home
Shri Datta Swami

 09 Jan 2025

 

దేవాలయాలు, శిల్పాలు, యంత్రాల అంతరార్థము

Updated with Part-3 on 11 Jan 2025


Part-1   Part-2   Part-3


Part-1

[16-01-2004] ప్రాచీన ఋషులు ప్రకృతిలో నున్న వస్తువులను పరమాత్మకు ప్రతీకలుగా పెట్టి ఉపాసించినారు. దీనికి కారణము ఆ కాలములో పరమాత్మ మనుష్యరూపములో వచ్చు అవసరము లేదు కావున. ఋషులు నేరుగా బ్రహ్మ, విష్ణు, శివ లోకములకు పోయి తేజోరూపులైన బ్రహ్మ, విష్ణు, శివులను దర్శించెడివారు. ఋషులు జ్ఞానములో పరిపూర్ణులు. జ్ఞానములో వచ్చు సంశయములను వారిని అడిగి తెలుసుకొనెడివారు. కావున జ్ఞానబోధకు అవతారముల అవసరము లేకపోయినది. జ్ఞానము సత్త్వగుణము. ప్రకాశమును కలుగచేయునని గీత చెప్పుచున్నది (ప్రకాశ ఉపజాయతే). కావున ప్రకాశవంతులైన సూర్యుని, అగ్నిని జ్ఞానస్వరూపుడైన పరమాత్మకు ప్రతీకలుగా ఆరాధించినారు. ప్రతీక యనగా దాని సహాయముతో అసలు వస్తువును తెలుసుకొనుట. దీని అర్థము చూపుడు వేలు సహాయముతో ఒక పుష్పమును దర్శించినపుడు ఇంక నీకు ఆ చూపుడు వేలుపై దృష్టి అవసరము లేదు. అనగా సూర్యుడు మరియు అగ్ని ద్వారా ‘పరమాత్మ జ్ఞానస్వరూపుడు, అజ్ఞానాంధకారమును పోగొట్టువాడు’ అని తెలుసుకున్న తరువాత ఇక నీవు సూర్యుని వైపు, అగ్ని వైపు చూడనక్కరలేదు.

ఉపాసన యనగా ధ్యానము. ధ్యానము అనగా పూర్తిగా తెలుసుకొనుట. నిశ్చయ జ్ఞానమే బుద్ధి. బుద్ధి యొక్క కర్మయే ధ్యానము. మొదట ‘ఆదిత్యం బ్రహ్మేత్యుపాసీత’ అని వేదము చెప్పినది. అనగా సూర్యుని దర్శించి ఆ సూర్యుని వంటివాడు పరమాత్మ, ఆ తేజస్సు వంటిదే ఆయన జ్ఞానము. ఆ తేజస్సు చీకటిని పారద్రోలినట్లు ఆయన జ్ఞానము అజ్ఞానమును పారద్రోలును, ఇత్యాది పరమాత్మ లక్షణములను సూర్యుడు అనెడి ఉపమానముల ద్వారా తెలుసుకొనుటయే ఉపాసన. ఇట్లు తాత్పర్యమును తెలియక పిచ్చివారలగు అజ్ఞానులు ఆ సూర్యుని వైపే చూచువారు కొందరు, ఆ సూర్య మండలమును మనస్సులో ఊహించి నిలుపుకొనువారు కొందరు బయలుదేరినారు. ఇంకను వెర్రి వేయి విధములై ఆ సూర్యునికి జలము నిచ్చువారు, నైవేద్యాది పూజలు చేయువారు బయలుదేరినారు. దీనికి కారణము అజ్ఞానులగు ఈ పామరులు సూర్యుడినే పరమాత్మగా భావించినారు. అందుకే వేదము ‘నేదం తత్ యదిదముపాసతే’ అని చెప్పినది. దీని అర్థము – ఈ జడమైన సూర్య మండలము పరమాత్మ కాదు. మరియు పరమాత్మ ఆ సూర్యమండలములో కూడ లేడని ఏ జడవస్తువులోను పరమాత్మ ఉండడని – ‘న తస్య ప్రతిమా అస్తి’ అని వేదము బోధించుచున్నది.

