – సమీపమునకు, నయనము – చేర్చుటయే ఉపనయనము. ఇట్టి సగుణబ్రహ్మమైన శ్రీ కృష్ణుని సమీపమునకు చేరి గానాత్మకమైన రాసకేళితో ఉపాసించిన గోపికలే నిజమైన ఉపనయనము పొందిన గాయత్రీ ఉపాసకులు. ఆ గోపికలు స్త్రీలు. ఆ గోపికలు గొల్లవర్ణమున పుట్టిన శూద్రవర్ణము వారు. ఈ గోపికలే పూర్వజన్మమున బ్రాహ్మణులైన పురుషులు. కావున ఎవరికి గాయత్రీ ఉపనయనాధికారము లేదనుకున్నామో వారి వద్దనే నిజముగా గాయత్రి ఉన్నది. నోములు, భజనలతో స్త్రీలు, శూద్రులు పాటలతో పరమాత్మ నుపాసించుచున్నారు. గాయత్రికి స్త్రీస్వరూపము నిచ్చి స్త్రీలకే గాయత్రి లేదనుట ఎంత హాస్యాస్పదము.
Part-4
యజ్ఞమున స్త్రీలచేత కొన్ని మంత్రములను ఉచ్చరింపజేయుదురు. వారికి వేదాధికారము లేదా? ‘పురాకల్పే తు నారీణాం, మౌంజీబంధన మిష్యతే’ అని ప్రాచీనకాలమున స్త్రీలకు ఉపనయనమున్నదని చెప్పబడినది. ‘ఇమాం శివజలామేతి’ అను శ్లోకము సీత సంధ్యావందనము చేసినట్లు చెప్పుచున్నది. ‘జన్మనా జాయతే శూద్రః, కర్మణా జాయతే ద్విజః’ అను శ్లోకము యొక్క అంతరార్థమేమనగా సర్వజీవులును మానవజన్మము చేత శోకించు స్వభావముగల శూద్రులే అగుచున్నారు. కాని వారు చేయు గానాత్మకమైన సామవేద ఉపాసనతో, భక్తితో ద్విజులగుచున్నారు. అనగా మరల కొత్త జన్మమును ఎత్తుచున్నారు అని అర్థము. అనగా లౌకిక చింతలతో, కర్మలతో నిత్యము శోకించు వాడే శూద్రుడు. అట్టి లౌకిక జీవితమును త్యజించుటయే మరణము. పరమాత్మను భక్తితో ఉపాసించుటయే కొత్త జన్మము. ఇట్లు రెండవ జన్మము నెత్తినవాడే ద్విజుడు. లౌకికచింతలతో నున్న ఒకడు శిరిడీసాయికి నమస్కరించగా ఆయన వానిని చావమని పలికెను. దాని అర్థము తెలియక వాడు ఏడ్చుచుండగా వానికి దాని అంతరార్థమును జ్ఞానులు బోధించిరి. అట్టి నిత్యలౌకికుడే శూద్రుడు. శూద్రుడు వేద శ్రవణము చేయనివాడని బ్రహ్మసూత్రములలో అపశూద్రాధికరణమునందు చెప్పబడినది. దీని అర్థమేమి? ఎంత బోధించిననూ పరమాత్మ వైపుకు తిరగక నిత్యము లౌకికముతో ఏడ్చువాడే శూద్రుడు. వానికి జ్ఞాన శ్రవణము అనవసరము. ఒకే పరీక్షను పదిసార్లు వ్రాసిననూ ఉత్తీర్ణుడుకాని విద్యార్థిని విశ్వవిద్యాలయము డీబార్ (debar) చేయుచున్నది. అట్టి నిత్యలౌకికుడే గుణకర్మను బట్టి శూద్రుడగుచున్నాడు కానీ జన్మచేత కాదు. బ్రహ్మ యొక్క మనుమడైననూ రావణుడు శూద్రుడే. దాసీ పుత్రుడైననూ విదురుడు బ్రాహ్మణుడే.
ఈ పదునాలుగు లోకములకు పైనున్న పదిహేనవ లోకమగు గోలోకమునకు ఆధిపత్యమును పొందిన రాధాదేవి గొల్లలను శూద్రకులమున బుట్టిన స్త్రీ అని తెలిసి కులాహంకారము, లింగాహంకారము విడచినగాని మోక్షము సిద్ధించదని తెలియవలయును. కావుననే బ్రాహ్మణ పురుషులైన ఋషులు శూద్రస్త్రీలైన గోపికలుగా జన్మించినగాని మోక్షమును పొందలేదు. ఈ కుల, లింగాహంకారములు, ఆగర్భ జన్మవాసనలు, జన్మమారిన కానీ అవి పోవు. కావున ముక్తికి కడపటి జన్మ, చిట్టచివరి జన్మ శూద్రస్త్రీ జన్మయని తెలిసినచో అజ్ఞాన అహంకార, అంధకారము పటాపంచలగును. అయితే ఒకానొక మహాత్ముడు తీవ్రమైన సాధనచేతనే ఈ జన్మవాసనలు పోగొట్టుకొనవచ్చును. బ్రాహ్మణుడు, పురుషుడు అయిన శ్రీ రామకృష్ణ పరమహంస నెలరోజుల పాటు చీరెను సొమ్ములను ధరించి తనను తాను గొల్లస్త్రీగా అనగా గోపికగా భావించుకొని, భావతీవ్ర సాధనచేత ఆ వాసనలు పోగొట్టుకొని జగన్మాత స్వరూపముగా మారినాడు. నిజముగా పురుషజన్మ కన్న స్త్రీజన్మయే ఉత్తమము. ఏలననగా వినయము, భయము మొదలగు సాత్వికగుణములు పరమాత్మ వద్ద కావలసిన దైవగుణ సంపద వారలకు స్వభావసిద్ధమై యున్నది. వాటిని సాధించుటకు పురుషుడు ప్రత్యేక సాధన చేయవలయును. స్త్రీయగు మహాకాళి, పురుషుడగు శివునిపై పాదము నుంచి నృత్యముచేయుటలో అంతరార్థమిదియే. పురుషభాగమగు దక్షిణపాదమును స్త్రీ భాగమగు వామపాదము దాటి యుండగా వ్యత్యస్త పాదారవింద ముద్రలో స్త్రీలకే అగ్రస్థానమును స్వామి సూచించుచున్నారు. గోపికలలో కుల, లింగాహంకారములు పోయిననూ స్త్రీ స్వభావసిద్ధమైన అసూయ ఉన్నది. దానిని పోగొట్టుటకే బృందావనమున స్వామి రాసకేళిలో గోపికలందరితో కలసి విహరించినాడు. వారికి గోవిందుడు అందరివాడేనని తెలియచెప్ప అసూయను పోగొట్టి అత్యుత్తమ గోలోకమును ప్రసాదించినాడు.
జ్ఞానసరస్వతి – జ్ఞానయోగాధికారము
కావున, ఓ మానవ జీవులారా! మీరు జ్ఞానసరస్వతి శ్రవణమును ముందు అనగా జ్ఞానయోగాధికారము పొందుటకై మీ చిత్తమాలిన్యములగు అసూయ, ద్వేషము, అహంకారము మొదలగు దుర్గుణములను ఊడ్చివేయండి, అప్పుడే జ్ఞానసరస్వతి యొక్క అమృతవర్షమును దత్తుడు చిందించును. అట్లు చేయకున్నచో సరస్వతీనదిలో జలము మీకు ఎట్లు కనిపించదో మీరు ఆ జలమును ఎట్లు పొందలేరో, అదే విధముగా జ్ఞానసరస్వతిలో జ్ఞానము మీకు కనిపించదు. మీరు దానిని పొందలేరు. మీ మనస్సులోనున్న ఆ దుర్గుణములను దుమ్ము మాత్రమే ఇసుకరేణువులవలె ఈ అంతర్వాహిని అగు జ్ఞానసరస్వతిలో మీకు ఇసుక తిన్నెలే కనిపించును. ఇది నాటకమునకు ముందు వేదికవంటిది. వేదికలేనిదే నాటకము అసంభవము. కావున పరిపూర్ణమైన చిత్తశుద్ధి కలవారే ఈ జ్ఞానసరస్వతిలోకి అర్హులగుచున్నారు.
★ ★ ★ ★ ★