home
Shri Datta Swami

 08 Feb 2025

 

జపము యొక్క అంతరార్థము

Updated with Part-2 on 08 Feb 2025


Part-1   Part-2


Part-1

జపము అనగా భగవంతుని యొక్క నామమును పదే పదే ఉచ్చరించుట. మనము లోకములో ఒకరి యొక్క నామమును ఎప్పుడు ఉచ్చరించుచున్నాము? మనము వారిని పిలువ వలసివచ్చినప్పుడు ఆ నామమును పలుకుచున్నాము. రామయ్య అను వ్యక్తిని పిలువవలసి వచ్చినప్పుడు ఆ పేరును ఉచ్చరించుచున్నాము. అట్లే భగవంతుని పిలువ వలసివచ్చినప్పుడు ఆయన నామమును ఉచ్చరించుట సహజమైయుండును. ఇంతకు తప్ప ఒక నామమును ఉచ్చరించుటలో లోకములో ఏ ప్రయోజనమూ కనబడుటలేదు. నీ కుమారునిపై లేక పుత్రికపై నీకు ఎంత ప్రేమ వున్ననూ ఆ కుమారుని నామమును గాని, పుత్రుని నామమును గాని పదే పదే ఉచ్చరించుట ఎప్పుడైననూ చేయుచున్నావా? ప్రియాంకా అని పిలిచినప్పుడు తల్లి పిలుపునకు ఆమె కూతురగు ప్రియాంక బదులు పలుకుచున్నది. అంతేగాని ఆ తల్లి పదే పదే ప్రియాంకా, ప్రియాంకా అని పేరును ఉచ్చరించినచో అప్పుడు ఆ తల్లిని గూర్చి జనులు ఏమని భావింతురు? ఆ తల్లికి మనస్సు భ్రమించినదని వైద్యచికిత్సకు ఆప్తులైన వారు తీసుకునిపోవుదురు. అదే భగవంతుని నామమును ఒక్కసారి ఉచ్చరించుటలో అర్థమున్నది.

ఆ నామమును ఒక్కసారి ఉచ్చరించినప్పుడు భగవంతుని నీవు పిలుచుచున్నావు. ఒకే నామమును పలుమార్లు ఉచ్చరించుటచేత అధికమైన ప్రేమ ఉన్నదని లోకములో ఎవరునూ భావించరు. పోనీ, నామమునందు ప్రియత్వము ఉన్నచో రెండుసార్లు, లేక మూడుసార్లు పలుకవచ్చును. కాని ఒకే నామమును లక్షలసార్లు పలుకుచూ జపము చేయుటలో అర్థము లేదు. ఆ నామమునకు కల అర్థము ఒకటి రెండుసార్లు ఉచ్చరించగనే మనస్సులోకి ఎక్కుచున్నది. అన్నిసార్లు ఉచ్చరించుట చేత ఆ నామమునకు కొత్త కొత్త అర్థములు వచ్చుట లేదు. ఒకే అర్థము కల ఒకే శబ్దమును ఎన్నిసార్లు ఉచ్చరించిననూ అదే అర్థము మరల మరల బోధపడుచుండగా విసుగు లేక వెగటు జనించుచున్నది. అట్లు విసుగు ఏర్పడినప్పుడు ఆ నామము పై కాని ఆ నామము కలిగిన వ్యక్తి పై కాని ఆకర్షణ ఏర్పడదు. అట్టి సహజమైన ఆకర్షణయను ప్రేమ లేక ఆ నామమును పదే పదే ఉచ్చరించుటలో నీవు మనస్సును బలవంతము చేయుచున్నావు. ఆ బలవంతము ఏమనగా నీవు ఈ నామమును లక్షసార్లు జపించినచో నీకు ఫలానా ఐహికమైన లాభము కలుగును అను ఆశను పెట్టియున్నారు. నీవు ఆ లాభమును పొందగోరి ఫలాశతో, బలవంతముగా లక్షసార్లు ఆ నామమును జపము చేయుచున్నావు.