Swami

సూర్యబింబము ఆయన ఇచ్ఛాసారముగా చలించు జడమైన ఒక తేజోరూపమేనని ‘భీషోఽదేతి సూర్యః’ అని చెప్పుచున్నది. ఎట్టి జడపదార్థము పరమాత్మ కాదని వేదము స్పష్టముగా – ‘నేతి, నేతి’ అను వాక్యముతో చెప్పుచున్నది. అట్టి జడవస్తువుకు సేవ చేయరాదనియు, మూర్ఖుడై చేతనమునకు చేయవలసిన సేవలను జడమునకు చేసినచో జడముగా జన్మించుననియు గీత చెప్పినది (భూతేజ్యా యాన్తి భూతాని). కావున జడములు పరమాత్మ యొక్క జ్ఞానమును బోధించు నమూనాలు లేక ఉపమానములు (ప్రతీకలు) అని గ్రహించి జ్ఞాని అవి బోధించు జ్ఞానమును అర్థము చేసుకున్న తర్వాత ఆ నమూనాలను వదలివేయుచున్నాడు. ఇక ఆ నమూనాలు – జ్ఞానమును పొందవలసిన అజ్ఞానులకే గాని, జ్ఞానము పొందిన వారికి అక్కరలేదు. ఆ నమూనాలను విడచివేయుటయే సంన్యాసము. జ్ఞానియగు సంన్యాసి సూర్యునకు జలమును అర్పించు సంధ్యావందనము చేయుట లేదు.

ఆ తరువాత ఋషుల కాలము పోయినది. ఋషుల స్థానములో లౌకికులగు పండితులు వచ్చినారు. వీరు కొంత జ్ఞానమును గలిగి కొంత అజ్ఞానమును కలిగినవారు కావున అనుకూలమైనంత వరకు ఆచరించుచు, అనుకూలము గాని జ్ఞానమునకు పాండిత్యశక్తితో వక్రార్థములను తీయనారంభించినారు. ఈ వక్రార్థములను ఖండించి సరియైన అంతరార్థమగు జ్ఞానమును బోధించుటకు పరమాత్మ నరరూపములో వచ్చినాడు. ఒకానొక నరరూపములో పరమాత్మ వచ్చినాడు కావున, ఆ నరరూపమును గుర్తించవలయును అన్న జ్ఞానమును బోధించుటకై, నరరూపములో దేవతా విగ్రహములను, గతించిన అవతార పురుషుల విగ్రహములను చెక్కినారు.

ప్రతి నరుడు అవతారమని భ్రమించు అవకాశము లేదు. ఏలననగా ఒక మామూలు మనిషి విగ్రహమును చెక్కి దానికి దేవాలయమును కట్టించలేదు. ఆ విగ్రహమునకు ప్రాణప్రతిష్ఠ అన్నారు. అనగా ప్రాణముతో కూడిన నరాకారములో పరమాత్మ వచ్చుననియే అర్థమును గ్రహించవలయును. ఈ అంతరార్థమును గ్రహించక విగ్రహములోనికి ప్రాణము దూరినదని అజ్ఞానులు తలచినారు. అట్లు ప్రాణము దూరినచో విగ్రహము కదలి మాట్లాడదేల? ప్రాణప్రతిష్ఠకు అంత శక్తి ఉన్నచో మరణించిన విగ్రహమువలె జడమైన మానవ శరీరమునకు ప్రాణప్రతిష్ఠ చేయరేల? కావున ప్రాణప్రతిష్ఠ సూచించు సత్యమైన జ్ఞానము పోయినది. దానికి అసత్యజ్ఞానమైన అపార్థము వచ్చినది. ‘దేవో దేవాలయః ప్రోక్తః’ ‘జీవో దేవ స్సనాతనః’ దీని అర్థమేమి?

 

Part-2

దేవాలయము కూడ జ్ఞాన విషయమును చెప్పు నమూనాయే. బాహ్య ప్రాకారము స్థూల శరీరము. లోపల ఉన్న గుడి సూక్ష్మ శరీరము. లోపల ఉన్న గర్భగుడి కారణ శరీరము. ఆ లోపల ఉన్న విగ్రహము మహాకారణ శరీరము. ఈశ్వరుని సూచించుచున్నది. ఈశ్వరుడనగా త్రిగుణాత్మకమైన మాయతో కూడిన పరబ్రహ్మము. అవతార విషయములో మాయాతీతమైన ఈ పరబ్రహ్మము ఆధారకేంద్రము. దాని చేత సృష్టించబడిన తేజోమయమైన సృష్టి, స్థితి, లయములను చేయు దత్తాత్రేయరూపమే కారణ శరీరమగు గర్భగుడి. దానిచే సృష్టించబడిన మరియొక తేజోమయమైన సూక్ష్మ శరీరమైన గుడియే విష్ణువు. దానిచే సృష్టించబడిన పంచభూతాత్మకమైన శ్రీరాముని శరీరమే బాహ్య ప్రాకారము. కావున శ్రీరాముని శరీరములో విష్ణువు, విష్ణువులో దత్తుడు ఉందురు. ప్రాకారము, గుడి, గర్భగుడి – ఈ మూడును శరీరములైన రూపములు. లోపల ఉన్న విగ్రహము సగుణబ్రహ్మము. ఇంత వరకే మనము పోగలము. గుణస్వరూపమైన మాయను దాటలేమని గీత చెప్పుచున్నది (మమ మాయా దురత్యయా). మాయారహితమైన శుద్ధబ్రహ్మము ఊహకు సైతము అందదు. కావున సగుణ బ్రహ్మమును ఆవరించి ఉండునదే దత్తస్వరూపము. అనగా కంటికి కనపడే రూపాలలో అసలు రూపమే దత్తుడు. ఈ దత్తుని యొక్క అవతారము విష్ణువు. విష్ణువు యొక్క అవతారమే రాముడు.

గుడిలో దాచబడే యంత్రము లన్నియు జ్ఞానములను బోధించు నమూనాలే. సిద్ధాంతములను చిత్రరూపములో తత్త్వాలకు సంకేతముగా బీజాక్షరాలను ఉపయోగించి గీచిన పటములే యంత్రములు. తాళపత్రముపై లిఖించినచో నశించునని లోహపత్రములపై లిఖించినారు. ఆ యంత్రములను చూచి ధ్యానము చేయుట అనగా ఆ యంత్రము సూచించు విధానమును అర్థము చేసుకొనుటయే. అన్ని చక్రములలో శ్రీచక్రము ప్రధానము అన్నారు.

శ్రీ అనగా లక్ష్మి. ధనము లోకములో ప్రధానము. చక్రము అనగా సుడిగుండము. ఈ ధనబంధము యొక్క సుడిగుండములో పడినవాడు బయటకు రాలేడు కనుక అది ప్రధానచక్రమైనది. వశిష్ఠుడు ‘ధనమూల మిదం జగత్’ అనినాడు. కావున శ్రీచక్రమే జగత్తుకు మూలమైయున్నది. శ్రీచక్రమును సమయమతములో సృష్టిచక్రముగను, కౌళమతములో సంహారచక్రముగను వ్రాయుచున్నారు. సృష్టిచక్రములో ధనబంధము ఏర్పడుట, సంహార చక్రములో ధనబంధము ఛిన్నమగుటయే అంతరార్థము. సృష్టి చక్రములో అయిదు త్రికోణములు అధోముఖములై యుండి, వాటి ఆధారములు పైకి ఉన్నవి. అనగా పంచభూతమయమైన ధనమే ఆధారముగా యుండుట. ఇందులో నాలుగు త్రికోణములు ఊర్ధ్వముఖముతో యున్నవి. అనగా ఆ నాలుగు అంతఃకరణ స్వరూపమగు జ్ఞానము, ధనమునకు వశమైయున్నవి. ఈ చక్రములో మధ్యబిందువు మాయ. అనగా ఇది అజ్ఞానికి సంబంధించినది.

ఇక సంహారచక్రములో అయిదు త్రికోణములు ఊర్ధ్వముఖములై, నాలుగు త్రికోణములు అధోముఖములై యున్నవి. అనగా జ్ఞానమును ఆధారమును చేసుకొని ధనమున్నది. జ్ఞానము యొక్క వశములో ధనమున్నది. ఈ చక్రములో సంహారకారకుడగు ఈశ్వరుడున్నాడు. అనగా ఈశ్వరజ్ఞానము గల జ్ఞాని విషయము. రెండు చక్రములలో అష్టదళ పద్మము, షోడశదళ పద్మము వెంట వెంట యున్నవి. అజ్ఞాని విషయములో అష్టైశ్వర్యములే అష్టదళ పద్మములు. షోడశ కళలు గల చంద్రస్వరూపమైన మనసే షోడశదళ పద్మములు. అనగా వాని మనస్సు ఎల్లప్పుడు అష్టైశ్వర్యముల మీదనే ఉండును. ఇక జ్ఞాని విషయములో – అష్టదళ పద్మము అష్టసిద్ధులు. షోడశదళ పద్మము షోడశ కళ్యాణ గుణములు గల పద్మము. అనగా వాని మనస్సు ఎల్లప్పుడు ఈశ్వర స్వరూపమై యుండును కావున వానికి అష్టసిద్ధులు వశమైయుండును.

రెండు చక్రములలోను మూడు వృత్తములు ఉన్నవి. ఇవే – కారణ, సూక్ష్మ, స్థూల శరీరములు. బాహ్య వృత్తములో మూడు రేఖలు ఉన్నవి. అనగా స్థూల శరీరములో త్రిగుణకర్మలు విడివిడిగా గోచరించుచున్నవి. చక్రమునకు బయట మూడు రేఖలతో కూడిన నాలుగు ద్వారములున్నవి. అజ్ఞాని విషయములో ఈ నాలుగు ద్వారములే – ధర్మార్థ కామమోక్షములు. వీని దృష్టిలో మోక్షమనగా – పాపకర్మ ఫలముల నుండి విముక్తి చెందుట. అంతే కాని సంసారచక్రము నుండి విముక్తి కాదు. జ్ఞాని దృష్టిలో ఈ నాలుగు ద్వారములు నాలుగు వేదములు. అటు వేదములైనను ఇటు ధర్మ, అర్థ, కామ, మోక్షములైనను త్రిగుణవిషయములే కావున మూడు రేఖలే వున్నవి. వేదము కూడ త్రిగుణ విషయమే అని ‘త్రైగుణ్య విషయా వేదాః’ అని గీత చెప్పుచున్నది. అజ్ఞాని విషయము జీవస్వరూపమును, జ్ఞాని విషయము శివస్వరూపమును చెప్పుచున్నది. జీవస్వరూపములో శివ కోణములు నాలుగు ఊర్ధ్వముఖములై, అధోముఖములైన అయిదు శక్తి కోణముల పీఠములపై నిలుచుటచేత చైతన్య స్వరూపుడైన జీవుడు పంచభూతమయమైన ధనమాయకు వశీకృతుడైయుండును.

జ్ఞాని స్వరూపమున శివకోణములు అధోముఖములైనందున, వాటి పీఠములపై పంచభూతమయమైన అయిదు శక్తి కోణములగు ధన మాయను జ్ఞానియగు ఈశ్వరుడు తన వశములో ఉంచుకొనును. కావున మాయకు వశుడైన వాడు జీవుడు. మాయను వశములో ఉంచుకున్నవాడు శివుడు అని సూచింపబడుచున్నది.

 

Part-3

ఈ విధముగా దేవాలయములు, దేవతా విగ్రహములు యంత్రములు జ్ఞానమును బోధించు ప్రతీకలు. ఈ అంతరార్థమును తెలుసుకొనక గుడులకు, విగ్రహములకు, యంత్రములకు కర్మఫలములను అంటగట్టుచున్నారు. ‘నా భుక్తం క్షీయతే కర్మ’ అనగా కర్మ ఫలములు అనుభవించక తప్పదు. దుష్కర్మ ఫలముల శిక్ష తప్పించుకొనుటకు వీలు కాదు. చేసిన దుష్కర్మ ఫలములు పోవు. చేయని పుణ్యకర్మ ఫలములు రావు. ఎన్ని పూజలు చేసినను ఎన్ని ప్రదక్షిణములు చేసినను యంత్రములను ఆరాధించినను కర్మఫలములను తప్పించుకొనలేరు. ఒక దొంగ గురువు నీ నుండి 100 రూపాయలు కాజేయ తలచుకున్నాడు. వాడు ఎంత బోధించినను నీవు ఒక్క రూపాయి కూడా ఇవ్వవు. నీ చేత 50 రూపాయిల ద్రవ్యమును కొనిపించి నీలోని ఆశను రెచ్చగొట్టి ఆ 50 రూపాయలను దగ్ధము చేసిన గాని నీకు వానిపై విశ్వాసము ఏర్పడదు. ఇట్టి దొంగ గురువులకు నిత్య నరకము విధించబడుచున్నది. ఆ దొంగ గురువు నిత్య నరకమున పడుచున్నాడు. నీవు ద్రవ్యమును, కాలమును కోల్పోయి ఇచ్చట నష్టపడుచున్నావు.

దొంగ గురువు 100 రూపాయలు తీసుకుని ఆశ్రయించిన వానిని అసత్యమార్గములో భగవంతునకు 100 అడుగులు దూరము చేయుచున్నాడు. నీవే గురువైనచో, అట్లు చేయుట కన్నను వాడు ఒక్క రూపాయి ఇచ్చినను వాని వద్ద నుండి దానిని గురుదక్షిణగా తీసుకొని సత్యమైన మార్గమున ఒక్క అడుగు వేయించుము. భగవంతుడు నీపై సంతసించును. నీకు లక్షరూపాయల నిచ్చును. భగవంతుని అనుగ్రహము ఆలస్యమైనను, నీవు ఎక్కువ మంది జనమును ఆకర్షించకపోయినను, కీర్తి లభించకపోయినను, నీవు ఆచార్యునిగా సత్యమైన మార్గమునే నడువవలెను. ముందు చెప్పిన ఈ నమూనాల అర్థము తెలిసిన తరువాత నీవు ఇహపరముల యందు తరించెదవు. ఇట్లు సంప్రదాయములోని ప్రతి విషయమున గల అంతరార్థమును బోధించు జ్ఞానమందిరములుగా దేవాలయములు మారవలయును.

గీత నిషేధించిన ఇజ్యను (ఊదు వత్తులు వెలిగించుట, దీపములు వెలిగించుట, పూలతో అలంకరించుట, టెంకాయలు కొట్టుట, కర్పూర నీరాజనము, తాంబూలము) ఆపివేసి, అర్చకులు, పురోహితులు, మంచి పండితులుగా మారి జ్ఞానమును బోధించి వచ్చిన వారలను భక్తులుగా చేసి వారును మనస్ఫూర్తిగ సంతోషముతో యిచ్చు గురుదక్షిణలను స్వీకరించి ఈశ్వరానుగ్రహనకు అందరును పాత్రులైననాడే మరల ఋషులయుగము (కృతయుగము) వచ్చును. ఆచరణమున జ్ఞానబోధలను చేయువారు ఋషులు గాని, జడలను, గడ్డములను పెంచుకొని కాషాయ వస్త్రములను ధరించి, బాహ్యవేషముల చేత కరడుగట్టిన అజ్ఞానముతో అజ్ఞానులైన జనులను సంస్కరించుచు, జ్ఞానులవలె నటించుచున్నవారు మహా రౌరవ నరకకూపమున అంధులై, అంధులైన శిష్యగణములతోడ పతితులగుదురని వేదము చెప్పుచున్నది. (అవిద్యాయా మన్తరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః, దంద్రమ్యమాణాః పరియన్తి మూఢా అంధేనైవ నీయమానా యథాన్ధాః)

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch