16 Sep 2024
శ్రీ కృష్ణ భగవానుడు ప్రదర్శించిన విశ్వరూపమును అర్థము చేసుకొనుటయే సర్వ వేదముల యొక్కయు సర్వ శాస్త్రముల యొక్కయు సారమై యున్నది. శ్రీ కృష్ణుడు విశ్వరూపమును ప్రదర్శించక ముందు కూడ విశ్వరూపముతోనే యున్నాడు. విశ్వరూపమును ఉపసంహరించిన తర్వాత కూడ విశ్వరూపముతోనే యున్నాడు. అర్జునుని యొక్క దృష్టి మాత్రమే మారినది. సూర్యుడు ఎప్పుడును ప్రకాశించుచునే యున్నాడు. నల్ల కళ్ళజోడు పెట్టగనే ప్రకాశము లేని ఒక బింబమాత్రునిగా గోచరించుచున్నాడు. ఆ కళ్ళజోడు తీయగనే మరల చూచుటకు వీలు కాని మహాప్రకాశముతో మండుచున్నాడు. నీవు నల్ల కళ్ళజోడు పెట్టినపుడు సూర్యుని యొక్క తేజస్సు సూర్యుని నుండి పోవుట లేదు. ఆ కళ్ళజోడు తీయగనే సూర్యునికి కొత్త తేజస్సు వచ్చుట లేదు.
అందుకే విశ్వరూప ప్రదర్శనమునకు ముందు "దివ్యం దదామి తే చక్షుః" అనగా నీకు దివ్య దృష్టిని ఇచ్చుచున్నాను అన్నాడు. అనగా నీ కళ్ళకు ఉన్న నల్ల కళ్ళజోడును తీసివేసి నీ యొక్క స్వభావ సిద్ధమైన సత్యమైన దృష్టితో నన్ను తిలకించుము అని అర్థము. కావున పరమాత్మ అవతరించునపుడు మనుష్య రూపమున ఉన్నట్లు మనకు గోచరించుటకు కారణము మనకున్న అజ్ఞానమే కాని ఆయన నిజముగా అజ్ఞానము చేత కప్పబడి లేడు. కొందరు పచ్చని వర్ణములో ఉన్నారు. వారి మధ్యకు ఎర్రని వర్ణము ఉన్న వ్యక్తి రావలసి వచ్చెను. వారు ఎరుపు వర్ణమును సహించలేరు. అప్పుడు ఆ పచ్చని వర్ణము కలవారి కండ్లకు పచ్చని వర్ణము కల కళ్ళజోళ్ళను పెట్టించినాడు. ఇప్పుడు వారి మధ్యకు ఎర్రని రంగు కలవాడు వచ్చినాడు కాని వారందరికిని వారి కళ్ళజోళ్ళ ప్రభావము వలన వాడు పచ్చగనే కనిపించుచున్నాడు. ఇప్పుడు వారిలో ఒకని యొక్క కండ్ల జోడు తీసివేసి వాని యొక్క స్వభావ సిద్ధమైన సత్యమైన దృష్టితో తనను చూడమన్నాడు. అప్పుడు వానికి ఎర్రని రంగుతో ఈ వ్యక్తి కనపడినాడు. వారందరికిని ఎరుపు రంగు చూచిన భయము కాన వాడు భయముతో కేకలు పెట్టి నీవు మరల పచ్చగనే కనిపించమని ప్రార్థించినాడు. అప్పుడు ఈ వ్యక్తి వానికి మరల పచ్చ కళ్ళజోడును పెట్టి పచ్చగా కనిపించినాడు. ఇదే విధముగా అర్జునుడు మాయ యను పచ్చ కండ్లజోడును పెట్టుకున్నంత కాలము కృష్ణునిగా కనిపించినాడు. సర్వ జీవులకును ఈ మాయ యను కళ్ళజోడు జన్మ నుండి మరణ పర్యంతము ఉండుచున్నది. ఈ కళ్ళజోడే అహంకార, మమకారములను రెండు కంటి పొరలు. స్వామి యొక్క నిజ స్వరూపమును దర్శించకోరినపుడు స్వామి అర్జునుని యొక్క కళ్ళజోడును తీసివేసినాడు. అప్పుడు అర్జునుడు తన నిజ నేత్రములతో సత్యమైన దృష్టితో స్వామి యొక్క నిజ స్వరూపమును చూచినాడు. దానిని చూడలేక భయపడినందున మరల అర్జునునకు ఆ కళ్ళజోడును పెట్టినాడు. కావున పరమాత్మ అవతరించునపుడు తన యొక్క నిజ స్వరూపముతోనే క్రిందకి వచ్చినాడు. దానిని జీవులు చూడలేరు.
కావున మాయ జీవుల కండ్లకు స్వామి మనుష్యునిగ కనిపించు భ్రమను కలిగించు కళ్ళజోళ్ళను పెట్టినది. అవ= అనగా క్రిందకు, తర= అనగా దిగుట. ఒక వ్యక్తి మేడపై నుండి క్రిందకి దిగునప్పుడు తన నిజ స్వరూపముతోనే క్రిందకు దిగుచున్నాడు. అంతే తప్ప క్రిందకి దిగునపుడు ఒక ముసుగు వేసుకొని దిగుట లేదు. కావున పరమాత్మ అవతరించునపుడు నిజముగ మనుష్య శరీరమును ఆశ్రయించలేడు. ఆయన మనుష్య శరీరములో ఉన్నట్లు మనకు మాయ భ్రమను కలిగించుచున్నది. కావున అవతార పురుషుని యొక్క శరీరము లోపల మరియొక పరమాత్మ శరీరము ఉన్నదని భావించుట జీవుల యొక్క అజ్ఞానమే. పచ్చ కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు ఎర్రని వ్యక్తిపై పచ్చ రంగు పూయబడలేదు. నీవు కళ్ళజోడు తీయగనే ఆ వ్యక్తి పచ్చరంగును నీటితో కడుకుని మరల ఎర్రగా కనిపించుట లేదు. అతడు ఎప్పుడునూ ఎర్రగానే ఉన్నాడు. కావున శ్రీ కృష్ణుడు ఎల్లప్పుడును విశ్వరూపముతోనే ఉన్నాడు. ఆయన యొక్క పరిమితమైన మానవాకారము మన యొక్క కంటి భ్రమయే. కావున అవతార పురుషుడు దివ్య దర్శనములను చూపుచున్నప్పుడు ఆయనలో ఎట్టి మార్పు లేదు. ఆయన చేయుచున్నది మన యొక్క కంటి పొరలను కొంచెము ప్రక్కకు త్రోయుచున్నాడు. ఇదియే వేదాంతము యొక్క చిట్ట చివరి కొస.
కావున గోపికలు శ్రీ కృష్ణుని బాహ్య స్వరూపము అంతః స్వరూపము అను రెండు స్వరూపములున్న వానిగా చూడలేదు. వారికి శ్రీ కృష్ణుడు సాక్షాత్తుగా పరబ్రహ్మమే. వారి కండ్లకు మాయ లేనే లేదు. కావున వారికి కృష్ణుడు ఎప్పుడును మానవునిగ గోచరించలేదు. వాళ్ళు కళ్లద్దములు లేనివారు. వారికి పసుపు, ఎరుపు అను రెండు రంగులు లేవు. ఒకే ఒక ఎరుపు రంగు నిత్యము కనిపించుచున్నది. కావున వారికి కృష్ణుని పైనున్న విశ్వాసము ఒక క్షణకాలము కూడ చలించలేదు. వారికి ఈ మాయ లేకపోవుటకు కారణమేమనగా, వారికి ఎన్నడును అజ్ఞానము రాలేదు. ఏలననగా వారి జ్ఞానము అగ్నివలె ప్రకాశించుచున్నది. వారు ఎన్నో జన్మల నుండి నిద్రాహారములు లేక ఏ ఇతర విషయమును మనస్సునకు రానీయక నిరంతరము భగవంతుని సత్సంగములో కోటానుకోట్ల జన్మలు గడిపిన బ్రహ్మర్షులు. వారికి కల ఆ నిశ్చలమైన శ్రద్ధయే వారి బ్రహ్మ జ్ఞానాగ్నికి కారణము. “శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్” అనగా శ్రద్ధయే జ్ఞానమునకు కారణము. శ్రద్ధలేని కారణముననే జ్ఞానము బలహీనమై అజ్ఞానము ఆవహించుచున్నది. మిథిలా నగరము తగలబడుచున్నను బ్రహ్మ జ్ఞానము ఆస్వాదించు జనకుడు లేచి పోలేదు. ఆయన యొక్క శ్రద్ధ ఎంతయో ఆలోచించుడు. మనము సినిమా హాలులో కూర్చునప్పుడు నల్లులు పీకుచున్నను, దోమలు రక్తము త్రాగుచున్నను తలుపులు బంధించుట వలన ప్రాణవాయువు లేక శ్వాస ఆడక ఆయాసము వచ్చుచున్నను, ఇంత ఏల, పిడుగులు పడినను చలించము. ఆ పిడుగు మూలకముగా సినిమా ఆగిపోయినపుడు మనము ఈ లోకమునకు వచ్చి ఏమి జరిగినదని ఆలోచించెదము.
కాని సత్సంగము యున్నప్పుడు లేక పురాణమో భాష్య ప్రవచనమో వినుచున్నప్పుడు చీమ చిటుక్కు మన్నను ప్రక్కకు చూచెదము. అన్ని ముచ్చట్లు అప్పుడే వచ్చును. ఏ పనియు లేకపోయినను కొంప మునిగిపోయినట్లు లేచిపోయెదము. పొయ్యి మీద పాలు పెట్టివచ్చి క్షణమే అయిననూ అవి పొంగిపోవుటకు ఇంకనూ ఎంతో సమయమున్ననూ ఆ పొంగు సాకుతో వెంటనే లేచిపోయెదము. ఇది వీరికిని, రాజ్యము తగలపడినను లేవని జనకునకు ఎంత భేదము గలదు? కావున పరమాత్మపై నిజముగా మనకు శ్రద్ధ లేదు. విలువ లేదు. లౌకికములకు ఉపయోగించునేమోయని, మరణానంతరము రక్షించునేమో అని, అదియును కొందరి విశ్వాసము. అనుమానముతో మనకు శ్రద్ధ లేకపోవుట వలన బ్రహ్మ జ్ఞానము మనలో ఇముడుట లేదు. ఇల్లు, వాకిలి, సంసారబంధము అను నీటితో చల్లారి అజ్ఞానమను పొగతో మనము చుట్టబడియున్నాము. ఇదే "ధూమేనావ్రియతే వహ్నిః ఆవృతం జ్ఞానమేతేన అని గీతలో చెప్పబడినది. ఈ అజ్ఞానము యొక్క పొరల వల్లనే మాధవుడు స్వస్వరూపమున క్రిందకు దిగివచ్చినను, మనము ఆయనను గుర్తించ లేక మానవునిగనే చూచున్నాము. మనకు ఆయన యొక్క మాధవ స్వరూపము గోచరించుట లేదు. కావున స్వామిని మాయ కప్పి లేదు మన కళ్ళకే మాయ కప్పియున్నది. స్వామి స్వస్వరూపమును ప్రకటించనక్కర లేదు. మన మాయ పొరలను తొలగించుకొన్నచో ఆయన యొక్క స్వస్వరూపమును మనము చూడగలుగుదుము. ఆయన యొక్క దివ్య దర్శనము కొరకు ఆయన ఎట్టి ప్రయత్నము చేయనక్కర లేదు. మనమే ప్రయత్నము చేయవలెను.
★ ★ ★ ★ ★