అనగా ప్రియాంక నుండి పది రూపాయలు పొందగోరి నీవు ఆ పేరును పదే పదే ఉచ్చరించుచున్నావు. కావున నీకు ఉన్న ప్రేమ ఆమె చేతిలో ఉన్న పది రూపాయల మీదనే కాని ఆమె మీద కాదు. అంతరార్థమును తెలియని అమాయకురాలగు ప్రియాంక నీవు వందసార్లు ఆమె నామమును ఉచ్చరించినందుకు పొంగిపోయి తన చేతిలో నున్న పది రూపాయలను నీకు ఈయవచ్చును. కాని సర్వజ్ఞుడగు పరమాత్మ అట్లు ఎన్నటికినీ మోసపోడు. నీవు ఎన్నిసార్లు పిలచిననూ నీవు కోరిన పది రూపాయలను నీకు అందించడు. ఒక్కొక్కసారి నీ మోసమునకు బుద్ధిచెప్పదలచి నీ వద్దనున్న పదిరూపాయలను తీసుకొనును. అందుకే కొన్ని మంత్ర జపములు విరుద్ధ ఫలములను ఇచ్చుచున్నవి. దీనికి కారణము మంత్రము యొక్క ఉచ్చారణా దోషము లేక సరియైన నైవేద్యము పెట్టలేదనియో అజ్ఞానులు భావించుచున్నారు. పరమాత్మ ఉచ్చారణమును కాని భాషను గాని ఎప్పుడునూ గమనించడు. ‘భావగ్రాహీ జనార్దనః’ అని శాస్త్రము. అనగా పరమాత్మ నీ భావమును చూచుచున్నాడు తప్ప నీ భాషను కాదు.

Swami

గోకులమున గోపాలురు ‘కృష్ణ’ శబ్దమును పలుక లేక ‘కిట్టయ్యా’ అని పిలిచెడివారు. వెంటనే ఆ పరమాత్మ పెద్ద గొంతుతో ఆ! అని బదులు పలికెడివారు. ఋషులు యజ్ఞములు చేయుచూ ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని వందలసార్లు సంస్కృతములో స్పష్టమైన ఉచ్చారణతో పిలుచుచున్ననూ మౌనమును వహించుచున్నాడే తప్ప బదులు పలుకుట లేదు. గోకులము ఆవుల మందల రొచ్చులతో ఎంతో మలినముగ ఉండెడిది. ఆ రొచ్చులో కాలుజారి పడుచున్ననూ అచ్చటనే పరంధాముడు సంచరించెడివాడు. ఎంతో పవిత్రముగా శుభ్రపరచి అలంకరింపబడిన యజ్ఞవాటికలలోకి వచ్చుటకు ఇష్టపడెడి వాడు కాదు. దీనికి కారణము ఏమి? ఆ గోపాలురు పూర్వము ఋషులు. కర్మల చేత కాని, తపస్సులచేత కాని, జపములచేత కాని, వేదాధ్యయనముల చేత కాని పరమాత్మ చిక్కడు, కేవలము ప్రేమభావమునకే చిక్కును అని తెలిసి ఆ ఋషులు అవి అన్నియును త్యజించి చివరకు బ్రాహ్మణజన్మలను సైతము వదలివేసి గొల్లలుగా శూద్రకులమున పుట్టినారు. అప్పుడే వారికి ఆ పురుషోత్తముడు లభించినాడు.

 

Part-2

కావున ఒకే నామమును బలవంతముగా ఫలాశతో పలుమార్లు ఉచ్చరించుట వెర్రితనము. ఉదా: ‘రామ’ అని పలికినాము. ఆ శబ్దమునకు ఒకే అర్థము ఉన్నది. ‘రమతే ఇతి రామః’ అని అర్థము. అనగా పరమాత్మ ఒక పాత్రను ధరించి తాను సూత్రధారిని అని పూర్తిగా మరచిపోయి తనను కేవలము ఆ పాత్రగానే తలచుచూ ఆ పాత్ర రసమును మోజులో అనుభవించి రమించువాడని అర్థము. రాముడు ఆ పాత్రలో ఎంత లీనమైపోయినాడనగా, నాటకము పూర్తి అయిననూ ఇంటికి రాకుండా స్టేజి మీదనే ఉండిపోయి చంద్రమతీ! చంద్రమతీ అని కలవరించుచూ ఉన్న హరిశ్చంద్ర పాత్రధారియైన సుబ్బారావు అను నటునివలె త్రేతాయుగము ముగియుచున్ననూ అయోధ్యలోనే సీతా! సీతా! అని కలవరించుచూ ఉండిపోయినాడు. కావుననే ఆ పాత్ర రసమును పూర్తిగ అనుభవించినాడు. కావున రామశబ్దమును ఒకసారి ఉచ్చరించగనే ఈ అర్థము బోధపడినది. ఆనందించినాము. మరల రెండవసారి ఉచ్చరించగనే మరల ఇదే అర్థము బోధపడుచున్నది. ఇక లక్షలసార్లు రామ శబ్దమును చెప్పుచుండగా, లక్షలసార్లు అదే అర్థము బోధపడుచుండగా మనస్సులో రామునపై ఆకర్షణ ఏర్పడుటకు బదులు విసుగుతో వికర్షణ ఏర్పడును. అదే రామ శబ్దమునకు బదులు ఆ రాముని యొక్క గుణగుణములను స్ఫురింప చేయు ఇతర నామములను ఉచ్చరించవచ్చును.

ఉదాహరణకు ‘శబరీ మోక్షప్రదాయ నమః!’ అన్నాము. అనగా, శబరికి మోక్షము ఇచ్చినాడని అర్థము. ఆ నామములో శబరి అనే భక్తురాలిపై ఆయన చూపించిన కరుణ స్ఫురించుచున్నది. మూడవసారి ‘రావణాంతకాయ నమః!’ అన్నాము. అనగా అజేయుడైన రావణుని సంహరించిన వాడు అన్నప్పుడు ఆయన యొక్క పరాక్రమము తెలియుచున్నది. కావున ఒక్క నామమును జపించుట కన్ననూ సహస్రనామ పారాయణము చేయుట ఉత్తమము. అయితే సహస్రనామము పలుకుచున్నప్పుడు ప్రతి నామము యొక్క అర్థము తెలియవలయును. అర్థము వలన భావము పుట్టును. భావము వలన రసము జన్మించును. రసము వలన ఆనందము కలుగును. ఆనందమే పరమాత్మ స్వరూపము. ‘ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్’ అని శ్రుతి. నిజముగా ఆలోచించినచో అసలు సిసలు ఫలము ఆనందమే. నీవు లోకములో ఏమి సాధించినూ తరువాత పొందు మోక్షమునకు కూడా ఆనందమే ఫలము, లక్ష్యము అగుచున్నది.

ఈ ఆనందము పరమాత్మ నుండియే పుష్కలముగ లభించును. జీవుడు తన ఆత్మ నుండియు ఆనందము పొందును కాని జీవాత్మలో ఉన్న ఆనందము ఒక బిందెడు నీరు మాత్రమే. అది చాలా పరిమితము. కాని పరమాత్మ సన్నిధిలో నుండి ఆనందమును పొందుట గంగానది తటమున ఉండి జలము త్రాగినట్లుండును. ఈ అపార ఆనంద స్వరూపమైన బ్రహ్మానందమే స్వామి యొక్క స్వస్వరూపము. బ్రహ్మ అనగా చాలా గొప్పది అని అర్థము. ‘బృహి - వృద్ధౌ’ అను ధాతువు నుండి బ్రహ్మ శబ్దము వచ్చినది. కావున బ్రహ్మానందము అనగా చాలా గొప్ప అపారమైన ఆనందము అని అర్థము. అవతరించిన పరమాత్మను గుర్తించుటకు ఇది ఒక గుర్తు. ఆయన యొక్క సన్నిధిలో నీవు అనంతమైన ఆనందమును పొందుచుందువు. ఇంతకన్న అవతారమును గుర్తించుటకు వేరు గుర్తులు అక్కర లేదు. అగ్ని యొక్క సన్నిధిలో నిరంతరము వేడి లభించుచున్నది. జలప్రవాహ సమీపమున నిరంతరము చల్లదనము లభించుచున్నది. అట్లే అపారానంద స్వరూపుడగు స్వామి సన్నిధిలో అపారముగ ఆనందము లభించుచుండును.

కావున ఏక నామజపము కన్ననూ సహస్రనామ జపము గొప్పది. అయితే ఈ సహస్రనామములు వచన రూపములో ఉన్నవి. వచనము కన్ననూ పద్యము మనస్సును ఆకర్షించును. కావున సహస్రనామ పారాయణ కన్ననూ పద్యరూపములో నున్న భాగవతమును పఠించుట ఇంకనూ ఉత్తమము. పద్యముకన్ననూ గీతము గొప్పది. గీతము మనస్సును ఆకర్షించినట్లు వచనము కాని, పద్యము కాని మనస్సును ఆకర్షించలేవు. కావున పరమాత్మ యొక్క కళ్యాణ గుణములను స్ఫురింపచేయు గానమును చేయుట అత్యుత్తమ సాధన. మంత్రము అనగా మనస్సును ఆకర్షించునది. గాయత్రి అనగా గానాత్మకమగు కీర్తన. గానమునకు మించిన చిత్తాకర్షణము వేరొకటి లేదు. కావుననే ‘న గాయత్ర్యాః పరో మంత్రః’ అనగా గాయత్రిని మించిన మంత్రము లేదు అని అర్థము. అనగా గానాత్మకమగు కీర్తనమును మించి మనస్సును ఏదియు ఆకర్షించలేదు అని అర్థమే, ఈ అంతరార్థమును తెలియక పామరులు ‘తత్సవితుర్ వరేణ్యమ్’ అను ఋగ్వేద శ్లోకమునకు మించిన మంత్రము లేదని చెప్పుచున్నారు. కావున అంతరార్థమును తెలియనిచో సర్వమునూ కోల్పోవుచున్నాము.

దేనిలోనైననూ అంతరార్థమును ‘గురుదత్తుడు’ మాత్రమే వివరించగలడు. కావున అట్టి గురుదత్తుడు నీకు సద్గురువుగా లభించినచో నీవు తరించినట్లేనని తెలియుము. ఏలననగా ఆయన యొక్క అంతరార్థ వివరణము అను వలలో పడిన పెద్ద తిమింగలము కూడా తప్పించుకొనజాలదు. జ్ఞాన ఆకర్షణములో నిన్ను సత్యమైన మార్గమున నడుపగలవాడు గురుదత్తుడే తప్ప మరి ఏ నరగురువునూ సమర్థుడు కాజాలడు. గురుదత్తుడు త్రిమూర్తి స్వరూపుడు. త్రిమూర్తులనగా సృష్టి, స్థితి, లయములను చేయువాడు. సృష్టి, స్థితి, లయములను చేయునది పరబ్రహ్మమేనని శ్రుతి చెప్పుచున్నది. కావున త్రిమూర్తి స్వరూపుడగు దత్తుడే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము సత్యమైన, అనంతమైన జ్ఞానస్వరూపమనియు, ప్రశస్తియైన జ్ఞానము అగు ప్రజ్ఞాని అనియు శ్రుతులు ‘సత్యం జ్ఞానమ్ అనంతం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ’ అని చెప్పుచున్నవి.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch